సాక్షి, అమరావతి: విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అండగా నిలుస్తున్న వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను (ఆర్బీకేలను) వైఎస్ జగన్ ప్రభుత్వం మరింత బలోపేతం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం జనాభా ప్రాతిపదికన ఉన్న ఆర్బీకేలను పంటల విస్తీర్ణం ప్రాతిపదికన హేతుబద్దీకరణ (రేషనలైజేషన్)కు నిర్ణయించింది. అవసరానికి మించి ఉన్న మండలాల్లోని ఆర్బీకేల సిబ్బందిని తక్కువ ఉన్న మండలాలకు సర్దుబాటు చేయనుంది. అక్టోబర్ కల్లా సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేసి, ఖరీఫ్ సీజన్ పూర్తయిన తర్వాత నవంబర్‌లో తాజా పోస్టింగుల ఉత్తర్వులు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది.
ప్రజల గుమ్మం వద్దకు పౌర సేవలందించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రతి 2వేల జనాభాకు ఒక సచివాలయం ఏర్పాటు చేశారు. ఈ సచివాలయాలకు అనుబంధంగా రైతు సేవల కోసం ప్రత్యేకంగా 10,778 వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పూర్వపు జిల్లా ప్రాతిపదికన జరిగిన నియామకాల ద్వారా వీటిలో 6,218 మంది వ్యవసాయ, 2,352 మంది ఉద్యాన, 374 మంది పట్టు సహాయకులతో పాటు 4,652 మంది పశుసంవర్ధక, 731 మంది మత్స్య సహాయకులు ఆర్బీకేల్లో సేవలందిస్తున్నారు.
వీరికి అదనంగా 904 మంది వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈవో), 1,396 మంది వ్యవసాయ మలీ్టపర్పస్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్స్ (ఎంపీఈవో), 77 మంది ఉద్యాన ఎంపీఈవోలు పని చేస్తున్నారు. ఆర్బీకేలను పంటల విస్తీర్ణం ప్రాతిపదికన కాకుండా జనాభా ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. ఒక్కో ఆర్బీకేకు స్థానికంగా సాగయ్యే పంటలనుబట్టి గ్రామ వ్యవసాయ, ఉద్యాన, పట్టు సహాయకులను ఇన్‌చార్జిలుగా నియమించారు.
సిబ్బందిపై పనిఒత్తిడి తగ్గించడమే లక్ష్యం
కొన్ని మండలాల్లో ఒక సచివాలయం పరిధిలో రెండు, అంతకు మించి ఆర్బీకేలు కూడా ఉన్నాయి. ఈ కారణంగా ఒకే మండలంలో కొన్ని ఆర్బీకేల పరిధిలో సాగు విస్తీర్ణం పదుల ఎకరాల్లో ఉంటే, కొన్నింటిలో వందల ఎకరాలు, మరికొన్నింటిలో 7 వేలు, 8 వేల ఎకరాల్లో ఉంది. విస్తీర్ణం ఎక్కువగా ఉన్న ఆర్బీకేల్లో సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగింది.
సర్టీఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల పంపిణీ, పంటల వివరాలను ఈ క్రాప్ యాప్‌లో నమోదు చేయడం, పొలాలకు వెళ్లి ఫొటోలతో పాటు రైతుల ఈ కేవైసీ నమోదు చేయడం, వైపరీత్యాల వేళ నష్టపోయిన పంటల వివరాలను నమోదు చేయడం, పంట కోత ప్రయోగాలు, పంటల బీమా అమలు.. ఇలా రైతుల కోసం ప్రభుత్వం అమలు చేసే ప్రతి కార్యక్రమంలో భాగస్వాములవ్వాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్బీకే వ్యవస్థలో హేతుబద్ధీకరణకు ప్రభుత్వం సంకల్పించింది.
విస్తీర్ణం ప్రాతిపదికన సిబ్బంది సర్దుబాటు
హేతుబద్ధీకరణలో భాగంగా పంటల విస్తీర్ణం ప్రాతిపదికన మండలం యూనిట్‌గా సిబ్బందిని సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏజెన్సీ ప్రాంతాల్లో 600 నుంచి 800 ఎకరాలకు, మైదాన ప్రాంతాల్లో 1000 నుంచి 1500 ఎకరాలకు ఒకరు చొప్పున సిబ్బంది ఉండేలా ఏర్పాటు చేస్తోంది. అవసరానికి మించి ఉన్న సిబ్బందిని ఇతర మండలాల్లో సర్దుబాటు చేస్తారు.
స్థానికంగా సాగయ్యే ఉద్యాన, పట్టు పంటలను బట్టి వీఎస్‌ఏ, వీహెచ్‌ఎలకు తొలి ప్రాధాన్యతనిస్తారు. ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉన్న చోట ఉద్యాన ఎంపీఈవోలను సర్దుబాటు చేస్తారు. వ్యవసాయ పంటలు సాగు ఎక్కువగా ఉంటే ఏఈవో, వ్యవసాయ ఎంపీఈవోలను సర్దుబాటు చేస్తారు. అర్బన్ ప్రాంతాల్లో మాత్రం ఏఈవో, ఏంపీఈవోలను నియమిస్తారు. ఏఈవోలను జిల్లా పరిధిలో సర్దుబాటు చేస్తుండగా, ఎంపీఈవోలను అవసరాన్ని బట్టి ఇతర జిల్లాల పరిధిలో సర్దుబాటు చేసేలా వెసులుబాటు కల్పించారు.
ఖరీఫ్ తర్వాతే రిపోర్టింగ్
ప్రస్తుతం ఖరీఫ్–2023 సీజన్ ఈ క్రాప్ బుకింగ్ జోరుగా సాగుతోంది. మరో వైపు కోతలు ప్రారంభమైన తర్వాత ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. ఖరీఫ్ సీజన్ పూర్తయిన తర్వాతే సర్దుబాటు చేసిన సిబ్బంది వారికి కేటాయించిన స్థానాల్లో రిపోర్టింగ్ చేయాలి. జిల్లాల పరిధిలో స్థానిక అవసరాలనుబట్టి సర్దుబాటు చేసుకునే వెసులుబాటు కల్పించారు. – చేవూరు హరికిరణ్, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment