సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కింద 2023–24 సీజన్ మూడో విడత పెట్టుబడి సాయంతో పాటు రబీ–2021–22, ఖరీఫ్–2022 సీజన్‌లో అర్హత పొందిన రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ రాయితీ సొమ్ముల పంపిణీకి రంగం సిద్ధమైంది. రైతు భరోసా, సున్నా వడ్డీ రాయితీ కింద 64.37 లక్షల రైతు కుటుంబాలకు రూ.1,294.34 కోట్ల సాయం అందించనున్నారు. మూడో విడత రైతు భరోసా కింద 53.58 లక్షల మందికి రూ.1,078.36 కోట్లు సాయమందిస్తారు. రబీ 2021–22, ఖరీఫ్–2022కు సంబంధించి 10.79 లక్షల మందికి రూ.215.98 కోట్ల సున్నా వడ్డీ రాయితీ సొమ్ము అందిస్తారు. ఈ నెల 28న తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బటన్ నొక్కి ఈ సొమ్ము జమ చేయనున్నారు.
ఒక్కో రైతు కుటుంబానికి రూ.67,500
ఎన్నికలకు ముందు ఏటా రూ.12,500 చొప్పున ఐదేళ్లలో రూ.50 వేల సాయం ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చినప్పటికీ, అధికారంలోకి వచ్చిన వెంటనే అంతకంటే మిన్నగా ఏటా 3 విడతల్లో రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇచ్చిన హామీకంటే రూ.17,500 ఎక్కువగా ప్రతి రైతుకూ సాయం అందించి సీఎం జగన్ రైతన్నల పట్ల తనకున్న చిత్తశుద్ధిని చాటుకున్నారు. భూ విస్తీర్ణంతో ముడిపెట్టకుండా చివరికి 5 సెంట్ల భూమి ఉన్న రైతుకు సైతం రూ.13,500 చొప్పున ఏటా పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఇలా 2019–20లో 46,69,375 మందికి రూ.6,173 కోట్లు, 2020–21లో 51,59,045 మందికి రూ.6,928 కోట్లు, 2021–22లో 52,38,517 మందికి రూ.7,016.59 కోట్లు, 2022– 23లో 51,40,943 మందికి రూ.6,944.50 కోట్లు చొప్పున పెట్టుబడి సాయం అందించారు.
2023–24లో గరిష్టంగా 53.58 లక్షల కుటుంబాలకు లబ్ధి
2023–24లో తొలి విడతలో 52,57,263 రైతు కుటుంబాలకు రూ.3,942.95 కోట్లు, రెండో విడతలో 53,52,905 కుటుంబాలకు రూ.2,204.77 కోట్లు సాయం అందించారు. కాగా మూడో విడతలో 53,58,368 రైతు కుటుంబాలకు రూ.1,078.36 కోట్లు జమచేయనున్నారు. లబ్ధిదారుల్లో 51,00,063 మంది భూ యజమానులు కాగా, భూమి లేని ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీ సాగుదారులు 1,64,705 మంది, దేవదాయ, అటవీ భూమి సాగుదారులు 93,600 మంది ఉన్నారు. తొలి విడతతో పోల్చుకుంటే రెండో విడతలో 95,642 మంది పెరగ్గా, రెండో విడతతో పోల్చుకుంటే మూడో విడతలో మరో 5,463 మంది పెరిగారు. మూడో విడత సాయంతో కలిపి ఈ ఏడాది 53.58 లక్షల మందికి రూ.7,226.08 కోట్ల పెట్టుబడి సాయం అందించగా, ఈ ఐదేళ్లలో సగటున 51.13 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ.67,500 చొప్పున రూ.34,288.17 కోట్ల పెట్టుబడి సాయాన్ని అందించినట్టవుతుంది.
క్రమం తప్పకుండా సున్నా వడ్డీ రాయితీ
వడ్డీ భారం తగ్గించడంతో పాటు రైతుల్లో ఆర్థిక క్రమశిక్షణ తీసుకురావడమే లక్ష్యంగా 2019 ఖరీఫ్ సీజన్ నుంచి వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తోంది. సీజన్‌లో రూ.లక్ష లోపు తీసుకున్న రుణాన్ని ఏడాది లోపు చెల్లించిన వారిలో ఈ క్రాప్ ప్రామాణికంగా అర్హులైన రైతుల పొదుపు ఖాతాలకు సీజన్ చివర్లో సున్నా వడ్డీ రాయితీని ఈ ప్రభుత్వం జమ చేస్తోంది. ఇలా ఇప్పటి వరకు 73.88 లక్షల రైతు కుటుంబాలకు రూ.1,834.55 కోట్లు చెల్లించింది. ఈ మొత్తంలో చంద్రబాబు ఆయన పాలించిన ఐదేళ్లలో 39.07 లక్షల మంది రైతులకు ఎగ్గొట్టిన రూ.1,180.66 కోట్లు కూడా ఉన్నాయి.
తాజాగా రబీ –2021–22 సీజన్‌లో అర్హత పొందిన 4.48 లక్షల మంది రైతులకు రూ.84.30 కోట్లు, ఖరీఫ్–2022 సీజన్‌లో అర్హత పొందిన 6.31లక్షల మందికి రూ.131.68 కోట్లు వెరసి 10.79 లక్షల మందికి రూ.215.98 కోట్లు జమ చేయనున్నారు. తాజాగా జమ చేసే మొత్తంతో కలిపి ఈ ఐదేళ్లలో 84.67 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ.2,050.53 కోట్లు జమ చేశారు. అదే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 40.61 లక్షలమందికి రూ.685.46 కోట్ల వడ్డీ రాయితీని మాత్రమే చెల్లించారు. గత ప్రభుత్వంతో పోలిస్తే రైతుల సంఖ్య రెట్టింపు కాగా, వడ్డీ రాయితీ సొమ్ము మూడు రెట్లు ఎక్కువగా అందించినట్టయింది.
ఇచ్చిన మాట కంటే ఎక్కువగా ఇస్తున్న సీఎం జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీకంటే మిన్నగా వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించి రైతులకు అండగా నిలిచారు. ఇప్పటికే రూ.65,500 చొప్పున సాయం అందించగా, మిగిలిన సాయం ఈ నెల 28న జమ చేస్తున్నాం. తాజా సాయంతో కలిపి ఈ 5 ఏళ్లలో 34,288 కోట్ల పెట్టుబడి సాయం అందించినట్టయ్యింది. రైతు రుణ మాఫీ, అన్నదాత సుఖీభవ పథకాల కింద చంద్రబాబు రైతులకు ఇచ్చిన సాయంకంటే రెట్టింపు సాయం ఒక్క రైతు భరోసా పథకం కిందే ఇచ్చాం. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment