తెల్లదోమ నియంత్రణకు జాతీయ స్థాయి పరిశోధనలు అవసరం | National level research is needed For white mosquito control | Sakshi
Sakshi News home page

తెల్లదోమ నియంత్రణకు జాతీయ స్థాయి పరిశోధనలు అవసరం

Published Thu, Oct 7 2021 5:29 AM | Last Updated on Thu, Oct 7 2021 5:29 AM

National level research is needed For white mosquito control - Sakshi

సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా కొబ్బరి, ఆయిల్‌పామ్, మామిడి, అరటి, బొప్పాయి, సీతాఫలం, కోకో పంటలను దెబ్బతీస్తున్న సర్పలాకార తెల్లదోమ (రుగోస్‌ స్పైరల్లింగ్‌ వైట్‌ఫ్లై) నియంత్రణకు విస్తృత పరిశోధనలు నిర్వహించేలా బాధిత రాష్ట్రాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏపీ వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి స్పష్టం చేశారు. తెల్లదోమ ప్రభావంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్న తమిళనాడు రాష్ట్రంలో తీసుకుంటున్న నియంత్రణ చర్యలను పరిశీలించేందుకు నాగిరెడ్డి నేతృత్వంలోని బృందం కోయంబత్తూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆ రాష్ట్ర శాస్త్రవేత్తలతో బుధవారం భేటీ అయింది.

ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ.. తెల్లదోమ ప్రభావంతో మన రాష్ట్రంలో 2019–20లో 21,966 హెక్టార్లు, 2020–21లో 35,875 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కొబ్బరి, ఆయిల్‌పామ్, నెల్లూరు జిల్లాలో అరటిపై ఈ దోమ ఎక్కువగా ఆశించినట్టు గుర్తించామన్నారు. ఇది జూన్, జూలై, ఆగస్టు నెలల్లో తగ్గిపోతున్నప్పటికీ.. తిరిగి సెప్టెంబర్‌లో మొదలై డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. ఈ విషయాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా విస్తృత పరిశోధనలు చేయాలని ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ను ఆదేశించారన్నారు.

ఉద్యాన వర్సిటీ అభివృద్ధి చేసిన జీవ నియంత్రణ చర్యల వల్ల 20 శాతానికి మించి నియంత్రించలేకపోతున్నారన్నారు. బయో కంట్రోలింగ్, ఆముదం రాసిన ఎల్లోపాడ్స్‌ ఎక్కువగా సిఫార్సు చేస్తున్నామని, పురుగుల మందులను అజాడిరక్టిన్‌తో కలిపి వాడొద్దని సూచిస్తున్నారని చెప్పారు. పెద్దఎత్తున బదనికలను సరఫరా చేయాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పథకాన్ని ప్రకటించి ఆర్థిక చేయూత ఇవ్వాల్సిన అవసరం ఉందని నాగిరెడ్డి స్పష్టం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement