సాక్షి, అమరావతి బ్యూరో: ఔషధ గుణాలు, పోషక విలువలు పుష్కలంగా ఉండే పుట్టగొడుగులను లొట్టలేసుకుని తిననివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. పుట్టగొడుగులపై శాకహారులతోపాటు మాంసాహారులు కూడా మోజు పడుతున్నారు. హోటళ్లలోనే కాదు.. ఇంట్లో వంటకాల్లోనూ ఇదో స్పెషల్ డిష్‌గా ప్రత్యేకతను చాటుకుంటోంది. కోవిడ్ సమయంలోనూ ప్రజలు మాంసాహారానికి దీటుగా పుట్టగొడుగులను అధికంగా తీసుకున్నారు. ఈ తరుణంలో కొన్ని రకాల పుట్టగొడుగులు ప్రాణాంతకమవుతున్నాయన్న వార్తలు జనంలో కలవరాన్ని రేపుతున్నాయి. తాజాగా అసోంలో పుట్టగొడుగులు తిని పది రోజుల వ్యవధిలో 13 మంది మృత్యువాత పడటం, పదుల సంఖ్యలో తీవ్ర అస్వస్థతకు గురి కావడం అందరిలోనూ అలజడికి కారణమవుతోంది.
ఈ పుట్టగొడుగులే ప్రాణాంతకం..
సాధారణంగా పంట పొలాలు, కొండ కోనలు, కాలువ గట్లు, అరణ్య ప్రాంతాలతోపాటు తడి కలిగిన ప్రదేశాల్లో పుట్టగొడుగులు సహజసిద్ధంగా పెరుగుతుంటాయి. ఇలాంటి పుట్టగొడుగులు ఎక్కువ శాతం విషతుల్యమని.. అందువల్ల వీటిని తినడం ప్రాణాంతకమని వ్యవసాయ శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పుట్టగొడుగులను తింటే కాలేయం, మూత్రపిండాలను స్వల్ప వ్యవధిలోనే దెబ్బతీసి మృత్యువాత పడేలా చేస్తాయని చెబుతున్నారు. అయితే నిపుణుల పర్యవేక్షణలో శాస్త్రీయంగా కృత్రిమ వాతావరణంలో పెంచే పుట్టగొడుగులు విషపూరితం కావని పేర్కొంటున్నారు.
తినే రకాలు నాలుగే..
ప్రపంచవ్యాప్తంగా రెండు వేలకు పైగా.. దేశంలో 283 పుట్టగొడుగుల జాతులున్నాయి. క్యాన్సర్, హైపర్‌టెన్షన్ వంటి జబ్బులకు పుట్టగొడుగులు ఔషధాలుగా పనిచేస్తాయి. ఇలా ఔషధ గుణాలు, పోషక విలువలు కలిగిన, ప్రమాదకరం కాని నాలుగు రకాల జాతులనే పెంపకానికి అనువైనవిగా ఎంపిక చేశారు. వీటిలో వైట్ బటన్ మష్రూమ్, ముత్యపు చిప్ప లేక అయిస్టర్ మష్రూమ్, వరిగడ్డి లేదా చైనీస్ మష్రూమ్, మిల్కీ మష్రూమ్ రకాలను తినడానికి అనువైనవిగా గుర్తించారు. దీంతో కొన్నేళ్లుగా అటు దేశంలోనూ, ఇటు మన రాష్ట్రంలోనూ ఈ 4 రకాల పుట్టగొడుగులనే పెంచుతున్నారు.
విషపూరిత మష్రూమ్‌లు..
పుట్టగొడుగుల్లో ఏడు రకాలను విషపూరితమైనవిగా గుర్తించారు. వాటిలో డెడ్ కాప్, కనోసీ బెట్టిలారిస్, వెబ్ కాప్స్, ఆటం స్కల్‌కాప్, డెస్ట్రాయింగ్ ఏంజెల్స్, పొడిస్టాన్ అకార్నడెమె, డెడ్లీ డాపర్లెరీలు ఉన్నాయి.
తిన్నవారిపై 6 నుంచి 24 గంటల్లో ప్రభావం
విషపూరిత పుట్టగొడుగులను తిన్నవారిపై ఆ ప్రభావం 6 నుంచి 24 గంటల్లో కనిపిస్తుంది. కళ్లు తిరగడం, వాంతులు, నీరసం, కడుపులో నొప్పి, మగతగా ఉండడం, విరేచనాలు, తలనొప్పి, స్పృహ తప్పడం వంటి లక్షణాలతోపాటు గ్యాస్ సంబంధిత ఇబ్బందులు కనిపిస్తాయి. బయట ప్రాంతాల్లో పెరిగే పుట్టగొడుగుల్లో ప్రమాదకర ముస్కోరిన్, ఇబోటెనిక్ అనే విష పదార్థాలుంటాయి. వాటిని తినడం ప్రమాదకరం, ప్రాణాంతకం. శాస్త్రీయంగా పెంచే పుట్టగొడుగులు ఆరోగ్యకరం.
– వి.ప్రసన్న, గృహవిజ్ఞాన శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, ఘంటసాల, కృష్ణా జిల్లా
విషపూరిత పుట్టగొడుగులను ఎలా గుర్తించాలంటే..
సామాన్య ప్రజలు విషపూరిత పుట్టగొడుగులను ఎలా గుర్తించాలో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బాగా విచ్చుకున్నవి, పచ్చ రంగు, ఫంగస్‌తో ఉన్నవి, నల్ల మచ్చలతో ఉన్నవి తినడానికి పనికిరావని, ఒకవేళ వాటిని తింటే ప్రాణాంతకమవుతుందని వివరిస్తున్నారు. అందువల్ల ఇలాంటి పుట్టగొడుగుల విషయంలో జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. శాస్త్రీయంగా ప్రమాణాలు పాటించి పెంచే పుట్టగొడుగులే శ్రేయస్కరమని స్పష్టం చేస్తున్నారు. విషపూరిత పుట్టగొడుగులను అటవీ ప్రాంతాల ప్రజలు, శాస్త్రవేత్తలు తమ అనుభవంతో తేలిగ్గా గుర్తించగలుగుతారని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment