
మతిమాలిన మద్దతు
ప్రభుత్వాల పోకడలు రైతుల ఉసురు పోసు కుంటున్నాయి. మతిమాలిన మద్దతు ధర నిర్ణయం సాగుకు రైతును దూరం చేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో కాడిమేడి వదిలేస్తున్న వైనం దీనికి అద్దం పడుతోంది.
- గిట్టుబాటు కాని వరిసాగు
- ప్రభుత్వ మద్దతు ధర కంటితుడుపే
- జిల్లా రైతులకు రూ.74 కోట్ల నష్టం
ప్రభుత్వాల పోకడలు రైతుల ఉసురు పోసు కుంటున్నాయి. మతిమాలిన మద్దతు ధర నిర్ణయం సాగుకు రైతును దూరం చేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో కాడిమేడి వదిలేస్తున్న వైనం దీనికి అద్దం పడుతోంది. సాగు ఖర్చులు ఊహించనం తగా పెరిగి పెట్టుబడికి, ఆదాయానికి పొంతనలేని పరిస్థితుల్లో సేద్యమంటేనే జూదమన్న భావన రైతుల్లో బలపడుతోంది. ఇటీవల కేంద్రం క్వింటాలుకు రూ.50
పెంపు కంటితుడుపు చర్యేనని అంటున్నారు.
విశాఖ రూరల్: ఖర్చు బారెడు ఆదాయం మూరెడుగా ఉంది వరి రైతుల పరిస్థితి. సాగు ఖర్చులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. వరిసాగు చేస్తే లాభాల మాట అటుంచి చేతులు కాల్చుకోవలసిన దుస్థితి ఎదురవుతోంది. ఎకరం భూమిలో వరిసాగు చేస్తే నికరంగా రైతుకు నష్టం రూ.2,860లు. ఇది ఏ రైతు చెప్పిన లెక్కకాదు.
వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నదే. అన్నదాత ఏనాడూ శ్రమకు వెనుదీయడు. వృత్తిని ప్రేమిస్తాడు. ఒకసారికాకపోతే మరోసారైనా ప్రతిఫలం లభించకపోదన్న నమ్మకంతో స్వేదం చిందిస్తాడు. అదే అతడ్ని సాగువైపు నడిపిస్తోంది. జిల్లాలో 1996-97లో 3.02 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యేది. పంట కలిసిరాకపోవడంతో ఇప్పుడు 2.62 లక్షల ఎకరాలకు పడిపోయింది. వ్యవసాయశాస్త్రవేత్తల లెక్కల ప్రకారం ఎకరా వరి సాగుకు రూ.28,460లు ఖర్చవుతోంది.
ఆదాయం రూ.25,600 లభిస్తోంది. నికరంగా ఎకరాకు రూ.2,860లు నష్టం వస్తోంది. అంటే ఈ లెక్కన జిల్లా రైతులు 2.62 లక్షల ఎకరాల్లో వరిసాగుతో నష్టపోతున్నది సుమారు రూ.74 కోట్లు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వరి మద్దతు ధరను ప్రకటించింది. ఏ గ్రేడుకు రూ.1345లు నుంచి రూ.1400లు, సాధారణ రకాలకు రూ.1310లు నుంచి రూ.1360లుగా పెంచారు. ఇది అన్నదాతకు ఏమూలకూ సరిపోదు. ఐదేళ్లలో ఎరువుల ధరలు భారీగా పెరిగాయి. రూ198లకు లభించిన 50 కిలోల యూరియా ప్రస్తుతం రూ360లకు విక్రయిస్తున్నారు.
డీఏపీ రూ.580 నుంచి రూ.1260కి చేరగా మ్యురేట్‌ఆఫ్ పొటాష్(ఎంవోపీ) రూ.440 నుంచి ఏకంగా రూ.830లకు పైగా ధర పలుకుతోంది. అన్ని ప్రాంతాల్లో కూలీల కొరత ఏర్పడింది. వ్యవసాయ కూలీల ఖర్చులు అనూహ్యంగా పెరిగిపోయాయి. సీజన్ బట్టి మహిళకు రోజు కూలి రూ.200లు పురుషులకు రూ.300 వరకు ఉంటోంది.
ఇలా ఎకరాకు వివిధ రూపాల్లో సుమారు రూ.30 వేలు వెచ్చించాల్సి వస్తోంది. విత్తనాలు సైతం అనుకున్న రకాలు లభించడం లేదు. ఉదాహరణకు సోనామసూరి రకం సాగుకు జిల్లా రైతులు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఇవి తిండిగింజలుగా బాగుండడమే కారణం. వ్యవసాయశాఖ మాత్రం ఎంటీయూ-1001, స్వర్ణ రకాలను సరఫరా చేస్తోంది. దీంతో ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక ధరలకు కావాల్సిన రకాలను రైతులు కొనుగోలు చేయాల్సి వస్తోంది.