పీహెచ్‌సీలకు జబ్బు
Published Mon, Jan 2 2017 12:03 PM | Last Updated on Tue, Sep 5 2017 12:12 AM
వైద్యులు, సిబ్బంది కొరతతో అందని నాణ్యమైన సేవలు
ప్రారంభానికి నోచుకోని మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు
అప్‌గ్రేడ్ అయిన పీహెచ్‌సీల్లో స్టాఫ్ కొరత
కొత్త మండలాల్లో ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు
విద్యా, వైద్యంపై దృష్టి సారించిన కలెక్టర్
ప్రతిపాదనలు అమలైతే వైద్యం మెరుగుపడినట్లే
మహబూబాబాద్ : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. ఫలితంగా రోగులకు నాణ్యమైన వైద్యసేవలందడం లేదు. కొత్తగా ప్రారంభించినా పీహెచ్‌సీల్లో పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఆ కేంద్రాలు అలంకారప్రాయంగా మారాయి. జిల్లాలో 17 పీహెచ్‌సీల్లో 35 మంది డాక్టర్లు అవసరం ఉండగా, 12 డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కింది స్థాయి సిబ్బంది 486 మందికిగాను 131 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో మల్యాల, కురవి, మరిపెడ మండలంలోని ఉగ్గంపల్లిలో పీహెచ్‌సీల నిర్మాణం జరిగి నెలలు గడుస్తున్నా నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు. తొర్రూరు పీహెచ్‌సీ, డోర్నకల్, గార్ల పీహెచ్‌సీలు, సీహెచ్‌సీగా అప్‌గ్రేడ్ చేసినా దానికి తగ్గట్టుగా సిబ్బంది, వైద్యుల భర్తీ జరగలేదు. తొర్రూరు, డోర్నకల్ సీహెచ్‌సీల్లో అదనపు భవనాల నిర్మాణం కూడా పూర్తి కాలేదు. గార్ల సీహెచ్‌సీ భవనం పూర్తయినా సిబ్బంది నియామకం జరుగలేదు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో అనేక సమస్యలతో వైద్యులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.
గంగారం మండలంలోని కోమట్లగూడెం పీహెచ్‌సీ, డోర్నకల్ పీహెచ్‌సీ, కేసముద్రం, మరిపెడ, బలపాల పీహెచ్‌సీల్లో వైద్యులు లేరు. స్టాఫ్ నర్సులు, సిబ్బందే వైద్య పరీక్షలు నిర్వహించాల్సి వస్తోంది. ఆ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. 108 ఏఎన్‌ఎం సెంటర్లు ఉండగా వాటిలో 56 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హెల్త్ అసిస్టెంట్ పోస్టులు 35 ఖాళీగా ఉన్నాయి. ప్రధానంగా సిబ్బంది, వైద్యులను భర్తీ చేయాలని ప్రతిపాదనలు తయారు చేసి సంబంధిత అధికారులకు పంపామని డీఎంహెచ్‌ఓ, కార్యాలయం సిబ్బంది తెలిపారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో ఉన్న సమస్యలపై అన్ని విషయాలను సంబంధిత అధికారులకు తెలియపర్చినట్లు డీఎంఅండ్‌హెచ్‌ఓ తెలిపారు.
ప్రారంభానికి నోచుకోని పీహెచ్‌సీలు..
మానుకోట మండలంలోని మల్యాల పీహెచ్‌సీ, కురవి, మరిపెడ మండలంలోని ఉగ్గంపల్లి పీహెచ్‌సీల భవనాలు పూర్తయినా నేటికి ప్రారంభానికి నోచుకోలేదు. భవన నిర్మాణాలు జరిగి నెలలు గడుస్తున్నా సిబ్బంది నియామకం జరగకపోవడంతో ఆ భవనాలు నిరుపయోగంగానే ఉన్నాయి. మానుకోట జిల్లాగా ఏర్పాటు కావడంతో త్వరలోనే ఆ పోస్టులు భర్తీ అయి పీహెచ్‌సీలు ప్రారంభమవుతాయని ఆయా మండలాల ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.
అధికారుల ప్రతిపాదనలు..
ప్రతి మండలానికి పీహెచ్‌సీ, 104, 108 వాహనాలు ఏర్పాటు చేయాలని, సిబ్బందిని భర్తీ చేయాలని, మెడికల్ అధికారులకు తప్పనిసరిగా వాహనం ఇవ్వాలని, మండలానికి రెండు ఫాగింగ్ మిషన్లు ఏర్పాటు మంజూరు చేయాలని, జిల్లా కేంద్రంలో టీబీ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని, పీహెచ్‌సీల్లో ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్, సీహెచ్‌సీల్లో ఎక్స్‌రే, ఏరియా ఆస్పత్రిలో సిటీ స్కాన్, ఎంఆర్‌ఐ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు తయారు చేసి అందజేశారు.
సిబ్బందిని భర్తీ చేస్తే మెరుగైన వైద్య సేవలు
పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బందిని భర్తీ చేస్తే ఇంకా మెరుగైన వైద్యం అందుతుంది. డెలివరీలు ఎక్కువగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిర్వహించేలా ప్రోత్సాహక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అనవసరమైన ఆపరేషన్లు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేయించుకోవద్దు. అనవసరంగా జరిగే ఆపరేషన్లను నివారించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్నిరకాల పరీక్షలు జరుగుతున్నాయి. గర్భిణుల కోసం ప్రభుత్వం జనని, శిశు సంరక్షణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. - డీఎంహెచ్‌ఓ శ్రీరామ్
Advertisement