ఏజెన్సీకి మలేరియా.. పట్నానికి డెంగీ | Malaria in the agency and Dengue at city | Sakshi
Sakshi News home page

ఏజెన్సీకి మలేరియా.. పట్నానికి డెంగీ

Published Tue, Aug 21 2018 2:50 AM | Last Updated on Tue, Aug 21 2018 2:50 AM

Malaria in the agency and Dengue at city - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మళ్లీ జ్వరాలు విజృంభించాయి. వివిధ జిల్లాల్లో భారీ వర్షాలతో మలేరియా, డెంగీ జ్వరాలు తీవ్రమయ్యాయి. రెండు నెలలుగా డెంగీ జ్వరాలు అంతకంతకూ పెరుగుతున్నా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, విశాఖ, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో మలేరియా జ్వరాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు మలేరియా జ్వరాలతో కిటకిటలాడుతున్నాయి. పీహెచ్‌సీల్లో ప్రతి రోజూ మలేరియా కేసులు నమోదవుతున్నట్టు రంపచోడవరం, మారేడుమిల్లి, శ్రీశైలం తదితర ఐటీడీఏల్లో పనిచేస్తున్న వైద్యులు చెబుతున్నారు.

రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాల్లో 135 వరకూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా గత నెల రోజుల్లో 2,800కు పైనే మలేరియా కేసులు నమోదయ్యాయి. ఏటా సీజన్‌ వచ్చేవరకూ ఎవరూ పట్టించుకోరని, తీరా జ్వరాలు మొదలయ్యాక వైద్య బృందాలు వచ్చి హడావిడి చేస్తారని అక్కడి పీహెచ్‌సీలలో పనిచేసే వైద్యులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మందులు లేకపోతే ఆస్పత్రి అభివృద్ధి సొసైటీ (హెచ్‌డీఎస్‌) నుంచి కొనుగోలు చేయాలని చెబుతున్నారని, అయితే దీనివల్ల జాప్యం జరుగుతోందని అంటున్నారు. మలేరియా, డెంగీతోపాటు వర్షాలకు నీరు కలుషితమవడంతో ఎక్కువ మంది చిన్నారులు టైఫాయిడ్, న్యూమోనియా బారినపడుతున్నారని పేర్కొన్నారు.

అదుపులోకి రాని డెంగీ
పట్టణాల్లో ఇప్పటికీ డెంగీ జ్వరాలు అదుపులోకి రావడం లేదని స్వయానా ప్రజారోగ్య శాఖ చెబుతోంది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా మూడు నెలలుగా డెంగీ జ్వరాలు రోజురోజుకూ అధికమవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ప్రకాశం, తూర్పుగోదావరి, అనంతపురం, విశాఖ జిల్లాల్లో గత నెల రోజుల్లో 3 వేలకు పైగా డెంగీ కేసులు నమోదైనట్టు తేలింది. ఒక్క విశాఖçలోనే 900కు పైగా డెంగీ కేసులు నమోదయ్యాయి. డెంగీబారిన పడ్డ బాధితులు ప్రభుత్వాస్పత్రులకు వెళ్తూ ఉంటే అక్కడి వైద్యులు సరిగా స్పందించడం లేదని, ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తేనేమో ప్లేట్‌లెట్‌లు తగ్గిపోతున్నాయని రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకూ పిండుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు.  

ముందస్తు చర్యలు లేవు
దోమకాటుతో వచ్చే జ్వరాలను ముందస్తు చర్యలు తీసుకుంటే నివారించే అవకాశం ఉంటుంది. కానీ చర్యలు తీసుకోలేదు. ఆరోగ్యశాఖలో మలేరియా విభాగమనేది ప్రత్యేకంగా ఉన్నా అది పడకేసింది. మలాథియాన్, పైరిథ్రిమ్‌ అనే ద్రావణాలను ప్రతి ఊళ్లో మురికి కాలువలు, నీళ్లు నిల్వ ఉన్న ప్రాంతాలు, డంపింగ్‌ ప్రాంతాల్లో పిచికారీ చేయాలి. కానీ అలా చేయలేదు. కనీసం పారిశుధ్య చర్యలు కూడా చేపట్టలేదు. దీంతో దోమలు విజృంభించాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా దోమల వ్యాప్తి ఎక్కువగా ఉంది. అక్కడ గిరిజనులకు ఇవ్వాల్సిన దోమతెరలు అందరికీ అందలేదు. 

ప్రాణాధార మందులే కరువు
పామ్‌ ఇంజక్షన్‌ అనేది ఎవరైనా పాయిజన్‌ (విషం) తీసుకున్నప్పుడు దానికి విరుగుడుగా ఇస్తారు. అట్రోపిన్, అడ్రినల్‌ ఇంజక్షన్‌లు సర్జరీ సమయంలో ఇస్తారు. వీటిని లైఫ్‌ సేవింగ్‌ డ్రగ్స్‌గా పేర్కొంటారు. కానీ ఈ రెండు ఇంజక్షన్లు రెండు మాసాలుగా ఏజెన్సీ ఏరియాల్లోని పీహెచ్‌సీలలో లేవు. పారాసెట్‌మాల్‌ ఇంజక్షన్, డైసైక్లోమైన్‌ తదితర మందులూ లేవు. కళ్లలో వేసుకునే సిప్రోఫ్లాక్సిన్‌ డ్రాప్స్‌ లేవు. చిన్నారులకు దగ్గు వస్తే వేసుకోవడానికి ఆంబ్రోక్సిల్‌ సిరప్‌ లేదు. 

చర్యలు తీసుకుంటున్నాం
పట్టణాల్లో ఇప్పటికీ డెంగీ కేసులు ఉన్నాయి. ఈ ఏడాది ఎక్కువగా ఉన్న మాట నిజమే. ఇప్పటికే విజయనగరం జిల్లాలో ఎంటమలాజికల్‌ బృందం పనిచేస్తోంది. ఏజెన్సీ ప్రాంతాలతోపాటు అన్ని ప్రాంతాలకూ మందుల కొరత లేకుండా చూస్తున్నాం.
–డా.గీతాప్రసాదిని, అదనపు సంచాలకులు, ప్రజారోగ్య శాఖ

దోమకుట్టకుండా చూసుకోవాలి
ఇంటి పరిసరాల్లో కొబ్బరి చిప్పలు, టైర్లు, పాత బాటిళ్లు, కప్పులు ఇవన్నీ లేకుండా చూసుకోవడంతోపాటు వాటిలో నీళ్లు నిల్వ లేకుండా చేస్తే దోమలు వృద్ధి చెందవు. ముఖ్యంగా చిన్నారులకు దోమతెరలు వాడాలి. టైఫాయిడ్, న్యూమోనియా జ్వరాలూ ఈ సీజన్‌లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కాచి చల్లార్చిన నీళ్లు తాగడం, బాగా ఉడికించిన భోజనం తినడం మంచిది. 
– డా.వంశీధర్, చిన్నపిల్లల వైద్యులు, రిమ్స్, కడప 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement