
వైద్యం ‘పోస్టు’పోన్!
వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీల భర్తీపై సర్కారు శీతకన్ను
ఉద్యోగ నియామక ప్రకటనలో పోస్టుల ఊసే లేదు
సిబ్బంది లేమితో అవస్థలు పడుతున్న ఆస్పత్రులు
హైదరాబాద్: రాష్ట్రంలోని ఆస్పత్రులకు సమగ్ర చికిత్స చేసి ఆధునిక హంగులతో మరింత విస్తరిస్తామన్న సర్కారు.. ఆచరణలో మాత్రం ఆ వైపు ఒక్క అడుగు కూడా వేయడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో 15 వేల పోస్టులు ఖాళీగా ఉన్నా... ఇటీవల విడుదల చేసిన ఉద్యోగ నియామక ప్రకటనలో ఒక్కటంటే ఒక్క పోస్టు కూడా ఈ శాఖకు సంబంధించినది లేకపోవడం గమనార్హం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 30 పడకల ఆస్పత్రులుగా, ఏరియా ఆస్పత్రులను 100 పడకలుగా, జిల్లా ఆస్పత్రులను సూపర్ స్పెషాలిటీలుగా... ఉస్మానియాలో 2,500 పడకలతో కూడిన 24 అంతస్తులతో రెండు భారీ టవర్ల ఆసుపత్రిగా... గాంధీ, నిలోఫర్ ఆసుపత్రులను రెండు వేల పడకలుగా అభివృద్ధి చేస్తామని ఏప్రిల్‌లో జరిగిన వైద్య ఆరోగ్యశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా ప్రకటించారు. అలాగే ఆసుపత్రుల్లో పూర్తిస్థాయి సిబ్బంది, పరికరాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కానీ ఘనమైన ఈ లక్ష్యాల సాధనకు కీలకమైన వైద్య ఉద్యోగ ఖాళీల భర్తీపై మాత్రం శీతకన్ను వేశారు. కీలకమైన వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీ లేకుండా ప్రజలకు మేలైన వైద్యం ఎలా అందించగలరని చర్చ జరుగుతోంది.
15 వేలకు పైగా ఖాళీలు: వైద్య ఆరోగ్యశాఖలో వైద్యులు, ఇతర సిబ్బంది పోస్టులు భారీగా ఖాళీలున్నాయి. దీంతో రోగులకు వైద్యసేవలు అరకొరగానే అందుతున్నాయి. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో రోజుకు 2 వేల మందికిపైగా రోగులు ఓపీలో చికిత్స పొందుతుంటారు. రోజూ 250 మంది వరకు ఆస్పత్రుల్లో చేరుతుంటారు. రోజూ 200 మంది వరకు ఆపరేషన్లు జరుగుతుంటాయి. సరైన సిబ్బంది లేక ఆపరేషన్ కోసం వారాల తరబడి రోగులు వేచి ఉండే పరిస్థితి ఏర్పడుతోంది. ఇక ఎంఆర్‌ఐ, సీటీస్కాన్, ఆల్ట్రాసౌండ్ తదితర పరీక్షల కోసమైతే నెలల తరబడి వేచి ఉండాల్సిందే. వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది కొరత వల్లే ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. పీహెచ్‌సీల్లో కనీసం ఇద్దరు వైద్యులుండాల్సి ఉండగా... ఒక్కరితోనే నెట్టుకొస్తున్నారు. 24 గంటల వైద్య సేవలు సిబ్బంది లేక కునారిల్లుతున్నాయి. నిమ్స్‌లో 172 వైద్య పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అక్కడ నర్సింగ్ పోస్టులు 158 ఖాళీలున్నాయి. 116 పారామెడికల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైద్య విధాన పరిషత్‌లో 385 వైద్యులు, నర్సింగ్ 429, పారామెడికల్ 765 ఖాళీలున్నాయి.
ప్రజారోగ్యంలో 298 వైద్యులు, నర్సింగ్ 205, పారామెడికల్‌లో 765 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైద్య విద్యలో 426 వైద్యులు, 324 నర్సింగ్, 784 పారామెడికల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవిగాక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, జాతీయ ఆరోగ్య మిషన్ కింద కూడా ఖాళీలున్నాయి. మొత్తంగా 15,727 ఖాళీలున్నట్లు అప్పట్లో సీఎం సమీక్ష సందర్భంగా అధికారులు వెల్లడించారు. వైద్య ఆరోగ్యశాఖలో వేల పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయకుండా రోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని తెలంగాణ నర్సింగ్, పారామెడికల్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీను నాయక్ విమర్శించారు. తక్షణమే పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగ ఖాళీలు
కేటగిరి ఖాళీలు
వైద్యులు 1,983
నర్సింగ్ 1,494
పారామెడికల్ 8,614
ఇతరులు 3,636
మొత్తం 15,727