పీహెచ్‌సీలకు ఫీవర్ | no treatment in primary health center | Sakshi
Sakshi News home page

పీహెచ్‌సీలకు ఫీవర్

Published Tue, Nov 11 2014 2:59 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 PM

no treatment in primary health center

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు వైద్యం అందని ద్రాక్షగా మారింది. కోట్ల రూపాయల మందులు జిల్లాకు వస్తున్నా రోగి నోట్లోకి మాత్రం ఒక్క మాత్ర పోవడం గగనంగా మారింది. జిల్లాలో మందుల కొరత లేదని వాదించే అధికారులు రోగులు ఏది అడిగితే అది రాలేదని చెబుతుండటం గమనార్హం.

 గత రెండు నెలలుగా జిల్లాలో విషజ్వరాలు, మలేరియా, డెంగీ విజృంభిస్తున్నా వైద్య ఆరోగ్యశాఖ పీహెచ్‌సీల్లో కనీస వైద్య సౌకర్యాలను కల్పించలేకపోతోంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా రోగులకు అందుతున్న సేవలపై ‘సాక్షి’ బృందం  సోమవారం జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరిశీలన జరిపింది. కొన్ని చోట్ల వైద్యుల నిర్లక్ష్యం, మరికొన్ని చోట్ల మౌలిక సదుపాయాల కొరత వెలుగులోకి వచ్చింది.  జిల్లాలోని అనేక ఆస్పత్రుల్లో సిబ్బంది, వైద్యులు సమయపాలన పాటించటం లేదని వెల్లడైంది. 11 దాటితే కానీ ఆస్పత్రికి రాని సిబ్బంది సాయంత్రం మూడు గంటలు కాకముందే జిల్లా కేంద్రానికి, నియోజకవర్గ కేంద్రాలకు పయనం అవుతున్నారు.

 అందని మందులు
 జిల్లాలో 69 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 11 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఒక్కో పీహెచ్‌సీకి ఒక వైద్యాధికారి ఉండాలి. జిల్లాలో కేవలం నాలుగు పీహెచ్‌సీలకు మాత్రమే వైద్యాధికారులు లేరని, మం దుల కొరత లేదని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. డీఎంహెచ్‌ఓ ద్వారా పీహెచ్‌సీలకు 123 రకాల మందులు, 68 సర్జికల్ ఐటమ్స్ పం పిణీ చేస్తున్నారు. పీహెచ్‌సీలలో మాత్రం ఈ మందులు అందుబాటులో ఉండటం లేదు.

సర్వరోగ నివారిణి తరహాలో ఎవరికి ఏ జబ్బు చేసినా వాంతులు, విరేచనాలు, జ్వరం, జలు బు వీటిలో ఏదైనా.. వ్యాధి లక్షణంతో పనిలేకుండా వారికి అందుబాటులో ఉన్నవే పంపిణీ చేస్తున్నారని వివిధ ప్రాంతాల్లో రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం సూదిమందు వేయమని ప్రాధేయపడినా అదీ సాధ్యం కాదని తిప్పి పంపుతున్నట్లు చెబుతున్నారు.

 ఏజెన్సీలో ఏదీ సమయపాలన
 ఏజెన్సీలోని పీహెచ్‌సీల్లో వైద్యులు సమయపాలన పాటించడం లేదు. ఉదయం 9 గంటలకే పీహెచ్‌సీలు తెరవాల్సి ఉండగా 10 గంటలైనా తలుపులు తెరిచే వారే లేరు. కుక్కునూరు మండలంలోని రాజీవ్‌నగర్ ఆస్పత్రిలో 12 గంటలే పీహెచ్‌సీ తెరిచి ఉంటుంది. పీహెచ్‌సీలో ఒకే ఒక వైద్యుడు ఉండటంతో రాత్రివేళల్లో ల్యాబ్ టెక్నిషియన్ వైద్యుడి అవతారం ఎత్తుతున్నారు.

ఇద్దరు వైద్యులు భద్రాచలం నుంచి నిత్యం ప్రయాణం చేయడంతో పేదలకు వైద్యం సరిగా అందడం లేదు. తల్లాడ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో వైద్యునితో పాటు సిబ్బంది సమయపాలన పాటించకపోవటం వలన రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రి ప్రాంగణం అపరిశుభ్రంగా ఉండటంతో ముక్కులు మూసుకొని వెళ్లాల్సి వస్తోంది. నేలకొండపల్లి పీహెచ్‌సీలో కూడా ఉదయం 10 గంటల వరకు కూడా వైద్యులు అడ్రస్ లేరు. అశ్వాపురంలో శిథిలావస్థలో ఉన్న బెడ్స్‌పైనే రోగులకు వైద్యం చేస్తున్నారు. మణుగూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు సకాలంలో రావడంలేదు.

గదులు సరిపోవడం లేదు. ఇరుకు గదుల్లో వైద్యులు, రోగులు ఇబ్బందులు పడుతున్నారు. సరిపడా పడకలు లేవు.. ఉన్న పడకలు వేయడానికి గదులు లేవు. మణుగూరు, గుండాల మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అంబులెన్స్ లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. గుండాల పీహెచ్‌సీలో సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. పినపాక వైద్యశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు డాక్టర్లు, ఇతర సిబ్బందికి ఆరు నెలలుగా వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ వైద్యశాలలకు రోగుల సంఖ్య పెరిగినా అందుకు తగిన విధంగా వసతులు కల్పించకపోవడంతో అనేక మంది ప్రైవేటు వైద్యశాలలకు వెళ్లాల్సి వస్తోంది.

 ఆర్‌ఎంపీలే దిక్కు..
 భద్రాచలం ఏజెన్సీలోని గ్రామాల్లో ఆర్‌ఎంపీలే రోగులకు పెద్దదిక్కుగా మారుతున్నారు. చర్ల మండలంలోని సత్యనారాయణపురం ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు, సిబ్బంది శిథిలమైన భవనాల కిందే విధులు నిర్వహిస్తున్నారు. ఈ  వైద్యశాల పరిధిలో సుమారు 40కు పైగా గ్రామాలకు చెందిన ప్రజలు వైద్యసేవలు  పొందుతున్నారు. ఈ వైద్యశాలకు ఇటీవల ప్రభుత్వం పక్కా భవనాన్ని నిర్మించినా దాన్ని ప్రారంభించలేదు. ఈ పీహెచ్‌సీలో రోగులకు బెడ్లు లేవు.  వాజేడు మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో ముగ్గురు డాక్టర్లకు గాను కేవలం ఒక్కరు మాత్రమే పని చేస్తున్నారు.


 దుమ్ముగూడెం మండలం పర్ణశాల పీహెచ్‌సీ సిబ్బంది స్థానికంగా ఉండటం లేదు. వీరంతా భద్రాచలం నుంచి ప్రతి రోజు విధులకు హాజరవుతుండటంతో రోగులకు సకాలంలో అందుబాటులో ఉండటం లేదు. ఆసుపత్రికి వస్తున్న రోగులు తిరిగి వెళ్తున్నారు. పాల్వంచ మండల పరిధిలోని ఉల్వనూరు గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆపరేషన్ థియేటర్ ఉన్నా ప్రయోజనం లేకుండా పోయిందని రోగులు వాపోతున్నారు. గతంలో 24 గంటలు వైద్య పరీక్షలు నిర్వహించే ఈ ఆస్పత్రిలో ప్రస్తుతం 12 గంటలు మాత్రమే వైద్య సేవలు అందిస్తున్నారు.

కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడం లేదు. జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అత్యవసర  వైద్యసేవల నిమిత్తం వచ్చిన రోగులను ప్రాణాపాయస్థితి నుంచి రక్షించేందుకు ఆక్సిజన్ అందుబాటులో ఉంచాల్సి ఉంది. కానీ ఉన్న రెండు సిలిండర్లలో ఆక్సిజన్ లేదు. ఇల్లెందు  వైద్యశాలలో ఇన్వర్టర్ బ్యాటరీలు పనిచేయటం లేదు. రాత్రివేళల్లో కరెంటు పోతే అంధకారంలోనే రోగులకు వైద్యం చేయాల్సి వస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement