శాసనమండలిలో మంత్రి కామినేని ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మహిళలకు ఉచిత ఆల్ట్రా స్కానింగ్ పరీక్షల సౌకర్యం అందుబాటు తీసుకురాబోతున్నట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు మంగళవారం శాసన మండలిలో ప్రకటించారు. నెల రోజుల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ప్రభుత్వ వైద్య ఆరోగ్య పాలసీపై చేపట్టిన స్వల్పకాలిక చర్చకు మంత్రి సమాధానమిచ్చారు. గ్రామాల్లో సబ్‌సెంటర్లు- అంగన్‌వాడీ కేంద్రాల కలిసి పనిచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ఎక్కువ ప్రసవాలు జరుగుతున్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్‌ల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. చిత్తూరు ఆసుపత్రిని అపోలో సంస్థకు అప్పగించినప్పటికీ, వారు రోగుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయడానికి అనుమతి లేదన్నారు. మిగిలిన ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రక్రియను ఆపేశామని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తూ ప్రైవేటు క్లీనిక్‌లు నడుపుతున్న డాక్టర్లు 600 మందిని గుర్తించి తొలి హెచ్చరికగా వారందరి జీతాల నుంచి మూడు ఇంక్రిమెంట్లు చొప్పున కోత పెట్టినట్లు మంత్రి తెలిపారు.