తట్టు నిర్మూలనే ధ్యేయం
2020 నాటికి రాష్ట్రంలో తట్టు వ్యాధి నిర్మూలించడమే ధ్యేయంగా పని చేస్తున్నట్లు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ వెంకటరమణ తెలిపారు.
- డీఐఓ డాక్టర్ వెంకటరమణ
- ఆగష్టు నుంచి మీజిల్స్ రూబెల్లా వ్యాక్సిన్
జూపాడుబంగ్లా: 2020 నాటికి రాష్ట్రంలో తట్టు వ్యాధి నిర్మూలించడమే ధ్యేయంగా పని చేస్తున్నట్లు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ వెంకటరమణ తెలిపారు. శనివారం ఆయన మండల పరిధిలోని తంగెడంచ గ్రామంలో వ్యాక్సినైజేషన్‌ను పరిశీలించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వ్యాక్సిన్‌ను భద్రపరిచిన విధానాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం ఇస్తున్న మీజిల్స్ స్థానంలో ఆగష్టు నుంచి మీజిల్స్ రూబెల్లా వ్యాక్సిన్ ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. రూబెల్లా అనే వైరస్ గర్భిణీల్లో వ్యాపించి పుట్టబోయే బిడ్డకు అవయవలోపాలు కలిగించడతోపాటు ప్రాణాపాయం సంభవించేలా చేస్తుందన్నారు. దీన్ని నివారించేందుకు వ్యాక్సిన్ ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. గర్భిణిలతోపాటు 9 నెలల చిన్నారుల నుంచి 15 సంవత్సరాల వయసున్న వారికి వ్యాక్సిన్ వేస్తారన్నారు. రాష్ట్రంలో 1.70లక్షల రోగాల్లో సగానికిపైగా ఈ వ్యాక్సిన్ ద్వారా అరికట్టవచ్చన్నారు. చిన్నారులకు ఆగష్టు నుంచి ఓ డోసు వ్యాక్సిన్ ఇస్తామన్నారు. సెప్టెంబర్ నుంచి మీజెల్స్ వ్యాక్సిన్ తొలగిస్తారని తెలిపారు.