సాక్షి, అమరావతి/ఏలూరు టౌన్: రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్ల లోపు వయసున్న చిన్నారులకు ఆదివారం పల్స్ పోలియో చుక్కలు వేయనున్నారు. దీనికోసం కుటుంబ సంక్షేమ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. స్కూళ్లు, కాలేజీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పోలియో చుక్కల కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం తన నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిన్నారులకు పల్స్‌పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. పోలియో చుక్కల మందు కార్యక్రమాన్ని కుటుంబ సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ, పురపాలక, పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ, రవాణా, విద్యాశాఖలు సంయుక్తంగా నిర్వహిస్తాయి. రాష్ట్రంలో ఐదేళ్ల వయసులోపు చిన్నారులు 52.27 లక్షల మంది ఉన్నట్టు కుటుంబ సంక్షేమ శాఖ గుర్తించింది.
వీళ్లందరికీ విధిగా పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 గంటల నుంచే పోలియో చుక్కల మందు బూత్‌లలో అందుబాటులో ఉంటుంది. మారుమూల గిరిజన ప్రాంతాల్లో సైతం చిన్నారులకు పోలియో చుక్కలు అందేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒకవేళ ఆదివారం ఎవరైనా చిన్నారులకు వేయించలేని పరిస్థితి ఉంటే ఈనెల 20 నుంచి 22వ తేదీ వరకు ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే 65.75 లక్షల డోస్‌ల పోలియో చుక్కల మందు రాష్ట్రానికి చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో 2008 జూలైలో పశ్చిమగోదావరి జిల్లాలో పోలియో కేసు నమోదైందని, తర్వాత ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కుటుంబ సంక్షేమ శాఖ ధృవీకరించింది. ప్రతి కాలనీలో, ప్రతి గ్రామంలోనూ పల్స్ పోలియో బూత్ ఉంటుందని, తల్లిదండ్రులు తమ బిడ్డలకు చుక్కలు వేయించడం మరచిపోవద్దని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్తికేయ మిశ్రా కోరారు.
ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం
ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలని, ఆరోగ్యవంతమైన, పోలియోరహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పిలుపునిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదేళ్లలోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు.
నేడు పల్స్ పోలియో
Published Sun, Jan 19 2020 4:36 AM | Last Updated on Sun, Jan 19 2020 4:37 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment