18.81 లక్షల గృహాల్లో వ్యక్తుల ఆరోగ్య వివరాల సేకరణ | Collection of health details of people | Sakshi
Sakshi News home page

18.81 లక్షల గృహాల్లో వ్యక్తుల ఆరోగ్య వివరాల సేకరణ

Published Thu, Sep 21 2023 3:42 AM | Last Updated on Thu, Sep 21 2023 12:39 PM

Collection of health details of people - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ సర్వే ముమ్మరంగా కొనసాగుతోంది. కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌(సీహెచ్‌వో), ఏఎన్‌ఎం, ఆశా వర్కర్‌లు ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిని వాకబు చేస్తున్నారు. వైద్య రంగంలో ఫ్యామిలీ డాక్టర్, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌ వంటి విప్లవాత్మక సంస్కరణలతో ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం.. ప్రజల ఆరోగ్య సమస్యలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి, వాటిని పరిష్కరించడానికి ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఈనెల 30వ తేదీ నుంచి స్పెషలిస్ట్‌ వైద్యులతో హెల్త్‌ క్యాంపులను వైద్యశాఖ ప్రారంభించనుంది. హెల్త్‌ క్యాంప్‌ల నిర్వహణ షెడ్యూల్‌కు అనుగుణంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సర్వే చేపడుతున్నారు.  

18.81 లక్షల గృహాల్లో సర్వే
ఈనెల 16 నుంచి ఆరోగ్య సురక్ష సర్వేను మొదలు పెట్టారు. సీహెచ్‌వోలు, ఏఎన్‌ఎంలు నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు ఇప్పటి వరకూ 18.81 లక్షల గృహాలను సందర్శించాయి. జ్వరం, బీపీ, షుగర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధి బాధితుల వివరాలు సేకరిస్తున్నారు. జ్వరం, బీపీ, షుగర్‌ లక్షణాలున్న వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తంగా ఏడు రకాల పరీక్షలను ఇంటి వద్దే చేస్తున్నారు. ఇలా ఇప్పటివరకూ జరిగిన సర్వేలో 20 లక్షలకు పైగా పరీక్షలు నిర్వహించారు.  

45 రోజుల పాటు హెల్త్‌ క్యాంపులు
ఈనెల 30 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్‌ క్యాంప్‌లు ప్రారంభించనున్నారు. 45 రోజుల పాటు 10,032 వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు, 500కు పైగా పట్టణ ఆరోగ్య కేంద్రాలను కవర్‌ చేసేలా క్యాంప్‌లు నిర్వహిస్తారు. ప్రతీ క్యాంప్‌లో నలు­గు­రు వైద్యులు అందుబాటులో ఉండి ప్రజల­కు వైద్య సేవలు అందిస్తారు. మెరుగైన వైద్యం అవసరం ఉన్న వారిని దగ్గరలోని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రిఫర్‌ చేస్తారు.   

టోకెన్‌ల అందజేత
సర్వేలో భాగంగా వివిధ ఆరోగ్యపరమైన సమస్యలపై ఆరా తీసి, అవసరం మేరకు బీపీ, షుగర్, ఇతర పరీక్షలు నిర్వహించిన అనంతరం టోకెన్‌ స్లిప్‌లు ఇస్తున్నారు. ఆ టోకెన్‌లో గ్రామం/పట్టణంలో హెల్త్‌ క్యాంప్‌ నిర్వహించే రోజు, స్థలం వంటి వివరాలు ఉంటాయి.

అదే విధంగా సేకరించిన ప్రజల ఆరోగ్య వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన ఆరోగ్య సురక్ష యాప్‌లో ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఈ వివరాల ఆధారంగా హెల్త్‌ క్యాంప్‌ నిర్వహించే రోజున ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా కేస్‌ షీట్‌లను తయారు చేస్తారు. ఆ కేస్‌ షీట్‌లో సంబంధిత వ్యక్తికి క్యాంప్‌లో అందజేసే వైద్యం, పరీక్షలు, వైద్యుడు సూచించే మందుల ప్రిస్క్రిప్షన్, ఇతర వివరాలన్నింటినీ నమోదు చేస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement