సాక్షి, అమరావతి: నిన్నటిదాకా వారి వేతనం రూ.3 వేలు మాత్రమే.. మరి నేడు రూ. 10 వేలు.. రాష్ట్రవ్యాప్తంగా ఆశా కార్యకర్తలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ప్రజాసంకల్ప పాదయాత్రలో ఆశా వర్కర్ల బాధలు, ఆవేదన విని చలించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాను ఇచ్చిన హామీకి కట్టుబడి వారి వేతనాన్ని నెలకు రూ.10 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వేల కిలోమీటర్ల పాదయాత్రలో అడుగడుగునా ఆశా వర్కర్ల ఇబ్బందులను గుర్తించిన వైఎస్ జగన్ తాము అధికారంలోకి రాగానే వారి వేతనం పెంచుతామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆయన ముఖ్యమంత్రి అయిన ఐదో రోజే వారి వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించడంతో ఆశా వర్కర్లలో ఆనందం వెల్లివిరుస్తోంది. సోమవారం వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈమేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. వేతనాల పెంపుతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 42 వేల మంది ఆశా కార్యకర్తలకు లబ్ధి చేకూరనుంది.
టీడీపీ అధికారంలో ఉండగా ఆశా కార్యకర్తలు గౌరవ వేతనం కోసం పలు ధర్నాలు, ఆందోళనలు చేసినా సర్కారు కనికరించలేదు. ఎన్నికల ముందు నెలకు రూ.3 వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఈ వేతనం చాలక చాలామంది ఆశా వర్కర్లు కూలి పనులకు వెళుతున్నారు. వారి బాధలన్నీ ప్రత్యక్షంగా చూసి చలించిన వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఆశావర్కర్ల వేతనాలతోపాటు ఆరోగ్యశాఖపై సమీక్షలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పలు అంశాలను చర్చించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
వైద్యారోగ్య శాఖలో సమూల ప్రక్షాళన
వైద్య ఆరోగ్యశాఖను సమూలంగా ప్రక్షాళన చేసి దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చి దిద్దేందుకు కృషి చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులకు సూచించారు. విశాఖ మెడ్‌టెక్ జోన్ (మెడికల్ టెక్నాలజీ పార్కు)లో జరిగిన అవినీతిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మెడ్‌టెక్ జోన్‌లో కాంట్రాక్టు పొందిన లగడపాటి రాజగోపాల్‌కు చెందిన సంస్థకు చెల్లించిన రూ.53 కోట్లు ఇప్పటివరకు ఎందుకు రికవరీ చేయలేదని అధికారులను ప్రశ్నించారు. లగడపాటి సంస్థ కొన్ని ఇంజనీరింగ్ సర్వీసులు అందించినట్లు అధికారులు పేర్కొన్నారు.
నిపుణులతో కమిటీ ఏర్పాటు
ఆరోగ్యశాఖలో వివిధ పథకాల అమలు తీరుతోపాటు గత ఐదేళ్లలో జరిగిన అవినీతిని వెలికి తీసేందుకు నిపుణులతో కమిటీ నియమిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ కమిటీని సీనియర్ ఐఏఎస్ అధికారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా.పీవీ రమేష్ ముఖ్యమంత్రి కార్యాలయం తరఫున పర్యవేక్షిస్తారు. ఈ కమిటీ అధికారులతో సమావేశం నిర్వహించి 45 రోజుల్లో నివేదిక సమర్పిస్తుంది.
సీఎం పర్యవేక్షణలో ఆరోగ్యశాఖ
కోట్లాది మంది ప్రజల ఆరోగ్యంతో ముడిపడిన ఆరోగ్యశాఖ పనితీరును ఇక నుంచి తానే స్వయంగా పర్యవేక్షిస్తానని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో తక్షణమే మౌలిక వసతులు మెరుగు పరచాలని, దీనికి ఎంత వ్యయం అయినా భరిస్తామని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో సర్కారీ ఆస్పత్రుల్లో ఎలుకలు కొరికి శిశువులు మృతి చెందడం, ఆపరేషన్ థియేటర్‌లో కరెంటు లేక సెల్‌ఫోన్ వెలుతురులో ఆపరేషన్ నిర్వహించడం లాంటి ఘటనలు చాలా బాధ కలిగించాయన్నారు. ఐదేళ్లుగా ప్రభుత్వ ఆస్పత్రులను నిర్వీర్యం చేసి పలు సేవలను పీపీపీ కింద ప్రైవేట్‌కు అప్పగించారని పేర్కొన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో సేవలన్నీ ప్రైవేట్ పరం చేయడం దారుణమన్నారు. అవసరమైతే వైద్య పరికరాలు, మందులు, మౌలిక సౌకర్యాల టెండరింగ్ విధానాలను పునఃసమీక్షిస్తామని చెప్పారు. ఉన్నతాధికారులు తమ సొంతపనిగా భావిస్తే ఆరోగ్యశాఖలో మంచి ఫలితాలు ఉంటాయని సూచించారు.
వైఎస్సార్ విధానాలే ఆదర్శం
వైద్య ఆరోగ్య రంగంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విధానాలే ఆదర్శమని, వాటి ఆధారంగానే ముందుకెళ్లాలని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ, 108, 104 లాంటి సేవలను ప్రారంభించి వైఎస్సార్ దేశంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గుర్తింపు తెచ్చారని చెప్పారు. పలు రాష్ట్రాలు ఈ పథకాలను అమలు చేస్తున్నాయని గుర్తు చేశారు. 108, 104 సర్వీసులను ప్రక్షాళన చేసి వాహనాలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాలని సూచించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్యసేవగా కొనసాగుతున్న పథకాన్ని ఇకపై ‘వైఎస్సార్ ఆరోగ్యశ్రీ’గా మారుస్తున్నట్లు ప్రకటించారు. మండలానికి ఒక 104 అందుబాటులోకి తెచ్చి మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రస్తుతం 500 పైచిలుకు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు మాత్రమే 24 గంటల ఆస్పత్రులుగా ఉన్నాయని అధికారులు పేర్కొనగా.. మిగతావి కూడా నిరంతరాయంగా పనిచేసేలా అందుబాటులోకి తేవాలని, అదనపు నిధులు ఇస్తామని, అందుకు అనుగుణంగా సిబ్బందిని నియమించుకోవాలని సీఎం సూచించారు.
వైద్య సీట్లు పెరగాలి..
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లు పెరగకుండా అడ్డంకులు ఎందుకు తలెత్తుతున్నాయని సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. సౌకర్యాలు లేవని వైద్య సీట్లకు కోతలు వేస్తుంటే దానిపై గట్టిగా చర్యలు ఎందుకు తీసుకోలేక పోతున్నారన్నారు. నిబంధనల మేరకు అధికారులు సమీక్షించి వైద్య విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు.
లెక్కలు డాష్‌బోర్డుకే పరిమితం కారాదు
వైద్య ఆరోగ్యశాఖలో నివేదికలు, లెక్కలు వాస్తవాలకు దగ్గరగా ఉండాలని కేవలం కోర్‌డాష్ బోర్డుకే పరిమితం కావడం సరికాదని సీఎం పేర్కొన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పట్టణ ఆరోగ్యకేంద్రం, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి రోజూ ఫొటోలు తీసి పంపాలని ఆదేశించారు. ఉద్యోగుల ఖాళీలు, ఆర్థిక అవసరాలపై తక్షణమే నివేదిక ఇవ్వాలని సూచించారు.
నకిలీ మందులను అరికట్టాలి..
నకిలీ, నాసిరకం మందులు మార్కెట్‌లోకి రాకుండా ఔషధ నియంత్రణ శాఖ అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటివారైనా ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఆస్పత్రి అభివృద్ధి కమిటీలకు మళ్లీ ఎమ్మెల్యేలు
గత ప్రభుత్వం ఆస్పత్రి అభివృద్ధి కమిటీలకు బాధ్యులుగా ఉన్న ప్రజాప్రతినిధులను (ఎమ్మెల్యేలను) తొలగించి తమకు ఇష్టమైన వారిని తీసుకుందని సీఎం పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు బాధ్యులుగా ఉంటే మరింత బాధ్యతగా పనిచేస్తారన్నారు. ఈ నేపథ్యంలో తక్షణమే ఆస్పత్రి అభివృద్ధి కమిటీల అధ్యక్షులను తొలగించి ఆ స్థానంలో తిరిగి ఎమ్మెల్యేలను నియమించాలని ఆదేశించారు.
రాష్ట్రం వాటా చెల్లించకపోవడంతో..
అనంతపురం, విజయవాడలో పీఎంఎస్‌ఎస్‌వై (ప్రధాని స్వాస్థ్య సురక్ష యోజన) కింద రూ.150 కోట్ల చొప్పున వ్యయంతో నిర్మించిన ఆస్పత్రులకు సంబంధించి రాష్ట్రం తన వాటాను చెల్లించకపోవడంతో భవనాలను అప్పగించడం లేదని అధికారులు ఈ సందర్భంగా సీఎం దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తక్షణమే రూ. 60 కోట్లు ఇస్తున్నామని, వెంటనే ఆ రెండు సూపర్ స్పెషాలిటీ బ్లాకులను అందుబాటులోకి తేవాలని సూచించారు. జాతీయ ఆరోగ్యమిషన్ నిధులను కూడా త్వరలోనే విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment