
అరకొరే!
పీహెచ్‌సీల్లో అందని వైద్య సేవలు
పాలమూరు :ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ప్రభుత్వాలు ఊదరగొడుతున్నా పేదలకు అరకొర వైద్యం అందుతోంది. జిల్లా వ్యాప్తంగా అధికశాతం పీహెచ్‌సీలకు నిర్లక్ష్యం జబ్బు పట్టుకొంది. దీంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తోంది. సోమవారం జిల్లా వ్యాప్తంగా ఆయా పీహెసీల పరిధిలో ‘సాక్షి’ బృందం ఏక కాలంలో జరిపిన విజిట్‌లో పలు సమస్యలు వెలుగులోకి వచ్చాయి.
జిల్లాలోని 87 పీహెచ్‌సీలుండగా 40 కేంద్రాల్లోని వైద్యులు సకాలంలో విధులకు హాజరు కాలేదు. పీహెచ్‌సీల పరిధిలోని సబ్‌సెంటర్లకు వెళ్లామంటూ సదరు వైద్యులు చెప్పుకొస్తున్నారు. సబ్ సెంటర్లకు వెళ్తున్న కారణంగానే పీహెచ్‌సీలకు ఆలస్యంగా వస్తున్నామని, నిర్ణీత సమయానికి ముందుగానే వెళ్తున్నామని పలువురు వైద్యులు చెబుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని సిబ్బంది తమ విధులు సక్రమంగా నిర్వహించకపోవడంతో పేదలు ఇబ్బంది పడాల్సివస్తోంది.
జిల్లాలో 20కిపైగా పీహెచ్‌సీలకు ఇన్‌చార్జ్ వైద్యులు ఉన్నారు. 35కు పైగా ఏఎన్‌ఎం పోస్టులు ఖాళీలున్నాయి. పీహెచ్‌సీల్లో వైద్యులు, సిబ్బంది కూడా పనివేళలు సక్రమంగా పాటించడం లేదు. ఉదయం 10 నుంచి 11గంటల మధ్య పీహెచ్‌సీకి చేరుకుని మధ్యాహ్నం 2గంటల కల్లా వైద్యులు ఇంటిదారి పడుతున్నారు. జిల్లాలోని కేవలం 8 పీహెచ్‌సీల్లోనే మౌలిక సదుపాయాలున్నాయి. 6 పడకలున్న పీహెచ్‌సీలు 25 మాత్రమే ఉన్నాయి. జిల్లాలోని అధిక శాతం పీహెచ్‌సీల పరిధిలో వైద్యులు స్థానికంగా నివాసం ఉండడం లేదు. అన్ని పీహెచ్‌సీల్లోనూ బీపీ చెకింగ్ మిషన్‌లున్నా.. అక్కడికి వచ్చే రోగులకు బీపీ చెకప్ చేయడంపై వైద్యులు, సిబ్బంది తగిన దృష్టి నిలపడంలేదు.
ఉపయోగంలో లేని పరికరాలు
పీహెచ్‌సీల్లో మౌలిక వసతుల కల్పనకోసం ప్రభుత్వం పలు పరికరాలను ఏర్పాటు చేసినప్పటికీ అక్కడి సిబ్బంది సరైన జాగ్రత్త తీసుకోకపోవడంతో అవి నిరుపయోగంగా మారుతున్నాయి. ఇంజక్షన్లు భద్రపరచుకునేందుకు, ఇతర అవసరాల కోసం పీహెచ్‌సీల్లో ఫ్రిజ్‌లను ఏర్పాటు చేసినప్పటికీ వాటి నిర్వహణ సరిగా లేదు. అంతే కాకుండా గర్భిణీలు వస్తే తూకం చూసేందుకు ఏర్పాటు చేసిన మిషన్‌లు కూడా చాలాచోట్ల ఉపయోగంలో లేవు.
పీహెసీల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసేందుకు తగిన పరికరాలున్నప్పటికీ అక్కడ ఆపరేషన్‌లు నిర్వహించడం లేదు. దీంతో జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రితోపాటు, డివిజన్ కేంద్రాల్లోని సివిల్ ఆసుపత్రులకు కు.ని ఆపరేషన్లు చేయించుకునేందుకు రోగులు ఆసక్తి చూపుతున్నారు.
ఆస్పత్రుల్లో ఇలా..!
అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. అన్ని కేంద్రాల్లో వైద్యాధికారులు ఉన్నా సమయానుకూలంగా పీహెచ్‌సీలకు రాకపోవడం కనిపించింది. అలంపూర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, గద్వాల, కొల్లాపూర్ నియోజకవర్గాల్లోనూ ఆయా పీహెచ్‌సీల్లో ఆపరేషన్ థియేటర్లు నిరుపయోగంగా మారాయి. కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని బొంరాస్‌పేట, దౌల్తాబాద్, మద్దూరు. గుండుమాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది.
షాద్‌నగర్ నియోజకవర్గంలోని పీహెచ్‌సీలకు చెందిన కొందరు వెద్యులు, ఏఎన్‌ఎంలు స్థానికంగా ఉండకపోవడంతో డాక్టర్‌ల కోసం రోగులు గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోంది. దేవరకద్ర పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు ఉన్నట్లు రికార్డుల్లో ఉన్నప్పటికీ ఓ వైద్యుడు డిప్యూటేషన్‌తో జిల్లా టీబీ ఆసుపత్రికి వెళ్లారు. మరో వైద్యుడు విధులకు రాక పోవడం వల్ల సరెండర్ చేశారు.
దీంతో ఇక్కడ వైద్యుల్లేకుండా పోయారు. అడ్డాకుల పీహెచ్‌సీ వైద్యురాలు సకాలంలో రానందువల్ల రోగులకు వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందడం లేదు. జడ్చర్ల పరిధిలోని గంగాపూర్ పీహెచ్‌సీలో రెగ్యులర్ డాక్టర్ లేక పోవడంతో ఇన్‌చార్జి డాక్టర్‌తో అరకొరగా సేవలు అందుతున్నాయి. నవాబుపేట పీహెచ్‌సీలో డాక్టర్ అందుబాటులో లేక ల్యాబ్ అసిస్టెంట్ డాక్టర్ అవ తారమెత్తి రోగులకు పరీక్షలు చేసి మందులను ఇవ్వాల్సిన దుస్ధితి నెలకొంది.
మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల పరిధిలోని పీెహ చ్‌సీల్లో వైద్యసేవలు సరిగా లేక రోగులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. కల్వకుర్తి, తలకొండపల్లి, మాడ్గుల పీహెచ్‌సీల పరిధిలో మౌలిక వసతుల్లేక రోగులకు అవస్థ ఏర్పడింది. దీనికితోడు సిబ్బంది కొరత, ఉన్న వైద్యులు, సిబ్బంది కూడా సకాలంలో పీహెచ్‌సీకి రాకపోవడంతో వైద్య సేవలు మృగ్యమయ్యాయి.
ఆస్పత్రుల్లో ఖాళీలు
విభాగం ఉండాల్సింది ఉన్నది ఖాళీలు
వైద్యులు 124 105 19
ఏఎన్‌ఎంలు 261 226 35
ఇతర సిబ్బంది 174 156 18
మొత్తం పీహెచ్‌సీలు 87