వికారాబాద్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ (పీహెచ్‌సీలు) ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రజారోగ్య శాఖ డైరెక్ట ర్ శ్రీనివాసరావు తెలిపారు. మొత్తం 53 రకాల సేవ లు అందించేలా ఏర్పాట్లు చేస్తోందన్నారు. శుక్రవా రం వికారాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన ముందుగా ధారూరు, రామయ్యగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు.
తర్వాత మద్గు ల్ చిట్టెంపల్లి డీపీఆర్సీ భవనంలో వైద్యులు, వైద్యారోగ్య శాఖ పర్యవేక్షణ అధికారులతో సమావేశమై ఆస్పత్రుల పనితీరుపై సమీక్షించారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరోగ్యశ్రీ కింద ఇక్కడ చేరే ప్రతి రోగి తరఫున పీహెచ్‌సీకి ప్రభుత్వం రూ.2,100 చెల్లిస్తుం దన్నారు. ఇందులో 35 శాతం డబ్బును పీహెచ్‌సీలో విధులు నిర్వర్తించే వైద్యులు, సిబ్బందికి ప్రోత్సాహకంగా ఇస్తుందని, మిగిలిన 65 శాతం నిధులను ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి వినియోగించుకోవచ్చని చెప్పారు. దీంతో పీహెచ్‌సీలు నిధుల కొరతను అధిగమించి బలోపేతం అవుతాయన్నారు.
వైద్యుల వాహనాలకు జీపీఆర్‌ఎస్: క్షేత్రస్థాయి లో పీహెచ్‌సీలను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని శ్రీనివాసరావు చెప్పారు. 750 ఎం బీబీఎస్ వైద్యుల నియామకానికి త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనుందని తెలిపారు. పీహెచ్‌సీల్లో చేసే ప్రతి సాధారణ కాన్పుకు ప్రభుత్వం రూ.3 వేలు అందజేస్తుందని, ఈ మొత్తం వైద్యులు, సిబ్బందికి ఇన్సెంటివ్ రూపంలో చెల్లిస్తుందన్నారు.
దీంతో వైద్యుల్లో ఉత్సాహం పెరిగి నాణ్యమైన సేవలు అం దుతాయన్నారు. వైద్యులు స్థానికంగా ఉండేలా స్పష్టమైన ఆదేశాలు ఇస్తామన్నారు. స్థానికంగా ఉంటున్నారా..? లేదా నగరానికి వెళ్లి వస్తున్నారా..? అనే వివరాలు తెలుసుకునేందుకు వైద్యుల వాహనాలకు జీపీఆర్‌ఎస్ అమరుస్తామని చెప్పారు. జిల్లా నుంచి రాష్ట్రస్థాయి వరకు వైద్యులు, సిబ్బంది పని తీరును పర్యవేక్షించేలా ప్రతి పీహెచ్‌సీలో 3 సీసీ కెమెరాలు అమరుస్తామని తెలిపారు.
ఏడాదిలో ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు మెడికల్ ఆఫీసర్లకు వెహికల్ అలవెన్స్ ఇవ్వనున్నట్టు చెప్పారు. గడిచిన మూడు నెలలుగా రాష్ట్రంలో కోవిడ్ బాగా తగ్గిందని శ్రీనివాసరావు తెలిపారు. రోజుకు 40 లోపు కేసులే నమోదవుతున్నాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment