సాక్షి, హైదరాబాద్: ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులకు డిమాండ్ పెరిగింది. హైదరాబాద్‌లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (యూపీహెచ్‌సీ), బస్తీ దవాఖానాల్లో మొత్తం 300 చోట్ల ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నారు. రోజుకు 10 వేల వరకు యాంటిజెన్ టెస్టులు చేసేలా ఏర్పాట్లు చేయడంతో కరోనా నిర్ధారణ మరింత అందుబాటులోకి వచ్చింది. అరగంటలోపే ఫలితం వస్తుండటంతో వాటివైపే జనం మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం ఐసీఎంఆర్ నిర్దేశిత లేబొరేటరీల్లో నిర్వహించే ఆర్‌టీ–పీసీఆర్ పరీక్షల పట్ల బాధితులు విముఖత చూపుతున్నారు. ఆర్‌టీ–పీసీఆర్ పరీక్ష కోసం ప్రభుత్వ, ప్రైవేటు లేబరేటరీలకు వెళ్లడం, వేచి చూడటం ప్రయాసగా మారింది. నాలుగైదు రోజుల నుంచి వారం వరకు ఫలితం కోసం ఎదురుచూడటం ఇబ్బందిగా మారింది. లక్షణాలు అధికం గా ఉన్నవారికి అన్ని రోజులు వేచిచూడడం వల్ల వైరస్ ముదిరే ప్రమాదముంది. యాంటిజెన్ టెస్టు లు ఇప్పటికే దాదాపు 30 వేల వరకు చేసినట్లు అంచనా. ఈ పరీక్షల కోసం రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల యాంటిజెన్ కిట్లను తెప్పించిన సంగతి తెలిసిందే.
తక్షణం రిపోర్టులు ఇవ్వకపోవడంపై ఫిర్యాదులు
యాంటిజెన్ టెస్టులు చేసి తక్షణమే పాజిటివ్ లేదా నెగెటివ్ వచ్చినట్లు చెప్పేస్తున్నారు. కానీ, వెంటనే ఎలాంటి రిపోర్టులు ఇవ్వడంలేదన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఉదాహరణకు నారాయణ అనే ఒక ప్రైవేట్ ఉద్యోగికి తీవ్రమైన కరోనా లక్షణాలున్నాయి. దీంతో సమీపంలోని బస్తీ దవాఖానాలో యాంటిజెన్ టెస్ట్ చేయించుకున్నాడు. అరగంటలోపే ఆయనకు పాజిటివ్ అని చెప్పారు. రిపోర్టు ఇవ్వండని అడిగితే తర్వాత ఫోన్ చేస్తామని, అప్పటికప్పుడు రిపోర్టు ఇవ్వడం కుదరదని చెప్పేశారు. కానీ ఆయనకు తీవ్రమైన లక్షణాలు ఉండటంతో తక్షణం ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి ఉంది. రిపోర్ట్ లేకుంటే ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆసుపత్రులు చేర్చుకునే పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలో వైద్యాధికారులకు ఫిర్యాదుల వెల్లువెత్తుతున్నాయి.
రిపోర్ట్ ఇచ్చేలా కసరత్తు...
బస్తీ దవాఖానాలు, యూపీహెచ్‌సీల్లో పరీక్షలు చేస్తుండటంతో తక్షణమే రిపోర్టు ఇవ్వాలంటే ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఒక ఫార్మాట్ రూపొందించి ప్రింట్ రూపంలో రిపోర్ట్ ఇవ్వాలి. అయితే ఎలా చేయాలన్న దానిపై వైద్య, ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. కాగా, మంగళవారం నుంచే కొన్నిచోట్ల రిపోర్టులు ఇచ్చే ప్రక్రియ ప్రారంభించామని, మిగిలిన చోట్ల త్వరలోనే దీనిని మొదలుపెడతామని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ర్యాపిడ్‌లో రిపోర్టుల సమస్య
Published Wed, Jul 15 2020 5:59 AM | Last Updated on Wed, Jul 15 2020 5:59 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment