వైద్యం పూజ్యం
నెల్లూరు (వైద్యం): జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఏళ్ల తరబడి ఖాళీ పోస్టులను భర్తీ చేయలేదు. దీంతో పేదలకు వైద్యం అందని ద్రాక్షగా మారింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ప్రతి ఏటా భారీగా నిధులు విడుదలవుతున్నాయి.
కాని వాటిని సద్వినియోగం చేయడంలో వైద్యాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా పీహెచ్‌సీలన్నీ సమస్యలతో విలవిలలాడుతున్నాయి. ఉదాహరణకు ఆత్మకూరు నియోజకవర్గంలోని అనంతసాగరం పీహెచ్‌సీలో కొన్ని నెలలుగా వైద్యులు లేరు. ఇటీవల ఆ ఆస్పత్రి ఫార్మసిస్ట్ దగదర్తికి బదిలీ అయ్యారు.
కనీసం ల్యాబ్ టెక్నీషియన్ కూడా లేకపోవడం వైద్యశాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టకు నిదర్శనమని చెప్పవచ్చు. ఈ ఆస్పత్రికి నిత్యం 70 మందికి పైగా ఔట్‌పేషంట్లు వస్తుంటారు. వీరికి ఏఎన్‌ఎమ్‌లే వైద్యసేవలు అందించడం గమనార్హం. జిల్లాలో మొత్తం 74 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 14 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, మూడు ఏరియా ఆస్పత్రులు, రెండు పీపీ యూనిట్లు, 17 క్లస్టర్లు ఉన్నాయి.
పోస్ట్‌లు అవసరం పని చేస్తున్నవారు ఖాళీలు
వైద్యులు 172 151 21
స్టాఫ్ నర్సులు 135 99 36
ఏఎన్‌ఎమ్ 477 325 152
కాంట్రాక్ట్‌ఏఎన్‌ఎం 477 394 83
ఫార్మాసిస్ట్‌లు 66 42 24
ల్యాబ్ టెక్నీషియన్ 62 15 47