సాక్షి, అమరావతి: ఆక్వా రంగం బలోపేతానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితాన్నిస్తున్నాయి. పెట్టుబడి తగ్గిపోయి దిగుబడి, నాణ్యత పెరుగుతోంది. పొలం బడి, ఉద్యానబడి తరహాలో నాణ్యమైన ఉత్పత్తులే లక్ష్యంగా నిర్వహిస్తున్న మత్స్య సాగుబడులు సత్ఫలితాలనిస్తున్నాయి. ఫార్మర్స్ ఫీల్డ్ స్కూల్స్ నిర్వహణ ద్వారా ఆక్వా ఉత్పత్తుల్లో మితిమీరిన యాంటి బయోటిక్స్ వాడకం అనూహ్యంగా తగ్గడమే కాకుండా నాణ్యమైన దిగుబడులు పెరుగుతున్నాయి.
మూడేళ్లలో 12.76 శాతం వృద్ధి రేటు
తూర్పు గోదావరి జిల్లా కరపకు చెందిన లక్ష్మీపతి రాజు చెరువు వద్ద అవగాహన కల్పిస్తున్న మత్స్య శాఖాధికారులు
ఆక్వా రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంది. రాష్ట్రానికి 974 కి.మీ. సువిశాల సముద్రతీర ప్రాంతం ఉంది. ఏపీలో సుమారు ఐదు లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. దేశవ్యాప్తంగా చేపల ఉత్పత్తిలో 29 శాతం, రొయ్యల ఉత్పత్తిలో 76 శాతం వాటా మన రాష్ట్రానిదే. 2018– 19లో 39.92 లక్షల మత్స్య టన్నులున్న దిగుబడులు 2020–21 నాటికి 46.20 లక్షల టన్నులకు (16 శాతం వృద్ధి) చేరాయి. 2018–19లో వార్షిక వృద్ధి రేటు 7.69 శాతం కాగా 2019–20లో 11 శాతంగా నమోదైంది. 2020–21 నాటికి 12.76 శాతానికి పెరిగింది.
ఆర్బీకేల ద్వారా నాణ్యమైన సీడ్, ఫీడ్
తూర్పు గోదావరి జిల్లా కరపకు చెందిన లక్ష్మీపతి రాజు చెరువు వద్ద అవగాహన కల్పిస్తున్న మత్స్య శాఖాధికారులు
2018–19లో ఆక్వా ఎగుమతుల్లో 86 శాతానికిపైగా మితిమీరిన యాంటి బయోటిక్స్ ఉండటంతో అమెరికా, చైనా సహా ఐరోపా, మధ్య ఆసియా దేశాలు వెనక్కి పంపాయి. ఈ పరిస్థితిని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా యాంటి బయోటిక్స్ శాతం 37.5 శాతానికి తగ్గింది. సర్టిఫై చేసిన సీడ్, ఫీడ్ అందించే లక్ష్యంతో ఏపీ సడా, సీడ్, ఫీడ్ చట్టాలని ప్రవేశపెట్టి రూ.50.30 కోట్లతో 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్‌లతో పాటు ఆర్బీకేల ద్వారా సర్టిఫై చేసిన సీడ్, ఫీడ్ అందుబాటులోకి తెచ్చారు. సర్వే నెంబర్ల వారీగా రైతులు సాగు చేస్తున్న మత్స్య ఉత్పత్తులను ఈ –క్రాప్ ద్వారా గుర్తించి నాణ్యమైన ఆక్వా దిగుబడుల కోసం మత్స్య సాగుబడులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
మత్స్య సాగుబడులు ఇలా..
మూస పద్ధతి సాగు విధానాలకు తెరదించి యాంటి బయోటిక్స్ వాడకుండా నాణ్యమైన ఆక్వా ఉత్పత్తుల కోసం నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం బాటలు వేస్తోంది. మత్స్యసాగుబడుల ద్వారా మెరైన్/ఇన్‌ల్యాండ్ మత్స్యకారులు, ఆక్వా రైతులకు సాగులో మెళకువలు, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందిస్తున్నారు. ఒకవైపు ఆర్బీకే ఛానల్ ద్వారా శాస్త్రవేత్తలతో అవగాహన కల్పిస్తూనే క్షేత్ర స్థాయిలో ఆర్బీకేల ద్వారా ఆక్వా, ఇన్‌ల్యాండ్, మెరైన్ సెక్టార్లలో మత్స్యసాగుబడుల ద్వారా అంశాలవారీగా శిక్షణ ఇస్తున్నారు. యాంటి బయోటిక్స్ వినియోగాన్ని నియంత్రించేలా పంటకాలంలో కనీసం ఐదుసార్లు వాటర్ ఎనాలసిస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించే రైతులను సమీప ఆర్బీకేలకు ట్యాగ్ చేస్తున్నారు. చెరువులను జియోట్యాగ్ చేస్తున్నారు. ప్రతీ విషయాన్ని ఈ–మత్స్యకార పోర్టల్‌లో అనుసంధానం చేస్తున్నారు.
హెక్టార్‌కు 4 టన్నులు
నేను 12 హెక్టార్లలో ఆక్వా సాగు చేస్తున్నా. ఆర్బీకే ద్వారా ఎంపిక చేసుకున్న నాణ్యమైన సీడ్, మత్స్యసాగుబడుల్లో సూచించిన సాగు విధానాలను పాటించా. పంట కాలంలో దశలవారీగా నీటి నమూనాలను సేకరిస్తూ వ్యా«ధుల నిర్ధారణ, ఫీడ్ నిర్వహణ పాటించా. నిషేధిత యాంటి బయోటిక్స్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేశా. సిఫార్సు చేసిన ప్రొ బయోటిక్స్, ఇమ్యునోస్టిమ్యులెంట్స్‌ను మాత్రమే వినియోగించా. గతంలో తెగుళ్ల నివారణ కోసం హెక్టార్‌కు రూ.80 వేల నుంచి రూ.లక్ష ఖర్చు కాగా ప్రస్తుతం రూ.10 వేల నుంచి రూ.20 వేలలోపే వ్యయం అవుతోంది. గతంలో హెక్టార్‌కు 3–3.2 టన్నుల దిగుబడి రాగా ఇప్పుడు 4 టన్నుల దిగుబడితో రూ.2–3 లక్షలు అదనపు ఆదాయం లభించింది.
– పి.లక్ష్మిపతిరాజు, కరప, తూర్పుగోదావరి జిల్లా
సత్ఫలితాలనిస్తున్న మత్స్యసాగుబడులు
నాణ్యమైన దిగుబడులు సాధించడమే లక్ష్యంగా మత్స్యసాగుబడులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దేశంలో ఎక్కడా ఫార్మర్ ఫీల్డ్ స్కూల్స్ నిర్వహిస్తున్న దాఖలాలు లేవు. ప్రతీ రైతును భాగస్వామిగా చేయడం ద్వారా నైపుణ్యాలను పెంపొందిస్తున్నాం. శాస్త్రవేత్తలతో క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహిస్తూ సలహాలు అందిస్తున్నాం. నిషేధిత యాంటి బయోటిక్స్ వినియోగం 10 శాతానికి తగ్గినట్లు గుర్తించాం. పెట్టుబడులు తగ్గడంతో పాటు దిగుబడులు పెరిగాయి.
– కె.కన్నబాబు, మత్స్యశాఖ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment