పెరుగుతున్న మేత ధరలు ఆక్వా రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తృణ ధాన్యాల దిగుబడి విషయంలో గత ప్రభుత్వానికి సరైన రవాణా ప్రణాళిక లేకపోవడంతో వాటి ధరలను వ్యాపారులు అమాంతం పెంచేశారు. దీనికితోడు ఉప్పు నీటి ప్రభావంతో రొయ్యలు, చేపల దిగుబడులు తగ్గిపోవడం.. ఉత్పత్తికి తగ్గట్టుగా గిట్టుబాటు ధర లేకపోవడం.. వ్యాధులు, వైరస్ చుట్టుముట్టడంతో మరింత కుంగదీశాయి. ఏటా ఇలాంటి సంక్షోభాలను ఎదుర్కొంటున్న రైతులకు ఈసారి నష్టాలు తప్పేలా లేవు. గత నాలుగేళ్లలో చేపల మేత ధర రెట్టింపు కాగా.. రొయ్యల మేత ధర మూడొంతులు పెరిగింది. వీటి పెరుగుదల రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
సాక్షి, కాకినాడ: జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 12,500 హెక్టార్లలో చేపలు, 6,200 వేల హెక్టార్లలో రొయ్యలను సాగు చేస్తున్నారు. నాలుగు కంపెనీల ద్వారా మేత ఉత్పత్తి చేస్తున్నారు. అక్కడ తయారైన వివిధ రకాల మేత చేపలు, రొయ్యలకు ఆహారంగా అందజేస్తున్నారు. మేత తయారీకి తృణ ధాన్యాలు వినియోగిస్తున్నారు. అయితే ఈ ధాన్యాల ధరలు గతంతో పోల్చుకుంటే కేజీ వేరుశనగ చెక్క ధర రూ.3, తవుడు రూ.6, డీవోపీ రూ.8 చొప్పున పెరిగాయి. డీవోపీ ధర రికార్డు స్థాయిని దాటిపోయింది. ప్రస్తుతం నాణ్యమైన టన్ను డీవోపీ ధర రూ.20 వేలు పలుకుతుండటం రైతులకు మింగుడు పడటం లేదు. మేతల రేట్లు పెరిగిన స్థాయిలో చేపల ధరల్లో మాత్రం మార్పు రాలేదు. నాలుగేళ్ల కిందట తవుడు ధర రూ.10 ఉన్నప్పుడు రోహూ రకం చేప కిలో రూ.100 ఉండేది. ప్రస్తుతం మేతల ధరలు రెట్టింపయినా చేప ధర రూ.110 వరకు మాత్రమే ఉంది. టన్ను చేపల రేట్లకు పది టన్నుల మేతల ధరలు ఉంటే రైతులకు గిట్టుబాటు అవుతుంది. ప్రస్తుతం టన్ను చేపలు సుమారు రూ.1.10 లక్షలుండగా టన్ను మేత రూ.20 వేలు పలుకుతోంది.
కారణాలు ఏమిటంటే..
పెరిగిన మేత ధరలకు ప్రధాన కారణం దేశవ్యాప్తంగా తృణ ధాన్యాలకు అధిక డిమాండ్లే. రైస్ మిల్లర్లకు ప్రభుత్వ కన్‌సైన్‌మెంట్ లేకపోవడంతో తక్కువ పరిణామంలోనే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఎక్కడా రైస్ మిల్లులు తిరిగే పరిస్థితి లేదు. గోదాముల్లో ధాన్యం ఉన్నా ఆర్డర్లు లేకపోవడంతో వాటిని మిల్లు పట్టించడం లేదు. తవుడుకు తీవ్ర కొరత ఏర్పడింది. నూనె తీసిన డీవోపీ ధరలకు రెక్కలు వచ్చాయి. స్థానికంగా తవుడు కొరత ఏర్పడంతో డిమాండ్ పెరిగింది. ఏటా వర్షాకాలం ప్రారంభంలో రైతులందరూ ఒకేసారి సాగు పనులు మొదలు పెట్టడంతో ఈ కాలంలో మేతలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. జూలై నుంచి నవంబర్ వరకు ధరలు పెరుగుతాయి. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు సిండికేటుగా ఏర్పడి ధరలను ప్రభావితం చేస్తున్నారు. కృత్రిమ డిమాండ్‌ను సృష్టించి అమాంతంగా రేట్లు పెంచి విక్రయిస్తున్నారు. ఆక్వా సాగులో ముఖ్యమైన మేతలు లేకపోతే దిగుబడిపై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతో ధరలు పెంచినా ప్రశ్నించకుండానే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇబ్బందుల్లో రైతులు
ఆక్వా సాగుదార్లకు మేతల ధరలు తలకుమించిన భారంగా పరిణమిస్తున్నాయి. చెరువుల్లో రొయ్యలు ఉన్నప్పుడు ఒకేసారి భారీ ఎత్తున మేతల ధరలు పెరుగుతున్నా తప్పక కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. గత ఏడాది నవంబర్ తర్వాత చేపల చెరువులకు చుక్కనీరు అందిన దాఖలాలు లేవు. ఓ పక్క నీరు లేక.. మరో పక్క పెరిగిన మేతల ధరలతో ఇబ్బందులు తప్ప లేదు. చెరువుల్లో నీరు అడుగంటి పోవడంతో పట్టుబడి సాధ్యం కాదు. చెరువులో వలను దింపితే చేపలు చనిపోయే ప్రమాదం ఉంది. పట్టుబడి చేయాలో..పెరిగిన మేతల ధరలతో సాగు చేసి నష్టాలు చవిచూడాలో అర్థం కాక ఆక్వా రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.
కల్తీ కాటు
మేతల ధరలు ఆకాశాన్ని అంటడంతో కొందరు వ్యాపారులు అత్యాశకు పోయి కల్తీకి పాల్పడుతున్నారు. చెరువుల్లో పిల్లల ను రక్షించుకోవడానికి ధరలు ఎంత పెరిగినా కొనుగోలు చేయక తప్పని పరిస్థితిలో రైతులున్నారు. కల్తీ చేసిన మేతల్ని కొనుగోలు చేసి నష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. వేరుశనగ చెక్కలో కంకర ఇసుక, చింతపిక్కల పొడి, వేరుసెనగ తొక్కల పొడిని కలుపుతున్నారు. తవుడులో రంపపు పొట్టు, సీరు నూకలు, ఊకదూగరతో కల్తీ చేస్తున్నారు. కొందరు మిల్లర్లే స్వయంగా తవుడును కల్తీ చేసి అమ్ముతున్నారు. పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల్లో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో మిల్లర్ల వద్ద నాణ్యమైన తవుడు దొరుకుతుందని వచ్చిన రైతులకు అక్కడా మోసం తప్పడం లేదు.
గిట్టుబాటు కరువే
ఎకరం చెరువులో 1.50 లక్షల పిల్లలు సాగు చేస్తే.. ప్రస్తుతం ఒక పిల్ల ధర 35 పైసలు పలుకుతోంది. అంటే 1.50 లక్షల పిల్లలకు రూ.45 వేలు, మందులు, మేత, విద్యుత్తు బిల్లులకు మరో రూ.4 లక్షలు అవుతోంది. ఆశించిన మేర పంట దిగుబడి అందితే.. అంటే రొయ్య 30 కౌంట్‌కు వచ్చి మూడు టన్నులు అయితే రూ.15 లక్షలు ఆదాయం వస్తుంది. లేని పక్షంలో పెట్టిన పెట్టుబడి సైతం చేతికందే పరిస్థితి ఉండదు. ప్రస్తుతం బహిరంగ విపణిలో సైతం రొయ్యల ధరలు ఆశించిన మేర లేకపోవడంతో రైతులు సాగుకు ముందుకు రావడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment