తిలాపియా.. ఏం చేయాలయా! | Lethal Virus Attacks Tilapia Fish | Sakshi
Sakshi News home page

తిలాపియా.. ఏం చేయాలయా!

Published Mon, Jun 5 2017 2:02 AM | Last Updated on Tue, Sep 5 2017 12:49 PM

తిలాపియా.. ఏం చేయాలయా!

తిలాపియా.. ఏం చేయాలయా!

ఐదు దేశాల్లోని చేపలకు వైరస్‌ నిర్ధారణ
► భారత్‌ సహా ఇతర దేశాలు అప్రమత్తం
► ఎలా సోకుతుంది.. వ్యాప్తి ఎలాపై పరిశోధన
►  ప్రపంచ ఆక్వా సాగులో తిలాపియాది రెండోస్థానం
► కోట్లాది మందికి ఆహారం.. లక్షల మందికి ఉపాధి


2015లో ప్రపంచవ్యాప్తంగా తిలాపియా చేపల ఉత్పత్తి  6.4 మిలియన్‌ టన్నులు
వీటి విలువ - 66,000 రూ.కోట్లలో

సాక్షి, అమరావతి: చేపల చెరువుల్లో కల్లోలం.. తిలాపియా చేపలకు వైరస్‌.. పెంపకందార్ల అయోమయం.. ప్రపంచంలో ఎక్కువగా తినే చేప జాతుల్లో ఒకటైన తిలాపియాకూ వైరస్‌ సోకడం పెంపకందారులను కుదిపేస్తుంది. ప్రజారోగ్యానికి ప్రస్తుతానికి ఎలాంటి ముప్పులేనప్పటికీ చేపల పెంపకంలో భారీ నష్టాలతో పాటు పౌష్టికాహారానికి తిప్పలు తప్పని పరిస్థితి. ఇప్పటికే ఈ వైరస్‌ ఐదు దేశాలను వణికిస్తోంది. మిగతా దేశాలు అప్రమత్తంగా ఉండాలని ఇవి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఇది ఎలా సోకుతుందన్నది, ఎలా వ్యాపిస్తుందీ ఇంకా నిర్ధారణ కాలేదు. ఇజ్రాయెల్‌ వైరస్‌ నిరోధానికి వ్యాక్సిన్‌ను కనిపెట్టే పనిలో పడింది.

ఏఏ దేశాల్లో..
ప్రస్తుతం మూడు ఖండాలలోని ఐదు దేశాలలో తిలాపియా చేపలకు వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. కొలంబియా, ఈక్విడార్, ఈజిప్ట్, ఇజ్రాయెల్, థాయ్‌ల్యాండ్‌ దేశాలలో వైరస్‌ను గుర్తించారు. థాయ్‌ల్యాండ్‌లో ఈ వైరస్‌ వల్ల 90 శాతం వరకు తిలాపియా చేపలు చనిపోయాయి.

ఇదే తొలిసారి...
ఎక్కడి నుంచైనా చేపల్ని ఎగుమతి చేసేటప్పుడు ఐస్‌లో పెట్టి గడ్డకట్టించి మరీ పంపుతారు. ఇలా పంపే చేపల ద్వారా వైరస్‌ సోకుతుందా లేదా? అనే విషయం ఇంకా నిర్ధారణ కాలేదు. అయితే తిలాపియాకు వైరస్‌ రావడం ఇదే తొలిసారి.
 
వైరస్‌ సోకితే...
వైరస్‌ సోకి¯è  చేపలు తిండి తక్కువÐè  తింటాయి. కదలిక తక్కువగా ఉంటుంది. మచ్చలు, పుండ్లు ఏర్పడతాయి. కళ్లు మూతలు పడుతుంటాయి. చూపు మందగిస్తుంది. దీన్ని ఆర్థోమైక్సోవిరిడియా (ఇదో వైరల్‌ వ్యాధి. వేగంగా సోకుతుంది)కు చెందిన వైరస్‌గా నిర్ధారించారు.

ప్రజారోగ్యానికి ముప్పు లేనట్లే..
ప్రస్తుతానికి ప్రజారోగ్యానికి ఎటువంటి ముప్పు లేనప్పటికీ ఈ బెడద భవిష్యత్తులో మరింత తీవ్రమవుతుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. దీంతో తిలాపియా దిగుమతి చేసుకునే దేశాలు అప్రమత్తమయ్యాయి. ప్రమాద నివారణ చర్యలు చేపట్టాయి. వ్యాధి నిర్ధారణ పరీక్షలు మెుదలుపెట్టాయి. విదేశాల నుంచి వచ్చిన చేపల్ని పరీక్షించడం, తాత్కాలిక నివారణ చర్యల్ని రూపొందించడం మొదలయ్యాయి.
 
జీఐఈడబ్ల్యూఎస్‌ హెచ్చరిక...
ముందస్తు హెచ్చరిక వ్యవస్థ (జీఐఈడబ్ల్యూఎస్‌) తిలాపియా పెంచే దేశాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తిలాపియాను పెంచే సరస్సులను, చెరువులను తరచూ తనిఖీ చేస్తూ ఎప్పటికప్పుడు రక్షణ చర్యలు చేపట్టాలని సలహా ఇచ్చింది.

తిలాపియాది రెండో స్థానం...
ప్రపంచంలోనే అత్యధికంగా సాగు చేసే ఆక్వా జాతుల్లో తిలాపియా రెండోది. ఈ సాగుతో కోట్ల మందికి ఆహారంతో పాటు లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. ఏ వ్యాధిని అయినా తట్టుకుని పెరిగే ఆక్వా జాతుల్లో తిలాపియా ఒకటి. ప్రత్యేకించి అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని బడుగు బలహీన వర్గాలకు పౌష్టికాహారాన్ని అందించడంలో ఈ చేపది కీలక పాత్ర.

భారత్‌లో తిలాపియా...
కొన్ని షరతులతో తిలాపియా సాగును ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అనుమతి తెలిపింది. ఆంధ్రప్రదేశ్, కేరళ, ఒడిశాలో సాగు చేస్తున్నారు. హెక్టార్‌కు 5 టన్నుల వరకు దిగుబడిని పొందుతున్నారు. కిలో సగటు ధర రు.150 నుంచి రూ.200 వరకు పలుకుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement