సాక్షి, అమరావతి: ఆక్వా కల్చర్ అభివృద్ధికి చేయూతనందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన ప్రాంతాల్లో సాగు విస్తీర్ణాన్ని పెంచేలా చర్యలు చేపట్టింది. నిబంధనలను అనుసరించి కొత్తగా చేపలు, రొయ్యల చెరువుల తవ్వకాలకు చకచకా అనుమతులు జారీ చేస్తోంది. మరోవైపు సాగర తీరంలోని ఉప్పునీటి భూముల్లోనూ ఆక్వా కల్చర్‌ను ప్రోత్సహించే దిశగా అడుగులేస్తోంది. రాష్ట్రంలో 974 కిలోమీటర్ల మేర సముద్ర తీరం విస్తరించి ఉంది. ఇందులో 352 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మడ అడవులున్నాయి. సుమారు 75 వేల హెక్టార్లలో ఉప్పునీటి (బ్రాకిష్ వాటర్) భూములు ఉండగా.. ఇవన్నీ ఆక్వా కల్చర్ సాగుకు అనుకూలమైనవి. ఇందులో ప్రస్తుతం 54,477 హెక్టార్లలో ఆక్వా సాగవుతోంది. మరో 21 వేల హెక్టార్లు సాగుకు అనుకూలంగా ఉంది. ఆ భూముల్లోనూ ఆక్వా సాగును విస్తరించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
సీఏఏ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుతో..
మంచినీటి చెరువుల్లో ఆక్వా సాగు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ (అప్సడా)ద్వారా లైసెన్సులు తీసుకోవచ్చు. అదే సముద్ర తీరంలోని ఉప్పునీటి భూముల్లో ఆక్వా సాగు చేపట్టాలంటే కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ (సీఏఏ) నుంచి అనుమతులు పొందాలి. తూర్పు తీరానికి సంబంధించి ఈ కేంద్రం చెన్నైలో మాత్రమే ఉండటంతో రాష్ట్రం నుంచి సిఫార్సు చేసిన దరఖాస్తులను పరిశీలించి అనుమతులు జారీ చేయడంలో తీవ్ర జాప్యం జరిగేది. ఈ కారణంగా దరఖాస్తులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండేవి.
రాష్ట్రంలో 54,477 హెక్టార్లలో ఉప్పునీటి ఆక్వా చెరువులు ఉండగా.. వాటిలో కేవలం 25,217 హెక్టార్ల (46 శాతం)లోని చెరువులకు మాత్రమే గుర్తింపు ఉంది. గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ఆ భూముల్లో అనధికారిక సాగు పెరిగిపోతూ వచ్చింది. ఈ పరిస్థితిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సీఏఏ తొలి ప్రాంతీయ ఫెసిలిటీ సెంటర్‌ను ఏపీకి మంజూరు చేయించింది. ఈ సెంటర్‌ను మార్చి 18న విజయవాడలోని మత్స్యశాఖ కమిషనరేట్ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ కార్యాలయం ఏర్పాటుతో ఉప్పునీటిలో ఆక్వా సాగు చేసే రైతులకు రిజిస్ట్రేషన్‌లో ఎదురవుతున్న ఇబ్బందులకు చెక్ పడింది. సాగులో ఉన్న చెరువుల రిజిస్ట్రేషన్ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఉప్పునీటి కింద 39,570 హెక్టార్లలో వనామీ, 3,796 హెక్టార్లలో మోనోడోన్ రొయ్యలు సాగవుతుండగా, 6,300 హెక్టార్లలో పసుపు పీత(మడ్ క్రాబ్), 4,811హెక్టార్లలో పండుగప్ప (సీ బాస్) సాగవుతోంది.
బ్రాకిష్ వాటర్‌లో కొత్త రకాలకు ప్రోత్సాహం
ఇదిలావుంటే.. తీరంలో సాగుకు అనుకూలంగా ఉన్న మరో 21వేల హెక్టార్ల విస్తీర్ణంలోని ఉప్పునీటి భూముల్లో ఆక్వా కల్చర్‌ను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2020–21లో కొత్తగా కనీసం 8 వేల హెక్టార్లలో బ్రాకిష్ వాటర్ ఆక్వా సాగును విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే ఐదువేల హెక్టార్లలో సాగు కోసం రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కొత్తగా సాగులోకి తీసుకొస్తున్న ఉప్పునీటి చెరువుల్లో సిల్వర్ పాంపనో (తెల్ల సందువా), రెడ్ స్నాప్పర్, గ్రౌవర్, పి.ఇండిసియస్ రొయ్యల సాగును ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
సీఏఏ రాకతో రొయ్యల హేచరీల్లో బ్రూడర్, సీడ్ నాణ్యతను పెంపొందించేందుకు.. ఆక్వా కల్చర్ ఇన్‌పుట్స్ ధ్రువీకరించేందుకు మార్గం సుగమమైంది. మరోవైపు విచ్చలవిడిగా వినియోగిస్తున్న యాంటీ బయోటిక్స్‌కు సీఏఏ కేంద్రం ద్వారా అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది. ఉప్పునీటిలో ఆక్వా సాగును ప్రోత్సహించేందుకు ఆన్‌లైన్ ద్వారా వచ్చే దరఖాస్తులను సీఏఏ ఫెసిలిటీ సెంటర్‌కు పంపించి 6 నుంచి 15 రోజుల్లో అనుమతులు మంజూరయ్యేలా చర్యలు చేపట్టినట్టు మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment