పాండిచ్చేరిలో సాగైన పండుగప్ప చేపలను చూపుతున్న ఎంపెడా సిబ్బంది (పండుగప్ప పిల్లలు)
దేశ విదేశీ మార్కెట్లలో మంచి గిరాకీ ఉండటమే కాకుండా.. మంచి నీటిలో, ఉప్పు నీటిలో, సముద్రపు నీటిలో కూడా పెరిగే అరుదైన చేప.. పండుగప్ప (సీబాస్). రొయ్యలకు ప్రత్యామ్నాయంగా రైతులు సాగు చేయదగిన సలక్షణమైన చేప ఇది.
ముళ్లు తీసేసిన పండుగప్ప మాంసం ముక్కలకు దేశీయ సూపర్ మార్కెట్లలో మంచి గిరాకీ ఉంది. కిలో రూ. 400–500 వరకు పలుకుతోంది. విదేశాల్లో దీనికి ఉన్న డిమాండ్ సరేసరి. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే.. సముద్ర ఉత్పత్తుల ఎగుమతి ప్రోత్సాహక సంస్థ ఎంపెడా ఇటీవల పండుగప్ప సాగులో అధిక దిగుబడి సాధించింది. ఉప్పునీటి చెరువులో హెక్టారుకు 15 టన్నుల పండుగప్ప చేపల దిగుబడి తీయడం విశేషం. చెరువుల్లో సాగయ్యే రకాల్లో రొయ్యలకు అన్ని విధాలా దీటైన ‘రారాజు పండుగప్ప’ అని ‘ఎంపెడా’ చైర్మన్ కె.ఎస్. శ్రీనివాస్ అభివర్ణించారు. ఆక్వా సాగు అంటే కేవలం రొయ్యల సాగే అని భావించే రైతులు పండుగప్ప సాగుపై దృష్టి సారించడానికి తాజా ప్రయోగాత్మక సాగు ఫలితాలు ఉత్తేజాన్నిస్తాయని ఆయన అన్నారు.
ఆక్వా సాగులో సరికొత్త ప్రయోగాలకు ‘రాజీవ్‌గాంధీ ఆక్వాకల్చర్ సెంటర్’(ఆర్.జి.సి.ఎ.)లు వేదికలుగా నిలిచాయి. ఎంపెడా ఆధ్వర్యంలో దేశంలోని అనేక చోట్ల ఆర్.జి.సి.ఎ.లు ఏర్పాటయ్యాయి. కృష్ణాజిల్లాలో కూడా ఒక ఆర్.జి.సి.ఎ. విభాగం ఉంది.
పాండిచ్చేరిలోని కరైకల్ వద్ద ఏర్పాటైన ఆర్.జి.సి.ఎ.లోని ప్రదర్శనా క్షేత్రంలో ప్రయోగాత్మకంగా పండుగప్పను సాగు చేసి, 10 నెలల్లో హెక్టారుకు 15 టన్నుల దిగుబడి సాధించారు. 1.5–2.0 సెం.మీ. చేప పిల్లలను చెరువులో వదిలారు. పది నెలల్లో ఒక్కోచేప 1200 గ్రాముల నుంచి 1500 గ్రాముల బరువు పెరిగాయి. తేలాడే పెల్లెట్లను మేతగా వేశారు. కిలో మేతకు 1.8 కిలోల దిగుబడి సాధించడం విశేషం. అన్నీ కలిపి కిలోకు రూ. 300 ఉత్పత్తి ఖర్చు అయింది. వ్యాపారులు చెరువు దగ్గరకే వచ్చి రూ. 420–450 ధర ఇచ్చి కొనుక్కెళ్లారు. రూ. 17 లక్షల లాభం వచ్చినట్లు ఎంపెడా అధికారులు ప్రకటించారు.
పండుగప్ప సాగుకు కీలకం నాణ్యమైన విత్తనం. తమిళనాడు నాగపట్నం జిల్లా తోడువాయి వద్ద గల ఆర్.జి.సి.ఎ.లోని హేచరీలో అత్యంత నాణ్యమైన పండుగప్ప విత్తనాన్ని ఉత్పత్తి చేసి రైతులకు అందిస్తున్నారు. ఇప్పటికే కోటి 80 లక్షల సీడ్‌ను ఉత్పత్తి చేసి రైతులకు అందించినట్లు ఎంపెడా చెబుతోంది. ప్రజలు మక్కువతో ఆరగించే పండుగప్ప చేపలను రొయ్యలకు బదులుగా ఆక్వా రైతులు సాగు చేయాలని ఎంపెడా సూచిస్తోంది.
పండుగప్ప విత్తనం కోసం ఆర్.జి.సి.ఎ. అధికారి పాండ్యరాజన్‌ను 94437 24422లో సంప్రదించవచ్చు. ఫాక్స్: 04364–264502
seabasshatchery@gmail.com.
Comments
Please login to add a commentAdd a comment