pandugoppa
-
పంజరంలో పండు‘గొప్ప’
సాక్షి, అమరావతి: తీరం వెంబడి విస్తరిస్తున్న పంజరం చేపల సాగు (కేజ్ కల్చర్) సిరుల పంట పండిస్తోంది. కేంద్ర సముద్ర మత్స్య పరిశోధన కేంద్రం (సీఎంఎఫ్ఆర్ఐ) సాంకేతిక చేయూత అందించడంతోపాటు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద సీడ్‌ను కూడా ఉచితంగా అందిస్తోంది. సీఎంఎఫ్ఆర్ఐ సహకారంతో కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం లక్ష్మీపురం వద్ద ఉప్పుటేరులో కేజ్ కల్చర్ చేపట్టిన యానాదులకు సిరుల పంట పండింది. 1.85 టన్నుల పండుగప్ప దిగుబడి ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద గత ఏడాది డిసెంబర్లో 585 మీటర్లు పరిమాణం గల 4 పంజరాల్లో 80 నుంచి 100 గ్రాముల బరువు గల పండుగప్ప చేప పిల్లలను వదిలారు. ఏడాది కాలంలో ఇవి కేజీన్నర నుంచి 2 కేజీల వరకు బరువు పెరిగాయి. 4 పంజరాల్లో తాజాగా పట్టుబడి పట్టగా 1.85 టన్నుల దిగుబడి వచ్చింది. కిలో రూ.460 చొప్పున విక్రయించారు. మరో 700 గ్రాముల సైజులో మరో 400 కేజీల వరకు పట్టుబడి చేయాల్సి ఉంది. వేటకు వెళ్లే ఈ కుటుంబాలు చిన్నపాటి చేపలను తీసుకొచ్చి పంజరాల్లోని పండుగప్పలకు మేతగా ఉపయోగించేవారు. పైసా పెట్టుబడి లేకుండా ఒక్కో పంజరం నుంచి రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఆర్జించారు. భూమిలేని పేదలకు వరం భూమిలేని పేదలకు ఇది ఎంతో లాభదాయకమని సీఎంఎఫ్ఆర్ఐ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శేఖర్ మేఘరాజన్ అన్నారు. సీఎంఎఫ్ఆర్ఐ ఇచ్చిన చేయూత వల్ల తమ కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోగలిగాయని ఎస్టీ మత్స్యకారుడు నాగరాజు ఆనందం వ్యక్తం చేశారు. -
పంజరంలో.. 'పండుగ'ప్ప
‘మాకు చేపల వేటే జీవనాధారం. బోట్లు దెబ్బతినడంతో ఆక్వాసాగు చేపట్టాం. అదికూడా కలిసిరాకపోవడంతో ఏం చేయాలో పాలుపోని సమయంలో గ్రామంలోని ఓ పది మంది ఎస్సీ, ఎస్టీ యువకులతో కలిసి సీఎంఎఫ్ఆర్ఐ దగ్గర శిక్షణపొంది కేజ్ కల్చర్ ప్రారంభించాం. నాలుగు కేజ్‌లలో రెండువేల పండుగప్ప పిల్లలు వేశాం. ఏడాది పాటు పెంచి సోమవారం పట్టుబడి పట్టాం. ఒక్కో చేప కేజీ నుంచి రెండు కేజీల వరకు పెరిగింది. కిలో రూ.400 చొప్పున అమ్మితే రూ.8 లక్షల ఆదాయం వచ్చింది. ఖర్చులు పోను రూ.3 లక్షలకు పైగా మిగిలింది’.. కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెం పంచాయతీ ఏటిపవర పల్లెపాలేనికి చెందిన తిరుమాని బలరాం తన ఆనందాన్ని ‘సాక్షి’తో ఇలా పంచుకున్నాడు. సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లాలో సముద్ర తీరం వెంబడి విస్తరిస్తున్న పంజరం సాగు (కేజ్ కల్చర్) నిరుద్యోగులకు సిరుల పంట కురిపిస్తోంది. ఇది తక్కువ పెట్టుబడితో రెట్టింపు ఆదాయం తెచ్చిపెడుతోంది. చెరువుల్లో చేపల సాగుకు పరిమితం కాకుండా సముద్ర, సహజ జలవనరులలో కేజ్ కల్చర్, మారీ కల్చర్‌ను (పారేనీటిలో వలలు కట్టి సాగుచేయడం) ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. కేంద్ర సముద్ర మత్స్య పరిశోధన కేంద్రం (సీఎంఎఫ్ఆర్ఐ) సాంకేతిక సహకారాన్నిస్తోంది. జపాన్, చైనా, హాంకాంగ్ దేశాల్లో అభివృద్ధి చెందిన ఈ కల్చర్ ఏపీలో విశాఖ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణాజిల్లాలోని తీర ప్రాంతాల్లో విస్తరిస్తోంది. కేజ్ ఏర్పాటు ఇలా.. ► సముద్ర తీరంలో 6 మీటర్లు వెడల్పు, 4 మీటర్ల పొడవు విస్తీర్ణంలో కేజును ఏర్పాటుచేస్తారు. ► వీటిని తుప్పుపట్టని పైపులతో వృత్తాకారం, దీర్ఘచతురస్రాకారంలో ఏర్పాటుచేస్తారు. ► ఇవి నీటిలో తేలియాడేందుకు ప్లాస్టిక్ డ్రమ్ములను అమర్చుతారు. ఇన్నర్, ఔటర్ నెట్లు ఏర్పాటుచేస్తారు. ఇన్నర్ వలలో సాగుచేపడతారు. ► పంజరం ఏర్పాటుచేసే స్థలంలో నీటి ఉష్ణోగ్రత 26–30 డిగ్రీల వరకు ఉండాలి. ► లోతు 7–10 మీటర్లు.. నీటి ప్రవాహ వేగం ఎక్కువగా ఉండి, గాలివేగం తక్కువగా ఉండాలి. ► కేజ్ కల్చర్‌లో తిలాఫియా, ఫంగసీస్, రెడ్ తిలాఫియా, రూప్‌చంద్,, కోబియా, పాంపినో, గ్రూపర్, పండుగప్ప వంటివి సాగుచేస్తున్నారు. పంజరం సాగుతో ప్రయోజనాలివీ.. ► భూమి అందుబాటులో లేనివారికి ఈ సాగు అనుకూలం. నిత్యం నీరు పారడంవల్ల చేపలకు వ్యాధులు సోకే అవకాశం తక్కువ. ► పదెకరాల్లో వచ్చే దిగుబడిని అర సెంటు విస్తీర్ణంలో కేజ్ పద్ధతిలో సాధించవచ్చు. ► యంత్రాలు, కూలీల ఖర్చు తగ్గుతుంది. కలుషిత నీటి బారి నుంచి కూడా రక్షణ ఉంటుంది. ఒక్కో కేజ్ నుంచి రెండున్నర టన్నుల దిగుబడి సీఎంఎఫ్ఆర్ఐ సాంకేతిక సహకారంతో కృష్ణాజిల్లాలో ఏటిపవర పల్లెపాలం గ్రామంలోని ఉప్పుటేరుల్లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద గత ఏడాది జూన్‌లో 585 మీటర్ల పరిమాణంగల ఒక్క పంజరంలో 100 గ్రా.సైజుగల 600 పండుగప్ప చేప పిల్లలను వదిలారు. ఏడాది కాలంలో ఇవి కేజీ నుంచి 2 కేజీల వరకు పెరిగాయి. సీఎంఎఫ్ఆర్ఐ సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ రితీష్ రంజన్, డాక్టర్ శేఖర్ మేఘరాజన్, ఇతర సాంకేతిక సిబ్బంది సమక్షంలో సోమవారం పట్టుబడి పట్టగా ఒక్కొక్క పంజరం నుండి సుమారు 600–700 కేజీల చొప్పున రెండున్నర టన్నులకు పైగా దిగుబడి వచ్చింది. ఒక్కో పంజరంలోని చేపల అమ్మకం ద్వారా రూ.70వేల– రూ.లక్ష వరకు ఆదాయం వచ్చింది. తక్కువ పెట్టుబడి రెట్టింపు ఆదాయం లభించడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. -
పండుగప్ప.. హెక్టారు.. 15 టన్నులు!
దేశ విదేశీ మార్కెట్లలో మంచి గిరాకీ ఉండటమే కాకుండా.. మంచి నీటిలో, ఉప్పు నీటిలో, సముద్రపు నీటిలో కూడా పెరిగే అరుదైన చేప.. పండుగప్ప (సీబాస్). రొయ్యలకు ప్రత్యామ్నాయంగా రైతులు సాగు చేయదగిన సలక్షణమైన చేప ఇది. ముళ్లు తీసేసిన పండుగప్ప మాంసం ముక్కలకు దేశీయ సూపర్ మార్కెట్లలో మంచి గిరాకీ ఉంది. కిలో రూ. 400–500 వరకు పలుకుతోంది. విదేశాల్లో దీనికి ఉన్న డిమాండ్ సరేసరి. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే.. సముద్ర ఉత్పత్తుల ఎగుమతి ప్రోత్సాహక సంస్థ ఎంపెడా ఇటీవల పండుగప్ప సాగులో అధిక దిగుబడి సాధించింది. ఉప్పునీటి చెరువులో హెక్టారుకు 15 టన్నుల పండుగప్ప చేపల దిగుబడి తీయడం విశేషం. చెరువుల్లో సాగయ్యే రకాల్లో రొయ్యలకు అన్ని విధాలా దీటైన ‘రారాజు పండుగప్ప’ అని ‘ఎంపెడా’ చైర్మన్ కె.ఎస్. శ్రీనివాస్ అభివర్ణించారు. ఆక్వా సాగు అంటే కేవలం రొయ్యల సాగే అని భావించే రైతులు పండుగప్ప సాగుపై దృష్టి సారించడానికి తాజా ప్రయోగాత్మక సాగు ఫలితాలు ఉత్తేజాన్నిస్తాయని ఆయన అన్నారు. ఆక్వా సాగులో సరికొత్త ప్రయోగాలకు ‘రాజీవ్‌గాంధీ ఆక్వాకల్చర్ సెంటర్’(ఆర్.జి.సి.ఎ.)లు వేదికలుగా నిలిచాయి. ఎంపెడా ఆధ్వర్యంలో దేశంలోని అనేక చోట్ల ఆర్.జి.సి.ఎ.లు ఏర్పాటయ్యాయి. కృష్ణాజిల్లాలో కూడా ఒక ఆర్.జి.సి.ఎ. విభాగం ఉంది. పాండిచ్చేరిలోని కరైకల్ వద్ద ఏర్పాటైన ఆర్.జి.సి.ఎ.లోని ప్రదర్శనా క్షేత్రంలో ప్రయోగాత్మకంగా పండుగప్పను సాగు చేసి, 10 నెలల్లో హెక్టారుకు 15 టన్నుల దిగుబడి సాధించారు. 1.5–2.0 సెం.మీ. చేప పిల్లలను చెరువులో వదిలారు. పది నెలల్లో ఒక్కోచేప 1200 గ్రాముల నుంచి 1500 గ్రాముల బరువు పెరిగాయి. తేలాడే పెల్లెట్లను మేతగా వేశారు. కిలో మేతకు 1.8 కిలోల దిగుబడి సాధించడం విశేషం. అన్నీ కలిపి కిలోకు రూ. 300 ఉత్పత్తి ఖర్చు అయింది. వ్యాపారులు చెరువు దగ్గరకే వచ్చి రూ. 420–450 ధర ఇచ్చి కొనుక్కెళ్లారు. రూ. 17 లక్షల లాభం వచ్చినట్లు ఎంపెడా అధికారులు ప్రకటించారు. పండుగప్ప సాగుకు కీలకం నాణ్యమైన విత్తనం. తమిళనాడు నాగపట్నం జిల్లా తోడువాయి వద్ద గల ఆర్.జి.సి.ఎ.లోని హేచరీలో అత్యంత నాణ్యమైన పండుగప్ప విత్తనాన్ని ఉత్పత్తి చేసి రైతులకు అందిస్తున్నారు. ఇప్పటికే కోటి 80 లక్షల సీడ్‌ను ఉత్పత్తి చేసి రైతులకు అందించినట్లు ఎంపెడా చెబుతోంది. ప్రజలు మక్కువతో ఆరగించే పండుగప్ప చేపలను రొయ్యలకు బదులుగా ఆక్వా రైతులు సాగు చేయాలని ఎంపెడా సూచిస్తోంది. పండుగప్ప విత్తనం కోసం ఆర్.జి.సి.ఎ. అధికారి పాండ్యరాజన్‌ను 94437 24422లో సంప్రదించవచ్చు. ఫాక్స్: 04364–264502 seabasshatchery@gmail.com. -
పండు‘గొప్పే’
ఆరు వేలకు అమ్ముడుపోయిన చేప చేపల్లో రారాజు పండుగొప్ప అంటారు. పేరుకు తగ్గట్టుగానే ఈ చేప ఆదివారం మలికిపురం చేపల మార్కెట్లో గొప్ప ధర పలికింది. ఒక్కొక్కటి ఏకంగా రూ.ఆరు వేలకు అమ్ముడు పోయింది. దాదాపు పది కేజీల బరువున్న రెండు పండుగొప్పలు ఈ ధరకు అమ్ముడయ్యాయి. కరవాక వైనతేయ నదిలో వలలకు ఈ చేపలు చిక్కినట్టు మత్స్యకారులు తెలిపారు. – మలికిపురం