‘మాకు చేపల వేటే జీవనాధారం. బోట్లు దెబ్బతినడంతో ఆక్వాసాగు చేపట్టాం. అదికూడా కలిసిరాకపోవడంతో ఏం చేయాలో పాలుపోని సమయంలో గ్రామంలోని ఓ పది మంది ఎస్సీ, ఎస్టీ యువకులతో కలిసి సీఎంఎఫ్‌ఆర్‌ఐ దగ్గర శిక్షణపొంది కేజ్ కల్చర్ ప్రారంభించాం. నాలుగు కేజ్‌లలో రెండువేల పండుగప్ప పిల్లలు వేశాం.
ఏడాది పాటు పెంచి సోమవారం పట్టుబడి పట్టాం. ఒక్కో చేప కేజీ నుంచి రెండు కేజీల వరకు పెరిగింది. కిలో రూ.400 చొప్పున అమ్మితే రూ.8 లక్షల ఆదాయం వచ్చింది. ఖర్చులు పోను రూ.3 లక్షలకు పైగా మిగిలింది’.. కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెం పంచాయతీ ఏటిపవర పల్లెపాలేనికి చెందిన తిరుమాని బలరాం తన ఆనందాన్ని ‘సాక్షి’తో ఇలా పంచుకున్నాడు.
సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లాలో సముద్ర తీరం వెంబడి విస్తరిస్తున్న పంజరం సాగు (కేజ్ కల్చర్) నిరుద్యోగులకు సిరుల పంట కురిపిస్తోంది. ఇది తక్కువ పెట్టుబడితో రెట్టింపు ఆదాయం తెచ్చిపెడుతోంది. చెరువుల్లో చేపల సాగుకు పరిమితం కాకుండా సముద్ర, సహజ జలవనరులలో కేజ్ కల్చర్, మారీ కల్చర్‌ను (పారేనీటిలో వలలు కట్టి సాగుచేయడం) ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
కేంద్ర సముద్ర మత్స్య పరిశోధన కేంద్రం (సీఎంఎఫ్‌ఆర్‌ఐ) సాంకేతిక సహకారాన్నిస్తోంది. జపాన్, చైనా, హాంకాంగ్ దేశాల్లో అభివృద్ధి చెందిన ఈ కల్చర్ ఏపీలో విశాఖ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణాజిల్లాలోని తీర ప్రాంతాల్లో విస్తరిస్తోంది.
కేజ్ ఏర్పాటు ఇలా..
► సముద్ర తీరంలో 6 మీటర్లు వెడల్పు, 4 మీటర్ల పొడవు విస్తీర్ణంలో కేజును ఏర్పాటుచేస్తారు.
► వీటిని తుప్పుపట్టని పైపులతో వృత్తాకారం, దీర్ఘచతురస్రాకారంలో ఏర్పాటుచేస్తారు.
► ఇవి నీటిలో తేలియాడేందుకు ప్లాస్టిక్ డ్రమ్ములను అమర్చుతారు. ఇన్నర్, ఔటర్ నెట్లు ఏర్పాటుచేస్తారు. ఇన్నర్ వలలో సాగుచేపడతారు.
► పంజరం ఏర్పాటుచేసే స్థలంలో నీటి ఉష్ణోగ్రత 26–30 డిగ్రీల వరకు ఉండాలి.
► లోతు 7–10 మీటర్లు.. నీటి ప్రవాహ వేగం ఎక్కువగా ఉండి, గాలివేగం తక్కువగా ఉండాలి.
► కేజ్ కల్చర్‌లో తిలాఫియా, ఫంగసీస్, రెడ్ తిలాఫియా, రూప్చంద్,, కోబియా, పాంపినో, గ్రూపర్, పండుగప్ప వంటివి సాగుచేస్తున్నారు.
పంజరం సాగుతో ప్రయోజనాలివీ..
► భూమి అందుబాటులో లేనివారికి ఈ సాగు అనుకూలం. నిత్యం నీరు పారడంవల్ల చేపలకు వ్యాధులు సోకే అవకాశం తక్కువ.
► పదెకరాల్లో వచ్చే దిగుబడిని అర సెంటు విస్తీర్ణంలో కేజ్ పద్ధతిలో సాధించవచ్చు.
► యంత్రాలు, కూలీల ఖర్చు తగ్గుతుంది. కలుషిత నీటి బారి నుంచి కూడా రక్షణ ఉంటుంది.
ఒక్కో కేజ్ నుంచి రెండున్నర టన్నుల దిగుబడి
సీఎంఎఫ్‌ఆర్‌ఐ సాంకేతిక సహకారంతో కృష్ణాజిల్లాలో ఏటిపవర పల్లెపాలం గ్రామంలోని ఉప్పుటేరుల్లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద గత ఏడాది జూన్‌లో 585 మీటర్ల పరిమాణంగల ఒక్క పంజరంలో 100 గ్రా.సైజుగల 600 పండుగప్ప చేప పిల్లలను వదిలారు. ఏడాది కాలంలో ఇవి కేజీ నుంచి 2 కేజీల వరకు పెరిగాయి.
సీఎంఎఫ్‌ఆర్‌ఐ సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ రితీష్ రంజన్, డాక్టర్ శేఖర్ మేఘరాజన్, ఇతర సాంకేతిక సిబ్బంది సమక్షంలో సోమవారం పట్టుబడి పట్టగా ఒక్కొక్క పంజరం నుండి సుమారు 600–700 కేజీల చొప్పున రెండున్నర టన్నులకు పైగా దిగుబడి వచ్చింది. ఒక్కో పంజరంలోని చేపల అమ్మకం ద్వారా రూ.70వేల– రూ.లక్ష వరకు ఆదాయం వచ్చింది. తక్కువ పెట్టుబడి రెట్టింపు ఆదాయం లభించడంతో వారి ఆనందానికి అవధుల్లేవు.
Comments
Please login to add a commentAdd a comment