సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి నెల్లూరు జిల్లా తడ వరకు 972 కిలోమీటర్ల పొడవున సముద్ర తీరం ఉంది. తుపానులు వచ్చినప్పుడు ఈ తీరం వెంబడి ఉన్న గ్రామాల్లో ఎక్కువగా నష్టపోయేది విద్యుత్ వ్యవస్థ. నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, తెగిన వైర్లను యధాస్థితికి తెచ్చేందుకు వారాలు పడుతుంది. అంత వరకు ఆ ప్రాంతాల ప్రజలు చీకటిలోనే గడపాలి. ఆ సమయంలో పాములు వంటి విషకీటకాల బారిన పడి జనం ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి.
ఈ బాధల నుంచి విముక్తి కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) సీఎండీ జె.పద్మాజనార్దన రెడ్డి తెలిపారు. విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల ద్వారా తీరం వెంబడి భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ‘సాక్షి ప్రతినిధి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు.
భూగర్భ లైన్లు సాధారణంగా దెబ్బతినవని, విద్యుత్ పునరుద్ధరణ కూడా వేగంగా జరుగుతుందని వివరించారు. జాతీయ రోజువారీ విద్యుత్ సరఫరా సగటులో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని, 24 గంటల్లో 23.56 గంటలకు తగ్గకుండా విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు, అభివృద్ధిపై ఆయన అందించిన వివరాలు ఆయన మాటల్లోనే..
తీర ప్రాంతంలో ప్రత్యేక గ్రిడ్
తుపాన్లు, గాలుల వల్ల విద్యుత్ వ్యవస్థకు కలిగే నష్టాన్ని తగ్గించడానికి తీర ప్రాంతంలో గ్రిడ్‌కు రూపకల్పన చేస్తున్నాం. అంటే దగ్గర్లో ఉన్న 132 కేవీ సబ్‌స్టేషన్లను డబుల్ సర్క్యూట్ ద్వారా అనుసంధానం చేస్తాం. దీనినే రింగ్ మెయిన్ అంటారు. దీనివల్ల ఒక సబ్ స్టేషన్ దెబ్బతింటే మరో సబ్ స్టేషన్ నుంచి సంబంధిత ప్రాంతాలకు వెంటనే విద్యుత్ అందించొచ్చు.
రైతులకు ఉచితంగా స్మార్ట్ మీటర్లు, రక్షణ పరికరాలు
వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లతో పాటు రక్షణ పరికరాలు కూడా ఉచితంగా అందజేస్తాం. డిసెంబర్ నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలనుకుంటున్నాం. ఖర్చుంతా ప్రభుత్వమే భరిస్తుంది. రైతులు ఒక్క పైసా కూడా చెల్లించనవసరం లేదు. ఈ మీటర్లకు విదేశాల్లో స్థిరపడ్డవారు కొందరు మినహా మిగతా రైతులంతా రాతపూర్వకంగా అంగీకారం తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూస్తున్నాం.
గతంలో వ్యవసాయానికి రాత్రి వేళ విద్యుత్ సరఫరా వల్ల పొలాల్లో రైతులు ఎక్కువగా ప్రమాదాల బారిన పడేవారు. దీనిని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పగటి పూటే 9 గంటలు నిరంతర విద్యుత్ అందిస్తోంది. పైగా, స్మార్ట్ మీటర్లు, రక్షణ పరికరాల ఏర్పాటు వల్ల రైతులకు ఎటువంటి ప్రమాదాలు జరగవు. ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు కొత్త వ్యవసాయ సర్వీసులను దరఖాస్తు చేసిన నెల లోపే ఇస్తున్నాం. ఇప్పటివరకు 80 వేల కొత్త సర్వీసులు ఇచ్చాం.
ప్రజల చేతిలో బిల్లు నియంత్రణ
విద్యుత్ బిల్లుల విషయంలో విద్యుత్ శాఖ పొరపాట్లు లేవు. విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) అనుమతించిన టారిఫ్ ప్రకారమే చార్జీలు ఉన్నాయి. ప్రజలు విద్యుత్ ఎక్కువగా వాడుతున్నారు. ఈ వేసవిలో గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రవ్యాప్తంగా రోజుకి 263 మిలియన్ యూనిట్లు సరఫరా చేశాం.
ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే విద్యుత్ బిల్లు తగ్గించొచ్చు. కెపాసిటర్లు, బ్రేకర్లు నాణ్యమైనవి అమర్చుకోవాలి. ఇంటి లోపల, బయట వాడే బ్రేకర్లు వేర్వేరుగా ఉంటాయి. మాగ్నెటిక్ బ్రేకర్లు వేగంగా, ఖచ్చితత్వంతో పనిచేస్తాయి. ప్రీపెయిడ్ మీటర్లతో ఎవరికి వారు బిల్లును నియంత్రించుకోవచ్చు. అవసరాన్నిబట్టి రీచార్జ్ చేసుకోవచ్చు. వారం వారం విద్యుత్ వినియోగం తెలుసుకోవచ్చు. ముందుగా ప్రభుత్వ, హెచ్‌టీ సర్వీసులకు ప్రీపెయిడ్ మీటర్లు అందిస్తాం.
సరికొత్త సబ్‌స్టేషన్లు
విద్యుత్ సబ్ స్టేషన్లకు స్థలాలు దొరకడంలేదు. దీంతో కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కంటైనర్ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే రెండింటిని అందుబాటులోకి తెచ్చాం. మరో రెండు విజయవాడలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భారీ విగ్రహాన్ని పెడుతున్న పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌లో, కనకదుర్గ గుడి దగ్గర ఏర్పాటు చేస్తున్నాం. వీటిని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు (పీటీఆర్)లు ఒక్కటి కూడా పాడవకుండా, ఒక్క రోజు కూడా లోడ్ రిలీఫ్ ఇవ్వకుండా ఈ వేసవిని సమర్ధంగా ఎదుర్కొన్నాం. 30 ఏళ్లు పైబడిన లైన్లు, కండక్టర్లు, బ్రేకర్లను మారుస్తున్నాం. దీనివల్ల సాంకేతిక నష్టాలు తగ్గుతాయి.
Comments
Please login to add a commentAdd a comment