Cage culture
-
‘కేజ్ కల్చర్’.. అసలేంటీ కథ..!
సాక్షి, విశాఖపట్నం: సముద్రంలో పంజరం వంటివి ఏర్పాటు చేసి వాటిలో చేపలను పెంచే విధానాన్ని కేజ్ కల్చర్‌గా పేర్కొంటారు. వీటిలో పెరిగే చేపలకు మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. ఇలాంటి కేజ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం రాయితీలిచ్చి ప్రోత్సహిస్తోంది. కొన్నేళ్ల నుంచి సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ (సీఎంఎఫ్ఆర్ఐ) శాస్త్రవేత్తలు విశాఖ ఆర్కే బీచ్‌కు సమీపంలో సముద్రంలో కేజ్‌లను అమర్చి పరిశోధనలు సాగిస్తున్నారు. వీరు అక్కడ ఉన్న 30 కేజ్‌ల్లో వివిధ రకాల చేపలను పెంచుతున్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం (పీఎంఎంఎస్వై) ద్వారా మత్స్యకారులతో పాటు వివిధ కులాల మహిళలకు ఓపెన్ సీ కేజ్ యూనిట్లను మంజూరు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలు, మత్స్యకార మహిళలకు 60 శాతం, బీసీ మత్స్యకారులకు 40 శాతం చొప్పున సబ్సిడీ ఇస్తున్నారు. ఇలా విశాఖ జిల్లాకు 18 యూనిట్లు మంజూరయ్యాయి. వీటిలో జనరల్ కేటగిరీ వారికి 14, ఎస్సీలకు 4 చొప్పున కేటాయించారు. ఒక్కో యూనిట్ విలువ రూ.5 లక్షలు. ఇందులో 10 శాతం లబ్దిదారు వాటాగా భరిస్తే సబ్సిడీ సొమ్ము 40/60 శాతం) పోగా మిగిలినది బ్యాంకు రుణంగా సమకూరుస్తోంది. సబ్సిడీ సొమ్మును లబ్ధిదారునికి దశల వారీగా చెల్లిస్తారు. విశాఖ జిల్లాలో బి.రేవతి అనే మహిళకు 10 ఓపెన్ సీ కేజ్ యూనిట్లను మంజూరు చేశారు. వీటిని సీఎంఎఫ్ఆర్ఐ నిర్వహిస్తున్న కేజ్‌ల సమీపంలోనే ఏర్పాటు చేస్తున్నారు. ఈ కేజ్‌ల నిర్వహణకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని సీఎంఎఫ్ఆర్ శాస్త్రవేత్తలే అందజేస్తారు. అంతేకాదు.. వీరి పర్యవేక్షణలోనే కేజ్‌ల్లో చేపల పెంపకం కూడా జరుగుతుంది. చేప పిల్లలు, మేత, రవాణా తదితర అవసరాలకు సీఎంఎఫ్ఆర్ఐ సహకరిస్తుంది. విశాఖలో సముద్రంలో కేజ్‌ల ఏర్పాటు ప్రక్రియ జరుగుతోంది. నెల రోజుల్లో వీటిలో చేపల పెంపకం ప్రక్రియ ప్రారంభమవుతుందని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. కేజ్‌ల నిర్మాణం ఇలా.. ఒక్కో ఓపెన్ సీ కేజ్‌ను ఆరు మీటర్ల వ్యాసార్ధంలో, నాలుగు మీటర్ల లోతులో రబ్బరు ట్యూబ్‌లు, పీవీసీ పైప్‌లతో నిర్మిస్తారు. వీటికి ప్లాస్టిక్ డ్రమ్ములు, వెదురును కూడా ఉపయోగిస్తారు. చుట్టూ ఔటర్, ఇన్నర్ నెట్లను ఫ్రేమ్‌ల మాదిరిగా అమరుస్తారు. ఈ కేజ్‌లు కొట్టుకుపోకుండా సముద్రంలో లైన్లు, యాంకరింగ్‌కు వీలుగా చైన్లను ఏర్పాటు చేస్తారు. ఈ కేజ్‌ల్లో పండుగప్పల పెంపకం విశాఖలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న కేజ్‌ల్లో పండుగప్ప రకం చేపలను పెంచనున్నారు. ప్రస్తుతం బయట మార్కెట్లో పండుగప్ప చేపలకు మంచి డిమాండ్ ఉంది. ఈ పండుగప్ప చేప పిల్లలను (3–4 అంగుళాల పొడవు) పాండిచ్చేరి సమీపంలోని సీడ్గాళిలో ఉన్న రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ ఆక్వా కల్చర్ నుంచి తీసుకొచ్చి ఈ కేజ్‌ల్లో పెంచుతారు. 10–12 నెలల్లో చేప పూర్తి స్థాయిలో (కిలో వరకు బరువు) ఎదుగుతుంది. ఇలా ఒక్కో కేజ్ నుంచి 2–3 టనునల చేపల దిగుబడి వస్తుంది. మార్కెట్లో కిలో పండుగప్ప ధర రూ.500–700 వరకు పలుకుతోంది. -
పంజరంలో పండు‘గొప్ప’
సాక్షి, అమరావతి: తీరం వెంబడి విస్తరిస్తున్న పంజరం చేపల సాగు (కేజ్ కల్చర్) సిరుల పంట పండిస్తోంది. కేంద్ర సముద్ర మత్స్య పరిశోధన కేంద్రం (సీఎంఎఫ్ఆర్ఐ) సాంకేతిక చేయూత అందించడంతోపాటు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద సీడ్‌ను కూడా ఉచితంగా అందిస్తోంది. సీఎంఎఫ్ఆర్ఐ సహకారంతో కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం లక్ష్మీపురం వద్ద ఉప్పుటేరులో కేజ్ కల్చర్ చేపట్టిన యానాదులకు సిరుల పంట పండింది. 1.85 టన్నుల పండుగప్ప దిగుబడి ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద గత ఏడాది డిసెంబర్లో 585 మీటర్లు పరిమాణం గల 4 పంజరాల్లో 80 నుంచి 100 గ్రాముల బరువు గల పండుగప్ప చేప పిల్లలను వదిలారు. ఏడాది కాలంలో ఇవి కేజీన్నర నుంచి 2 కేజీల వరకు బరువు పెరిగాయి. 4 పంజరాల్లో తాజాగా పట్టుబడి పట్టగా 1.85 టన్నుల దిగుబడి వచ్చింది. కిలో రూ.460 చొప్పున విక్రయించారు. మరో 700 గ్రాముల సైజులో మరో 400 కేజీల వరకు పట్టుబడి చేయాల్సి ఉంది. వేటకు వెళ్లే ఈ కుటుంబాలు చిన్నపాటి చేపలను తీసుకొచ్చి పంజరాల్లోని పండుగప్పలకు మేతగా ఉపయోగించేవారు. పైసా పెట్టుబడి లేకుండా ఒక్కో పంజరం నుంచి రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఆర్జించారు. భూమిలేని పేదలకు వరం భూమిలేని పేదలకు ఇది ఎంతో లాభదాయకమని సీఎంఎఫ్ఆర్ఐ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శేఖర్ మేఘరాజన్ అన్నారు. సీఎంఎఫ్ఆర్ఐ ఇచ్చిన చేయూత వల్ల తమ కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోగలిగాయని ఎస్టీ మత్స్యకారుడు నాగరాజు ఆనందం వ్యక్తం చేశారు. -
పంజరంలో.. 'పండుగ'ప్ప
‘మాకు చేపల వేటే జీవనాధారం. బోట్లు దెబ్బతినడంతో ఆక్వాసాగు చేపట్టాం. అదికూడా కలిసిరాకపోవడంతో ఏం చేయాలో పాలుపోని సమయంలో గ్రామంలోని ఓ పది మంది ఎస్సీ, ఎస్టీ యువకులతో కలిసి సీఎంఎఫ్ఆర్ఐ దగ్గర శిక్షణపొంది కేజ్ కల్చర్ ప్రారంభించాం. నాలుగు కేజ్‌లలో రెండువేల పండుగప్ప పిల్లలు వేశాం. ఏడాది పాటు పెంచి సోమవారం పట్టుబడి పట్టాం. ఒక్కో చేప కేజీ నుంచి రెండు కేజీల వరకు పెరిగింది. కిలో రూ.400 చొప్పున అమ్మితే రూ.8 లక్షల ఆదాయం వచ్చింది. ఖర్చులు పోను రూ.3 లక్షలకు పైగా మిగిలింది’.. కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెం పంచాయతీ ఏటిపవర పల్లెపాలేనికి చెందిన తిరుమాని బలరాం తన ఆనందాన్ని ‘సాక్షి’తో ఇలా పంచుకున్నాడు. సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లాలో సముద్ర తీరం వెంబడి విస్తరిస్తున్న పంజరం సాగు (కేజ్ కల్చర్) నిరుద్యోగులకు సిరుల పంట కురిపిస్తోంది. ఇది తక్కువ పెట్టుబడితో రెట్టింపు ఆదాయం తెచ్చిపెడుతోంది. చెరువుల్లో చేపల సాగుకు పరిమితం కాకుండా సముద్ర, సహజ జలవనరులలో కేజ్ కల్చర్, మారీ కల్చర్‌ను (పారేనీటిలో వలలు కట్టి సాగుచేయడం) ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. కేంద్ర సముద్ర మత్స్య పరిశోధన కేంద్రం (సీఎంఎఫ్ఆర్ఐ) సాంకేతిక సహకారాన్నిస్తోంది. జపాన్, చైనా, హాంకాంగ్ దేశాల్లో అభివృద్ధి చెందిన ఈ కల్చర్ ఏపీలో విశాఖ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణాజిల్లాలోని తీర ప్రాంతాల్లో విస్తరిస్తోంది. కేజ్ ఏర్పాటు ఇలా.. ► సముద్ర తీరంలో 6 మీటర్లు వెడల్పు, 4 మీటర్ల పొడవు విస్తీర్ణంలో కేజును ఏర్పాటుచేస్తారు. ► వీటిని తుప్పుపట్టని పైపులతో వృత్తాకారం, దీర్ఘచతురస్రాకారంలో ఏర్పాటుచేస్తారు. ► ఇవి నీటిలో తేలియాడేందుకు ప్లాస్టిక్ డ్రమ్ములను అమర్చుతారు. ఇన్నర్, ఔటర్ నెట్లు ఏర్పాటుచేస్తారు. ఇన్నర్ వలలో సాగుచేపడతారు. ► పంజరం ఏర్పాటుచేసే స్థలంలో నీటి ఉష్ణోగ్రత 26–30 డిగ్రీల వరకు ఉండాలి. ► లోతు 7–10 మీటర్లు.. నీటి ప్రవాహ వేగం ఎక్కువగా ఉండి, గాలివేగం తక్కువగా ఉండాలి. ► కేజ్ కల్చర్‌లో తిలాఫియా, ఫంగసీస్, రెడ్ తిలాఫియా, రూప్‌చంద్,, కోబియా, పాంపినో, గ్రూపర్, పండుగప్ప వంటివి సాగుచేస్తున్నారు. పంజరం సాగుతో ప్రయోజనాలివీ.. ► భూమి అందుబాటులో లేనివారికి ఈ సాగు అనుకూలం. నిత్యం నీరు పారడంవల్ల చేపలకు వ్యాధులు సోకే అవకాశం తక్కువ. ► పదెకరాల్లో వచ్చే దిగుబడిని అర సెంటు విస్తీర్ణంలో కేజ్ పద్ధతిలో సాధించవచ్చు. ► యంత్రాలు, కూలీల ఖర్చు తగ్గుతుంది. కలుషిత నీటి బారి నుంచి కూడా రక్షణ ఉంటుంది. ఒక్కో కేజ్ నుంచి రెండున్నర టన్నుల దిగుబడి సీఎంఎఫ్ఆర్ఐ సాంకేతిక సహకారంతో కృష్ణాజిల్లాలో ఏటిపవర పల్లెపాలం గ్రామంలోని ఉప్పుటేరుల్లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద గత ఏడాది జూన్‌లో 585 మీటర్ల పరిమాణంగల ఒక్క పంజరంలో 100 గ్రా.సైజుగల 600 పండుగప్ప చేప పిల్లలను వదిలారు. ఏడాది కాలంలో ఇవి కేజీ నుంచి 2 కేజీల వరకు పెరిగాయి. సీఎంఎఫ్ఆర్ఐ సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ రితీష్ రంజన్, డాక్టర్ శేఖర్ మేఘరాజన్, ఇతర సాంకేతిక సిబ్బంది సమక్షంలో సోమవారం పట్టుబడి పట్టగా ఒక్కొక్క పంజరం నుండి సుమారు 600–700 కేజీల చొప్పున రెండున్నర టన్నులకు పైగా దిగుబడి వచ్చింది. ఒక్కో పంజరంలోని చేపల అమ్మకం ద్వారా రూ.70వేల– రూ.లక్ష వరకు ఆదాయం వచ్చింది. తక్కువ పెట్టుబడి రెట్టింపు ఆదాయం లభించడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. -
వినూత్న కేజ్ కల్చర్.. అద్భుత ప్యా‘కేజ్’
అలరారే అపార మత్స్య నిక్షేపాలకు ఆలవాలమైన నడి సంద్రంలో వినూత్న కేజ్ కల్చర్‌కు శ్రీకారం చుట్టడం ఓ సాహసం. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఒకేసారి పది యూనిట్ల సమాహారం (ప్యాకేజ్)తో భారీ ప్రాజెక్టుకు నడుం కట్టడం నిజంగా అద్భుతం. ఈ పెను విప్లవానికి నాంది పలికారు చీరాల మండలం వాడరేవు యువకులు. కడలిపై వానర సైన్యం వారధి కట్టినట్టు.. వీరు భారీ పంజరాన్ని (కేజ్) నిర్మించి విజయవంతంగా సాగర జలాల్లోకి పంపారు. మహాద్భుత ఘట్టాన్ని కళ్లెదుటే ఆవిష్కరించి ఔరా అనిపించారు. చీరాల : మనం చెరువులు, కుంటలలో చేపలు, రొయ్యల పెంపకం చూసుంటాం. సముద్రంలో మత్స్య సాగును అసలు ఊహించలేం. ఈ అనూహ్య పరిణామాన్ని ఆచరణ సాధ్యం చేసి చూపారు చీరాల మండలం వాడరేవు యువకులు. సముద్రంలో భారీ కేజ్ కల్చర్‌కు శ్రీకారం చుట్టారు. ఇతర దేశాల్లో ఉన్నదే.. చెరువులు, కుంటల్లో రొయ్యలు, చేపల సాగుకు కొన్ని ప్రతికూలతలు ఎదురవుతున్నాయి. తరచూ మత్స్య సంపదకు వ్యాధులు సోకుతున్నాయి. దీని నుంచి తప్పించుకోవడం ఎలా.. అనే ప్రశ్న నుంచే సముద్రంలో మత్స్యసాగు చేయాలనే వినూత్న ఆలోచన పుట్టుకొచ్చింది. నిజానికి కేజ్ కల్చర్ కొత్తేమీ కాదు. పలు దేశాల్లో ఉన్నదే. మన దేశంలోని తమిళనాడు, కేరళ రాష్ట్రాలతోపాటు మన రాష్ట్రంలోని విశాఖ ప్రాంతంలోనూ కొందరు ఈ సాగును చేస్తున్నారు కూడా. ఆచరణ ఇలా.. చీరాల మండలం వాడరేవుకు చెందిన రాకాతి శివ మత్స్యకారుడు. ఫైబర్ బోట్ల తయారీలో మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తి. ఇతని మేనల్లుళ్లు ఉస్మాన్, సతీష్ వైజాగ్ ఆంధ్రా విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తి చేశారు. ఆ సమయంలో సముద్రంలో చేపల సాగు (మెరీ కల్చర్) గురించి తెలుసుకుని మేనమామకు చెప్పారు. సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ సంస్థ నుంచి వివరాలు సేకరించారు. శివ, మేనల్లుళ్లు ఇద్దరితో పాటు వాడరేవుకు చెందిన మరో ఏడుగురు మిత్రులతో కలిసి బృందంగా ఏర్పడి కేరళ, తమిళనాడు, విశాఖపట్నం, కాకినాడలలో చేపడుతున్న కేజ్ కల్చర్‌ను పరిశీలించారు. భారీ కేజ్ కల్చర్ ప్రాజెక్టు ఏర్పాటుకు వాడరేవులో అలల సాంద్రత, మత్స్య ఉత్పత్తి అనుకూలంగా ఉందని సీఎంఎఫ్ఆర్ఐ శాస్త్రవేత్తలు నిర్ధారించడంతో 2018లో మత్స్యశాఖ సహకారంతో ఈ వినూత్న కార్యక్రమానికి తొలి అడుగు పడింది. అయితే కరోనా వల్ల నిర్మాణ పనులు ఆలస్యమైనా ఎట్టకేలకు గతనెల 6న భారీ కేజ్ జల ప్రవేశం చేసింది. వంద టన్నుల ఉత్పత్తి లక్ష్యం ఆరు నెలల్లో వంద టన్నుల మత్స్య ఉత్పత్తులు లక్ష్యంగా ఈ కేజ్ కల్చర్‌కు శ్రీకారం చుట్టారు. సముద్రంలో 9 కిలోమీటర్ల దూరంలో ఈ కేజ్‌ను నిలిపి సాగు చేపట్టేలా ప్రణాళిక సిద్ధం చేశారు. రొయ్య, చేప పిల్లలు ఉత్పత్తి చేసే హేచరీని కూడా ప్రారంభించి రోజూ లక్ష పిల్లల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకోనున్నారు. మత్స్య సంపద రవాణా, రాకపోకలకు అనుకూలంగా పడవలను సిద్ధం చేశారు. ప్రస్తుతం వేట నిషేధ సమయం కావడంతో జూన్ 15 వరకు సాగుకు విరామం ప్రకటించారు. నిర్మాణం.. ప్రత్యేకం.. ఈ భారీ కేజ్ పంజరంలా ఉంటుంది. 145 అడుగుల పొడవు, 15 అడుగుల ఎత్తుతో 2,700 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో దీనిని నిర్మించారు. కేజ్ మధ్యలో నిలువు, అడ్డంగా దారుల ఏర్పాటుతోపాటు సిబ్బంది నివాసం, దాణా నిల్వకు రెండు గదుల నిర్మాణం, చేపలు, రొయ్యల సాగుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఇరవై నాలుగు గంటల పర్యవేక్షణకు సీసీ కెమెరాలు అమర్చారు. జనరేటర్లూ అందుబాటులో ఉంచారు. తుప్పు పట్టని తేలికపాటి ఇనుప పైపులు తయారీకి వినియోగించారు. 3.5 కిలో వాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. రాష్ట్ర, కేంద్ర మత్స్యశాఖ ఉన్నతాధికారులు ఈ కేజ్ నిర్మాణ పనులను నిరంతరం పర్యవేక్షించి సూచనలు అందించారు. రూ.1.50 కోట్లతో.. నీలి విప్లవం పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2017–18లో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు 41 కేజ్ కల్చర్ యూనిట్లను మంజూరు చేసింది. విడివిడిగా అయితే ఖర్చు ఎక్కువ అవుతుందని భావించిన శివ బృందం అప్పటి మత్స్యశాఖ అధికారుల సహకారంతో ఒక సంఘంగా ఏర్పడింది. ఒక్కో యూనిట్ కాకుండా పది యూనిట్లను కలిపి ఏక ప్యాకేజ్‌గా దరఖాస్తు చేసుకుంది. దీంతో రూ.50 లక్షల రుణం మంజూరైంది. రూ.37 లక్షల రాయితీ వచ్చింది. దీనికి అదనంగా ఈ బృందం మరో రూ.కోటి వెచ్చించి భారీ కేజ్ కల్చర్‌ను రూపొందించింది. బహుళ ప్రయోజనకారి చీరాల వాడరేవులో తొలిగా కేజ్ కల్చర్‌కు శ్రీకారం చుట్టాం. సీఎంఎఫ్ఆర్ఐ, మత్స్యశాఖ సహకారంతో భారీ ప్రాజెక్టును చేపట్టగలిగాం. సముద్రంలో మత్స్య సాగు ప్రయోజనకరంగా ఉంటుంది. పలు చోట్ల ఈ కేజ్ కల్చర్ అమల్లో ఉంది. వాడరేవుకు ఖ్యాతిని తీసుకొచ్చాం. ఈ ప్రాజెక్టు సత్ఫలితాలిస్తుందన్న నమ్మకం ఉంది. త్వరలో మత్స్య ఉత్పత్తిలో చీరాల ప్రాంతం ముందుంటుంది. మత్స్యకారులకు ఉపాధి పెరుగుతుంది. ఈ ప్రాజెక్టు బహుళ ప్రయోజనకారి. – రాకాతి శివ, కేజ్ నిర్మాణకర్త, వాడరేవు ఇదో విప్లవం వాడరేవులో ఏర్పాటు చేసిన భారీ కేజ్ కల్చర్ ప్రాజెక్టు ఓ విప్లవం. యువకుల అంకితభావం, మత్స్యశాఖ ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైంది. సముద్రంలో భారీ కేజ్ నిలుపుదలకు ప్రత్యేకంగా స్థలం కేటాయించాం. మత్స్యశాఖ తరఫున అన్ని విధాలుగా సహాయం అందిస్తాం. – ఎ.చంద్రశేఖరరెడ్డి, మత్స్యశాఖాధికారి, ఒంగోలు -
Cage Culture: కేజ్ కల్చర్‌తో యువతకు ఉపాధి
సాక్షి, అమరావతి: కేజ్ కల్చర్ (పంజరంలో చేపలసాగు)ను మరింత ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిపై అధ్యయనం చేస్తున్న ప్రభుత్వం ఇందుకోసం త్వరలో ప్రత్యేక పాలసీని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీఎంఎఫ్ఆర్ఐ) అభివృద్ధి చేసిన ఈ వినూత్న సాగు కేజ్ కల్చర్‌ను 2007లో రాష్ట్రంలో ప్రారంభించారు. ఈ సాగుకు గజం భూమి కూడా అవసరం లేదు. ప్రత్యేకంగా నీరు పెట్టక్కర్లేదు. తరచూ నీరు మార్చాల్సిన పనిలేదు. విద్యుత్ అవసరం అసలే లేదు. కూలీల భారం పెద్దగా లేనేలేదు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం ఆర్జించే ఈ సాగు సముద్రం, నదుల్లోనే కాదు.. అన్ని రకాల రిజర్వాయర్లలో ప్రోత్సహించే అవకాశం ఉన్నా గత ప్రభుత్వాలు ఆసక్తి చూపలేదు. దీంతో మన రాష్ట్రంలోకంటే పొరుగు రాష్ట్రాల్లో ఈ సాగుకు మంచి ఆదరణ లభించింది. ఇన్నాళ్లు నిర్లక్ష్యానికి గురైన ఈ కల్చర్ ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. కేజ్ తయారీ వినూత్నం.. 6 మీటర్ల వృత్తంతో 4 మీటర్ల లోతున ప్రత్యేకంగా తయారు చేసిన పంజరంలో సాగుచేస్తారు. ఇది తేలడానికి పంజరం కింద డ్రమ్‌లు, లోపల చేపలు పెంచేందుకు ఓ వల, బయట రక్షణ వలయంగా మరో వల ఏర్పాటు చేస్తారు. కనీసం 5 మీటర్ల లోతున్న ప్రాంతాల్లో ఏర్పాటు చేసే వీటిని వరదలు, తుఫాన్లు వచ్చినప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలించవచ్చు. విశాఖ సముద్ర తీరంలో 30, సూర్యలంకబీచ్‌లో 10 మెరైన్ కేజ్‌లు, తూర్పుగోదావరి, కృష్ణాజిల్లాల్లో 110 బ్యాక్‌వాటర్ కేజ్‌లు ఉన్నాయి. అత్యధికంగా 70కు పైగా కృష్ణాజిల్లా నాగాయలంకలో ఉండడంతో కేజ్ కల్చర్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఆ ప్రాంతం నిలిచింది. ఈ సాగుపై ఆధారపడి సుమారు 500 కుటుంబాలు జీవిస్తున్నాయి. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి మత్స్య సంవృద్ధి యోజన (పీఎంఎంఎస్వై) ద్వారా 60ః40 నిష్పత్తిలో ఈ సాగుకు చేయూతనిస్తున్నాయి. ఖర్చులు పోను మెరైన్ కేజ్ ద్వారా ఏటా రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు, బ్యాక్‌వాటర్ కల్చర్ ద్వారా రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు ఆదాయం వస్తుంది. కేజ్ కల్చర్ విస్తరణకు ఏపీ అనువైన ప్రాంతం ఏపీలో కేజ్ కల్చర్ విస్తరణకు అవకాశాలున్నాయి. సుదూరమైన సముద్రతీర ప్రాంతంతోపాటు పొడవైన కృష్ణా, గోదావరి బ్యాక్‌వాటర్ ప్రాంతం ఉంది. అంతేకాకుండా పెద్ద ఎత్తున రిజర్వాయర్లున్నాయి. ప్రత్యేకంగా కేజ్ కల్చర్ పాలసీని తీసుకొస్తే అవసరమైన సాంకేతిక సహకారం అందించేందుకు సీఎంఎఫ్‌ఐఆర్ సిద్దంగా ఉంది. – డాక్టర్ సుభాదీప్‌ఘోష్, సీఎంఎఫ్ఆర్ఐ విశాఖ రీజనల్ సెంటర్ హెడ్ త్వరలో కొత్త పాలసీ బ్యాక్‌వాటర్‌తో పాటు రిజర్వాయర్లలో కేజ్ కల్చర్ విస్తరణకు ఉన్న అవకాశాలపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. త్వరలో కొత్త పాలసీని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. – కె.కన్నబాబు, కమిషనర్, మత్స్యశాఖ 12 కేజ్‌లు ఏర్పాటు చేశా.. కేజ్ కల్చర్ ఎంతో లాభదాయకం. నేను 2 కేజ్‌లతో ఈ సాగు ఆరంభించా. ప్రస్తుతం 12 కేజ్‌లకు విస్తరించగలిగా. ఒక్కో కేజ్‌కు రూ.50 వేలు పెట్టుబడిపెడితే రూ.లక్ష ఆదాయం వస్తోంది. చెరువులు అవసరం లేకుండా చేపలు పెంచే ఈ విధానం నిరుద్యోగ యువతకు ఎంతో ఉపయోగం. – తలశిల రఘుశేఖర్, కేజ్ కల్చర్ రైతు, నాగాయలంక ముందుకొచ్చే వారికి శిక్షణ కేజ్ కల్చర్‌ను మరింత మెరుగుపర్చేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ కల్చర్‌కు ముందుకొచ్చే వారికి పంజరం తయారీలో శిక్షణనిస్తున్నాం. సీడ్, ఫీడ్ అందిస్తున్నాం. సాగులో మెళకువలపై అవగాహన కల్పిస్తున్నాం. – డాక్టర్ శేఖర్ మేఘరాజన్, సీనియర్ శాస్త్రవేత్త, సీఎంఎఫ్ఆర్ఐ -
కోతులు తాకని పంజరపు తోట!
ఆరోగ్యదాయకమైన సేంద్రియ ఇంటిపంటలు సాగు చేసుకునే వారికి తెలుగు రాష్ట్రాల్లో పల్లెలు, పట్టణాలన్న తేడా లేకుండా చాలా ప్రాంతాల్లో కోతుల బెడద పెద్ద సమస్యగా మారింది. కోతుల తాకిడికి తట్టుకోలేక పెరటి తోటలు/ మేడలపై ఇంటిపంటల సాగుకు స్వస్తి పలుకుతున్న వారు లేకపోలేదు. అయితే, పెరట్లో పాతికేళ్లుగా ఇంటిపంటలు సాగు చేసుకునే అలవాటు ఉన్న ముళ్లపూడి సుబ్బారావు కోతుల సమస్యను ఎలాగైనా అధిగమించాలన్న పట్టుదలతో పంజరపు తోట(కేజ్ గార్డెన్)ను ఏర్పాటు చేసుకున్నారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన సుబ్బారావు ప్రకృతికి దగ్గరగా జీవించాలన్న తపన కలిగిన వ్యక్తి. సామాజిక చైతన్యం కలిగిన కథా రచయిత కూడా. సింగరేణి కాలరీస్‌లో అదనపు జనరల్ మేనేజర్‌గా కొత్తగూడెంలో పనిచేస్తున్న ఆయన తన క్వార్టర్ పక్కనే గచ్చు నేలపై ఇనుప మెష్‌తో పంజరం నిర్మించుకొని.. అందులో మడులు, పాత టబ్‌లు, బక్కెట్లలో సేంద్రియ ఇంటిపంటలు పండించుకుంటున్నారు. 25 అడుగుల వెడల్పు, 25 అడుగుల పొడవున 9 అడుగుల ఎత్తున తన కిచెన్ గార్డెన్‌కు రూ. 40 వేల ఖర్చుతో ఇనుప పంజరాన్ని నిర్మించుకున్నారు. కుమారుడు విదేశాల్లో స్థిరపడటంతో దంపతులు ఇద్దరే నివాసం ఉంటున్నారు. సుబ్బారావు తన అభిమాన మినీ పొలమైన ఇనుప పంజరంలో.. బెండ, వంగ, టమాటా, అలసంద, పొట్ల, ఆనప(సొర) వంటి కూరగాయలతోపాటు 6 రకాల ఆకుకూరలను సాగు చేస్తున్నారు. ఏడాదిలో 6 నెలలు కూరగాయలు, ఆకుకూరలు నూటికి నూరు శాతం, మిగతా 6 నెలలు 50% మేరకు తమ పంజరపు తోటలో కూరగాయలు, ఆకుకూరలనే తింటున్నామని ఆయన సంతృప్తిగా చెప్పారు. ఆరోగ్యదాయకమైన కూరగాయలు, ఆకుకూరలను పొందడంతోపాటు.. కంటి నిండా పచ్చదనం పంజరపు తోట రూపంలో అందుబాటులో ఉండటంతో దైనందిన జీవితంలో ఒత్తిడిని మర్చిపోయి సాంత్వన పొందుతున్నానని ఆయన తెలిపారు. ఇప్పుడు ఫైబర్ టబ్‌లు అందుబాటులోకి రావడంతో ఇంటిపంటల సాగు కొంత సులభమైందన్నారు. తక్కువ స్థలంలో, మనకు నచ్చిన కూరగాయలు, ఆకుకూరలను అధిక దిగుబడి పొందడానికి పంజరపు తోట ఉపకరిస్తోందన్నారు. క్వార్టర్లలో, అద్దె ఇళ్లలో నివసించే ఉద్యోగులు అవకాశం ఉన్న వారు పంజరపు తోటను ఏర్పాటు చేసుకుంటే.. ఇల్లు మారినా, ఊరు మారినా.. దీన్ని కూడా పెద్దగా కష్టపడకుండానే తరలించుకెళ్లవచ్చని ఆయన అనుభవపూర్వకంగా చెబుతున్నారు. సొంత ఇల్లున్న వారికి పంజరపు తోట ఖర్చు భరించలేనిదేమీ కాదని, ఒక సోఫాపై పెట్టే ఖర్చుతోనే దీన్ని సమకూర్చుకోవచ్చన్నారు. క్యాంపులకు వెళ్లినప్పుడు ఇబ్బంది లేకుండా ఉండటానికి టైమర్‌తో కూడిన డ్రిప్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని యోచిస్తున్నట్లు సుబ్బారావు తెలిపారు. కోతుల బెడదకు విరుగుడుగా పంజరపు తోటను నిర్మించుకున్న సుబ్బారావు (94911 44769) దంపతులకు ‘సాక్షి’ జేజేలు పలుకుతోంది. ముళ్లపూడి సుబ్బారావు -
‘కేజ్‌కల్చర్’కు జాతీయ అవార్డు
కూసుమంచి : పాలేరు జలాశయంలో స్థానిక మత్స్య సహకార సంఘం, మత్స్యకారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేజ్‌కల్చర్ యూనిట్ల నిర్వహణకు జాతీయ స్థాయిలో అవార్డు దక్కింది. జాతీయ మత్స్య రైతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 10న కోల్‌కత్తాలో అందజేశారు. మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు నిమ్మరబోయిన లింగయ్య అవార్డును అందుకున్నారు. అలాగే రెండు నెలల క్రితం హైదరాబాద్‌లో నిర్వహించిన ఆక్వా ఎక్స్‌పోలో నేషనల్ అవార్డుకు పాలేరు యూనిట్లు ఎంపికైన విషయం తెలిసిందే. పాలేరు రిజర్వాయర్‌లో ప్రయోగాత్మకంగా 2015లో ప్రభుత్వం మత్స్యకారుల ఆధ్వర్యంలో కేజ్‌కల్చర్ (పంజర వలల్లో చేపలు పెంపకం) చేపట్టించింది. పాలేరుకు చెందిన 14 మంది మత్స్యకారులు జార్ఖండ్ రాష్ట్రంలో ఇందుకోసం ప్రత్యేక శిక్షణను కూడా పొందారు. తొలి ఏడాదిలోనే రాష్ట్రంలోని ఇతర కేజ్ యూనిట్ల కంటే ఇక్కడి యూనిట్లలో పెంచిన చేపలు మంచి దిగుబడులను ఇచ్చాయి. మత్స్యకారుల ఆదాయం కూడా రెట్టింపు అయింది. దీంతో మత్స్యకారులు ప్రస్తుతం కొత్తగా ఐదు యూనిట్లను నెలకోల్పగా మరో ఐదు యూనిట్లను నెలకోల్పేందుకు చర్యలు చేపట్టారు. గత సంవత్సరం కేజ్ యూనిట్లలో 20 టన్నుల చేపలను మత్స్యకారులు దిగుబడి చేయగలిగారు. దక్షిణాఫ్రికా దేశానికి చెందిన ప్రతినిధులు కూడా ఇక్కడి యూనిట్లను సందర్శించి కితాబు ఇవ్వడం గమనార్హం. యూనిట్ల నిర్వహణ, దిగుబడులు మంచిగా ఉండటంతో ఐసీఏఆర్(సెంట్రల్ ఇన్‌ల్యాండ్ ఫిషరీష్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్) ఆధ్వర్యంలో అందించే జాతీయస్థాయి అవార్డుకు ఇక్కడి యూనిట్లు ఎంపికయ్యాయి. దీంతో మత్స్యకారులు రెట్టింపు ఉత్సాహంతో రిజర్వాయర్‌లో కేజ్యూనిట్ల ద్వారా చేపలు పెంచేందుకు ముందుకు సిద్ధమవుతున్నారు. -
చేపల వేట... బతుకు బాట
మెదక్: మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేం దుకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. యాజమాన్య పద్ధతులు పాటిస్తూ..తక్కువ స్థలంలో ఎక్కువ చేపలను పెంచడంతో పాటు అధిక దిగుబడులు సాధించేందుకు ‘‘పంజరంలో చేపల పెంపకం’’ అనే వినూత్న పద్ధతిని అవలంబిస్తోంది. ఈ మేరకు మత్స్యకారులను పశ్చిమబెంగాల్‌కు పంపి 5 రోజులపాటు శిక్షణ కూడా ఇప్పించింది. అంతేకాకుండా కేజ్ కల్చర్ చేపల పెంపకాన్ని జిల్లాలో అవలంభించేందుకు అధికారులు పోచారం రిజర్వాయర్‌ను ఎంపిక చేశారు. అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ ప్రారంభమైతే రాష్ట్రంలోనే మోడల్ ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశం ఉంది. మత్స్యకారులను ఆదుకునేందుకు.. తెలంగాణలోని మత్స్యకారుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ రిజర్వాయర్లు..చెరువుల్లో కేజ్ (పంజరం) కల్చర్, పెన్ (దడి) కల్చర్ పద్ధతుల్లో చేపల పెంపకానికి ప్రభుత్వం కొత్త ప్రాజెక్ట్‌ను రూపొందించింది. ఈ మేరకు మెదక్ ప్రాంతంలోని పోచారం రిజర్వాయర్‌ను ఎంపిక చేసింది. కేజ్ కల్చర్, పెన్ కల్చర్ పద్ధతుల్లో చేపలు పెంచేందుకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సెంటర్ ఇన్లాండ్, ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (భారక్‌పూర్)లో ఈనెల 11 నుంచి 15వ తేదీవరకు 17 మంది మత్స్య కార్మికులకు శిక్షణ ఇప్పించినట్లు ఎఫ్డీఓ రాజనర్సయ్య తెలిపారు. పంజరం(కేజ్), పెన్ కల్చర్లలో చేపల పెంపకం తక్కువ స్థలంలో ఎక్కువ చేపలు పెంచుతూ అధిక దిగుబడులు సాధించేందుకు కేజ్ కల్చర్ పద్ధతిని సెంటర్ ఇన్లాండ్, ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(భారక్‌పూర్) రూపొందించింది. దీని ప్రకారం పది మీటర్ల లోతు ప్రాంతాన్ని ఎంచుకుని నలువైపుల వెదురు బొంగులు పాతుతూ.. చుట్టూరా జాలిని కట్టాలి. పక్షుల నుంచి, భక్షక చేపల నుంచి రక్షణ కల్పించేందుకు పై భాగంలో కూడా వల కడతారు. అలాగే పెన్(దడి) కల్చర్ పద్ధతిలో కూడా చెరువులో వెదురు బొంగులు పాతి చుట్టూ వలను కట్టి చేపలను పెంచుతారు. నేల, నీరు భౌతిక ధర్మాలకు సంబంధించిన యాజమాన్య పద్ధతులను పాటిస్తూ...చేప పిల్లలకు ఆహారాన్ని ఇస్తారు. ఒక్కో పంజరంలో 3,500 చేప పిల్లలు (3 అంగులాల సైజు) వదులుతారు. 7 నుంచి 8 నెలల కాలంలో ఇవి కేజీ బరువు పెరుగుతాయి. జాతీయ మత్స్యశాఖ అభివృద్ధి మండలి ఆర్థిక సాయం కేజ్ కల్చర్, పెన్ కల్చర్ పద్ధతుల్లో చేపలు పెంచేందుకు ఒక్కో ప్రాజెక్ట్‌కు రూ.3 లక్షలు ఖర్చు అవుతుంది. ఇందుకు గానూ మత్స్యకార్మికులకు జాతీయ మత్స్యశాఖ అభివృద్ధి మండలి 90 శాతం నిధులు సబ్సిడీపై అందజేస్తుంది. పదిశాతం నిధులు కార్మిక సంఘాలు చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో ప్రాజెక్ట్ ద్వారా సుమారు రూ.3 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. మెదక్ జిల్లాలో ఈ పద్ధతిలో చేపల పెంపకానికి పోచారం రిజర్వాయర్‌లో అవకాశం ఉన్నందున ఈ ప్రాజెక్ట్ అక్కడ చేపట్టడానికి మత్స్యకారులు ముందుకొస్తున్నారని మత్స్య శాఖ ఏడీఈ లక్ష్మినారాయణ తెలిపారు. కేజ్ కల్చర్ పద్ధతిని ప్రోత్సహించిన మత్స్యశాఖ మంత్రి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర మత్స్యశాఖ అధికారి సాయిబాబాకు మత్స్యపారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు బెస్త మొగులయ్య కృతజ్ఞతలు తెలిపారు. పశ్చిమ బెంగాల్లో శిక్షణ పొందాం పంజరంలో చేపల పెంపకం పద్ధతిని తెలుసుకోవడానికి పశ్చిమ బెంగాల్‌కు వెళ్లాం. అక్కడ మైతాన్ ప్రాజెక్ట్, రాజేంద్రపూర్, నోయిటా, అకాయిపూర్ ప్రాంతాలను సందర్శించి ఈ పద్ధతులను పూర్తిగా తెలుసుకున్నాం. శాస్త్రవేత్త ఏ.కె.దాస్ యాజమాన్య పద్ధతులపై చక్కగా విశదీకరించారు.