పాలేరు రిజర్వాయర్‌లో ఏర్పాటు చేసిన కేజ్ యూనిట్లు (ఫైల్)
కూసుమంచి : పాలేరు జలాశయంలో స్థానిక మత్స్య సహకార సంఘం, మత్స్యకారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేజ్‌కల్చర్ యూనిట్ల నిర్వహణకు జాతీయ స్థాయిలో అవార్డు దక్కింది. జాతీయ మత్స్య రైతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 10న కోల్‌కత్తాలో అందజేశారు. మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు నిమ్మరబోయిన లింగయ్య అవార్డును అందుకున్నారు.
అలాగే రెండు నెలల క్రితం హైదరాబాద్‌లో నిర్వహించిన ఆక్వా ఎక్స్‌పోలో నేషనల్ అవార్డుకు పాలేరు యూనిట్లు ఎంపికైన విషయం తెలిసిందే. పాలేరు రిజర్వాయర్‌లో ప్రయోగాత్మకంగా 2015లో ప్రభుత్వం మత్స్యకారుల ఆధ్వర్యంలో కేజ్‌కల్చర్ (పంజర వలల్లో చేపలు పెంపకం) చేపట్టించింది. పాలేరుకు చెందిన 14 మంది మత్స్యకారులు జార్ఖండ్ రాష్ట్రంలో ఇందుకోసం ప్రత్యేక శిక్షణను కూడా పొందారు.
తొలి ఏడాదిలోనే రాష్ట్రంలోని ఇతర కేజ్ యూనిట్ల కంటే ఇక్కడి యూనిట్లలో పెంచిన చేపలు మంచి దిగుబడులను ఇచ్చాయి. మత్స్యకారుల ఆదాయం కూడా రెట్టింపు అయింది. దీంతో మత్స్యకారులు ప్రస్తుతం కొత్తగా ఐదు యూనిట్లను నెలకోల్పగా మరో ఐదు యూనిట్లను నెలకోల్పేందుకు చర్యలు చేపట్టారు. గత సంవత్సరం కేజ్ యూనిట్లలో 20 టన్నుల చేపలను మత్స్యకారులు దిగుబడి చేయగలిగారు.
దక్షిణాఫ్రికా దేశానికి చెందిన ప్రతినిధులు కూడా ఇక్కడి యూనిట్లను సందర్శించి కితాబు ఇవ్వడం గమనార్హం. యూనిట్ల నిర్వహణ, దిగుబడులు మంచిగా ఉండటంతో ఐసీఏఆర్(సెంట్రల్ ఇన్‌ల్యాండ్ ఫిషరీష్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్) ఆధ్వర్యంలో అందించే జాతీయస్థాయి అవార్డుకు ఇక్కడి యూనిట్లు ఎంపికయ్యాయి. దీంతో మత్స్యకారులు రెట్టింపు ఉత్సాహంతో రిజర్వాయర్‌లో కేజ్‌యూనిట్ల ద్వారా చేపలు పెంచేందుకు ముందుకు సిద్ధమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment