అలరారే అపార మత్స్య నిక్షేపాలకు ఆలవాలమైన నడి సంద్రంలో వినూత్న కేజ్ కల్చర్‌కు శ్రీకారం చుట్టడం ఓ సాహసం. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఒకేసారి పది యూనిట్ల సమాహారం (ప్యాకేజ్)తో భారీ ప్రాజెక్టుకు నడుం కట్టడం నిజంగా అద్భుతం. ఈ పెను విప్లవానికి నాంది పలికారు చీరాల మండలం వాడరేవు యువకులు. కడలిపై వానర సైన్యం వారధి కట్టినట్టు.. వీరు భారీ పంజరాన్ని (కేజ్) నిర్మించి విజయవంతంగా సాగర జలాల్లోకి పంపారు. మహాద్భుత ఘట్టాన్ని కళ్లెదుటే ఆవిష్కరించి ఔరా అనిపించారు.
చీరాల : మనం చెరువులు, కుంటలలో చేపలు, రొయ్యల పెంపకం చూసుంటాం. సముద్రంలో మత్స్య సాగును అసలు ఊహించలేం. ఈ అనూహ్య పరిణామాన్ని ఆచరణ సాధ్యం చేసి చూపారు చీరాల మండలం వాడరేవు యువకులు. సముద్రంలో భారీ కేజ్ కల్చర్‌కు శ్రీకారం చుట్టారు.
ఇతర దేశాల్లో ఉన్నదే..
చెరువులు, కుంటల్లో రొయ్యలు, చేపల సాగుకు కొన్ని ప్రతికూలతలు ఎదురవుతున్నాయి. తరచూ మత్స్య సంపదకు వ్యాధులు సోకుతున్నాయి. దీని నుంచి తప్పించుకోవడం ఎలా.. అనే ప్రశ్న నుంచే సముద్రంలో మత్స్యసాగు చేయాలనే వినూత్న ఆలోచన పుట్టుకొచ్చింది. నిజానికి కేజ్ కల్చర్ కొత్తేమీ కాదు. పలు దేశాల్లో ఉన్నదే. మన దేశంలోని తమిళనాడు, కేరళ రాష్ట్రాలతోపాటు మన రాష్ట్రంలోని విశాఖ ప్రాంతంలోనూ కొందరు ఈ సాగును చేస్తున్నారు కూడా.
ఆచరణ ఇలా..
చీరాల మండలం వాడరేవుకు చెందిన రాకాతి శివ మత్స్యకారుడు. ఫైబర్ బోట్ల తయారీలో మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తి. ఇతని మేనల్లుళ్లు ఉస్మాన్, సతీష్ వైజాగ్ ఆంధ్రా విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తి చేశారు. ఆ సమయంలో సముద్రంలో చేపల సాగు (మెరీ కల్చర్) గురించి తెలుసుకుని మేనమామకు చెప్పారు. సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ సంస్థ నుంచి వివరాలు సేకరించారు. శివ, మేనల్లుళ్లు ఇద్దరితో పాటు వాడరేవుకు చెందిన మరో ఏడుగురు మిత్రులతో కలిసి బృందంగా ఏర్పడి కేరళ, తమిళనాడు, విశాఖపట్నం, కాకినాడలలో చేపడుతున్న కేజ్ కల్చర్‌ను పరిశీలించారు. భారీ కేజ్ కల్చర్ ప్రాజెక్టు ఏర్పాటుకు వాడరేవులో అలల సాంద్రత, మత్స్య ఉత్పత్తి అనుకూలంగా ఉందని సీఎంఎఫ్‌ఆర్‌ఐ శాస్త్రవేత్తలు నిర్ధారించడంతో 2018లో మత్స్యశాఖ సహకారంతో ఈ వినూత్న కార్యక్రమానికి తొలి అడుగు పడింది. అయితే కరోనా వల్ల నిర్మాణ పనులు ఆలస్యమైనా ఎట్టకేలకు గతనెల 6న భారీ కేజ్ జల ప్రవేశం చేసింది.
వంద టన్నుల ఉత్పత్తి లక్ష్యం
ఆరు నెలల్లో వంద టన్నుల మత్స్య ఉత్పత్తులు లక్ష్యంగా ఈ కేజ్ కల్చర్‌కు శ్రీకారం చుట్టారు. సముద్రంలో 9 కిలోమీటర్ల దూరంలో ఈ కేజ్‌ను నిలిపి సాగు చేపట్టేలా ప్రణాళిక సిద్ధం చేశారు. రొయ్య, చేప పిల్లలు ఉత్పత్తి చేసే హేచరీని కూడా ప్రారంభించి రోజూ లక్ష పిల్లల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకోనున్నారు. మత్స్య సంపద రవాణా, రాకపోకలకు అనుకూలంగా పడవలను సిద్ధం చేశారు. ప్రస్తుతం వేట నిషేధ సమయం
కావడంతో జూన్ 15 వరకు సాగుకు విరామం ప్రకటించారు.
నిర్మాణం.. ప్రత్యేకం..
ఈ భారీ కేజ్ పంజరంలా ఉంటుంది. 145 అడుగుల పొడవు, 15 అడుగుల ఎత్తుతో 2,700 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో దీనిని నిర్మించారు. కేజ్ మధ్యలో నిలువు, అడ్డంగా దారుల ఏర్పాటుతోపాటు సిబ్బంది నివాసం, దాణా నిల్వకు రెండు గదుల నిర్మాణం, చేపలు, రొయ్యల సాగుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఇరవై నాలుగు గంటల పర్యవేక్షణకు సీసీ కెమెరాలు అమర్చారు. జనరేటర్లూ అందుబాటులో ఉంచారు. తుప్పు పట్టని తేలికపాటి ఇనుప పైపులు తయారీకి వినియోగించారు. 3.5 కిలో వాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. రాష్ట్ర, కేంద్ర మత్స్యశాఖ ఉన్నతాధికారులు ఈ కేజ్ నిర్మాణ పనులను నిరంతరం పర్యవేక్షించి సూచనలు అందించారు.
రూ.1.50 కోట్లతో..
నీలి విప్లవం పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2017–18లో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు 41 కేజ్ కల్చర్ యూనిట్లను మంజూరు చేసింది. విడివిడిగా అయితే ఖర్చు ఎక్కువ అవుతుందని భావించిన శివ బృందం అప్పటి మత్స్యశాఖ అధికారుల సహకారంతో ఒక సంఘంగా ఏర్పడింది. ఒక్కో యూనిట్ కాకుండా పది యూనిట్లను కలిపి ఏక ప్యాకేజ్‌గా దరఖాస్తు చేసుకుంది. దీంతో రూ.50 లక్షల రుణం మంజూరైంది. రూ.37 లక్షల రాయితీ వచ్చింది. దీనికి అదనంగా ఈ బృందం మరో రూ.కోటి వెచ్చించి భారీ కేజ్ కల్చర్‌ను రూపొందించింది.
బహుళ ప్రయోజనకారి
చీరాల వాడరేవులో తొలిగా కేజ్ కల్చర్‌కు శ్రీకారం చుట్టాం. సీఎంఎఫ్‌ఆర్‌ఐ, మత్స్యశాఖ సహకారంతో భారీ ప్రాజెక్టును చేపట్టగలిగాం. సముద్రంలో మత్స్య సాగు ప్రయోజనకరంగా ఉంటుంది. పలు చోట్ల ఈ కేజ్ కల్చర్ అమల్లో ఉంది. వాడరేవుకు ఖ్యాతిని తీసుకొచ్చాం. ఈ ప్రాజెక్టు సత్ఫలితాలిస్తుందన్న నమ్మకం ఉంది. త్వరలో మత్స్య ఉత్పత్తిలో చీరాల ప్రాంతం ముందుంటుంది. మత్స్యకారులకు ఉపాధి పెరుగుతుంది. ఈ ప్రాజెక్టు బహుళ ప్రయోజనకారి.
– రాకాతి శివ, కేజ్ నిర్మాణకర్త, వాడరేవు
ఇదో విప్లవం
వాడరేవులో ఏర్పాటు చేసిన భారీ కేజ్ కల్చర్ ప్రాజెక్టు ఓ విప్లవం. యువకుల అంకితభావం, మత్స్యశాఖ ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైంది. సముద్రంలో భారీ కేజ్ నిలుపుదలకు ప్రత్యేకంగా స్థలం కేటాయించాం. మత్స్యశాఖ తరఫున అన్ని విధాలుగా సహాయం అందిస్తాం.
– ఎ.చంద్రశేఖరరెడ్డి, మత్స్యశాఖాధికారి, ఒంగోలు
Comments
Please login to add a commentAdd a comment