
నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడిస్తున్న సీఐ ఎం.భీమానాయక్, ఎస్సై, సిబ్బంది
చీరాల: ప్రేమపేరుతో ఓ మైనర్ బాలికను వలలో వేసుకుని, ఆమెతో సన్నిహితంగా మెలిగిన దృశ్యాలను కెమెరాలో రహస్యంగా చిత్రీకరించి వాటిని స్నేహితుల సెల్‌ఫోన్లకు పంపిన మాజీ కౌన్సిలర్ పుత్రరత్నాన్ని పోలీసులు అరెస్టు చేశారు. చీరాల ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ ఎం.భీమానాయక్ మీడియాకు వెల్లడించిన వివరాల మేరకు...
స్థానిక ఉడ్‌నగర్‌కు చెందిన మైనర్ బాలికను అదే ప్రాంతానికి చెందిన షేక్ జునైద్ ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకువెళ్లాడు. మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ ఆమెతో తాగించాడు. అనంతరం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను తన సెల్‌ఫోన్ ద్వారా చిత్రీకరించి వాటిని తన స్నేహితుల సెల్‌ఫోన్‌లకు పంపాడని సీఐ తెలిపారు.
నిందితుడిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్లు తెలిపారు. జునైద్‌పై రౌడీషీట్ కూడా తెరవనున్నట్లు చెప్పారు. నిందితుడిని కోర్టులో హాజరు పరచగా మేజిస్ట్రేట్ 15 రోజులు రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు.