సాక్షి, చిలకలూరిపేట(గుంటూరు) : నేటి కాలంలో ప్రతి ఇంట్లో వినిపిస్తున్నమాట మరిచిపోయా.. స్కూల్‌కు వెళ్లే పిల్లలు పుస్తకాలు, పెన్నులు, లంచ్‌బాక్స్ మరిచిపోయి నానా అగచాట్లు పడటం చూస్తుంటాం. కళాశాలలకు, ఉద్యోగాలకు వెళ్లే యువత పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏం లేదు. ప్రతి రోజూ బైక్‌తాళాలో, ఇతర వస్తువులో వెతుకుతూ తమ మతిమరుపుతనాన్ని తిట్టుకోవటం చాలా ఇళ్లలో కనిపిస్తూనే ఉంటోంది. ఉరుకుల, పరుగుల జీవితంలో చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు మరుపు సమస్య సాధారణంగా మారింది. చదువులో వెనుకబడతామనే ఒత్తిడి, ఉద్యోగం రాదనే భయం, పని ఒత్తిడి, ఆందోళనలు మతిమరుపునకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. ప్రస్తుతం పాతికేళ్లు దాటిన వారిలో ఈ సమస్య అధికంగా ఉంటోందని వైద్యులు చెబుతున్నారు. మారిన ఆహార అలవాట్లతో పౌష్టికాహారం అందక తలెత్తే కొన్ని రకాల ఆనార్యోగాలు కూడా మతిమరుపునకు దారి తీస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
యుక్త వయస్సులోనే...
మతిమరుపు సమస్యకు యుక్తవయస్సులోనే బీజం పడుతోంది. 25 నుంచి 35 ఏళ్ల వయస్సు ఉన్న సమయంలో అది తీవ్రస్థాయికి చేరుతోందని వైద్యవర్గాలు వెల్లడిస్తున్నారు. కొందరు తాము మతిమరుపుతో బాధపడుతున్నామనే విషయం తెలీక అనారోగ్యంగా ఉందంటూ వైద్యులను సంప్రదిస్తున్నారు. రాజధాని యువతలో 20 శాతం మందికి మరుపు సమస్య ఉందని అంచనా.
లోపిస్తున్న ఏకాగ్రత...
యువతలో ఏకాగ్రత లోపిస్తుండటమే ఈ సమస్యకు మూల కారణమని తెలుస్తోంది. ఏదైనా అంశాన్ని వినడం, విన్నదాన్ని మదిలో నిలుపుకోవటం, దాన్ని తిరిగి చెప్పే అంశాల్లో తీవ్రమైన మార్పులొస్తున్నాయి. విన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోలేకపోతున్నారు. ఇలానే మతిమరుపు సమస్య మొదలవుతోందని వైద్యులు చెబుతున్నారు. యువత చదివిన, తెలుసుకున్న విషయాలను గుర్తు పెట్టుకోకుండా సెల్‌ఫోన్లు, ట్యాబ్స్ వంటి గాడ్జెట్స్‌పై ఆధారపడటం, పుస్తక పఠనాన్ని నిర్లక్ష్యం చేయడం మతిమరుపునకు కారణమవుతున్నట్లు గుర్తించారు.
ఆహార అలవాట్లు..
జ్ఞాపక శక్తి పెరగటానికి విటమిన్ బీ12 అవసరం. ఇవి లోపించినా మతిమరుపు పెరుగుతుంది. పౌష్టికాహారలేమి మెదడుపై ప్రభావం చూపుతుంది. రెడీ మేడ్ ఫుడ్, జంక్‌ఫుడ్ వంటివి మెదడు పనితీరును మందగించేలా చేస్తాయి.
మానసిక సమస్యలు..
జ్ఞాపక శక్తి తగ్గిపోవటానికి, మానసిక సమస్యలు తలెత్తటానికి ఆందోళన కూడా ప్రధాన కారణమే. ఏ పని చేయాలన్నా ఆందోళన చెందటం,హడావుడి పెరగటంతో తీవ్ర ఒత్తిడి ఏర్పడుతుంది. ఇది మనసుపై ప్రభావం చూపుతుంది. పనిఒత్తిడి, కుటుంబ సమస్యలు, ఆర్థికాంశాలు కూడా యువతపై ప్రభావం చూపుతున్నాయి. అయితే ఏకాగ్రతతో సమస్యను అధిగమించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
మెదడుకు పని కల్పించాలి
ప్రస్తుతం వయస్సుతో నిమిత్తం లేకుండా పిల్లలు, యువతలో కూడా మతి మరుపు కనిపిస్తోంది. దీనికి జీవనవిధానంతో పాటు ఆహారపు అలవాట్లు, బీ12 విటమిన్ లోపం, ఏకాగ్రత లేకపోవడం కారణాలుగా మారుతున్నాయి. ఏ విషయాన్ని ఏకాగ్రతతో చేయకపోవటం ప్రతి పనికి సెల్‌ఫోన్‌పై ఆధారపడి మెదడుకు నికల్పించకపోవటంతో జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. పౌష్టికాహారం తీసుకోవటం, చెస్ ఆడటం, పజిల్స్ పూర్తి చేయటం, పుస్తక పఠనం వంటి వాటిని చేస్తుంటే మతిమరుపు కొంతమేర తగ్గుతుంది.
–డాక్టర్ ఆర్.గోపీనాయక్, ప్రభుత్వ వైద్యుడు
Comments
Please login to add a commentAdd a comment