mental depression
-
నాపై మానసికంగా ప్రభావం పడింది: సింధు
న్యూఢిల్లీ: రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు ఈ ఏడాది కలిసి రావడంలేదు. 2023లో సింధు ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోగా, మాడ్రిడ్ మాస్టర్స్ టోరీ్నలో రన్నరప్‌గా నిలవడం ఆమె అత్యుత్తమ ప్రదర్శన. తాజాగా యూఎస్ ఓపెన్‌లో సింధు క్వార్టర్ ఫైనల్లోనే ఓటమి పాలైంది. దాంతో ఆమె తీవ్ర నిరాశ చెందింది. ఈ ఓటమి అనంతరం సోషల్ మీడియాలో స్పందించింది. ఆశ్చర్యకరంగా గతంలో ఎన్నడూలేని రీతిలో తన భావోద్వేగాలను ప్రదర్శించింది. ‘ఈ ఓటమి మానసికంగా నాపై తీవ్ర ప్రభావం చూపించింది. ముఖ్యంగా అన్ని ప్రతికూలతలు ఎదురవుతున్న ఈ ఏడాదిలో ఇలాంటి ఫలితం రావడం బాగా నిరాశపర్చింది. తాజా పరాజయంతో నేను చాలా బాధపడ్డాను. నా ఈ భావోద్వేగాలను సరైన రీతిలో మలచుకొని నా ఆట ను మరింత మెరుగుపర్చుకొనేందుకు, ఎక్కువగా సాధన చేసేందుకు వాడుకుంటా. రాబోయే కొరియా, జపాన్ టోరీ్నల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. మీ అభిమానమే నాకు సర్వస్వం. దానికి కృతజ్ఞురాలిని’ అని సింధు పోస్ట్ చేసింది. -
తీవ్ర మానసిక క్షోభతోనే మహంత్ గిరి ఆత్మహత్య
న్యూఢిల్లీ: అఖిల భారతీయ అఖాడా పరిషత్ దివంగత అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి ఆత్మహత్యకు అతని మాజీ శిష్యుల బెదిరింపులు, వేధింపులే కారణమని సీబీఐ పేర్కొంది. మాజీ శిష్యులైన ఆనంద్ గిరి, ఆధ్యప్రసాద్ తివారీ, అతని కొడుకు సందీప్ తివారీల చేతిలో అవమానాలను భరించలేకే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారని సీబీఐ తన చార్జిషీటులో తెలిపింది. ఒక మహిళతో సన్నిహితంగా ఉన్నప్పటికీ వీడియోను బహిర్గతం చేస్తానంటూ ఆనంద్ గిరి తనను బెదిరించినట్లు ఆత్మహత్యకు పాల్పడడానికి ముందు మహంత్ నరేంద్ర గిరి ఆరోపిస్తున్నట్లుగా ఉన్న ఒక వీడియో తమకు లభ్యమైందని సీబీఐ తెలిపింది. అలహాబాద్‌లోని బడే హనుమాన్ మందిర్ పూజారి ఆనంద్ గిరి, ఆధ్యప్రసాద్ తివారీ, సందీప్ తివారీలు మహంత్ బలన్మరణం కేసులో ఆత్మహత్యకు ప్రేరేపించడం, నేరపూరిత కుట్రలో నిందితులుగా పేర్కొంటూ ఈ నెల 20వ తేదీన కోర్టుకు సీబీఐ చార్జిషీటు సమర్పించిందని అధికారులు వెల్లడించారు. అలహాబాద్‌లోని బాఘంబరీ మఠంలోని తన గదిలో సెప్టెంబర్ 20వ తేదీన మహంత్ గిరి ఉరికి వేలాడుతుండగా గమనించి శిష్యులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. -
వీథి నుంచి వెండి తెరకు
మతి స్థిమితం తప్పి వీధుల్లో తిరిగే వారికి ఎవరైనా ఆహారం ఇస్తారు. కొందరు బట్టలు ఇస్తారు. మరికొందరు షెల్టర్ ఏర్పాటు చేస్తారు. కాని ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఒక దీనురాలిని తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఆమెను తన కూతురిగా చూసుకున్నాడు. వైద్యం చేయించాడు. మనిషిగా మార్చాడు. ఆ మనిషి కథతో ‘మనసున్నోడు’ అనే సినిమా తయారవుతోందిప్పుడు. స్టార్ట్.. కెమెరా.. యాక్షన్.. సీన్ –1 సరిగా చూస్తే తప్ప ఆ చెత్త కుప్ప దగ్గర ఆమె ఉన్నట్టు తెలియదు. ఆ చెత్త మధ్య ఆమె కూడా ఒక చెత్త కుప్పలా ఉంది. చెత్తలోనే ఏరుకు తింటోంది. అక్కడే నిదురిస్తుంది. ఏ ఊరో తెలియదు. ఏ భాషో తెలియదు. ఏమీ మాట్లాడదు. ఒక పాతికేళ్లు ఉంటాయి. కాని విధి కొట్టిన దెబ్బలకు దిమ్మరిగా మారింది. కట్ చేస్తే... సీన్ –2 కోదాడ వ్యవసాయ మార్కెట్. ఆమె వయసు 45 సంవత్సరాలు. ఇప్పుడు ఆమె తెలుగు మాట్లాడుతోంది. స్వస్థతతో ఉంది. తన కాళ్ల మీద తాను నిలబడి ఉద్యోగం చేస్తూ నెలకు 15 వేలు సంపాదిస్తోంది. నాడు చెత్తకుప్పల్లో తిరిగిన యువతి నేడు ప్రయోజకురాలు. అంతేనా? ఆమె కథతో సినిమా కూడా తయారవుతోంది. ఎంత ఆసక్తికరం ఈ కథ..! ఎవరీ యువతి... ?! 2001. తెలంగాణలోని కోదాడ పట్టణంలోని హుజూర్నగర్ రోడ్డు. చెప్పులు కుట్టుకునే పల్లే వెంకటేశ్వర్లు మధ్యాహ్నం పని పూర్తయ్యాక సామాను అంతా సర్దుకుని కూచున్నాడు. అంతలో అతని పక్కన విసురుగా వచ్చి ఓ రాయి పడింది. ఎటునుంచి పడిందా అని చూసిన అతనికి చింపిరి జుత్తు, చిరిగిన దుస్తులు, దయనీయమైన పరిస్థితిలో మతి స్థిమితం లేని ఓ యువతి కనిపించింది. మున్సిపాలిటీ చెత్తకుప్పలో పడవేసిన ఆహారం కోసం పందులు, కుక్కలతో పోటీ పడి ఏరుకొని తింటున్న ఆమెను చూసి దగ్గరికి వెళ్లి పరిస్ధితి ఆరా తీయబోయాడు. కాని అర్థంకాని పిచ్చి మాటలు.. చేష్టలతో అతనిపైనే రాళ్లురువ్వసాగింది. ఓపికతో ఆమెకు నచ్చజెప్పి తాను తెచ్చుకున్న అన్నం పెడితే ఆబగా తినేసింది. ఎండకు ఎండుతూ.. వానకి తడుస్తూ ఉన్న ఆ యువతిని ఇలా రోడ్డు మీద వదిలి వేయడం కంటే ఇంటికి తీసుకెళ్లడం మంచిదని భావించాడు. కుటుంబంలో ఒకరిగా.. మానసిక ఆరోగ్యం కోల్పోయిన ఆ అభాగ్యురాలిని ఇంటికి తెచ్చిన వెంకటేశ్వర్లును చూసి భార్య నిరోధించలేదు. కాకుంటే ‘ఇప్పటికే ఇద్దరు పిల్లలతో పేదరికంలో ఉన్న మనం భరించగలమా!’ అని భయపడింది. కానీ మానవత్వంతో ఆ అమ్మాయి బాధ్యత తీసుకుంది. చింపిరి జుత్తు కత్తిరించి, స్నానం చేయించి.. తమ పిల్లల బట్టలు వేసింది. పిల్లలకు ఇక నుంచి ఈ అక్క మీతోనే ఉంటుందని ఆ భార్యాభర్తలు చెప్పారు. మానసికచికిత్స చేయించమని కొంతమంది సాయమందించడంతో హైద్రాబాద్‌లోని ‘ఆశ’ మానసిక చికిత్సాలయం వద్దకు తీసుకెళ్లాడు వెంకటేశ్వర్లు. ఏడాది పాటు అక్కడే ఆ యువతికి ఉచిత చికిత్సను అందించారు. దీంతో ఆమెకు పునర్జన్మ లభించింది. ముంబయ్‌కి వెళ్లిన కథ చికిత్స తరువాత తన వివరాలను ఒక్కొక్కటి చెప్పసాగిందామె. తన పేరు అముద అని, తండ్రి నారాయణ నాడర్ అని, తమది తమిళనాడులోని తిరునల్వేలి’ అని చెప్పింది. బతుకుదెరువు కోసం నలుగురు అక్కాచెల్లెళ్లం కలిసి ముంబాయిలోని ధారవికి వెళ్లామని, అక్కడ దయాసదన్ లో 10 తరగతి వరకు చదువుకొని మాంటిస్సోరీలో శిక్షణ తీసుకున్నట్లు చెప్పింది. తరువాత తమిళనాడుకు చెందిన వ్యక్తితో వివాహం జరిగిందని, ఒక కొడుకు కూడా ఉన్నాడని, భర్త వేధింపులు భరించలేక పురుగులమందు తాగానని, ఆ తరువాత ఏమైందో.. తాను కోదాడకు ఎలా వచ్చానో తెలియదని చెప్పడంతో కథ అంతటితో ఆగిపోయింది. అయినవారికి కలపాలని వెంకటేశ్వర్లు ముంబాయిలోని దయాసదన్ కు ఉత్తరం రాసి, అముద బంధువుల కోసం ఆరా తీసాడు. కాని వారు అక్కడ లేరని, ఒక చర్చిలో అముద చెల్లెలు ఉంటుందని చెప్పడంతో ఆమెను తీసుకొని ముంబయి వెళ్లాడు. అక్కను గుర్తుపట్టిన చెల్లెలు తామే ఇతరుల వద్ద బతుకుతున్నామని, ఆమెను ఆదరించలేమని చెప్పడంతో అక్కడి నుండి తిరిగి వచ్చారు. భర్త ఆచూకి కోసం ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఇక అముద తన కూతురే అనుకొని తన దగ్గరే ఉంచుకొని ఉన్న దాంట్లో పోషించసాగాడు. శాశ్వత ఆసరా! తనకు వయస్సు పైబడడం, చికిత్స కోసం నెలకు దాదాపు 1500 రూపాయలు అముదకు అవసరం కావడంతో ఆమెకు శాశ్వత ఆసరా కల్పించడానికి వెంకటేశ్వర్లు విశ్వప్రయత్నాలు చేశాడు. 10 సంవత్సరాల క్రితం ‘సాక్షి’ అముద గాథకు అక్షర రూపం ఇవ్వడంతో అప్పటి కలెక్టర్ అముదకు విద్యావలంటీర్‌గా అవకాశం కల్పించాడు. కాని సెలవులు వచ్చిన సమయంలో వేతనాలు రాకపోవడంతో ఇబ్బంది పడుతూనే దాదాపు 6 సంవత్సరాలు పని చేసింది. 2016వ సంవత్సరంలో మంత్రి హరీష్‌రావు చొరవతో కోదాడలోని వ్యవసాయమార్కెట్ కార్యాలయంలో అటెండర్‌గా ఉద్యోగం కల్పించారు. ప్రస్తుతం నెలకు 15 వేల రూపాయల వేతనం వస్తుండడంతో అముద బతుకుబండి సాఫీగా సాగుతోంది. వెండి తెరపైన అముద కథ ఎన్నో మలుపులు తిరిగిన అముద జీవితాన్ని 2008వ సంవత్సరంలో ‘సాక్షి’లో వచ్చిన కథనం చూసిన పశ్చిమగోదావరి జిల్లా వాసి వేల్పుల నాగేశ్వరరావు అనే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆమె కథను ‘మళ్లీ మరో జన్మంటూ ఉంటే’ పేరుతో నాటకంగా మార్చారు. 2012 నుండి పలుచోట్ల దీన్ని ప్రదర్శించారు. తాజాగా తానే సినిమాగా వెండితెరకెక్కించాలని భావించి నాలుగు నెలల క్రితం కోదాడకు వచ్చి అముదను, ఆమెకు కొత్త జీవితాన్ని అందించిన పల్లే్ల వెంకటేశ్వర్లును కలిశారు. సినిమాలో వారి పాత్రలలో వారే నటించమని కోరారు. కాని వారు ఒప్పుకోకపోవడంతో కొత్త వారితో సినిమా షూటింగ్ ప్రారంభించారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని అశ్వారావుపేట సమీపంలో పలుగ్రామాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు. వచ్చే ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని దర్శకుడు నాగేశ్వరరావు తెలిపారు. మతి స్వాధీనం తప్పి తిరిగే దీనులకు వెంకటేశ్వర్లు వంటి బాంధవులు దొరికితే వారి జీవితం ఇలా తప్పక బాగుపడుతుంది. చిత్రం షూటింగ్ సన్నివేశం సంరక్షకుడు పల్లే వెంకటేశ్వర్లుతో అముద – అప్పిరెడ్డి, సాక్షి, కోదాడ -
తల్లి చిన్నప్పుడే మృతి.. నాన్న మరొకరిని పెళ్లి చేసుకోవడంతో
సాక్షి, అంబర్‌పేట: పుట్టింటి వారి ఆదరణ కరువైందని మానసికంగా కుంగిపోయి మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం అంబర్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ సురేష్ కథనం మేరకు.. పటేల్‌నగర్‌లో శివారెడ్డి, ధనలక్ష్మి(28) దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ధనలక్ష్మి తల్లి చిన్నప్పుడే మరణించడం, నాన్న మరొకరిని వివాహం చేసుకోవడంతో పుట్టింటి వారి ఆదరణ కరువైందని కొంత కాలంగా మానసికంగా ఇబ్బంది పడుతుంది. చదవండి: గాంధీ ఆస్పత్రి: హృదయ విదారకం.. ఒకే బెడ్‌పై ఇద్దరు బాలింతలు.. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి భర్త, పిల్లలతో కలిసి పడుకుంది. తెల్లవారుజామున 5 గంటలకు భర్త లేచి చూస్తే ధనలక్ష్మి కనిపించలేదు. హాల్లోకి వచ్చేందుకు ప్రయత్నించగా బెడ్రూం తలుపు బయట నుంచి గడిపెట్టి ఉంది. దీంతో ఇంటి యజమానికి ఫోన్ చేయగా బలవంతంగా ఇంటి తలుపులు తీసి లోపలికి వచ్చారు. అప్పటికే ఆమె హాల్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: యువతి ఫ్రం యూకే.. వాట్సాప్ చాటింగ్, వీడియో కాల్స్.. కట్ చేస్తే! గృహిణి అదృశ్యం చిక్కడపల్లి: గృహిణి అదృశ్యమైన ఘటన చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ పాలడుగు శివశంకర్‌రావు తెలిపిన కథనం మేరకు.. అశోక్‌నగర్ కాలనీకి చెందిన కవిత, పి.సుమన్‌కుమార్ భార్యాభర్తలు. సుమన్‌కుమార్ ముషీరాబాద్ పోస్టాఫీస్ డీఎస్వోగా పనిచేస్తున్నాడు. ఈ నెల 25న మధ్యాహ్నం సమయంలో కవిత ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయింది. బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ప్రయోజనం లేకపోవడంతో సోమవారం ఆమె భర్త పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్టీసీ బస్సుకు నిప్పంటించిన యువకుడు!
సాక్షి, కనిగిరి(ప్రకాశం): ఆర్టీసీ బస్సుకు ఓ యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ప్రయాణికులు బెంబేలెత్తారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని పామూరు బస్టాండ్ సెంటర్లో గురువారం జరిగింది. వివరాలు.. వెలిగండ్ల మండలం మొగళ్లూరుకు చెందిన ఏడుకొండలు అనే యువకుడు పామూరు బస్టాండ్ సెంటర్లో కనిగిరి నుంచి పామూరు వెళ్లే ఆర్టీసీ బస్సుకు పెట్రోల్ పోసి నిప్పటించాడు. వెంటనే స్థానికులు అప్రమత్తమై మంటలు అదుపు చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఏడుకొండలును అదుపులోకి తీసుకున్నారు. అనుకోని ఘటనతో బస్సులో ఉన్న 28 మంది ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయమై ఎస్ఐ రామిరెడ్డిని వివరణ కోరగా.. విచారణలో యువకుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని, త్వరలో జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని, వాటి ధరలు తగ్గిస్తుందని.. ఇలా పొంతన లేని సమాధానాలు చెప్తున్నాడని తెలిపారు. అతనికి మతిస్థిమితం సరిగా లేనట్లు అనుమానిస్తున్న పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తామని ఎస్ఐ చెప్పారు. -
బతకాలనిపించలేదు, చనిపోదామనుకున్నా.. కానీ, : దీపికా పదుకొనె
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె 2014లో తీవ్రమైన డిప్రెషన్‌కు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. మామూలుగా అయితే ఇలాంటి విషయాలు చెప్పుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడరు. కానీ దీపికా మాత్రం అన్నీ చెప్పుకుంది. తాజాగా ఆమె బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కౌన్‌బనేగా కరోడ్‌పతి’టీవీ షోలో దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరాఖాన్‌తో కలిసి పాల్గొంది. ఈ సందర్భంగా అమితాబ్.. దీపిక డిప్రెషన్లోకి వెళ్లిన విషయాన్ని గుర్తు చేయగా, దాని గురించి ఆమె మరోసారి వివరించింది. లేవగానే విచిత్రంగా ఉండేదని, ఏ పని చేసినా ఏదో లాగుతున్నట్లు ఉండేదని, నిద్ర పట్టకపోయేదని, ఉన్నట్టుండి ఏడ్చేసేదాన్ననీ.. అన్నీ.. అన్నీ చెప్పుకుంది. (చదవండి: చిన్నారి చికిత్సకు రూ.16 కోట్ల ఇంజెక్షన్.. అమితాబ్ సాయం) ‘2014లో నేను డిప్రెషన్లో ఉన్నాను.లేవగానే విచిత్రంగా ఉండేది. ఉన్నట్టుండి ఏడ్చేసేదాన్ని. ఎవరితోనైనా మాట్లాడాలని గానీ.. బయటికి వెళ్లాలని గానీ అనిపించేంది కాదు. నలుగురితో కలవకుండా ఒంటరిగా ఉండేదాన్ని. చాలా సందర్భాల్లో ఏమీ చేయలేకపోతున్నా ఎందుకు బతకడం అనిపించేది. ఆ సమయంలో చనిపోదామనుకున్నా. నా మానసిక పరిస్థితి బాగోలేదని గుర్తించిన మా అమ్మ.. వెంటనే సైకియార్టిస్ట్ దగ్గరకు వెళ్లమని సలహా ఇచ్చింది. కొన్ని నెలల పాటు చికిత్స తీసుకున్న తర్వాత డిప్రెషన్ నుంచి బయటపడ్డాను’అని దీపికా ఎమోషనల్ అయింది. తను అనుభవించిన బాధ మరెవరూ అనుభవించొద్దనే ఉద్దేశ్యంలో ‘లివ్ లవ్ లాఫ్’ఫౌండేషన్ స్థాపించానని దీపికా చెప్పుకొచ్చింది. ఈ పౌండేషన్ ద్వారా చాలా మంది డిప్రెషన్ నుంచి బయటపడ్డారని సంతోషం వ్యక్తం చేసింది. దీపిక ఇలా బాధపడే సమయంలోనే ‘హ్యాపీ న్యూ ఇయర్’ చిత్రంలో నటించిందని, షూటింగ్ సమయంలో ఒక్క శాతం కూడా బాధపడుతున్నట్టు కనిపించలేదని చెప్పింది ఆ చిత్ర దర్శకురాలు ఫరాఖాన్. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) -
ప్రేయసి వస్తుందని ఆశతో 21 ఏళ్లుగా ఎదురు చూసి చూసి.. చివరకు
ప్రేమ అనేది ఓ మధురమైన అనుభూతి, భావాలు తప్ప మాటల్లో వర్ణించలేని వర్ణన. అందుకే ప్రేమికులు తమ ప్రేమను కాపాడుకోవడం కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడుతుంటారు. కొందరు ఆ ప్రేమ కోసం ప్రాణాలు తీసుకుంటే, మరికొందరు జీవితాల్ని నాశనం చేసుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇలా ఓ యువకుడు తాను ప్రేమించిన యువతి కోసం ఒకటి రెండేళ్లు కాదు ఏకంగా 21ఏళ్లుగా ఎదురుచూస్తున్నాడు. ఈ ఘటన తమిళనాడులోని పుదుకోట్టైలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.... పుదుకోట్టై జిల్లాలోని పొన్నమరావతి సమీపం మూలక్కుడి గ్రామానికి చెందిన నాగరాజన్ (40) 21ఏళ్ల క్రితం ఉపాధి కోసం కేరళకు వెళ్లి అక్కడ ఓ యువతిని ప్రేమించాడు. తన తోబుట్టువులకు పెళ్లి అయ్యాక వివాహం చేసుకుందామని చెప్పి ఆమెను మూలక్కుడికి తీసుకొచ్చాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు, బంధువులు వచ్చి ఆమెను బలవంతంగా తీసుకువెళ్లారు. ఈ ఘటనతో షాకైన నాగరాజన్ తన ప్రియురాలు ఎప్పటికైనా తిరిగి వస్తుందన్న ఆ పరిసరాల్లోనే రోడ్డు మీద తిరుగుతూ ఆశగా ఎదురుచూసేవాడు. ఈ క్రమంలో ఎవరితోనూ మాట్లాడకుండా ఉండిపోవడంతో నాగరాజు మతిస్థిమితం తప్పింది. అలా ఏళ్లుగా నిరీక్షిస్తున్న అతడి విషయం ఇటీవలే జిల్లా అధికారులకు తెలిసింది. దీంతో వారు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సాయంతో అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. -
‘మామ్ సారీ.. ప్లీజ్ గివ్ లెటర్స్ టు మై ఫ్రెండ్స్’
గచ్చిబౌలి: తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్న ఓ ఇంటర్ విద్యార్థిని 23వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ గోనె సురేష్ తెలిపిన ప్రకారం..నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ‘మంత్రి సెలస్టియ’ అపార్ట్మెంట్ ఎఫ్ బ్లాక్‌లోని 23వ అంతస్తులో ఇషా రంజన్(17), తల్లి మౌనిక సిన్హా, అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి ఉంటోంది. జూబ్లీహిల్స్‌లో శ్రీచైతన్య కాలేజీలో ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతోంది. సోమవారం సాయంత్రం 4.45 గంటలకు బాల్కనీలో చెప్పులు వదిలేసి స్టూల్ ఎక్కి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. వాచ్మెన్ గమనించి చెప్పగా తల్లి చూసి పోలీసులకు సమాచారం అందించారు. భార్యా భర్తలు మౌనిక సిన్హా, సికెష్ రంజన్లు 2015లో విడాకులు తీసుకున్నారు. మౌనిక సిన్హా కూతురుతో కలిసి ఇక్కడే ఉంటుండగా తండ్రి అమెరికా వెళ్లిపోయాడు. తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్న ఇషా రంజన్ కొద్ది నెలల క్రితం స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసుకొని, బ్లేడ్‌తో కోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. మార్చి 7వ తేదీ నుంచి ఇప్పటి వరకు మిస్ అవుతున్నానని స్నేహితులకు ఏడు లెటర్లు రాసింది. ఆత్మహత్యకు ముందు తల్లికి ‘మామ్ సారీ..ప్లీజ్ గివ్ లెటర్స్ టు మై ఫ్రెండ్స్’ అని సూసైడ్ నోట్ రాసింది. స్నేహితులకు రాసిన లేఖలతో పాటు సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇషా రంజన్ తీవ్ర ఒత్తిడికి గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ‘ఎలా చావాలి’ అని యూట్యూబ్‌లో సెర్చ్ చేసి.. -
ఆ డైరెక్టర్ వల్లే డిప్రెషన్లోకి వెళ్లాను: పూనమ్
టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ తనదైన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. నిన్నటి వరకు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై స్పందించిన పూనమ్ తాజాగా ఓ దర్శకుడు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ట్విటర్లో వరుస ట్వీట్లు చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. గత కొంత కాలంగా తాను డిప్రెషన్‌తో పోరాడుతున్నట్లు పూనమ్ వెల్లడించారు. తను అలా కావడానికి ఓ తెలుగు డైరెక్టర్ కారణమంటూ పేర్కొన్నారు. దర్శకుడి పేరు వెల్లడించకుండా కేవలం గురూజీ అన్న హ్యష్‌ట్యాగ్‌తో ఈ వ్యాఖ్యలు చేశారు. అతని వల్ల సినిమాలు, టెలివిజన్ ప్రకటనలతోపాటు అనేక అవకాశాలను కోల్పోయినట్లు పేర్కొన్నారు. (సల్మాన్‌ఖాన్‌పై సంచలన ఆరోపణలు..) తన మానసిక ఆరోగ్యం గురించి వివరిస్తూ ఆ పరిస్థితులు తనను ఆత్మహత్య చేసుకునే వరకు ఎలా ప్రేరేపించాయో పూనమ్ వివరించారు. ‘నా స్నేహితురాలు ఒకటి రెండు సార్లు ఓ దర్శకుడిని సంప్రదించింది. పూనమ్ అనారోగ్యంతో బాధపడుతోందని తన ఆరోగ్యం బాగోలేదని చెప్పింది. ఈ పరిస్థితి గురించి మనం తనకు ఏమైనా సహాయం చేయగలమా అని అడిగింది. అయినా దర్శకుడు ఆలస్యం చేస్తూనే ఉన్నాడు. అప్పుడు నేనే వెళ్లి నా పరిస్థితిని చెప్పాను. నేను పూర్తిగా అనారోగ్యంతో బాధపడుతున్నాను. ఇప్పుడేం చేయాలని అడిగాను. తను సమాధానం ఇవ్వలేదు. మళ్లీ నేను ఈ సమస్యను పరిష్కరించవచ్చా. నేను ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నాను అని అడిగాను’. అంటూ తన బాధను చెప్పుకొచ్చారు. (సుశాంత్ ఆత్మహత్య; కరణ్‌కు మద్దతుగా వర్మ) దీనికి బదులుగా వెంటనే ఆ దర్శకుడు ‘ఏమీ జరగదు నువ్వు చచ్చిపోతే ఒక రోజు న్యూస్‌లో ఉంటావు అంతే’ అని చెప్పినట్లు పూనమ్ పేర్కొన్నారు. ఈ మాటలు విని తను షాక్‌కు గురైనట్లు తెలిపారు. మీడియా, మూవీ మాఫీయా, ఆడ్వర్టైజ్మెంట్స్ అన్ని అతనితో కంట్రోల్లో ఉంటాయన్నారు. తనపై అనవసర కథనాలు ప్రచురించి మరింత వేదనకు గురిచేశాయన్నారు.. అతనికి అప్పుడే డైరెక్టు సమాధానమిచ్చినట్లు స్పష్టం చేశారు. (నాకున్న స్నేహితులు ఇద్దరే: సుశాంత్) ‘నాతో మధ్య రాత్రి అయినా వస్తాను అనేవాడు. కానీ ఇప్పుడు చచ్చిపోతే ఒక రోజు న్యూస్‌లో ఉంటావు అనే వరకు వచ్చాడు. సమస్యకు పరిష్యారం కోసం తప్ప మరెందుకు తాను ఆ డైరెక్టర్‌ను సంప్రదించలేదు. తనుకున్న ఉన్నత పరిచయాలతో నన్ను తప్పుగా చిత్రీకరించాడు’ అని పేర్కొన్నారు. చివరగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తనను ఆశ్చర్యపరిచిందని, అతనిలాగే తన జీవితాన్ని అంతం చేసుకోవాలని లేదని తెలిపారు. ప్రస్తుతం డిప్రెషన్‌కు థెరపీ తీసుకుంటున్నట్లు పూనమ్ పేర్కొన్నారు. కాగా 2018లో సందీప్ కిషన్ నటించిన ‘నెక్స్ట్ ఏంటి’ సినిమాలో పూనమ్ చివరి సారిగా కనిపించారు. -
సుశాంత్ మరణం అబద్ధమైతే బాగుండు
ముంబై: ‘నేను, నా కుటుంబం.. కాస్తా ప్రశాంతమైన జీవితం అంతే ఇంతకు మించి నేను కోరుకోవడం లేదు’ అంటూ భోజ్‌పురి స్టార్ హీరోయిన్ రాణి ఛటర్జీ సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తీవ్ర ఒత్తిడితో అదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలంతా సోషల్ మీడియాలో సుశాంత్‌కు నివాళులు అర్పిస్తున్నారు. అదే విధంగా రాణి, సుశాంత్ మృతిపై స్పందిస్తూ.. ‘‘ప్రస్తుతం నేను కోరుకుంటుంది ఒకటే.. నేను నా కుటుంబం ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండాలని. ఈ దశాబ్థ కాలంలో అత్యంత కలతకు గురిచేసిన సంఘటనలో సుశాంత్ మరణం ఒకటి. ఇకపై ఇలాంటి విషాద ఘటనలు జరగకూడదని ఆ దేవుడిని పార్థిస్తున్నాను’’ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. (నవంబర్‌లో పెళ్లికి సిద్ధమైన సుశాంత్) View this post on Instagram A post shared by Rani Chatterjee Official (@ranichatterjeeofficial) on Jun 14, 2020 at 10:23pm PDT అంతేగాక సుశాంత్ ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘ ఆయన మరణించాడన్న విషయాన్ని నమ్మలేకపోతున్న, ఆయన మరణ వార్త అబద్ధమైతే బాగుండు. WHY??????? SHUSHANT #shushantsinghrajput’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తను కూడా ఒత్తిడికి లోనయ్యాయని, ఆ సమయంలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నానని వెల్లడించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు, స్నేహితుల సహయంతో మెల్లిగా ఒత్తిడి నుంచి బయటపడిగలిగానని చెప్పారు. కావున ఒత్తిడితో పోరాడుతున్న వారికి సహాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కాగా ప్రస్తుతం రాణి భోజ్‌పురి యాక్షన్ డ్రామా 'లేడీ సింఘం'లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ ప్రధాన పాత్రలో కినిపించనున్నట్లు సమాచారం. (అవును... త్వరగా వెళ్లిపోయావ్ సుశాంత్..) View this post on Instagram It is getting very hard to believe that someone will say that this is not true 😭😭😭😭😭😭 RIP . WHY??????? SHUSHANT #shushantsinghrajput A post shared by Rani Chatterjee Official (@ranichatterjeeofficial) on Jun 14, 2020 at 2:18am PDT -
అవును... త్వరగా వెళ్లిపోయావ్ సుశాంత్..
‘‘మసకబారిన జీవితం కన్నీటిబొట్టు రూపంలో ఆవిరి అవుతోంది. అంతు లేని కలలు చిరునవ్వును, అశాశ్వతమైన జీవితాన్ని చెక్కుతున్నాయి. ఆ రెండింటి మధ్య బతుకుతున్నాను’’... మనసు ఎంతో బరువెక్కినవాళ్లే ఇలా రాయగలుగుతారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హృదయం కూడా తల్లిని తలుచుకుని బరువెక్కింది. 2002లో ఆమె చనిపోయారు. ఈ నెల 3న తల్లిని స్మరించుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో సుశాంత్ పెట్టిన పోస్ట్ ఇది. తను పెట్టిన చివరి పోస్ట్ కూడా ఇదే. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఈ పోస్ట్ చూస్తుంటే తల్లి మీద సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కి ఉన్న ప్రేమ స్పష్టంగా అర్థం అవుతోంది. అలాగే అతనేదో మానసిక వేదనలో ఉన్నట్లు కూడా స్పష్టం అవుతోంది. ఈ పోస్ట్ పెట్టిన పదిరోజులకు ఆత్మహత్య చేసుకుని, అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేశాడు సుశాంత్. అయితే ‘చిచోరే’లో అనిరుథ్‌లా ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారికి ధైర్యం చెప్పేంత బలమైన వ్యక్తి. ఆత్మహత్య చేసుకోవాలనుకునే కొడుక్కి ధైర్యం నింపిన తండ్రి అతను. ‘ఓడిపోతాం అని భయపడి పోటీ నుంచి తప్పుకుంటేనే నిజంగా ఓడిపోయినట్లు... ఓడినా గెలిచినా ఓకే అని పోటీలో నిలబడేవాడు ఓడిపోయినట్లు కాదు’ అని పరీక్షల్లో ఫెయిల్ అవుతానని భయపడి ఆత్మహత్య ప్రయత్నం చేసి, ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న కొడుక్కి ధైర్యం నింపుతాడు అనిరుథ్. ‘జీవితంలో ఆత్మహత్య ఒక్కటే పరిష్కార మార్గం కాదు’ అంటాడు. ఆ సినిమాలో అలాంటి ఒక బలమైన పాత్ర చేసిన సుశాంత్ నిజజీవితంలో తనకు తాను ధైర్యం చెప్పుకోలేకపోయాడు. మరి.. ధైర్యం చెప్పేవారు లేరా? అసలు సుశాంత్ తన మనసులో ఉన్న బాధను ఎవరితోనైనా పంచుకున్నాడా? సమాధానాలు దొరకని ప్రశ్నలు. ఇక సుశాంత్ జీవితంలోకి వెళ్తే... సుశాంత్ పాట్నాలో పుట్టారు. స్కూల్ జీవితం అక్కడే సాగింది. తల్లి మరణంతో ఈ కుటుంబం ఢిల్లీకి మారింది. కాలేజీ జీవితం అక్కడే. మంచి మెరిట్ స్టూడెంట్. ఆల్ ఇండియా ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌లో అతనిది 7వ ర్యాంక్. మంచి విద్యార్థి అయినప్పటికీ నటన మీద ఉన్న ఇష్టంతో ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం మధ్యలోనే ఆపేశాడు. అయితే సుశాంత్ ఇంట్లో లాయర్లు, డాక్టర్లు, ఇంజినీర్లు ఎక్కువ. పైగా నలుగురు అక్కలు చదువుకుంటున్నారు. ఒక అక్క మీథూ సింగ్ మంచి క్రికెటర్. సుశాంత్ మాత్రం ఇంజినీరో, డాక్టరో అవ్వాలని అనుకోలేదు. నటుడు అయితే బాగుంటుందనుకున్నాడు. కానీ ‘నువ్వు ఇంజినీర్ అవ్వాల్సిందే’ అని సుశాంత్ ఇంట్లో చెప్పేశారు. అంతే.. పక్కనే ఉన్న ఒక పోస్టర్ని చింపేసి, తన అయిష్టాన్ని ఆ విధంగా వ్యక్తపరిచాడు. దాంతో కుటుంబ సభ్యులకు ఇతను నటుడు అవుతాడనే స్పష్టత వచ్చేసింది. ఇంజినీరింగ్ చేస్తూనే ప్రముఖ కొరియోగ్రాఫర్ షైమక్ దావర్ డ్యాన్స్ స్కూల్లో చేరాడు సుశాంత్. ‘‘అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నావ్. నీలో ఏదో ప్రతిభ దాగి ఉంది. థియేటర్ ఎందుకు ట్రై చేయకూడదు’’ అన్నారు షైమక్. ఆ సలహాతో ‘బ్యారీ జాన్’ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో చేరాడు సుశాంత్. మూడు నెలల కోర్సు అది. ఆ బ్యాచ్‌లో అందరికీ ‘సి’ గ్రేడ్ వస్తే సుశాంత్‌ది ‘బి’ గ్రేడ్. దాంతో తన మీద తనకు బాగా నమ్మకం పెరిగిపోయింది. నటుడు కావాలని ఢిల్లీ నుంచి ముంబై చేరుకున్నాడు. దాదాపు రెండేళ్లు థియేటర్ ఆర్టిస్ట్‌గా కొనసాగిన సుశాంత్ చేసిన తొలి యాడ్ షూట్ ‘మంచ్’. అప్పటికి పలు అవార్డు వేడుకల్లో గ్రూప్ డ్యాన్సులు కూడా చేశాడు. మొత్తానికి ప్రముఖ బాలాజీ టెలీఫిల్మ్స్ నుంచి ‘కిసీ దేశ్ మే హై మేరా దిల్’ (2008) సీరియల్ కోసం ఆడిషన్స్‌కి రమ్మని కబురు అందింది. ఈ సీరియల్లో చేసిన కీలక పాత్ర సుశాంత్‌కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత చేసిన ‘పవిత్ర రిశ్తా’ బుల్లితెర ఉత్తమ నటుడి అవార్డు దక్కేలా చేసింది. రెండు రియాల్టీ షోలు ‘జర నాచ్కే దిఖా’, ‘జలక్ దిఖ్లాజా’లో పాల్గొన్నాడు. సుశాంత్‌కి తానేం చేసినా ‘ది బెస్ట్’ అనిపించుకోవాలనే పట్టుదల. అందుకే అవకాశాలు వస్తున్నప్పటికీ తనలోని నటుడిని ఇంకా మెరుగుపరచుకోవాలని 2011లో విదేశాలు వెళ్లారు. శిక్షణ తీసుకుని తిరిగొచ్చాడు. ఇప్పుడు సుశాంత్ దృష్టంతా సినిమాలపైనే. అభిషేక్ కపూర్ దర్శకత్వంలో ‘కాయ్ పో చె’ (2013)లో నటించే అవకాశం వచ్చింది. ఇందులో ఉన్న మూడు ప్రధాన పాత్రల్లో సుశాంత్ పాత్ర ఒకటి. ఉత్తమ నటుడిగా స్క్రీన్అవార్డు, ప్రొడ్యూసర్స్ గిల్డ్ అవార్డు అందుకున్నారు. ఆ సినిమా తర్వాత సుశాంత్ బిజీ నటుడిగా మారిపోయాడు. కొడుకు నటుడు కావడం ఇష్టం లేనప్పటికీ ఇరుగుపొరుగు ‘మీ అబ్బాయి ఫలానా సినిమాలో బాగా నటించాడు’ అని చెబుతుంటే సుశాంత్ తండ్రి మురిసిపోతుంటారు. కానీ కొడుకుతో మాత్రం ‘డిగ్రీ పూర్తి చేయాలబ్బాయ్’ అనేవారు. ఇక ‘కాయ్ పో చె’ తర్వాత సుశాంత్ చేసిన ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’ మంచి హిట్ అయింది. ఆ వెంటనే ఆమిర్ ఖాన్ ‘పీకే’ సినిమాలో చేసిన కీలక పాత్ర ఈ యువహీరోకి మంచి పేరు తెచ్చింది. వెంటనే చేసిన ‘డిటెక్టివ్ బ్యోమకేష్ బక్షి’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. క్రికెటర్ మహేందర్ సింగ్ ధోనీ జీవితం ఆధారంగా చేసిన ‘ఎం.ఎస్. ధోనీ’తో సుశాంత్ పాపులార్టీ బాగా పెరిగిపోయింది. నిజానికి సుశాంత్‌కి క్రికెట్ ఆడటం రాదు. ఈ సినిమా కోసం నేర్చుకున్నాడు. ఈ సినిమాలో హెలికాప్టర్ షాట్ కొట్టే సీన్ ఒకటి ఉంటుంది. ఆ సీన్ పర్ఫెక్ట్గా రావడం కోసం దాదాపు 200 రోజులు సాధన చేశాడు. ధోనీగా మారిపోవడం కోసం దాదాపు ఏడాదిన్నర సమయం తీసుకుని, ఈ సినిమా చేశాడు, సుశాంత్ కేటాయించిన సమయం, పడిన కష్టం వృథా పోలేదు. ‘అద్భుతంగా నటించాడు’ అని అందరూ ప్రశంసించారు. అంతా సజావుగా సాగితే ఎలా? జీవితం కొన్ని ట్విస్టులు ఇస్తుంది. సోలో హీరోగా 2017లో చేసిన ‘రాబ్తా’, 2018లో చేసిన ‘కేదార్నాథ్’, ‘సోంచరియా’, మల్టీస్టారర్ మూవీ ‘వెల్కమ్ టు న్యూయార్క్’ చిత్రాలు ఆ ట్విస్టులు ఇచ్చాయి. ఆ సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అలా 2018 సుశాంత్‌కి కలిసి రాలేదు. అయితే అధైర్యపడలేదు. ఆ తర్వాత ‘చిచోరే’ (2019) చేశారు. సూపర్ హిట్. అయితే గత ఏడాది చేసిన మరో చిత్రం ‘డ్రైవ్’ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఆ తర్వాత చేసిన ‘దిల్ బేచారా’ గత ఏడాదే విడుదల కావాల్సింది. అయితే ఈ ఏడాది మేకి వాయిదా పడింది. కోవిడ్ 19 కారణంగా విడుదల ఆగింది. నటుడిగా మంచి పేరు. అవకాశాలకు కూడా కొదవ లేదు. మరి.. సుశాంత్ సింగ్‌ని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిన పరిస్థితులు ఏంటి? ఆదివారం మధ్యాహ్నం ‘సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు.. ఉరి వేసుకున్నాడు’. ఆరు నెలలుగా డిప్రెషన్లో ఉన్నాడని వార్తలు. ‘ఎం.ఎస్. ధోనీ’లో క్రికెటర్‌గా వందపరుగులు తీశాడు సుశాంత్. కానీ ‘లైఫ్ గేమ్’ని 34 ఏళ్లకే బలవంతంగా ముగించుకున్నాడు. ‘గాన్ టూ సూన్’... అంటూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సుశాంత్ మరణం పట్ల బాధ వ్యక్తం చేశారు. అవును... త్వరగా వెళ్లిపోయావ్ సుశాంత్. ‘చిచోరే’లో ఆత్మహత్యాయత్నం చేసిన కొడుక్కి తండ్రి స్థానంలో ఉండి ధైర్యం చెప్పావ్. నీకు నువ్వు ధైర్యం చెప్పుకోలేకపోయావ్. ‘‘మసకబారిన జీవితం కన్నీటిబొట్టు రూపంలో ఆవిరి అవుతోంది. అంతులేని కలలు చిరునవ్వును, అశాశ్వతమైన జీవితాన్ని చెక్కుతున్నాయి. ఆ రెండింటి మధ్య బతుకుతున్నాను’’ అన్నావ్. కలలు కరువయ్యాయా? ఆశలు అడుగంటాయా? అందుకే ఇక బతకలేనని వెళ్లిపోయావా? ‘గాన్ టూ సూన్’. – డి.జి. భవాని -
సిరిసిల్లలో మరో మృగాడు
మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు..మచ్చుకైన లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అనేలా తయారవుతున్నారు మృగాళ్లు. మొన్నటికి మొన్న వేములవాడలో బాలికను వరుసకు బావే లోబర్చుకుని గర్భవతిని చేసిన ఘటన మరువక ముందే సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్నబోనాలలో నివాసం ఉండే ఓ పిచ్చితల్లిని గర్భవతిని చేశాడు మరో ప్రబుద్ధుడు. తనకేం జరుగుతుందో తెలుసుకోలేని ఆ పిచ్చితల్లి బాత్రూం వెళ్లిన సందర్భంలో తనకు తానే ప్రసవం చేసుకుంది. పుట్టిన ఆడశిశువు క్షణకాలంలో మృతి చెందిన ఘటన ఆదివారం జరిగింది. సాక్షి, సిరిసిల్ల: మున్సిపల్ పరిధిలో నివాసం ఉండే ఇండ్ల దేవలక్ష్మి(22) మతిస్థిమితం లేదు. తల్లి వజ్రవ్వ, తండ్రి నర్సయ్య రోజువారి కూలీలు. వీరితోపాటు అప్పుడప్పుడు పనులకు వెళ్లేది. ఇదే క్రమంలో స్థానికంగా నివాసం ఉండే రాజు అనే మృగాడి కళ్లు దేవలక్ష్మిపై పడ్డాయి. మాయమాటలు చెప్పి పిచ్చితల్లిని గర్భవతిని చేశాడు. నెలల గడిచే కొద్ది దేవలక్ష్మి శరీరాకృతిలో మార్పులు రావడంతో సిరిసిల్ల వెంకంపేటలోని సత్యనారాయణ అనే ఆర్ఎంపీ వద్ద పరీక్షలు చేయించి మందులు తీసుకున్నట్లు దేవలక్ష్మి తల్లి వివరించింది. ఆర్ఎంపీ దేవలక్ష్మి గర్భవతి అని చెప్పలేదని బాధితురాలి తల్లి వాపోయింది. గోప్యంగా నెలల గడిచాక.. దేవలక్ష్మి ఆదివారం ఉదయం బాత్రూంకు వెళ్లి అందులో తనకు తెలియకుండా స్వతహాగా ప్రసవం చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పుట్టిన ఆడశిశువు పరిమాణాన్ని బట్టి గర్భం దాల్చి ఏడునెలలు దాటి ఉంటుందని వైద్యులు, ఐసీడీఎస్ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే తల్లిదండ్రులిద్దరికి సరైన అవగాహన లేకపోవడంతో ఘోరం జరిగిందని స్థానికులు ముచ్చటించుకున్నారు. ప్రబుద్ధుడి పేరు చెప్పలేని స్థితిలో... యువతి ప్రసవించిందని తెలిసిన స్థానికులు ఘటన స్థలానికి చేరుకుని పలురకాల ప్రశ్నలు అడిగారు. బాధితురాలి తల్లి ఎలాంటి సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నట్లు తెలిసింది. స్థానికంగా ఉన్న రాజుపై పది మందిలో పంచాయతీ పెట్టాలని చెప్పామని కానీ ఆ పని చేసే స్థితి తల్లిదండ్రులిద్దరికి లేకపోవడం ప్రబుద్ధుడు ఆడింది ఆటగా మారిందనే మాటలు వినిపించాయి. ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం.. పోలీసుల చొరవతో ప్రైవేటుకు.. బాత్రూంలో యువతి ప్రసవించి ప్రాణాపాయ స్థితిలో ఉందని స్థానికులు, ఐసీడీఎస్, ఎన్జీవో, పోలీసు అధికారులు హుటాహుటీనా ఆసుపత్రికి వస్తే అక్కడ విధుల్లో ఉన్న వైద్యులు ఎలాంటి పరీక్షలు చేయకుండా గైనకాలజిస్ట్ లేరని కరీంనగర్ వెళ్లాలని ఉచిత సలహా ఇచ్చారు. మృతశిశువును మార్చురీలో భద్రపరచాలని సీఐ శ్రీనివాస్ చెప్పినా దానిపై స్పందన లేకుండాపోయింది. పిచ్చితల్లికి సరైన వైద్యం అందించాలని చెబుతుంటే మృతశిశువు రక్తపరీక్షలు చేయాలని, ఆసుపత్రి నుంచి ఎక్కడికి తీసుకెళ్తారని డ్యూటీ డాక్టర్ తన కుర్చీలోంచి లేవకుండా ఇచ్చిన సలహాలు అందరిలో కోపాన్ని కలిగించాయి. అన్ని గమనించిన సిరిసిల్ల సీఐ శ్రీనివాస్ ప్రత్యేక చొరవ తీసుకుని ఐసీడీఎస్ సీడీపీవో అలేఖ్యపటేల్, అంగన్వాడీ టీచర్స్ వింధ్యారాణి, వెంకటలక్ష్మి మరో స్థానికురాలి సహకారంతో సిరిసిల్లలో అమ్మ ఆసుపత్రి వైద్యురాలు వాణి వద్దకు దేవలక్ష్మిని పంపించి వైద్య సేవలందించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన నిర్లక్ష్యాన్ని అందరూ తప్పుబట్టారు. చట్టప్రకారం చర్యలు ప్రస్తుతం యువతిని రక్షించే చర్యలు తీసుకున్నాం. దీనికి కారణమైన వ్యక్తికి సంబంధించి సమాచారం ఉంది. దానిని చట్టపరిధిలో పరిశీలించి యువతికి న్యాయం చేసేలా ముందుకెళ్తాం. – శ్రీనివాస్, సీఐ, సిరిసిల్ల టౌన్ -
కన్నతల్లి కర్కశత్వం
సాక్షి, కామారెడ్డి క్రైం: చున్నీతో ఐదేళ్ల కూతురుకు ఉరి బిగించి చంపిన తల్లి.. ఆపై తాను యాసిడ్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంట కాలనీలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బతుకమ్మ కుంటకు చెందిన షేక్ తాజొద్దీన్ ఇటీవలే గల్ఫ్ నుంచి తిరిగివచ్చాడు. అతడికి భార్య వసీమా, కూతురు ఒమెజా (05) ఉన్నారు. కొంతకాలంగా వసీమా మానసిక పరిస్థితి సక్రమంగా లేదు. ఆమె వింతవింతగా ప్రవర్తించేదని కుటుంబ సభ్యులు తెలిపారు. శుక్రవారం బంధువుల ఇంట్లో శుభాకార్యం ఉండడంతో తాజొద్దీన్ తన భార్య పిల్లలను అదే కాలనీలో నివసించే బంధవుల ఇంట్లో వదిలి హైదరాబాద్‌కు వెళ్లాడు. సాయంత్రం వరకు వసీమా తన కూతురుతో కలిసి బంధువుల ఇంట్లోనే ఉంది. సాయంత్రం సమయంలో ఇంటివరకు వెళ్లి వస్తానని చెప్పి కూతురును తీసుకుని బయలుదేరింది. ఇంటికి చేరిన తర్వాత కూతురు ఒమెజా మెడకు చున్నీచుట్టి గొంతు నులిమింది. దీంతో ఆ చిన్నారి చనిపోయింది. అనంతరం ఇంట్లో ఉన్న స్క్రూ డ్రైవర్‌తో కడుపులో పొడిచింది. ఆ తర్వాత ఆమె యాసిడ్ తాగింది. వసీమా ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆమె బంధువులు ఆందోళన చెంది ఆమె ఇంటికి వచ్చి చూశారు. అపస్మారక స్థితిలో ఉన్న తల్లీకూతుళ్లను కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మృతిచెందిందని వైద్యులు ధ్రువీకరించారు. వసీమా పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. మానసిక పరిస్థితి సరిగా లేకే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటుందని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నామని పట్టణ ఎస్‌హెచ్‌వో రామకృష్ణ, ఎస్సై గోవింద్ తెలిపారు. వసీమా స్పృహలోకి వస్తేగానీ ఎందుకు ఇలా చేసిందో తెలిసే పరిస్థితి లేదు. -
ప్చ్.. మర్చిపోయా !
సాక్షి, చిలకలూరిపేట(గుంటూరు) : నేటి కాలంలో ప్రతి ఇంట్లో వినిపిస్తున్నమాట మరిచిపోయా.. స్కూల్‌కు వెళ్లే పిల్లలు పుస్తకాలు, పెన్నులు, లంచ్‌బాక్స్ మరిచిపోయి నానా అగచాట్లు పడటం చూస్తుంటాం. కళాశాలలకు, ఉద్యోగాలకు వెళ్లే యువత పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏం లేదు. ప్రతి రోజూ బైక్తాళాలో, ఇతర వస్తువులో వెతుకుతూ తమ మతిమరుపుతనాన్ని తిట్టుకోవటం చాలా ఇళ్లలో కనిపిస్తూనే ఉంటోంది. ఉరుకుల, పరుగుల జీవితంలో చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు మరుపు సమస్య సాధారణంగా మారింది. చదువులో వెనుకబడతామనే ఒత్తిడి, ఉద్యోగం రాదనే భయం, పని ఒత్తిడి, ఆందోళనలు మతిమరుపునకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. ప్రస్తుతం పాతికేళ్లు దాటిన వారిలో ఈ సమస్య అధికంగా ఉంటోందని వైద్యులు చెబుతున్నారు. మారిన ఆహార అలవాట్లతో పౌష్టికాహారం అందక తలెత్తే కొన్ని రకాల ఆనార్యోగాలు కూడా మతిమరుపునకు దారి తీస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. యుక్త వయస్సులోనే... మతిమరుపు సమస్యకు యుక్తవయస్సులోనే బీజం పడుతోంది. 25 నుంచి 35 ఏళ్ల వయస్సు ఉన్న సమయంలో అది తీవ్రస్థాయికి చేరుతోందని వైద్యవర్గాలు వెల్లడిస్తున్నారు. కొందరు తాము మతిమరుపుతో బాధపడుతున్నామనే విషయం తెలీక అనారోగ్యంగా ఉందంటూ వైద్యులను సంప్రదిస్తున్నారు. రాజధాని యువతలో 20 శాతం మందికి మరుపు సమస్య ఉందని అంచనా. లోపిస్తున్న ఏకాగ్రత... యువతలో ఏకాగ్రత లోపిస్తుండటమే ఈ సమస్యకు మూల కారణమని తెలుస్తోంది. ఏదైనా అంశాన్ని వినడం, విన్నదాన్ని మదిలో నిలుపుకోవటం, దాన్ని తిరిగి చెప్పే అంశాల్లో తీవ్రమైన మార్పులొస్తున్నాయి. విన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోలేకపోతున్నారు. ఇలానే మతిమరుపు సమస్య మొదలవుతోందని వైద్యులు చెబుతున్నారు. యువత చదివిన, తెలుసుకున్న విషయాలను గుర్తు పెట్టుకోకుండా సెల్ఫోన్లు, ట్యాబ్స్ వంటి గాడ్జెట్స్‌పై ఆధారపడటం, పుస్తక పఠనాన్ని నిర్లక్ష్యం చేయడం మతిమరుపునకు కారణమవుతున్నట్లు గుర్తించారు. ఆహార అలవాట్లు.. జ్ఞాపక శక్తి పెరగటానికి విటమిన్ బీ12 అవసరం. ఇవి లోపించినా మతిమరుపు పెరుగుతుంది. పౌష్టికాహారలేమి మెదడుపై ప్రభావం చూపుతుంది. రెడీ మేడ్ ఫుడ్, జంక్‌ఫుడ్ వంటివి మెదడు పనితీరును మందగించేలా చేస్తాయి. మానసిక సమస్యలు.. జ్ఞాపక శక్తి తగ్గిపోవటానికి, మానసిక సమస్యలు తలెత్తటానికి ఆందోళన కూడా ప్రధాన కారణమే. ఏ పని చేయాలన్నా ఆందోళన చెందటం,హడావుడి పెరగటంతో తీవ్ర ఒత్తిడి ఏర్పడుతుంది. ఇది మనసుపై ప్రభావం చూపుతుంది. పనిఒత్తిడి, కుటుంబ సమస్యలు, ఆర్థికాంశాలు కూడా యువతపై ప్రభావం చూపుతున్నాయి. అయితే ఏకాగ్రతతో సమస్యను అధిగమించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. మెదడుకు పని కల్పించాలి ప్రస్తుతం వయస్సుతో నిమిత్తం లేకుండా పిల్లలు, యువతలో కూడా మతి మరుపు కనిపిస్తోంది. దీనికి జీవనవిధానంతో పాటు ఆహారపు అలవాట్లు, బీ12 విటమిన్ లోపం, ఏకాగ్రత లేకపోవడం కారణాలుగా మారుతున్నాయి. ఏ విషయాన్ని ఏకాగ్రతతో చేయకపోవటం ప్రతి పనికి సెల్‌ఫోన్‌పై ఆధారపడి మెదడుకు నికల్పించకపోవటంతో జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. పౌష్టికాహారం తీసుకోవటం, చెస్ ఆడటం, పజిల్స్ పూర్తి చేయటం, పుస్తక పఠనం వంటి వాటిని చేస్తుంటే మతిమరుపు కొంతమేర తగ్గుతుంది. –డాక్టర్ ఆర్.గోపీనాయక్, ప్రభుత్వ వైద్యుడు -
అదేపనిగా కూర్చుంటే మతిమరుపు ఖాయమట!
లాస్ ఏంజిలెస్ : సాధారణంగా వయసు పైబడితేనో, మానసిక ఒత్తిడి ఎక్కువైతేనో మతిమరుపు వస్తుందని చెబుతారు. కొన్నిసార్లు మెదడుకు గాయమైనా కూడా మతిమరుపు వస్తుంది. కానీ అదేపనిగా ఎక్కువ సేపు కదలకుండా కూర్చున్నా కూడా మతిమరుపు వచ్చే అవకాశముందని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తేలింది. భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త ఒకరు నేతృత్వం వహించిన బృందం డిమెన్షియాకు కారణాలేంటో తెలుసుకునేందుకు ప్రయత్నించగా.. గంటల తరబడి కూర్చొని, పనిలో నిమగ్నమయ్యేవారు మధ్యవయసుకు వచ్చేసరికి డిమెన్షియాబారిన పడుతున్నారని గుర్తించారు. ఇందుకోసం 45 నుంచి 75 సంవత్సరాల మధ్య వయసున్న 35 మందిపై పరిశోధన చేశారు. వారి ఫిజికల్ యాక్టివిటీ గురించి పూర్తి సమాచారాన్ని సేకరించారు. ఆ తర్వాత పరిశీలిస్తే.. కొత్త సమాచారాన్ని నిక్షిప్తం చేసుకునే మెదడు భాగం.. అదేపనిగా కూర్చొని పనిచేసే వ్యక్తుల్లో అభివృద్ధి చెందకపోవడాన్ని గుర్తించారట. దీనివల్ల అల్జీమర్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని తేలిందని అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రభా సిద్ధార్థ తెలిపారు. -
భర్త మరణం తట్టుకోలేక భార్య ఆత్మహత్య
హైదరాబాద్ : భర్త చనిపోవడంతో మానసికంగా కుంగిపోయిన భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం... హైదరాబాద్ లోని ఎల్బీనగర్ ఆర్టీసీకాలనీలో నివాసముండే ఏర్పుల శోభారాణి(32) భర్త కొన్నేళ్ల క్రితం టీబీ వ్యాధితో మృతిచెందాడు. అప్పటినుంచి ఆమె మానసికంగ కుంగిపోయింది. భర్త చనిపోయిన తర్వాత శోభారాణి.. కూతురు పావని (9), అత్తామామలతో కలిసి ఉంటోంది. కాగా మూడు రోజుల నుండి శోభారాణి ఇంట్లో లేకపోవడంతో బంధవుల ఇంటికి వెళ్లినట్లు కుటుంబసభ్యులు భావించారు. అయితే శుక్రవారం పైఅంతస్తులో ఉన్న పూజ గదిని శుభ్రం చేసేందుకు పైకి వెళ్లగా శోభారాణి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దుర్వాసన ఎక్కువగా వస్తుండటంతో మూడు రోజుల క్రితమే శోభారాణి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. దీనిపై సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.