అవును... త్వరగా వెళ్లిపోయావ్‌ సుశాంత్‌.. | Bollywood Star Sushant Singh Rajput commits suicide | Sakshi
Sakshi News home page

కలలు కరువయ్యాయా?

Published Mon, Jun 15 2020 5:49 AM | Last Updated on Mon, Jun 15 2020 9:16 AM

Bollywood Star Sushant Singh Rajput commits suicide - Sakshi

‘‘మసకబారిన జీవితం కన్నీటిబొట్టు రూపంలో ఆవిరి అవుతోంది. అంతు లేని కలలు చిరునవ్వును, అశాశ్వతమైన జీవితాన్ని చెక్కుతున్నాయి. ఆ రెండింటి మధ్య బతుకుతున్నాను’’... మనసు ఎంతో బరువెక్కినవాళ్లే ఇలా రాయగలుగుతారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ హృదయం కూడా తల్లిని తలుచుకుని బరువెక్కింది. 2002లో ఆమె చనిపోయారు. ఈ నెల 3న తల్లిని స్మరించుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో సుశాంత్‌ పెట్టిన పోస్ట్‌ ఇది. తను పెట్టిన చివరి పోస్ట్‌ కూడా ఇదే.

ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఈ పోస్ట్‌ చూస్తుంటే తల్లి మీద సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌కి ఉన్న ప్రేమ స్పష్టంగా అర్థం అవుతోంది. అలాగే అతనేదో మానసిక వేదనలో ఉన్నట్లు కూడా స్పష్టం అవుతోంది. ఈ పోస్ట్‌ పెట్టిన పదిరోజులకు ఆత్మహత్య చేసుకుని, అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేశాడు సుశాంత్‌.

అయితే ‘చిచోరే’లో అనిరుథ్‌లా ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారికి ధైర్యం చెప్పేంత బలమైన వ్యక్తి. ఆత్మహత్య చేసుకోవాలనుకునే కొడుక్కి ధైర్యం నింపిన తండ్రి అతను. ‘ఓడిపోతాం అని భయపడి పోటీ నుంచి తప్పుకుంటేనే నిజంగా ఓడిపోయినట్లు... ఓడినా గెలిచినా ఓకే అని పోటీలో నిలబడేవాడు ఓడిపోయినట్లు కాదు’ అని పరీక్షల్లో ఫెయిల్‌ అవుతానని భయపడి ఆత్మహత్య ప్రయత్నం చేసి, ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న కొడుక్కి ధైర్యం నింపుతాడు అనిరుథ్‌. ‘జీవితంలో ఆత్మహత్య ఒక్కటే పరిష్కార మార్గం కాదు’ అంటాడు. ఆ సినిమాలో అలాంటి ఒక బలమైన పాత్ర చేసిన సుశాంత్‌ నిజజీవితంలో తనకు తాను ధైర్యం చెప్పుకోలేకపోయాడు. మరి.. ధైర్యం చెప్పేవారు లేరా? అసలు సుశాంత్‌ తన మనసులో ఉన్న బాధను ఎవరితోనైనా పంచుకున్నాడా? సమాధానాలు దొరకని ప్రశ్నలు. ఇక సుశాంత్‌ జీవితంలోకి వెళ్తే...

సుశాంత్‌ పాట్నాలో పుట్టారు. స్కూల్‌ జీవితం అక్కడే సాగింది. తల్లి మరణంతో ఈ కుటుంబం ఢిల్లీకి మారింది. కాలేజీ జీవితం అక్కడే. మంచి మెరిట్‌ స్టూడెంట్‌. ఆల్‌ ఇండియా ఇంజనీరింగ్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్స్‌లో అతనిది 7వ ర్యాంక్‌. మంచి విద్యార్థి అయినప్పటికీ నటన మీద ఉన్న ఇష్టంతో ఇంజినీరింగ్‌ నాలుగో సంవత్సరం మధ్యలోనే ఆపేశాడు. అయితే సుశాంత్‌ ఇంట్లో లాయర్లు, డాక్టర్లు, ఇంజినీర్లు ఎక్కువ.

పైగా నలుగురు అక్కలు చదువుకుంటున్నారు. ఒక అక్క మీథూ సింగ్‌ మంచి క్రికెటర్‌. సుశాంత్‌ మాత్రం ఇంజినీరో, డాక్టరో అవ్వాలని అనుకోలేదు. నటుడు అయితే బాగుంటుందనుకున్నాడు. కానీ ‘నువ్వు ఇంజినీర్‌ అవ్వాల్సిందే’ అని సుశాంత్‌ ఇంట్లో చెప్పేశారు. అంతే.. పక్కనే ఉన్న ఒక పోస్టర్‌ని చింపేసి, తన అయిష్టాన్ని ఆ విధంగా వ్యక్తపరిచాడు. దాంతో కుటుంబ సభ్యులకు ఇతను నటుడు అవుతాడనే స్పష్టత వచ్చేసింది.

ఇంజినీరింగ్‌ చేస్తూనే ప్రముఖ కొరియోగ్రాఫర్‌ షైమక్‌ దావర్‌ డ్యాన్స్‌ స్కూల్‌లో చేరాడు సుశాంత్‌. ‘‘అద్భుతంగా డ్యాన్స్‌ చేస్తున్నావ్‌. నీలో ఏదో ప్రతిభ దాగి ఉంది. థియేటర్‌ ఎందుకు ట్రై చేయకూడదు’’ అన్నారు షైమక్‌. ఆ సలహాతో ‘బ్యారీ జాన్‌’ యాక్టింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాడు సుశాంత్‌. మూడు నెలల కోర్సు అది. ఆ బ్యాచ్‌లో అందరికీ ‘సి’ గ్రేడ్‌ వస్తే సుశాంత్‌ది ‘బి’ గ్రేడ్‌. దాంతో తన మీద తనకు బాగా నమ్మకం పెరిగిపోయింది. నటుడు కావాలని ఢిల్లీ నుంచి ముంబై చేరుకున్నాడు.

దాదాపు రెండేళ్లు థియేటర్‌ ఆర్టిస్ట్‌గా కొనసాగిన సుశాంత్‌ చేసిన తొలి యాడ్‌ షూట్‌ ‘మంచ్‌’. అప్పటికి పలు అవార్డు వేడుకల్లో గ్రూప్‌ డ్యాన్సులు కూడా చేశాడు. మొత్తానికి ప్రముఖ బాలాజీ టెలీఫిల్మ్స్‌ నుంచి ‘కిసీ దేశ్‌ మే హై మేరా దిల్‌’ (2008) సీరియల్‌ కోసం ఆడిషన్స్‌కి రమ్మని కబురు అందింది. ఈ సీరియల్‌లో చేసిన కీలక పాత్ర సుశాంత్‌కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత చేసిన ‘పవిత్ర రిశ్తా’ బుల్లితెర ఉత్తమ నటుడి అవార్డు దక్కేలా చేసింది. రెండు రియాల్టీ షోలు ‘జర నాచ్‌కే దిఖా’, ‘జలక్‌ దిఖ్‌లాజా’లో  పాల్గొన్నాడు. సుశాంత్‌కి తానేం చేసినా ‘ది బెస్ట్‌’ అనిపించుకోవాలనే పట్టుదల. అందుకే అవకాశాలు వస్తున్నప్పటికీ తనలోని నటుడిని ఇంకా మెరుగుపరచుకోవాలని 2011లో విదేశాలు వెళ్లారు. శిక్షణ తీసుకుని తిరిగొచ్చాడు.

ఇప్పుడు సుశాంత్‌ దృష్టంతా సినిమాలపైనే. అభిషేక్‌ కపూర్‌ దర్శకత్వంలో ‘కాయ్‌ పో చె’ (2013)లో నటించే అవకాశం వచ్చింది. ఇందులో ఉన్న మూడు ప్రధాన పాత్రల్లో సుశాంత్‌ పాత్ర ఒకటి. ఉత్తమ నటుడిగా స్క్రీన్‌అవార్డు, ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ అవార్డు అందుకున్నారు. ఆ సినిమా తర్వాత సుశాంత్‌ బిజీ నటుడిగా మారిపోయాడు. కొడుకు నటుడు కావడం ఇష్టం లేనప్పటికీ ఇరుగుపొరుగు ‘మీ అబ్బాయి ఫలానా సినిమాలో బాగా నటించాడు’ అని చెబుతుంటే సుశాంత్‌ తండ్రి మురిసిపోతుంటారు. కానీ కొడుకుతో మాత్రం ‘డిగ్రీ పూర్తి చేయాలబ్బాయ్‌’ అనేవారు.

ఇక ‘కాయ్‌ పో చె’ తర్వాత సుశాంత్‌ చేసిన ‘శుద్ధ్‌ దేశీ రొమాన్స్‌’ మంచి హిట్‌ అయింది. ఆ వెంటనే ఆమిర్‌ ఖాన్‌ ‘పీకే’ సినిమాలో చేసిన కీలక పాత్ర ఈ యువహీరోకి మంచి పేరు తెచ్చింది. వెంటనే చేసిన ‘డిటెక్టివ్‌ బ్యోమకేష్‌ బక్షి’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. క్రికెటర్‌ మహేందర్‌ సింగ్‌ ధోనీ జీవితం ఆధారంగా చేసిన ‘ఎం.ఎస్‌. ధోనీ’తో సుశాంత్‌ పాపులార్టీ బాగా పెరిగిపోయింది. నిజానికి సుశాంత్‌కి క్రికెట్‌ ఆడటం రాదు. ఈ సినిమా కోసం నేర్చుకున్నాడు. ఈ సినిమాలో హెలికాప్టర్‌ షాట్‌ కొట్టే సీన్‌ ఒకటి ఉంటుంది. ఆ సీన్‌ పర్ఫెక్ట్‌గా రావడం కోసం దాదాపు 200 రోజులు సాధన చేశాడు. ధోనీగా మారిపోవడం కోసం దాదాపు ఏడాదిన్నర సమయం తీసుకుని, ఈ సినిమా చేశాడు, సుశాంత్‌ కేటాయించిన సమయం, పడిన కష్టం వృథా పోలేదు. ‘అద్భుతంగా నటించాడు’ అని అందరూ ప్రశంసించారు.

అంతా సజావుగా సాగితే ఎలా? జీవితం కొన్ని ట్విస్టులు ఇస్తుంది. సోలో హీరోగా 2017లో చేసిన ‘రాబ్తా’, 2018లో చేసిన ‘కేదార్‌నాథ్‌’, ‘సోంచరియా’, మల్టీస్టారర్‌ మూవీ ‘వెల్కమ్‌ టు న్యూయార్క్‌’ చిత్రాలు ఆ ట్విస్టులు ఇచ్చాయి. ఆ సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అలా 2018 సుశాంత్‌కి కలిసి రాలేదు. అయితే అధైర్యపడలేదు. ఆ తర్వాత ‘చిచోరే’ (2019) చేశారు. సూపర్‌ హిట్‌. అయితే గత ఏడాది చేసిన మరో చిత్రం ‘డ్రైవ్‌’ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఆ తర్వాత చేసిన ‘దిల్‌ బేచారా’ గత ఏడాదే విడుదల కావాల్సింది. అయితే ఈ ఏడాది మేకి వాయిదా పడింది. కోవిడ్‌ 19 కారణంగా విడుదల ఆగింది.

నటుడిగా మంచి పేరు. అవకాశాలకు కూడా కొదవ లేదు. మరి.. సుశాంత్‌ సింగ్‌ని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిన పరిస్థితులు ఏంటి? ఆదివారం మధ్యాహ్నం ‘సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడు.. ఉరి వేసుకున్నాడు’. ఆరు నెలలుగా డిప్రెషన్‌లో ఉన్నాడని వార్తలు. ‘ఎం.ఎస్‌. ధోనీ’లో క్రికెటర్‌గా వందపరుగులు  తీశాడు సుశాంత్‌. కానీ ‘లైఫ్‌ గేమ్‌’ని 34 ఏళ్లకే బలవంతంగా ముగించుకున్నాడు.   ‘గాన్‌ టూ సూన్‌’... అంటూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సుశాంత్‌ మరణం పట్ల బాధ వ్యక్తం చేశారు. అవును... త్వరగా వెళ్లిపోయావ్‌ సుశాంత్‌. ‘చిచోరే’లో ఆత్మహత్యాయత్నం చేసిన కొడుక్కి తండ్రి స్థానంలో ఉండి ధైర్యం చెప్పావ్‌. నీకు నువ్వు ధైర్యం చెప్పుకోలేకపోయావ్‌. ‘‘మసకబారిన జీవితం కన్నీటిబొట్టు రూపంలో ఆవిరి అవుతోంది. అంతులేని కలలు చిరునవ్వును, అశాశ్వతమైన జీవితాన్ని చెక్కుతున్నాయి. ఆ రెండింటి మధ్య బతుకుతున్నాను’’ అన్నావ్‌.

కలలు కరువయ్యాయా? ఆశలు అడుగంటాయా?
అందుకే ఇక బతకలేనని వెళ్లిపోయావా?
‘గాన్‌ టూ సూన్‌’. – డి.జి. భవాని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement