బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, ఆయన మాజీ మేనేజర్ దిశా సలియన్ మరణానికి లింకు ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ క్రమంలో దిశ ఆత్మహత్య చేసుకోలేదని, అత్యాచారం చేసి చంపేశారంటూ బీజేపీ ఎంపీ నారాయణ్ రాణే ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. జూన్ 9న దిశ మరణిస్తే, జూన్ 11న తన మృతదేహానికి పోస్టుమార్టం జరపడంపైనా పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా దిశ మరణించిన రాత్రి ఏం జరిగింది? ఆమె వెంట ఎవరెవరు ఉన్నారు? ఆ రోజు పార్టీలో ఏదైనా గొడవ జరిగిందా? ఆమె ఆత్మహత్య చేసుకునేంత బలమైన కారణం ఏంటి? ఇలా ఎన్నో చిక్కుముడులను విప్పే ప్రయత్నం చేద్దాం..
దిశా సలియాన్ ఆప్త మిత్రురాలు పేర్కొన్న వివరాల ప్రకారం.. జూన్ 9 రాత్రి, ముంబైలోని మలద్ ప్రాంతంలోని ప్రియుడు రోహాన్ నివాసం.. దిశ తన బాయ్‌ఫ్రెండ్‌తో పాటు, మరికొంతమంది స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటోంది. మద్యం ఎక్కువగా తాగిన ఆమె ఒక్కసారిగా ఏడుస్తూ ఎవరూ ఎవరికోసం పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో అక్కడ ఉన్న ఓ స్నేహితుడు పార్టీ నాశనం చేయొద్దని కోరారు. వెంటనే ఆమె విసవిసా తన బెడ్‌రూంలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో ఆమె ప్రియుడు, ఇతర మిత్రులు వెళ్లి తలుపు తట్టారు. అటువైపు నుంచి స్పందన రాకపోవడంతో బలంగా తలుపును గుద్ది తెరిచేసరికి ఆమె అక్కడ కనిపించలేదు. లోనికి వచ్చి చూడగా ఆమె బాల్కనీలో నుంచి దూకి మెట్లపై పడిపోయి కనిపించింది. (మీడియా వేధింపుల గురించి ముంబై పోలీసులకు లేఖ)
అయితే అప్పటికీ ఆమె కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతోంది. వెంటనే వాళ్లు కిందకు వెళ్లి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆమెను చేర్పించుకునేందుకు మూడు ఆస్పత్రులు తిరస్కరించిన తర్వాత నాలుగోసారి వారి ప్రయత్నం ఫలించింది. కానీ అప్పటికే దిశ మరణించినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆమెను అత్యాచారం చేసి, చంపేశారని బీజేపీ ఎంపీ నారాయణ్ పేర్కొన్నారు. ఆమె మరణం వెనుక రాజకీయ నేతలు, బాలీవుడ్‌కు చెందిన వాళ్ల హస్తం ఉందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యాచార విషయాన్ని విషయాన్ని దిశ సుశాంత్‌కు చెప్పిందని దీంతో వాళ్లు అతడిని వేధించడం మొదలు పెట్టారని, అందుకే ఆయన ఆత్మహత్య చేసుకున్నారంటూ ఆరోపించారు. అయితే సుశాంత్ దిశను ఒకే ఒకసారి కలిశారని ముంబై పోలీసులు తెలిపారు. మరోవైపు దిశ మరణించిన నాలుగు రోజులకే సుశాంత్ బలవన్మరణానికి పాడిన విషయం తెలిసిందే. (‘ఆ విషయాన్ని రిపోర్టులో ప్రస్తావించలేదు’)
Comments
Please login to add a commentAdd a comment