గోవాలో కయాకింగ్ అండ్ కనోయింగ్‌లో పోటీ పడుతున్న గాయత్రి
ఆ యువతి పడవ నడపగలదు.. ఒడుపుగా లంగరు సైతం వేయగలదు. తండ్రినే గురువుగా భావించి.. సాగర సంగమ తీరాన్నే శిక్షణ కేంద్రంగా ఎంచుకుని ‘కయాకింగ్ అండ్ కనోయింగ్’ క్రీడలో రాణిస్తోంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన ఆ యువతి ప్రపంచ ఒలింపిక్స్‌లో రాణించి భారత్ తరఫున పతకం అందుకోవాలని తహతహలాడుతోంది.
నాగాయలంక (అవనిగడ్డ): కృష్ణా జిల్లా నాగాయలంక సాగర సంగమ తీరానికి చెందిన నాగిడి గాయత్రి గ్రామీణులకు పెద్దగా పరిచయం లేని ‘కయాకింగ్ అండ్ కనోయింగ్’ జలక్రీడలో రాణిస్తోంది. ఏడేళ్ల వయసులోనే తండ్రి వెంట నది బాటపట్టిన గాయత్రి చేపల వేట నేర్చుకుంది. జల క్రీడల్లో రాణించాలనే ఆ చిన్నారి తపనను గమనించి తండ్రి నాగబాబు కృష్ణా నదిలో ఈత నేర్పించారు.
స్థానిక జెడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి చదివిన గాయత్రి కరాటేలో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. విజయనగరం జిల్లా గరివిడి వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా చేసింది. నాటు పడవతోనే నదిలో సాధన చేసి గత ఏడాది గుజరాత్‌లో జరిగిన 36వ జాతీయస్థాయి కయాకింగ్ అండ్ కెనోయింగ్ పోటీల్లో నాలుగో స్థానంలో నిలిచింది.
జాతీయ స్థాయిలో రజత పతకం
18 సంవత్సరాల నాగిడి గాయత్రి కరాటే, రోయింగ్, కయాకింగ్ అండ్ కనోయింగ్ పోటీల్లో పలు పతకాలు సాధించింది. 2017లో ఢిల్లీలో జరిగిన 33వ నేషనల్ తైక్వాండో పోటీల్లో కాంస్య పతకం పొందింది. 2021లో రాష్ట్రస్థాయి రోయింగ్ పోటీల్లో బంగారు పతకం కైవశం చేసుకుంది.
గత ఏడాది అక్టోబర్‌లో గుజరాత్‌లో జరిగిన జాతీయస్థాయి వాటర్ స్పోర్ట్స్ పోటీల్లో నాలుగో స్ధానంలో నిలవగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 11న భోపాల్‌లో జరిగిన 5వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కయాకింగ్ అండ్ కెనోయింగ్ విభాగంలో జాతీయ స్థాయిలో రజత పతకం కైవశం చేసుకుంది.
ఈ ఏడాది అక్టోబర్‌లో గోవాలో జరిగే 37వ జాతీయస్థాయి వాటర్ స్పోర్ట్స్ పోటీలకు గాయత్రి అర్హత సాధించింది. దాతల సహాయం, మెరుగైన శిక్షణ అందిస్తే ప్రపంచ ఒలింపిక్ పోటీల్లో పతకం సాధిస్తానని గాయత్రి ధీమా వ్యక్తం చేస్తోంది.
చేపల వేటలో సాయపడుతూ..
తండ్రి నాగిడి నాగబాబుకు చేపల వేటలో గాయత్రి సహాయపడుతోంది. తండ్రితో పాటు రాత్రివేళలో బోటుపై సాగర సంగమ ప్రాంతానికి వెళ్లి వల, గాలం ద్వారా చేపల వేట సాగిస్తోంది. పురుషులకు దీటుగా పడవ నడుపుతూ.. లంగరు కూడా వేస్తోంది. చేపల వేటలో తలపండిన మత్స్యకారులు చేయలేని పనులను సైతం గాయత్రి సునాయాసంగా చేస్తుంది. గాలానికి రొయ్య గుచ్చడంలో గాయత్రి దిట్ట.
ఒడుపుగా గుచ్చకపోతే రొయ్య ముళ్ళు చేతిలో దిగి తీవ్రంగా బాధిస్తుంది. నాగాయలంకలో 40 చేపల వేట బోట్లు ఉండగా.. వీటిపై ముగ్గురు మాత్రమే గాలానికి ఒడుపుగా రొయ్య గుచ్చేవారు ఉంటే.. అందులో గాయత్రి ఒకరు కావడం విశేషం. నాగిడి నాగబాబు పెద్ద కుమార్తె గౌతమి స్మిమ్మింగ్‌లో, కుమారుడు రాజేష్ తైక్వాండోలో, నాగబాబు సోదరి లక్ష్మీకుమారి కుమారులు కన్నా కుమార్, ఈశ్వర్ తైక్వాండో, కయాకింగ్‌లో, నాగబాబు సోదరుడు సాంబశివరావు కుమార్తె భార్గవి రోయింగ్‌లో, కుమారుడు శ్యాం కయాకింగ్‌లో రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయిలో పలు పతకాలు అందుకోవడం విశేషం.
ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధిస్తా
మా కుటుంబానికి చేపల వేటే జీవనాధారం. మా నాన్న ఎంతో కష్టపడి శిక్షణ ఇప్పిస్తున్నారు. వాటర్ స్పోర్ట్స్ అకాడమీ సెక్రటరీ శివారెడ్డి ప్రోత్సాహం మరువలేనిది. కోచ్‌లు శ్రీనివాస్, నాగబాబు, చిన్నబాబు శిక్షణ నన్ను ఈ స్థాయికి తెచ్చాయి. ప్రపంచ ఒలింపిక్స్ వాటర్ స్పోర్ట్స్ క్రీడల్లో పాల్గొని బంగారు పతకం సాధించాలని ఉంది. దాతల ప్రోత్సాహం, మరింత మెరుగైన శిక్షణ అందిస్తే ఇంకా రాణిస్తాను.
– నాగిడి గాయత్రి, కయాకింగ్ క్రీడాకారిణి
Comments
Please login to add a commentAdd a comment