Water sports
-
హైదరాబాద్ : హుస్సేన్‌సాగర్‌లో వాటర్ స్పోర్ట్స్ ప్రారంభం (ఫొటోలు)
-
విజయవాడ : వాటర్ స్పోర్ట్స్‌లో శిక్షణ (ఫోటోలు)
-
సాగర తీరంలో కయాకింగ్ క్వీన్
ఆ యువతి పడవ నడపగలదు.. ఒడుపుగా లంగరు సైతం వేయగలదు. తండ్రినే గురువుగా భావించి.. సాగర సంగమ తీరాన్నే శిక్షణ కేంద్రంగా ఎంచుకుని ‘కయాకింగ్ అండ్ కనోయింగ్’ క్రీడలో రాణిస్తోంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన ఆ యువతి ప్రపంచ ఒలింపిక్స్‌లో రాణించి భారత్ తరఫున పతకం అందుకోవాలని తహతహలాడుతోంది. నాగాయలంక (అవనిగడ్డ): కృష్ణా జిల్లా నాగాయలంక సాగర సంగమ తీరానికి చెందిన నాగిడి గాయత్రి గ్రామీణులకు పెద్దగా పరిచయం లేని ‘కయాకింగ్ అండ్ కనోయింగ్’ జలక్రీడలో రాణిస్తోంది. ఏడేళ్ల వయసులోనే తండ్రి వెంట నది బాటపట్టిన గాయత్రి చేపల వేట నేర్చుకుంది. జల క్రీడల్లో రాణించాలనే ఆ చిన్నారి తపనను గమనించి తండ్రి నాగబాబు కృష్ణా నదిలో ఈత నేర్పించారు. స్థానిక జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదివిన గాయత్రి కరాటేలో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. విజయనగరం జిల్లా గరివిడి వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా చేసింది. నాటు పడవతోనే నదిలో సాధన చేసి గత ఏడాది గుజరాత్లో జరిగిన 36వ జాతీయస్థాయి కయాకింగ్ అండ్ కెనోయింగ్ పోటీల్లో నాలుగో స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయిలో రజత పతకం 18 సంవత్సరాల నాగిడి గాయత్రి కరాటే, రోయింగ్, కయాకింగ్ అండ్ కనోయింగ్ పోటీల్లో పలు పతకాలు సాధించింది. 2017లో ఢిల్లీలో జరిగిన 33వ నేషనల్ తైక్వాండో పోటీల్లో కాంస్య పతకం పొందింది. 2021లో రాష్ట్రస్థాయి రోయింగ్ పోటీల్లో బంగారు పతకం కైవశం చేసుకుంది. గత ఏడాది అక్టోబర్‌లో గుజరాత్లో జరిగిన జాతీయస్థాయి వాటర్ స్పోర్ట్స్ పోటీల్లో నాలుగో స్ధానంలో నిలవగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 11న భోపాల్‌లో జరిగిన 5వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కయాకింగ్ అండ్ కెనోయింగ్ విభాగంలో జాతీయ స్థాయిలో రజత పతకం కైవశం చేసుకుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో గోవాలో జరిగే 37వ జాతీయస్థాయి వాటర్ స్పోర్ట్స్ పోటీలకు గాయత్రి అర్హత సాధించింది. దాతల సహాయం, మెరుగైన శిక్షణ అందిస్తే ప్రపంచ ఒలింపిక్ పోటీల్లో పతకం సాధిస్తానని గాయత్రి ధీమా వ్యక్తం చేస్తోంది. చేపల వేటలో సాయపడుతూ.. తండ్రి నాగిడి నాగబాబుకు చేపల వేటలో గాయత్రి సహాయపడుతోంది. తండ్రితో పాటు రాత్రివేళలో బోటుపై సాగర సంగమ ప్రాంతానికి వెళ్లి వల, గాలం ద్వారా చేపల వేట సాగిస్తోంది. పురుషులకు దీటుగా పడవ నడుపుతూ.. లంగరు కూడా వేస్తోంది. చేపల వేటలో తలపండిన మత్స్యకారులు చేయలేని పనులను సైతం గాయత్రి సునాయాసంగా చేస్తుంది. గాలానికి రొయ్య గుచ్చడంలో గాయత్రి దిట్ట. ఒడుపుగా గుచ్చకపోతే రొయ్య ముళ్ళు చేతిలో దిగి తీవ్రంగా బాధిస్తుంది. నాగాయలంకలో 40 చేపల వేట బోట్లు ఉండగా.. వీటిపై ముగ్గురు మాత్రమే గాలానికి ఒడుపుగా రొయ్య గుచ్చేవారు ఉంటే.. అందులో గాయత్రి ఒకరు కావడం విశేషం. నాగిడి నాగబాబు పెద్ద కుమార్తె గౌతమి స్మిమ్మింగ్‌లో, కుమారుడు రాజేష్ తైక్వాండోలో, నాగబాబు సోదరి లక్ష్మీకుమారి కుమారులు కన్నా కుమార్, ఈశ్వర్ తైక్వాండో, కయాకింగ్‌లో, నాగబాబు సోదరుడు సాంబశివరావు కుమార్తె భార్గవి రోయింగ్‌లో, కుమారుడు శ్యాం కయాకింగ్‌లో రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయిలో పలు పతకాలు అందుకోవడం విశేషం. ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధిస్తా మా కుటుంబానికి చేపల వేటే జీవనాధారం. మా నాన్న ఎంతో కష్టపడి శిక్షణ ఇప్పిస్తున్నారు. వాటర్ స్పోర్ట్స్ అకాడమీ సెక్రటరీ శివారెడ్డి ప్రోత్సాహం మరువలేనిది. కోచ్‌లు శ్రీనివాస్, నాగబాబు, చిన్నబాబు శిక్షణ నన్ను ఈ స్థాయికి తెచ్చాయి. ప్రపంచ ఒలింపిక్స్ వాటర్ స్పోర్ట్స్ క్రీడల్లో పాల్గొని బంగారు పతకం సాధించాలని ఉంది. దాతల ప్రోత్సాహం, మరింత మెరుగైన శిక్షణ అందిస్తే ఇంకా రాణిస్తాను. – నాగిడి గాయత్రి, కయాకింగ్ క్రీడాకారిణి -
చేపల్లాంటి పిల్లలు... కడలిని ఈదేస్తున్నారు
జీవితమంటేనే కష్ట సుఖాల కలయిక. కొంతమంది జీవితాల్లో సుఖాలకంటే కష్టాలే ఎక్కువగా ఉంటాయి. వాటిలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటారు కొందరు. కానీ కొందరు తమ కష్టాలకు ప్రతిభను జోడించి అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. ఈ కోవకు చెందిన వారే జియారాయ్, కావేరి ధీమార్‌లు. వ్యక్తిగత జీవితంలో ఎదురైన అనేక సమస్యలను కడలికి ఎదురీదుతూ తమ వయసు కంటే ఎక్కు సంఖ్యలో మెడల్స్‌ను సాధిస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తున్నారు. ఇండియన్ పారా స్విమ్మర్ జియారాయ్ నేవీ అధికారి మదన్ రాయ్, రచన దంపతుల ముద్దుల కూతురు. సొంత ఊరు యూపీ అయినప్పటికీ మదన్ ఉద్యోగ రీత్యా ముంబైలో ఉండడంతో జియా అక్కడే పెరిగింది. పుట్టి ఏడాదిన్నర దాటినా జియా చిన్న చిన్న మాటలు కూడా సరిగా పలకలేక పోతోంది. తల్లిదండ్రులు కంగారు పడి డాక్టర్లకు చూపించారు. ఆటిజం అని తెలిసింది. మిగతా పిల్లల్లా ఏదీ సులభంగా నేర్చుకునేది కాదు. ఏదైనా పదేపదే చెబితే కోపం వచ్చేది. నేర్చుకోకపోగా విపరీతంగా అరిచేది. ఒకరోజు మదన్ జియాను స్విమ్మింగ్ పూల్‌లో దించగానే అమె నీళ్లను ఇష్టపడుతూ బాగా ఆడుకుంది. డాక్టర్లు కూడా వాటర్ స్పోర్ట్స్ ఆడిస్తే జియాలో త్వరగా మార్పులు కనిపిస్తాయని సూచించారు. వాటర్ థెరపీలో భాగంగా వాటర్ గేమ్స్ ఆడుతూ జియాకు స్విమ్మింగ్‌పై ఆసక్తి ఏర్పడింది. దీంతో స్విమ్మింగ్ సాధన చేయడం ప్రారంభించింది. ఎన్నో సమస్యలున్నా అన్నిటినీ తల్లిదండ్రుల సాయంతో ఎదుర్కొని మంచి స్విమ్మర్‌గా ఎదిగింది జియా. అనేక జాతీయ స్విమ్మింగ్ పోటీలలో పాల్గొని వయసుకంటే ఎక్కువ సంఖ్యలో బంగారు పతకాలను గెలుచుకుంది. అంతేగాక ఇప్పటిదాకా స్విమ్మింగ్‌లో అనేక జాతీయ రికార్డులను బద్దలు కొట్టి, 22 గోల్డ్ మెడల్స్‌ను సాధించింది. రెండు వందల మీటర్ల ఫ్రీస్టైల్, వంద మీటర్ల బ్యాక్ స్ట్రోక్, బటర్‌ఫ్లై స్విమ్మింగ్‌లో అనేక మెడల్స్‌ను సాధించింది. 14 కిలోమీటర్లను మూడు గంటల ఇరవై ఏడు నిమిషాల ముప్పై సెకన్లలో ఈది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియా బుక్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. అంతేగాక 2022 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్‌ను అందుకుంది. తాను సాధించిన అనేక విజయాల రికార్డులను ఆటిజంపై అవగాహన కల్పించడానికి అంకితం చేస్తోంది జియా. కనీసం మాట్లాడడం కూడా రాని జియా ఈ స్థాయికి ఎదగడానికి ఎంతో కష్టపడి సాధన చేసింది. ఉదయం నాలుగున్నర గంటలకు నిద్రలేచి ఐదు గంటల వరకు వ్యాయామం చేస్తుంది. ఎనిమిదింటి నుంచి పదింటి వరకు స్విమ్మింగ్ సాధన చేస్తుంది. తరువాత స్కూలుకు వెళ్తుంది. స్కూలు అయ్యాక సాయంత్రం నాలుగు గంటలకు మళ్లీ స్విమ్మింగ్ సాధన. ఎనిమిదో తరగతి చదువుతోన్న జియా రోజూ ఇదే దిన చర్యను పాటిస్తూ గోల్డ్ మెడల్స్‌ను సాధించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో జియా విజయాలను పొగడడం విశేషం. తాజాగా శ్రీలంకలోని తలైమన్నార్ సెటిల్మెంట్ నుంచి తమిళ నాడులోని ధనుష్కోటి వరకు ఉన్న 29 కిలోమీటర్ల దూరాన్ని 13 గంటల్లో ఈది మరో కొత్త రికార్డును నెలకొల్పింది. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో ‘యంగెస్ట్ స్విమ్మర్’గా నిలిచిన జియాకు అమెరికా స్విమ్మర్ మైఖేల్ ఫిలిప్స్ రోల్ మోడల్. అతని లాగే ఒలింపిక్స్‌లో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. చేప పిల్ల.. కావేరీ ధీమార్.. 2017 వరకు ఈమెవరో ప్రపంచానికి తెలియదు. ఆమెలోని ప్రతిభ పాటవాలు సుదూర శిఖరాలను అధిరోహించేలా చేసి జాతీయ రికార్డుల్లో తనకంటూ స్థానం సంపాదించుకుని ప్రపంచాన్ని తన వైపు తిప్పుకుంది. భోపాల్‌లోని కోస్తా జిల్లాలోని మండి గ్రామం కావేరిది. ఏడుగురు అక్కాచెల్లెళ్ళు,ఇద్దరు తమ్ముళ్ల మధ్య ఐదో అమ్మాయి కావేరి ధీమార్. జాలరుల కుటుంబం కావడంతో చేపలను వేటాడితేగానీ వారి కడుపులు నిండని పరిస్థితి. ఇది తప్ప వారికి ఆదాయం వచ్చే మరో మార్గం లేదు. కుటుంబ ఖర్చులతోపాటు తండ్రి అప్పులు కూడా పెరిగాయి. అప్పులు తీర్చడానికి తన అక్కచెల్లెళ ్లతో కలిసి కావేరి కూడా చేపల వేటకు వెళ్లేది. వేటలో ఎంతో చురుకుగా దూసుకుపోయేది కావేరి. ఈ విషయం ఆనోటా ఈ నోటా మధ్యప్రదేశ్ వాటర్ స్పోర్ట్స్’ అకాడమీకి తెలిసింది. వెంటనే కావేరీని అకాడమీలో చేర్చుకుని పడవలను నడపడడంలో శిక్షణ ఇచ్చారు. దీంతో నీళ్లమీద పడవలను పరిగెత్తిస్తూ ఇండియాలోనే టాప్ కెనోయిర్‌గా నిలిచింది. పొల్గొన్న ప్రతిపోటీలోనూ పతకాన్ని ఖాయం చేసుకొస్తోంది. ఈ క్రమంలోనే జాతీయ కనోయింగ్ ఈవెంట్స్‌లో పాల్గొని 12 స్వర్ణపతకాలను గెలుచుకుంది. థాయ్‌లాండ్‌లో జరుగుతున్న జరుగుతున్న ‘ఏషియన్ చాంపియన్‌షిప్స్’ లో భారత్ తరపున ప్రాతినిథ్యం వహిస్తోంది. ప్రతిభ ఉండి కలిసొచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోగల నేర్పరితనం ఉండాలేగాని పేద, గొప్ప అనే తేడా లేకుండా ఎదగవచ్చనడానికి కావేరి జీవితం ఉదాహరణగా నిలుస్తోంది. -
సాగర గర్భం నుంచి సీఎం జగన్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు
సాక్షి, కొమ్మాది (భీమిలి)/ విశాఖ స్పోర్ట్స్: రాష్ట్ర వ్యాప్తంగా 110 జలక్రీడ ప్రాంతాలను గుర్తించినట్టు రాష్ట్ర శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తెలిపారు. క్రీడలను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా ఆయన విశాఖ రుషికొండలోని యాటింగ్ సెంటర్‌ను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని నదులు, సముద్రంలో 110 ప్రాంతాలు జల క్రీడలు నిర్వహించేందుకు అనుకూలంగా ఉన్నాయన్నారు. అనంతరం ఆయన లైవ్ అడ్వంచర్ డైరెక్టర్ బలరామ్‌నాయుడుతో కలసి సముద్రంలో 30 అడుగుల లోతు వరకు స్కూబా డైవ్ చేశారు. ఈనెల 21న సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా సముద్ర గర్భంలోకి వెళ్లి అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే సీఎం సార్ అంటూ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. Byreddy Siddharth Reddy's special birthday wishes to CM YS Jagan garu 🔥🔥#CMYSJagan pic.twitter.com/twqNJVYsGK — Manvitha (𝕾𝖚𝖒𝖆) (@ManviDad) December 19, 2021 సీఎం కప్ బాక్సింగ్ టోర్నీ ప్రారంభం విశాఖలోని వైఎంసీఏ వద్ద ఆదివారం సీఎం కప్ స్టేట్ సీనియర్స్, యూత్ మెన్, ఉమెన్ బాక్సింగ్ టోర్నీ ప్రారంభమైంది. తొలి బౌట్‌ను బైరెడ్డి సిద్దార్థరెడ్డి ప్రారంభించారు. మూడు రోజుల పాటు ఈ పోటీలు కొనసాగనున్నాయి. కార్యక్రమంలో ఏపీ బాక్సింగ్ సంఘం అధ్యక్షుడు కాయల వెంకటరెడ్డి, జీసీసీ చైర్పర్సన్ స్వాతిరాణి, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, 13 జిల్లాల బాక్సర్లు పాల్గొన్నారు. చదవండి: (సినిమా టికెట్ల ఆన్లైన్ విక్రయాలకు ప్రత్యేక వ్యవస్థ) -
జలక్రీడలకు నెలవుగా విశాఖ
సాక్షి, విశాఖపట్నం: జల క్రీడలకు విశాఖ బీచ్‌లు కేరాఫ్ అడ్రస్‌గా మారనున్నాయి. వివిధ విభాగాల్లో శిక్షణ అందించేలా రుషికొండలో వాటర్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు కేంద్ర, ఏపీ ప్రభుత్వాల నుంచి అనుమతులు లభించాయి. దీంతో అంతర్జాతీయ స్థాయిలో జల క్రీడలకు విశాఖ వేదికగా మారనుంది. అదేవిధంగా చింతపల్లి బీచ్‌లో డైవింగ్ అకాడమీ ఏర్పాటుకు పర్యాటక శాఖ పచ్చజెండా ఊపింది. ఏపీ స్కూబా డైవింగ్ అకాడమీ ఆవరణలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. ఈ రెండూ అక్టోబర్‌లో ప్రారంభం కానున్నాయి. వాటర్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్లో బోట్ డ్రైవర్స్‌కు శిక్షణ అందించడంతో పాటు లైఫ్ సేవింగ్, యాచింగ్, సెయిలింగ్, వింగ్ సర్ఫింగ్‌లో ట్రైనింగ్ అందిస్తారు. -
మెట్ల బావుల్లో జలక్రీడలు
సాక్షి, హైదరాబాద్: వందల ఏళ్ల కింద నిర్మితమై పట్టించుకునే వారు లేక శిథిలమవుతూ వచ్చిన మెట్ల బావుల్లో ముఖ్యమైన వాటిని గుర్తించి, పునరుద్ధరించి పర్యాటక ప్రాంతాలుగా మార్చాలని పర్యాటక శాఖ భావిస్తోంది. అంతేకాదు వాటిని జలక్రీడలకు వేదికలుగా మార్చాలని యోచిస్తోంది. వీటికి అనువుగా ఉన్న మెట్ల బావులను త్వరలోనే గుర్తించి ప్రాజెక్టు రూపకల్పనకు కసరత్తు చేస్తామని పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు తెలిపారు. రాణి రుద్రమదేవి జలకాలాడినట్టు చెప్పుకునే వరంగల్ శివారులోని మెట్ల బావిని వెంటనే రూ.30 లక్షలతో అభివృద్ధి చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. ‘మెట్ల దారులు.. మహా బావులు’శీర్షికతో బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. ‘రాష్ట్రంలో వంద వరకు అపురూప బావులున్న విషయం నాకు తెలియదు. అప్పట్లో చాలాచోట్ల పెద్ద పెద్ద బావులు నిర్మించినట్లు అవగాహన ఉన్నా, మెట్లు, మండపాలతో నిర్మించిన విశాలమైన సుందరమైన బావులు పెద్ద సంఖ్యలో ఉన్నాయన్న సంగతి ‘సాక్షి’కథనంతోనే తెలిసింది. వీటిల్లో మంచి రూపుతో ఉన్న బావులను త్వరలోనే గుర్తించి వాటిని అభివృద్ధిచేస్తాం’అని చెప్పారు. ఇటీవల వరంగల్ శివారులోని మెట్లబావిని పరిశీలించానని, దాన్ని గుజరాత్‌లోని రాణీ కీ వావ్ తరహాలో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే సురేఖ, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఎంపీ పసునూరి దయాకర్ చెరో రూ.10 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించినట్లు పేర్కొన్నారు. -
జలక్రీడలకు కేంద్రంగా ఎర్రకాలువ జలాశయం
జలక్రీడలకు అనువుగా జలాశయం గుర్తింపు కార్యరూపం దాల్చితే జలాశయానికి మహర్ధశ ఇప్పటికే పర్యాటక కేంద్రంగా గుర్తింపు జలాశయంలో సెయిలింగ్, రోయింగ్, కెనాయింగ్ తదితర క్రీడల అభివృద్ధికి ప్రతిపాదనలు జంగారెడ్డిగూడెంః జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయంలో జలక్రీడల అభివృద్ధి దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జలక్రీడలకు కేకేఎం ఎర్రకాలువ జలాశయం అనువుగా ఉందని నిపుణుల కమిటీ గుర్తించింది. దీంతో ఎర్రకాలువ జలాశయంలో సెయిలింగ్, రోయింగ్, కెనాయింగ్ తదితర జలక్రీడలకు నిర్వహణ చర్యలు తీసుకుంటుంది. అక్టోబర్‌లో కేరళకు చెందిన రోయింగ్ శిక్షకుడు ద్రోణాచార్యఅవార్డు గ్రహీత జోస్జాకబ్, కనోయింగ్ కయాకింగ్ శిక్షకుడు అర్జునఅవార్డు గ్రహీత ఎస్సీజీ కుమార్‌తో కూడిన నిపుణుల బృందం, రాష్ట్రంలో కృష్ణాగోదావరి నదుల్లో జలక్రీడలు నిర్వహించేందుకు వాటిని అభివృద్ధి చేసేందుకు అవకాశాలపైన, సాధ్యాసాధ్యాలపైన అధ్యయనం చేసింది. దీనిలో భాగంగా రాష్ట్రంలో విజయవాడ కృష్ణనది పున్నమిఘాట్, నాగాయలంక కృష్ణాతీరం, పశ్చిమగోదావరి జిల్లాలోని ఎర్రకాలువ జలాశయం వీటికి అనువుగా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించింది. దీనిఇకి సంబంధించి నివేదికను ప్రభుత్వానికి అందించింది. నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు సిద్దం చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో జలక్రీడల నిర్వహణకు ప్రణాళికలు రూపొందిస్తుంది. జలక్రీడలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పన, క్రీడాపరికరాల కొనుగోలు, మౌలిక సదుపాయాలు స్పోర్ట్స్ ఆధారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్)కల్పించేందుకు త్వరలో ప్రాజెక్టు నివేదికను తయారుచేయనున్నట్లు తెలిసింది. పర్యాటక కేంద్రంగా ఎర్రకాలువ జలాశయంః కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయాన్ని ప్రభుత్వం 2013లో పర్యాటక కేంద్రంగా గుర్తించింది. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు 3.20 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేసింది. ఈ నిధులతో జలాశయం వద్ద రెస్టారెంట్, వసతిగృహాలు, జలాశయం లో బోటింగ్ కోసం వెచ్చించనుంది. అయితే నిధులు లేమి కారణంగా పనులు సజావుగా సాగడం లేదు. ఇప్పటికే పర్యాటక కేంద్రంగా గుర్తించి పనులు నిర్వహిస్తుండగా , తాజాగా ఈ జలాశయాన్ని జలక్రీడల అభివృద్దికి ప్రభుత్వం ఎంపిక చేసింది. ఎర్రకాలువ జలాశయంలో జలక్రీడలు ఇవేః ఎర్రకాలువ జలాశయంలో జలక్రీడల అభివృద్దిలో భాగంగా సెయిలింగ్, రోయింగ్, కెనాయింగ్ తదితర జలక్రీడలు నిర్వహించనున్నారు. వీటిలో క్రీడాకారులకు శిక్షణ కూడా ఇస్తారు. జలక్రీడలకు అనువైన ప్రాంతంగా జలాశయాన్ని గుర్తించి అభివృద్ధి చేయనున్నారు. ఇదే కార్యరూపం దాల్చితే ఎర్రకాలువ జలాశయాన్కి మహర్ధశ పట్టినట్లే ఈ జలక్రీడల అభివృద్ధికి న్యూజిలాండ్‌నుంచి సహకారం తీసుకునేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం న్యూజిలాండ్‌తో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతుంది. -
అమరావతితోపాటు పలు నగరాల్లో స్టార్ హోటళ్లు
సాక్షి, హైదరాబాద్: రాజధాని అమరావతితో పాటు రాష్ట్రంలోని పలు నగరాల్లో స్టార్ హోటల్స్ ఏర్పాటును ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మూడు, నాలుగు, ఐదు నక్షత్రాల హోటళ్లతో పాటు బీచ్ రిసార్ట్స్, అమ్యూజ్మెంట్ పార్కులు, ఐమాక్స్, వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటుతో పాటు వాటికి ఎక్కడెక్కడ ఆదరణ ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వ గుర్తించింది. అలాగే ఇందుకు అవసరమైన భూమి, పెట్టుబడి సంస్థలను కూడా సర్కార్ గుర్తించింది. రాజధాని అమరావతిలో మూడు నక్షత్రాల హోటళ్లు మూడు, నాలుగు నక్షత్రాల హోటల్ ఒకటి, ఐదు నక్షత్రాల హోటల్ ఒకటి ఏర్పాటు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పర్యాటక రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు గానూ భూములను లీజుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. పదెకరాల లోపు, ఆ పైబడిన భూములను 33 ఏళ్లపాటు లీజుకు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. లీజును మార్కెట్ విలువలో రెండు శాతంగా నిర్ధారించారు. కాగా, నిర్ధారించిన ప్రాజెక్టులకు పెట్టుబడిదారులు, వారి ప్రొఫైల్ ఆధారంగా నేరుగా భూమిని విక్రయించే అవకాశం కూడా ఉంది.