చేపల్లాంటి పిల్లలు... కడలిని ఈదేస్తున్నారు | Jiya Rai, Kaveri Dhimar wins gold medals in para olympics | Sakshi
Sakshi News home page

చేపల్లాంటి పిల్లలు... కడలిని ఈదేస్తున్నారు

Published Fri, Mar 25 2022 3:36 AM | Last Updated on Fri, Mar 25 2022 3:36 AM

Jiya Rai, Kaveri Dhimar wins gold medals in para olympics - Sakshi

జీవితమంటేనే కష్ట సుఖాల కలయిక. కొంతమంది జీవితాల్లో సుఖాలకంటే కష్టాలే ఎక్కువగా ఉంటాయి. వాటిలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటారు కొందరు. కానీ కొందరు తమ కష్టాలకు ప్రతిభను జోడించి అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. ఈ కోవకు చెందిన వారే జియారాయ్, కావేరి ధీమార్‌లు. వ్యక్తిగత జీవితంలో ఎదురైన అనేక సమస్యలను కడలికి ఎదురీదుతూ తమ వయసు కంటే ఎక్కు సంఖ్యలో మెడల్స్‌ను సాధిస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తున్నారు.

ఇండియన్‌ పారా స్విమ్మర్‌ జియారాయ్‌ నేవీ అధికారి మదన్‌ రాయ్, రచన దంపతుల ముద్దుల కూతురు. సొంత ఊరు యూపీ అయినప్పటికీ మదన్‌ ఉద్యోగ రీత్యా ముంబైలో ఉండడంతో జియా అక్కడే పెరిగింది. పుట్టి ఏడాదిన్నర దాటినా జియా చిన్న చిన్న మాటలు కూడా సరిగా పలకలేక పోతోంది. తల్లిదండ్రులు కంగారు పడి డాక్టర్లకు చూపించారు. ఆటిజం అని తెలిసింది.

మిగతా పిల్లల్లా ఏదీ సులభంగా నేర్చుకునేది కాదు. ఏదైనా పదేపదే చెబితే కోపం వచ్చేది. నేర్చుకోకపోగా విపరీతంగా అరిచేది. ఒకరోజు మదన్‌ జియాను స్విమ్మింగ్‌ పూల్‌లో దించగానే అమె నీళ్లను ఇష్టపడుతూ బాగా ఆడుకుంది. డాక్టర్లు కూడా వాటర్‌ స్పోర్ట్స్‌ ఆడిస్తే జియాలో త్వరగా మార్పులు కనిపిస్తాయని సూచించారు. వాటర్‌ థెరపీలో భాగంగా వాటర్‌ గేమ్స్‌ ఆడుతూ జియాకు స్విమ్మింగ్‌పై ఆసక్తి ఏర్పడింది. దీంతో స్విమ్మింగ్‌ సాధన చేయడం ప్రారంభించింది.

ఎన్నో సమస్యలున్నా అన్నిటినీ తల్లిదండ్రుల సాయంతో ఎదుర్కొని మంచి స్విమ్మర్‌గా ఎదిగింది జియా. అనేక జాతీయ స్విమ్మింగ్‌ పోటీలలో పాల్గొని వయసుకంటే ఎక్కువ సంఖ్యలో బంగారు పతకాలను గెలుచుకుంది. అంతేగాక ఇప్పటిదాకా స్విమ్మింగ్‌లో అనేక జాతీయ రికార్డులను బద్దలు కొట్టి, 22 గోల్డ్‌ మెడల్స్‌ను సాధించింది. రెండు వందల మీటర్ల ఫ్రీస్టైల్, వంద మీటర్ల బ్యాక్‌ స్ట్రోక్, బటర్‌ఫ్లై స్విమ్మింగ్‌లో అనేక మెడల్స్‌ను సాధించింది.

14 కిలోమీటర్లను మూడు గంటల ఇరవై ఏడు నిమిషాల ముప్పై సెకన్లలో ఈది ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్, ఏషియా బుక్, లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. అంతేగాక 2022 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన ప్రధాన్‌ మంత్రి రాష్ట్రీయ బాల్‌ పురస్కార్‌ను అందుకుంది. తాను సాధించిన అనేక విజయాల రికార్డులను ఆటిజంపై అవగాహన కల్పించడానికి అంకితం చేస్తోంది జియా.  

కనీసం మాట్లాడడం కూడా రాని జియా ఈ స్థాయికి ఎదగడానికి ఎంతో కష్టపడి సాధన చేసింది. ఉదయం నాలుగున్నర గంటలకు నిద్రలేచి ఐదు గంటల వరకు వ్యాయామం చేస్తుంది. ఎనిమిదింటి నుంచి పదింటి వరకు స్విమ్మింగ్‌ సాధన చేస్తుంది. తరువాత స్కూలుకు వెళ్తుంది. స్కూలు అయ్యాక సాయంత్రం నాలుగు గంటలకు మళ్లీ స్విమ్మింగ్‌ సాధన. ఎనిమిదో తరగతి చదువుతోన్న జియా రోజూ ఇదే దిన చర్యను పాటిస్తూ గోల్డ్‌ మెడల్స్‌ను సాధించింది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో జియా విజయాలను పొగడడం విశేషం. తాజాగా శ్రీలంకలోని తలైమన్నార్‌ సెటిల్‌మెంట్‌ నుంచి తమిళ నాడులోని ధనుష్‌కోటి వరకు ఉన్న 29 కిలోమీటర్ల దూరాన్ని 13 గంటల్లో ఈది మరో కొత్త రికార్డును నెలకొల్పింది. గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో ‘యంగెస్ట్‌ స్విమ్మర్‌’గా నిలిచిన జియాకు అమెరికా స్విమ్మర్‌ మైఖేల్‌ ఫిలిప్స్‌ రోల్‌ మోడల్‌. అతని లాగే ఒలింపిక్స్‌లో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది.

చేప పిల్ల..
కావేరీ ధీమార్‌.. 2017 వరకు ఈమెవరో ప్రపంచానికి తెలియదు. ఆమెలోని ప్రతిభ పాటవాలు సుదూర శిఖరాలను అధిరోహించేలా చేసి జాతీయ రికార్డుల్లో తనకంటూ స్థానం సంపాదించుకుని ప్రపంచాన్ని తన వైపు తిప్పుకుంది. భోపాల్‌లోని కోస్తా జిల్లాలోని మండి గ్రామం కావేరిది. ఏడుగురు అక్కాచెల్లెళ్ళు,ఇద్దరు తమ్ముళ్ల మధ్య ఐదో అమ్మాయి కావేరి ధీమార్‌. జాలరుల కుటుంబం కావడంతో చేపలను వేటాడితేగానీ వారి కడుపులు నిండని పరిస్థితి. ఇది తప్ప వారికి ఆదాయం వచ్చే మరో మార్గం లేదు.

కుటుంబ ఖర్చులతోపాటు తండ్రి అప్పులు కూడా పెరిగాయి. అప్పులు తీర్చడానికి తన అక్కచెల్లెళ ్లతో కలిసి కావేరి కూడా చేపల వేటకు వెళ్లేది. వేటలో ఎంతో చురుకుగా దూసుకుపోయేది కావేరి. ఈ విషయం ఆనోటా ఈ నోటా మధ్యప్రదేశ్‌ వాటర్‌ స్పోర్ట్స్‌’ అకాడమీకి తెలిసింది. వెంటనే కావేరీని అకాడమీలో చేర్చుకుని పడవలను నడపడడంలో శిక్షణ ఇచ్చారు. దీంతో నీళ్లమీద పడవలను పరిగెత్తిస్తూ ఇండియాలోనే టాప్‌ కెనోయిర్‌గా నిలిచింది.

పొల్గొన్న ప్రతిపోటీలోనూ పతకాన్ని ఖాయం చేసుకొస్తోంది. ఈ క్రమంలోనే  జాతీయ కనోయింగ్‌ ఈవెంట్స్‌లో పాల్గొని 12 స్వర్ణపతకాలను గెలుచుకుంది. థాయ్‌లాండ్‌లో జరుగుతున్న జరుగుతున్న ‘ఏషియన్‌ చాంపియన్‌షిప్స్‌’ లో భారత్‌ తరపున ప్రాతినిథ్యం వహిస్తోంది. ప్రతిభ ఉండి కలిసొచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోగల నేర్పరితనం ఉండాలేగాని పేద, గొప్ప అనే తేడా లేకుండా ఎదగవచ్చనడానికి కావేరి జీవితం ఉదాహరణగా నిలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement