జలక్రీడలకు కేంద్రంగా ఎర్రకాలువ జలాశయం
జలక్రీడలకు కేంద్రంగా ఎర్రకాలువ జలాశయం
Published Sat, Nov 12 2016 6:50 PM | Last Updated on Mon, Sep 4 2017 7:55 PM
జలక్రీడలకు అనువుగా జలాశయం గుర్తింపు
కార్యరూపం దాల్చితే జలాశయానికి మహర్ధశ
ఇప్పటికే పర్యాటక కేంద్రంగా గుర్తింపు
జలాశయంలో సెయిలింగ్, రోయింగ్, కెనాయింగ్ తదితర క్రీడల అభివృద్ధికి ప్రతిపాదనలు
జంగారెడ్డిగూడెంః
జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయంలో జలక్రీడల అభివృద్ధి దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జలక్రీడలకు కేకేఎం ఎర్రకాలువ జలాశయం అనువుగా ఉందని నిపుణుల కమిటీ గుర్తించింది. దీంతో ఎర్రకాలువ జలాశయంలో సెయిలింగ్, రోయింగ్, కెనాయింగ్ తదితర జలక్రీడలకు నిర్వహణ చర్యలు తీసుకుంటుంది. అక్టోబర్‌లో కేరళకు చెందిన రోయింగ్ శిక్షకుడు ద్రోణాచార్యఅవార్డు గ్రహీత జోస్‌జాకబ్, కనోయింగ్ కయాకింగ్ శిక్షకుడు అర్జునఅవార్డు గ్రహీత ఎస్‌సీజీ కుమార్‌తో కూడిన నిపుణుల బృందం, రాష్ట్రంలో కృష్ణాగోదావరి నదుల్లో జలక్రీడలు నిర్వహించేందుకు వాటిని అభివృద్ధి చేసేందుకు అవకాశాలపైన, సాధ్యాసాధ్యాలపైన అధ్యయనం చేసింది. దీనిలో భాగంగా రాష్ట్రంలో విజయవాడ కృష్ణనది పున్నమిఘాట్, నాగాయలంక కృష్ణాతీరం, పశ్చిమగోదావరి జిల్లాలోని ఎర్రకాలువ జలాశయం వీటికి అనువుగా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించింది. దీనిఇకి సంబంధించి నివేదికను ప్రభుత్వానికి అందించింది. నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు సిద్దం చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో జలక్రీడల నిర్వహణకు ప్రణాళికలు రూపొందిస్తుంది. జలక్రీడలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పన, క్రీడాపరికరాల కొనుగోలు, మౌలిక సదుపాయాలు స్పోర్ట్స్ ఆధారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్)కల్పించేందుకు త్వరలో ప్రాజెక్టు నివేదికను తయారుచేయనున్నట్లు తెలిసింది.
పర్యాటక కేంద్రంగా ఎర్రకాలువ జలాశయంః
కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయాన్ని ప్రభుత్వం 2013లో పర్యాటక కేంద్రంగా గుర్తించింది. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు 3.20 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేసింది. ఈ నిధులతో జలాశయం వద్ద రెస్టారెంట్, వసతిగృహాలు, జలాశయం లో బోటింగ్ కోసం వెచ్చించనుంది. అయితే నిధులు లేమి కారణంగా పనులు సజావుగా సాగడం లేదు. ఇప్పటికే పర్యాటక కేంద్రంగా గుర్తించి పనులు నిర్వహిస్తుండగా , తాజాగా ఈ జలాశయాన్ని జలక్రీడల అభివృద్దికి ప్రభుత్వం ఎంపిక చేసింది.
ఎర్రకాలువ జలాశయంలో జలక్రీడలు ఇవేః
ఎర్రకాలువ జలాశయంలో జలక్రీడల అభివృద్దిలో భాగంగా సెయిలింగ్, రోయింగ్, కెనాయింగ్ తదితర జలక్రీడలు నిర్వహించనున్నారు. వీటిలో క్రీడాకారులకు శిక్షణ కూడా ఇస్తారు. జలక్రీడలకు అనువైన ప్రాంతంగా జలాశయాన్ని గుర్తించి అభివృద్ధి చేయనున్నారు. ఇదే కార్యరూపం దాల్చితే ఎర్రకాలువ జలాశయాన్కి మహర్ధశ పట్టినట్లే ఈ జలక్రీడల అభివృద్ధికి న్యూజిలాండ్‌నుంచి సహకారం తీసుకునేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం న్యూజిలాండ్‌తో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతుంది.
Advertisement
Advertisement