అమరావతితోపాటు పలు నగరాల్లో స్టార్ హోటళ్లు
సాక్షి, హైదరాబాద్: రాజధాని అమరావతితో పాటు రాష్ట్రంలోని పలు నగరాల్లో స్టార్ హోటల్స్ ఏర్పాటును ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మూడు, నాలుగు, ఐదు నక్షత్రాల హోటళ్లతో పాటు బీచ్ రిసార్ట్స్, అమ్యూజ్‌మెంట్ పార్కులు, ఐమాక్స్, వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటుతో పాటు వాటికి ఎక్కడెక్కడ ఆదరణ ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వ గుర్తించింది. అలాగే ఇందుకు అవసరమైన భూమి, పెట్టుబడి సంస్థలను కూడా సర్కార్ గుర్తించింది.
రాజధాని అమరావతిలో మూడు నక్షత్రాల హోటళ్లు మూడు, నాలుగు నక్షత్రాల హోటల్ ఒకటి, ఐదు నక్షత్రాల హోటల్ ఒకటి ఏర్పాటు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పర్యాటక రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు గానూ భూములను లీజుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. పదెకరాల లోపు, ఆ పైబడిన భూములను 33 ఏళ్లపాటు లీజుకు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. లీజును మార్కెట్ విలువలో రెండు శాతంగా నిర్ధారించారు. కాగా, నిర్ధారించిన ప్రాజెక్టులకు పెట్టుబడిదారులు, వారి ప్రొఫైల్ ఆధారంగా నేరుగా భూమిని విక్రయించే అవకాశం కూడా ఉంది.