స్టార్ హోటళ్లకు 500 ఎకరాలు
అమరావతిపై సమీక్షలో సీఎం
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతిలో స్టార్ హోటళ్ల నిర్మాణానికి వీలుగా 500 ఎకరాల్ని సిద్ధంగా ఉంచాలని సీఎం చంద్రబాబునాయుడు సీఆర్‌డీఏ అధికారుల్ని ఆదేశించారు. వివిధ ప్రాంతాల్లో వాటిని నిర్మించేందుకు వీలుగా భూములను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. రాజధాని వ్యవహారాలపై బుధవారం వెలగపూడి సచివాలయంలో సీఆర్‌డీఏ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇస్తాంబుల్ తరహాలో రాజధాని అమరావతిలో ఆతిథ్యరంగాన్ని అభివృద్ధి చేయాలని సీఎం సూచించగా.. రాడిసన్, తాజ్, జీఆర్‌టీ, పార్క్, నోవాటెల్ వంటి ఎనిమిది ప్రముఖ సంస్థలు అమరావతిలో స్టార్ హోటళ్లను నిర్మించేందుకు ముందుకొచ్చాయని సీఆర్‌డీఏ అధికారులు ఆయనకు వివరించారు.
హైపర్‌లూప్ రవాణాపై అధ్యయనం
అమరావతిలో మెట్రోరైలు స్థానంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యంత వేగంతో కూడిన రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసే ‘హైపర్‌లూప్ రవాణా వ్యవస్థ’పై అధ్యయనం జరపాలని సీఎం ఆదేశించారు. హైపర్‌లూప్ వ్యవస్థ ఏర్పాటైతే విశాఖ నుంచి అమరావతికి 23 నిమిషాల్లో, అమరావతి నుంచి తిరుపతికి 25 నిమిషాల్లో చేరుకోవచ్చన్నారు.
ప్రీ స్కూళ్లుగా అంగన్‌వాడీ కేంద్రాలు
రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్ని ప్రీ స్కూళ్లుగా మారుస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ స్కూళ్లలో తెలుగుభాషకు ప్రాధాన్యం తగ్గించకుండానే ఆంగ్లంలో బోధిస్తారని చెప్పారు. బుధవారం విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి ‘అంగన్‌వాడీ కేంద్రాలు–ప్రీ ప్రైమరీ స్కూళ్లు’ అంశంపై తల్లిదండ్రులు, అంగన్‌వాడీ ఉపాధ్యాయులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టణ ప్రాంతాల్లోని 3,128 అంగన్‌వాడీ కేంద్రాల్ని ఏకీకృతం చేసి 1,026 ప్రీ స్కూలు కేంద్రాలుగా మార్చుతున్నట్టు చెప్పారు. ఒక్కోప్రీ స్కూలు కేంద్రానికి రూ.2.40 లక్షలు చొప్పున వ్యయం చేయనున్నట్టు తెలిపారు. ప్రీ స్కూళ్ల నిర్వహణ బాధ్యతను పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖలు స్వీకరిస్తాయని, మూడేళ్ల వయసున్న చిన్నారులు నర్సరీ, నాలుగేళ్ల వయస్సున్నవారు ఎల్‌కేజీ, నాలుగు నుంచి ఐదేళ్ల వయస్సుంటే యూకేజీ చదివేందుకు వీలుందన్నారు.