
సాక్షి, హైదరాబాద్: వందల ఏళ్ల కింద నిర్మితమై పట్టించుకునే వారు లేక శిథిలమవుతూ వచ్చిన మెట్ల బావుల్లో ముఖ్యమైన వాటిని గుర్తించి, పునరుద్ధరించి పర్యాటక ప్రాంతాలుగా మార్చాలని పర్యాటక శాఖ భావిస్తోంది. అంతేకాదు వాటిని జలక్రీడలకు వేదికలుగా మార్చాలని యోచిస్తోంది. వీటికి అనువుగా ఉన్న మెట్ల బావులను త్వరలోనే గుర్తించి ప్రాజెక్టు రూపకల్పనకు కసరత్తు చేస్తామని పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు తెలిపారు. రాణి రుద్రమదేవి జలకాలాడినట్టు చెప్పుకునే వరంగల్ శివారులోని మెట్ల బావిని వెంటనే రూ.30 లక్షలతో అభివృద్ధి చేయాలని నిర్ణయించామని వెల్లడించారు.
‘మెట్ల దారులు.. మహా బావులు’శీర్షికతో బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. ‘రాష్ట్రంలో వంద వరకు అపురూప బావులున్న విషయం నాకు తెలియదు. అప్పట్లో చాలాచోట్ల పెద్ద పెద్ద బావులు నిర్మించినట్లు అవగాహన ఉన్నా, మెట్లు, మండపాలతో నిర్మించిన విశాలమైన సుందరమైన బావులు పెద్ద సంఖ్యలో ఉన్నాయన్న సంగతి ‘సాక్షి’కథనంతోనే తెలిసింది. వీటిల్లో మంచి రూపుతో ఉన్న బావులను త్వరలోనే గుర్తించి వాటిని అభివృద్ధిచేస్తాం’అని చెప్పారు. ఇటీవల వరంగల్ శివారులోని మెట్లబావిని పరిశీలించానని, దాన్ని గుజరాత్‌లోని రాణీ కీ వావ్ తరహాలో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే సురేఖ, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఎంపీ పసునూరి దయాకర్ చెరో రూ.10 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment