kayaking
-
కల్లోల కడలి మధ్యలో.. పాపం పసివాడు!
లైఫ్ ఆఫ్ పై సినిమా గుర్తుందా? ఓ బాలుడు పులితో పాటు చిన్న పడవపై సముద్రంలో చిక్కుకుపోతాడు. ప్రాణాలు కాపాడుకోవడానికి పెద్ద సాహసమే చేస్తాడు. పులి, పడవ లేవు గానీ హవాయి దీవుల్లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. 17 ఏళ్ల బాలుడు సముద్రంలో చిక్కుకుపోయాడు. చిన్న కయాక్ ఆసరాతో 12 గంటలపాటు ప్రాణాలు కాపాడుకున్నాడు. అతని పేరు కహియావ్. హైస్కూల్ కయాకింగ్ బృందంలో సభ్యుడు. హవాయి దీవుల్లోని వై బోట్ హార్బర్ నుంచి డైమండ్ హెడ్ దాకా మిత్రులతో కలిసి కయాకింగ్ చేశాడు. తిరుగు ప్రయాణంలో కనిపించకుండాపోయాడు. దాంతో సహచరులు అత్యవసర సిబ్బందికి ఫోన్ చేశారు. వెంటనే హోనోలులు అగ్నిమాపక శాఖ, అమెరికా కోస్ట్ గార్డ్ సహా 50 మందికి పైగా సిబ్బంది పడవలు, విమానాలతో గాలింపు చేపట్టారు.ఏం జరిగిందంటే... ఇంతకీ జరిగిందేమిటంటే కహియావ్ సముద్రంలో ప్రాక్టీస్ చేస్తూ ప్రమాదవశాత్తు సర్ఫ్ స్కీ నుంచి కింద పడ్డాడు. దాంతో అది కాస్తా మునిగిపోయింది. చూస్తే తనకు లైఫ్ జాకెట్ కూడా లేదు. అలలేమో ఈడ్చి కొడుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. మరోవైపేమో చీకటి పడుతోంది. కష్టమ్మీద ఈదుతూ ఎలాగోలా తన 20 అడుగుల సర్ఫ్ స్కీ కయాక్‌ను అందుకోగలిగాడు. అయితే ఎటు చూసినా సముద్రం. కటిక చీకటి. కాసేపు కయాక్ మీదే పడుకుంటూ, మరికాసేపు దాని ఆసరాతో నీళ్లలో ఈదుతూ గడిపాడు. సమయం గడుస్తున్న కొద్దీ అతనిలో ఆశలూ సన్నగిల్లుతూ వచ్చాయి. సరిగ్గా అప్పుడే దూరంగా పడవలు కనిపించాయి. కాపాడాలంటూ కేకలు వేసినా దురదృష్టవశాత్తూ వారికి వినిపించలేదు. దాంతో అవి దూరంగా వెళ్లి కనుమరుగయ్యాయి. ఒకానొక దశలో ఇక ఈదలేనని నిర్ధారించుకున్నాడు. ఏదేమైనా సరే ప్రశాంతంగా ఉండాలని, అలల వేగం తగ్గగానే వీలైనంతగా ఈదాలని నిర్ణయించుకున్నాడు. ఎవరో ఒకరు తనను కనిపెట్టేదాకా ప్రాణాలు కాపాడుకోవాలనుకున్నాడు. గుండె నిబ్బరంతో కొన్ని గంటలపాటు గడిపాడు. చదవండి: బండరాళ్ల తలకిందులుగా ఇరుక్కున్న మహిళ.. ఏం జరిగింది?ఇక తెల్లారుతుందనగా సముద్ర జలాలపై హెలికాప్టర్ల చప్పుడు విని కహియావ్కు ఒక్కసారిగా ప్రాణం లేచొచ్చింది. కయాక్ సాయంతో సముద్రంలో తేలియాడుతున్న బాలుడిని అమెరికా కోస్ట్ గార్డ్ విమాన సిబ్బంది ఎట్టకేలకు గుర్తించారు. అప్పటికే వెదుకులాటలో ఉన్న కోస్ట్‌గార్డు సిబ్బందికి సమాచారమివ్వడంతో వారొచ్చి కాపాడారు. అలా 8 గంటల ఆపరేషన్ చివరికి సుఖాంతమైంది. ఒంటికి గాయాలతో అతి చల్లని వాతావరణంలో గంటల కొద్దీ గడిపిన అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. శనివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.జీవితాంతం గుర్తుంచుకుంటా తన భయానక అనుభవాన్ని కహియావ్ మీడియాతో పంచుకున్నాడు. ‘‘నాకు ఏమవుతుందనే బాధ కంటే నా గురించి అమ్మ ఎంత ఆందోళన చెందుతుందోనని ఆవేదన చెందా. బయటపడతానని అనుకోలేదు. ఇదో గొప్ప అనుభవం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొగలననే ధైర్యాన్నిచ్చింది. కయాకింగ్ కొనసాగిస్తా. ఈ అనుభవాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటా’’ అని చెప్పుకొచ్చాడు. బాలునిది మామూలు ధైర్యం కాదని కోస్ట్ గార్డ్ సిబ్బంది అన్నారు. ‘‘అంతటి బలమైన గాలులు, కల్లోలంలో అత్యంత శిక్షణ పొందిన మాకే సముద్రంలో చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది చిన్న కయాక్ సాయంతో 17 ఏళ్ల బాలుడు అంత ధైర్యంగా గడపడం గొప్ప విషయం’’ అంటూ మెచ్చుకున్నారు. -
సాగర తీరంలో కయాకింగ్ క్వీన్
ఆ యువతి పడవ నడపగలదు.. ఒడుపుగా లంగరు సైతం వేయగలదు. తండ్రినే గురువుగా భావించి.. సాగర సంగమ తీరాన్నే శిక్షణ కేంద్రంగా ఎంచుకుని ‘కయాకింగ్ అండ్ కనోయింగ్’ క్రీడలో రాణిస్తోంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన ఆ యువతి ప్రపంచ ఒలింపిక్స్‌లో రాణించి భారత్ తరఫున పతకం అందుకోవాలని తహతహలాడుతోంది. నాగాయలంక (అవనిగడ్డ): కృష్ణా జిల్లా నాగాయలంక సాగర సంగమ తీరానికి చెందిన నాగిడి గాయత్రి గ్రామీణులకు పెద్దగా పరిచయం లేని ‘కయాకింగ్ అండ్ కనోయింగ్’ జలక్రీడలో రాణిస్తోంది. ఏడేళ్ల వయసులోనే తండ్రి వెంట నది బాటపట్టిన గాయత్రి చేపల వేట నేర్చుకుంది. జల క్రీడల్లో రాణించాలనే ఆ చిన్నారి తపనను గమనించి తండ్రి నాగబాబు కృష్ణా నదిలో ఈత నేర్పించారు. స్థానిక జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదివిన గాయత్రి కరాటేలో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. విజయనగరం జిల్లా గరివిడి వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా చేసింది. నాటు పడవతోనే నదిలో సాధన చేసి గత ఏడాది గుజరాత్లో జరిగిన 36వ జాతీయస్థాయి కయాకింగ్ అండ్ కెనోయింగ్ పోటీల్లో నాలుగో స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయిలో రజత పతకం 18 సంవత్సరాల నాగిడి గాయత్రి కరాటే, రోయింగ్, కయాకింగ్ అండ్ కనోయింగ్ పోటీల్లో పలు పతకాలు సాధించింది. 2017లో ఢిల్లీలో జరిగిన 33వ నేషనల్ తైక్వాండో పోటీల్లో కాంస్య పతకం పొందింది. 2021లో రాష్ట్రస్థాయి రోయింగ్ పోటీల్లో బంగారు పతకం కైవశం చేసుకుంది. గత ఏడాది అక్టోబర్‌లో గుజరాత్లో జరిగిన జాతీయస్థాయి వాటర్ స్పోర్ట్స్ పోటీల్లో నాలుగో స్ధానంలో నిలవగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 11న భోపాల్‌లో జరిగిన 5వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కయాకింగ్ అండ్ కెనోయింగ్ విభాగంలో జాతీయ స్థాయిలో రజత పతకం కైవశం చేసుకుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో గోవాలో జరిగే 37వ జాతీయస్థాయి వాటర్ స్పోర్ట్స్ పోటీలకు గాయత్రి అర్హత సాధించింది. దాతల సహాయం, మెరుగైన శిక్షణ అందిస్తే ప్రపంచ ఒలింపిక్ పోటీల్లో పతకం సాధిస్తానని గాయత్రి ధీమా వ్యక్తం చేస్తోంది. చేపల వేటలో సాయపడుతూ.. తండ్రి నాగిడి నాగబాబుకు చేపల వేటలో గాయత్రి సహాయపడుతోంది. తండ్రితో పాటు రాత్రివేళలో బోటుపై సాగర సంగమ ప్రాంతానికి వెళ్లి వల, గాలం ద్వారా చేపల వేట సాగిస్తోంది. పురుషులకు దీటుగా పడవ నడుపుతూ.. లంగరు కూడా వేస్తోంది. చేపల వేటలో తలపండిన మత్స్యకారులు చేయలేని పనులను సైతం గాయత్రి సునాయాసంగా చేస్తుంది. గాలానికి రొయ్య గుచ్చడంలో గాయత్రి దిట్ట. ఒడుపుగా గుచ్చకపోతే రొయ్య ముళ్ళు చేతిలో దిగి తీవ్రంగా బాధిస్తుంది. నాగాయలంకలో 40 చేపల వేట బోట్లు ఉండగా.. వీటిపై ముగ్గురు మాత్రమే గాలానికి ఒడుపుగా రొయ్య గుచ్చేవారు ఉంటే.. అందులో గాయత్రి ఒకరు కావడం విశేషం. నాగిడి నాగబాబు పెద్ద కుమార్తె గౌతమి స్మిమ్మింగ్‌లో, కుమారుడు రాజేష్ తైక్వాండోలో, నాగబాబు సోదరి లక్ష్మీకుమారి కుమారులు కన్నా కుమార్, ఈశ్వర్ తైక్వాండో, కయాకింగ్‌లో, నాగబాబు సోదరుడు సాంబశివరావు కుమార్తె భార్గవి రోయింగ్‌లో, కుమారుడు శ్యాం కయాకింగ్‌లో రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయిలో పలు పతకాలు అందుకోవడం విశేషం. ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధిస్తా మా కుటుంబానికి చేపల వేటే జీవనాధారం. మా నాన్న ఎంతో కష్టపడి శిక్షణ ఇప్పిస్తున్నారు. వాటర్ స్పోర్ట్స్ అకాడమీ సెక్రటరీ శివారెడ్డి ప్రోత్సాహం మరువలేనిది. కోచ్‌లు శ్రీనివాస్, నాగబాబు, చిన్నబాబు శిక్షణ నన్ను ఈ స్థాయికి తెచ్చాయి. ప్రపంచ ఒలింపిక్స్ వాటర్ స్పోర్ట్స్ క్రీడల్లో పాల్గొని బంగారు పతకం సాధించాలని ఉంది. దాతల ప్రోత్సాహం, మరింత మెరుగైన శిక్షణ అందిస్తే ఇంకా రాణిస్తాను. – నాగిడి గాయత్రి, కయాకింగ్ క్రీడాకారిణి -
అమెజాన్ బాస్‌పై గర్ల్‌ఫ్రెండ్ కామెంట్స్
ఎంత బిజీ పర్సన్ అయినా తన వ్యక్తిగత జీవితానికి కొంత సమయం కేటాయించి తీరాలి కదా! అందుకే అలుపెరగకుండా పని చేసే అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్(57) కూడా వీలుచిక్కినప్పుడల్లా తన ప్రేయసితో విహార యాత్రలకు చెక్కేస్తుంటాడు. ‘ఈ ప్రపంచంలో నాకు ఇష్టమైన ప్లేస్ ఏదో తెలుసా?.. నువ్వు నా పక్క ఉండడం. అది చాలు.’ అంటూ బెజోస్‌తో ఉన్న ఫొటోల్ని ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది బెజోస్ ప్రేయసి లారెన్ సాన్షెజ్. పెంపుడు కుక్కతో ఇద్దరూ సరదాగా కయాకింగ్ చేస్తున్న ఫొటోల్ని షేర్ చేసిందామె. View this post on Instagram A post shared by Lauren Sanchez (@laurenwsanchez) భార్య(మాజీ) మెక్కెంజీ స్కాట్‌తో విడాకుల అనంతరం.. అమెరికా టాప్ న్యూస్ యాంకర్ అయిన లారెన్ సాన్షెజ్(51) ప్రేమాయణం నడిపిస్తున్నాడు బెజోస్. విశేషం ఏంటంటే.. ఆమెకి కూడా ఇది రెండో రిలేషన్షిప్. ఇక మెక్సికన్-అమెరికన్ అయిన లారెన్ 2019 నుంచి బెజోస్‌తో రిలేషన్లో ఉంది. జర్నలిజంలో ఎమ్మీ అవార్డు సైతం అందుకున్న లారెన్.. హెలికాప్టర్ పైలెట్ కూడా. ఆమె సంపద విలువ 30 మిలియన్ డాలర్లు. సీటెల్‌లో పక్కపక్కనే ఇల్లు ఉండడం ద్వారా వీళ్లిద్దరికీ పరిచయం మొదలైంది . కిందటి ఏడాది జనవరిలో బెజోస్ భారత పర్యటన సందర్భంగా ఇద్దరూ కలిసి తాజ్ మహల్ దగ్గర ఫొటోలు సైతం తీయించుకున్నారు. చదవండి: తన ప్రేయసితో హీరో డికాప్రియో కబుర్లు.. జెలసీగా బెజోస్ -
మేం బతుకుతామనుకోలేదు..!
అలస్కా: హిమానీ నదుల్లో బోటింగ్ చేస్తే భలే మజాగా ఉంటుంది కదా! మరి ఆ సమయంలో అక్కడే ఉన్న మంచు శిఖరాలు కుప్పకూలిపోయి భయానక వాతావరణం సృష్టిస్తే.. ఏమైనా ఉంటుందా? ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. సరిగ్గా ఇదే సంఘటనను ప్రత్యక్షంగా చూశారు ఇద్దరు వ్యక్తులు. అమెరికాలోని అలస్కాలో యూట్యూబ్ ఛానల్‌ను నడిపే ఇద్దరు వ్యక్తులు శనివారం స్పెన్సర్ హిమానీ నది సమీపంలో సాహసయాత్రకు దిగారు. అయితే అక్కడి మంచు కొండలు ఒక్కసారిగా కుప్పకూలడంతో నదిలో ప్రకంపనలు మొదలయ్యాయి. దీంతో వారు ప్రయాణిస్తున్న పడవ అతలాకుతలమైంది. అయినప్పటికీ మంచు విస్ఫోటన దృశ్యాల్ని కెమెరాలో బంధిస్తూ దానికి చేరువగా వెళ్లాలని చూశారు. కానీ ప్రకృతి ప్రతాపం చూపించడంతో వారు వెనుదిరగక తప్పలేదు. ఈ వీడియోను వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మేం ఇంకా బతికే ఉండటం మా అదృష్టమంటూ ఆ వీడియోలో పేర్కొన్నారు. ఈ సాహస యాత్రలో ఎలాంటి గాయాలు తగలకుండా బయటపడ్డామని వారి అనుభూతిని పంచుకున్నారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘చావు తప్పి కన్ను లొట్టపోయింది’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. -
డల్లాస్‌లో జరిగిన ప్రమాదంలో భారత విద్యార్థి మృతి
డల్లాస్: ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన ఓ భారత విద్యార్థి అక్కడ ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. కేరళకు చెందిన 23 ఏళ్ల లింటో ఫిలిప్ నాలుగు నెలల కిందట మాస్టర్స్ కోసం డల్లాస్ వెళ్లాడు. ప్రస్తుతం అతని తల్లిదండ్రులు సుసాన్ ఫిలిప్, పీఎం ఫిలిప్ దుబాయ్‌లో నివాసం ఉంటున్నారు. డల్లాస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో మాస్టర్స్ చేస్తున్న లింటో శనివారం మధ్యాహ్నం తన స్నేహితులతో కలిసి సాహసోపేతమైన కయాకింగ్ ట్రిప్‌కు వెళ్లాడు. కయాకింగ్ అనేది నీటిలో ఒక చిన్న పడవపై చేసే ప్రయాణం. లేక్ రే హుబ్బార్డ్‌లో లింటో కయాకింగ్ చేస్తుండగా.. జలల ప్రవాహం అధికంగా ఉండటంతో అతని కయాక్ తిరగబడిందని డల్లాస్ పోలీసులు తెలిపారు. దీంతో లింటో నీళ్లలో కొట్టుకుపోయాడని వెల్లడించారు. గల్లంతయిన అతడి మృతదేహాన్ని గుర్తించిన రెస్యూ సిబ్బంది పోస్టు మార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. -
అలలపై విన్యాసం
జలకళ ఉట్టి పడే సరస్సును చూస్తే ఎవరికైనా ఎంతో ఉత్సాహం. అందులో బోటింగ్ చేస్తే మరెంతో ఉల్లాసం. పిల్లలైతే కేరింతలు కొట్టకుండా ఉండలేరు. అలాంటివారి కోసమే హైదరాబాద్‌లో ఓ సెయిలింగ్ క్లబ్ ఉంది. హుస్సేన్‌సాగర్ సెయిలింగ్‌కు అనువైన సరస్సు. మూడు బోట్స్‌తో గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు శిక్షణ ఇవ్వటం మొదలుపెట్టింది యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్. నగరం నడిబొడ్డులో సెయిలింగ్, కయాకింగ్ లాంటిచక్కటి క్రీడలు నేర్చుకునే అవకాశముంది. ఆసక్తి ఉన్న పిల్లలను ప్రోత్సహించడమే లక్ష్యంగా 2009లో సుహీం షేక్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ క్లబ్లో ఇప్పటికే 300 మందికిపైగా పిల్లలు సెయిలింగ్‌లో శిక్షణ పొందారు. అందులో 20 మంది క్లబ్ సెలెక్ట్ జాబితాలో ఉన్నారు. జాతీయస్థాయి టాప్‌టెన్‌లో ఈ క్లబ్‌వారు ఇద్దరున్నారు. హైదరాబాద్ యాచ్ క్లబ్ దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ యాచ్ క్లబ్. - ఓ మధు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, పేద పిల్లలతో పాటు ఢిల్లీ పబ్లిక్ స్కూల్, సిల్వర్ ఓక్స్, శ్రీనిధిలాంటి ప్రముఖ పాఠశాలల పిల్లలు కూడా ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. కొన్ని కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యంతో ఈ క్లబ్ ఎన్నో చారిటీ పనులు చేస్తోంది. ఎల్ఎస్ఎన్, నాందీ ఫౌండేషన్ల పిల్లలు శిక్షణ తీసుకుంటున్నారు. పేద విద్యార్థుల చదువు, అవసరాలకు కూడా సహాయం అందిస్తుంటారు. పోషకాహారం పంపిణీ చేస్తుంటారు. స్కూలుకు వెళ్లడానికి సైకిళ్లను సమకూరుస్తుంటారు. రేసింగ్, రేసింగ్ టెక్నిక్స్ కూడా శిక్షణలో భాగమే. ఈవెంట్స్... * కయాకింగ్, మాన్సూన్ రిగెటా నిర్వహిస్తుంటాం.ముంబైలో వింటర్ రిగెటా చేస్తున్నాం. * జాతీయ పోటీల్లో ఇక్కడ శిక్షణ తీసుకున్న పిల్లలు పాల్గొన్నారు. * పతి ఏడాది మాన్సూన్ రెగెటా నిర్వహిస్తారు. దేశ వ్యాప్తంగా 50 మందికిపైగా క్రీడాకారులు ఈ ఈవెంట్లో పాల్గొంటారు. * తెలంగాణ టూరిజంతో కలసి కయాకింగ్ ఈవెంట్ నిర్వహించారు. ఇది ప్రతి ఏడాది నిర్వహించనున్నారు. సిటీ కోసం ఏదైనా చేయాలని.. ‘జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. 35 ఏళ్లుగా సెయిలింగ్ చేస్తున్నాను. రజత పతకం పొందాను. నేను సాఫ్టేవేర్ రంగంలో వున్నాను. నా సిటీ కోసం ఏదైనా చేయాలని అనుకున్నాను. గవర్నమెంటు స్కూల్ పిల్లలకు సెయిలింగ్‌లో ట్రెయినింగ్ మొదలు పెడదామనుకున్నాను. నగరంలో కొన్నిచోట్ల సెయిలింగ్ చేయటానికి అవకాశమున్నా, అందరికీ అనుమతి లేదు. అందుకే ఈ క్లబ్‌ని మూడు బోట్స్‌తో మొదలుపెట్టాం. ఈ రోజు 35 బోట్స్ ఉన్నాయి. హుస్సేన్‌సాగర్ క్లీన్ లేక్‌గా మారితేసెయిలింగ్కి బెస్ట్ ప్లేస్ అవుతుందనటంలో డౌట్ లేదు. దుర్గం చెరువులో కూడా సెయిలింగ్ శిక్షణకు ఏర్పాట్లు చేయాలనుకున్నా ప్రస్తుతం ఆ చెరువు అనుకూలంగా లేదు. క్లబ్లో 100 మంది పిల్లలు సెయిలింగ్ చేస్తుంటే చూడాలన్నది నా కోరిక’ అంటారు సుహీం షేక్. క్లబ్ వివరాలకు -Yacht Club of Hyderabadఫేస్ బుక్ పేజ్ని చూడండి. మా అబ్బాయి సిల్వర్ మెడలిస్ట్ మా బాబు రిషభ్ చెన్నై వెళ్లినప్పుడు ఈ సెయిలింగ్ గేమ్ చూశాడు. హైదరాబాద్ వచ్చాక ఇంటర్నెట్లో చూసి ఈ క్లబ్ గురించి తెలుసుకున్నాడు. నేల మీద ఆడే స్పోర్ట్స్‌కి, నీళ్ల మీద ఆడే ఆటలకి చాలా తేడా ఉంటుంది. అందరూ వీటిని చేయలేరు. ఈ విషయం ఇక్కడి సీనియర్ ట్రెయినర్ మనకు అర్థం అయ్యేలా చెప్తారు. మా అబ్బాయి ట్రెయినింగ్ తీసుకొని చాలా జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. ఈ మధ్య జరిగిన మాన్సూన్ జాతీయ పోటీల్లో సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు. - షిరాణి నాయర్ సెయిలింగ్‌తో ఉల్లాసం మా పిల్లలు జూహీ, తనిష్క్ అన్ని రకాల క్రీడలు నేర్చుకోవడానికి ప్రయత్నించారు. కానీ వాళ్లకు అన్నిటికంటే ఎక్కువ ఉల్లాసాన్ని, ఆసక్తిని కలిగించిన క్రీడ సెయిలింగ్. ట్రైనింగ్‌లో ప్రమాదాలకు తావు లేకుండా యాచ్ క్లబ్ హైదరాబాద్ వారు చాలా జాగ్రత్తలు తీసుకుని శిక్షణ ఇస్తున్నారు. అందుకే పిల్లలను ధైర్యంగా పంపగలుగుతున్నాం. ఇక ఇక్కడ అండర్ ప్రివిలేజ్డ్ పిల్లల కోసం ఈ క్లబ్ చేసే చారిటీ ఈవెంట్స్ మా లైఫ్‌లో కూడా భాగమయ్యాయి. - జీనా దేశాయ్, పేరెంట్