కయాక్ సాయంతో ప్రాణాలు కాపాడుకున్న టీనేజర్
హవాయి దీవుల్లో ఘటన
లైఫ్ ఆఫ్ పై సినిమా గుర్తుందా? ఓ బాలుడు పులితో పాటు చిన్న పడవపై సముద్రంలో చిక్కుకుపోతాడు. ప్రాణాలు కాపాడుకోవడానికి పెద్ద సాహసమే చేస్తాడు. పులి, పడవ లేవు గానీ హవాయి దీవుల్లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. 17 ఏళ్ల బాలుడు సముద్రంలో చిక్కుకుపోయాడు. చిన్న కయాక్ ఆసరాతో 12 గంటలపాటు ప్రాణాలు కాపాడుకున్నాడు. అతని పేరు కహియావ్. హైస్కూల్ కయాకింగ్ బృందంలో సభ్యుడు. హవాయి దీవుల్లోని వై బోట్ హార్బర్ నుంచి డైమండ్ హెడ్ దాకా మిత్రులతో కలిసి కయాకింగ్ చేశాడు. తిరుగు ప్రయాణంలో కనిపించకుండాపోయాడు. దాంతో సహచరులు అత్యవసర సిబ్బందికి ఫోన్ చేశారు. వెంటనే హోనోలులు అగ్నిమాపక శాఖ, అమెరికా కోస్ట్ గార్డ్ సహా 50 మందికి పైగా సిబ్బంది పడవలు, విమానాలతో గాలింపు చేపట్టారు.
ఏం జరిగిందంటే...
ఇంతకీ జరిగిందేమిటంటే కహియావ్ సముద్రంలో ప్రాక్టీస్ చేస్తూ ప్రమాదవశాత్తు సర్ఫ్ స్కీ నుంచి కింద పడ్డాడు. దాంతో అది కాస్తా మునిగిపోయింది. చూస్తే తనకు లైఫ్ జాకెట్ కూడా లేదు. అలలేమో ఈడ్చి కొడుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. మరోవైపేమో చీకటి పడుతోంది. కష్టమ్మీద ఈదుతూ ఎలాగోలా తన 20 అడుగుల సర్ఫ్ స్కీ కయాక్‌ను అందుకోగలిగాడు. అయితే ఎటు చూసినా సముద్రం. కటిక చీకటి. కాసేపు కయాక్ మీదే పడుకుంటూ, మరికాసేపు దాని ఆసరాతో నీళ్లలో ఈదుతూ గడిపాడు.
సమయం గడుస్తున్న కొద్దీ అతనిలో ఆశలూ సన్నగిల్లుతూ వచ్చాయి. సరిగ్గా అప్పుడే దూరంగా పడవలు కనిపించాయి. కాపాడాలంటూ కేకలు వేసినా దురదృష్టవశాత్తూ వారికి వినిపించలేదు. దాంతో అవి దూరంగా వెళ్లి కనుమరుగయ్యాయి. ఒకానొక దశలో ఇక ఈదలేనని నిర్ధారించుకున్నాడు. ఏదేమైనా సరే ప్రశాంతంగా ఉండాలని, అలల వేగం తగ్గగానే వీలైనంతగా ఈదాలని నిర్ణయించుకున్నాడు. ఎవరో ఒకరు తనను కనిపెట్టేదాకా ప్రాణాలు కాపాడుకోవాలనుకున్నాడు. గుండె నిబ్బరంతో కొన్ని గంటలపాటు గడిపాడు.
చదవండి: బండరాళ్ల తలకిందులుగా ఇరుక్కున్న మహిళ.. ఏం జరిగింది?
ఇక తెల్లారుతుందనగా సముద్ర జలాలపై హెలికాప్టర్ల చప్పుడు విని కహియావ్‌కు ఒక్కసారిగా ప్రాణం లేచొచ్చింది. కయాక్ సాయంతో సముద్రంలో తేలియాడుతున్న బాలుడిని అమెరికా కోస్ట్ గార్డ్ విమాన సిబ్బంది ఎట్టకేలకు గుర్తించారు. అప్పటికే వెదుకులాటలో ఉన్న కోస్ట్‌గార్డు సిబ్బందికి సమాచారమివ్వడంతో వారొచ్చి కాపాడారు. అలా 8 గంటల ఆపరేషన్ చివరికి సుఖాంతమైంది. ఒంటికి గాయాలతో అతి చల్లని వాతావరణంలో గంటల కొద్దీ గడిపిన అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. శనివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.
జీవితాంతం గుర్తుంచుకుంటా
తన భయానక అనుభవాన్ని కహియావ్ మీడియాతో పంచుకున్నాడు. ‘‘నాకు ఏమవుతుందనే బాధ కంటే నా గురించి అమ్మ ఎంత ఆందోళన చెందుతుందోనని ఆవేదన చెందా. బయటపడతానని అనుకోలేదు. ఇదో గొప్ప అనుభవం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొగలననే ధైర్యాన్నిచ్చింది. కయాకింగ్ కొనసాగిస్తా. ఈ అనుభవాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటా’’ అని చెప్పుకొచ్చాడు. బాలునిది మామూలు ధైర్యం కాదని కోస్ట్ గార్డ్ సిబ్బంది అన్నారు. ‘‘అంతటి బలమైన గాలులు, కల్లోలంలో అత్యంత శిక్షణ పొందిన మాకే సముద్రంలో చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది చిన్న కయాక్ సాయంతో 17 ఏళ్ల బాలుడు అంత ధైర్యంగా గడపడం గొప్ప విషయం’’ అంటూ మెచ్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment