Life of Pi
-
కల్లోల కడలి మధ్యలో.. పాపం పసివాడు!
లైఫ్ ఆఫ్ పై సినిమా గుర్తుందా? ఓ బాలుడు పులితో పాటు చిన్న పడవపై సముద్రంలో చిక్కుకుపోతాడు. ప్రాణాలు కాపాడుకోవడానికి పెద్ద సాహసమే చేస్తాడు. పులి, పడవ లేవు గానీ హవాయి దీవుల్లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. 17 ఏళ్ల బాలుడు సముద్రంలో చిక్కుకుపోయాడు. చిన్న కయాక్ ఆసరాతో 12 గంటలపాటు ప్రాణాలు కాపాడుకున్నాడు. అతని పేరు కహియావ్. హైస్కూల్ కయాకింగ్ బృందంలో సభ్యుడు. హవాయి దీవుల్లోని వై బోట్ హార్బర్ నుంచి డైమండ్ హెడ్ దాకా మిత్రులతో కలిసి కయాకింగ్ చేశాడు. తిరుగు ప్రయాణంలో కనిపించకుండాపోయాడు. దాంతో సహచరులు అత్యవసర సిబ్బందికి ఫోన్ చేశారు. వెంటనే హోనోలులు అగ్నిమాపక శాఖ, అమెరికా కోస్ట్ గార్డ్ సహా 50 మందికి పైగా సిబ్బంది పడవలు, విమానాలతో గాలింపు చేపట్టారు.ఏం జరిగిందంటే... ఇంతకీ జరిగిందేమిటంటే కహియావ్ సముద్రంలో ప్రాక్టీస్ చేస్తూ ప్రమాదవశాత్తు సర్ఫ్ స్కీ నుంచి కింద పడ్డాడు. దాంతో అది కాస్తా మునిగిపోయింది. చూస్తే తనకు లైఫ్ జాకెట్ కూడా లేదు. అలలేమో ఈడ్చి కొడుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. మరోవైపేమో చీకటి పడుతోంది. కష్టమ్మీద ఈదుతూ ఎలాగోలా తన 20 అడుగుల సర్ఫ్ స్కీ కయాక్‌ను అందుకోగలిగాడు. అయితే ఎటు చూసినా సముద్రం. కటిక చీకటి. కాసేపు కయాక్ మీదే పడుకుంటూ, మరికాసేపు దాని ఆసరాతో నీళ్లలో ఈదుతూ గడిపాడు. సమయం గడుస్తున్న కొద్దీ అతనిలో ఆశలూ సన్నగిల్లుతూ వచ్చాయి. సరిగ్గా అప్పుడే దూరంగా పడవలు కనిపించాయి. కాపాడాలంటూ కేకలు వేసినా దురదృష్టవశాత్తూ వారికి వినిపించలేదు. దాంతో అవి దూరంగా వెళ్లి కనుమరుగయ్యాయి. ఒకానొక దశలో ఇక ఈదలేనని నిర్ధారించుకున్నాడు. ఏదేమైనా సరే ప్రశాంతంగా ఉండాలని, అలల వేగం తగ్గగానే వీలైనంతగా ఈదాలని నిర్ణయించుకున్నాడు. ఎవరో ఒకరు తనను కనిపెట్టేదాకా ప్రాణాలు కాపాడుకోవాలనుకున్నాడు. గుండె నిబ్బరంతో కొన్ని గంటలపాటు గడిపాడు. చదవండి: బండరాళ్ల తలకిందులుగా ఇరుక్కున్న మహిళ.. ఏం జరిగింది?ఇక తెల్లారుతుందనగా సముద్ర జలాలపై హెలికాప్టర్ల చప్పుడు విని కహియావ్కు ఒక్కసారిగా ప్రాణం లేచొచ్చింది. కయాక్ సాయంతో సముద్రంలో తేలియాడుతున్న బాలుడిని అమెరికా కోస్ట్ గార్డ్ విమాన సిబ్బంది ఎట్టకేలకు గుర్తించారు. అప్పటికే వెదుకులాటలో ఉన్న కోస్ట్‌గార్డు సిబ్బందికి సమాచారమివ్వడంతో వారొచ్చి కాపాడారు. అలా 8 గంటల ఆపరేషన్ చివరికి సుఖాంతమైంది. ఒంటికి గాయాలతో అతి చల్లని వాతావరణంలో గంటల కొద్దీ గడిపిన అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. శనివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.జీవితాంతం గుర్తుంచుకుంటా తన భయానక అనుభవాన్ని కహియావ్ మీడియాతో పంచుకున్నాడు. ‘‘నాకు ఏమవుతుందనే బాధ కంటే నా గురించి అమ్మ ఎంత ఆందోళన చెందుతుందోనని ఆవేదన చెందా. బయటపడతానని అనుకోలేదు. ఇదో గొప్ప అనుభవం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొగలననే ధైర్యాన్నిచ్చింది. కయాకింగ్ కొనసాగిస్తా. ఈ అనుభవాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటా’’ అని చెప్పుకొచ్చాడు. బాలునిది మామూలు ధైర్యం కాదని కోస్ట్ గార్డ్ సిబ్బంది అన్నారు. ‘‘అంతటి బలమైన గాలులు, కల్లోలంలో అత్యంత శిక్షణ పొందిన మాకే సముద్రంలో చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది చిన్న కయాక్ సాయంతో 17 ఏళ్ల బాలుడు అంత ధైర్యంగా గడపడం గొప్ప విషయం’’ అంటూ మెచ్చుకున్నారు. -
మూవీని మించిన బ్రతుకు పోరాటం.. నడి సంద్రాన ప్రాణాల కోసం ఆరాటం
మనిషి జీవితంలో కొన్ని ఘటనలు జీవించి ఉన్నంత కాలం గుర్తుండిపోతాయి. ప్రకృతి విపత్తు, మానవ తప్పిందం కారణంగానో జీవితంలో ఊహించిన పరిణామాలను చవిచూడాల్సి వస్తుంది. అలాంటి ఘటనల వల్ల చివరకు ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అప్పటో వచ్చిన ‘లైఫ్ ఆఫ్ పై’ సినిమా గుర్తుండే ఉంటుంది. కరెక్ట్‌గా అలాంటి ఘటనే ఒకటి ఓ వ్యక్తి జీవితంలో ఎదురైంది. నడి సంద్రంలో ప్రాణాల కోసం పోరాడి.. చివరకు 11 రోజుల తర్వాత బతుకు జీవుడా.. అన్న చందంగా ఒడ్డుకు చేరుకున్నాడు. బ్రెజిల్‌కు చెందిన రోములాడో మసిడో రోడ్రోగస్ అనే వ్యక్తి.. చేపల వేట కోసం ఏకంగా అట్లాంటిక్ సముద్రంలోకి వెళ్లాడు. వేటలో భాగంగా తన గాలానికి చేపలు చిక్కుతుడటంతో ఆనందపడ్డాడు. అప్పటి వరకు బాగానే ఉన్న తన జర్నీలో ఊహించని ఉపద్రవం వచ్చి పడింది. కొద్దిసేపటికే అతడి పడవ మునిగిపోవడం మొదలుపెట్టింది. దీంతో, తన ప్రాణం ఎక్కడ పోతుందో.. బ్రతుకుతానో లేదో అని భయపడ్డాడు. అయితే, ఆరోజు అతడికి అదృష్టం కలిసివచ్చింది. పడవ మునిగిపోయిన తర్వాత.. లక్కీగా తన పడవలోని ఫ్రీజర్ సముద్రంపై తేలడం చూశాడు. దీంతో వెంటనే దానిపైకి దూకేశాడు. ఈ క్రమంలో ఫీజర్ ఒకవైపునకు ఒరిగిపోయినా.. నీటిలో మాత్రం తేలుతూనే ఉంది. అప్పటికైతే ఫ్రీజర్ సాయంతో ప్రాణాలు దక్కించుకున్నా తాగేందుకు నీళ్లు, తినేందుకు ఆహారం లేకపోవడంతో నీరసించిపోయాడు. ఇలా దాదాపు 11 రోజులపాటు ఫ్రీజర్‌లోనే తలదాచుకున్నాడు. ఈ క్రమంలో తన చుట్టూ షార్క్‌లు, తిమింగళాలు తిరిగినా భయపడకుండా ప్రాణాలను అరచేతిలో పట్టుకుని కాలం వెళ్లదీశాడు. సరిగ్గా అదే సమయంలో అతడిలాగే సముద్రంలోకి బోటులో కొందరు వ్యక్తులు చేపల వేటకు వచ్చారు. ఈ సందర్భంగా నీటిపై తేలియాడుతున్న ఫ్రీజర్‌ను చూసి అటుగా బోటును అటుగా తిప్పారు. వారి ఊహించిన రీతిలో రోడ్రిగో కనిపించడంతో అతడిని తమ బోటులోకి ఎక్కించుకుని ప్రాణాలను కాపాడారు. అనంతరం అతడిని సురినామ్ అనే దక్షిణ అమెరికా దేశం తీరంలో అతడిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. దీంతో 11 రోజుల జీవితంలో విధితో పోరాడి ప్రాణాలతో బయటపడ్డాడు. 🇧🇷 Un pescador brasileño pasó 11 días en el mar sin comida ni agua, pero sobrevivió flotando dentro de un congelador. Romualdo Macedo Rodrigues, de 44 años, partió del norte de Brasil en un bote de madera a fines de julio. ⬇️⬇️ pic.twitter.com/rw8MSsCV5s — Tribuna Digital7 (@TribunaLibreES) September 4, 2022 -
Viral: ఏరా పులి.. వాడి కంటే వరస్ట్‌గా ఉన్నావ్!
Tiger Viral Video: లైఫ్ ఆఫ్ పై సినిమా గుర్తుందా? ఓ పులితో పాటు యువకుడు పడవలో సాగించే ప్రయాణమే ఈ చిత్ర కథ. ఆ సినిమా క్లైమాక్స్‌లో ప్రధాన పాత్రదారి దేవ్‌పటేల్‌తో పాటు పడవలో ప్రయాణించిన పెద్దపులి.. చివరికి అతన్ని వీడి వెళ్లే దృశ్యం భావోద్వేగమైన ముగింపు కథకు ఇస్తుంది. అలాంటి అనుభూతి పంచే దృశ్యం ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. వీడెవడో రిచర్డ్ పార్కర్(లైఫ్ ఆఫ్ పైలో పులి పాత్ర పేరు) కన్నా వరెస్ట్‌గా ఉన్నాడంటూ సోషల్ మీడియాలో ఫన్ జనరేట్ అవుతోంది. ఓ రాయల్ బెంగాల్ టైగర్‌ను కాపాడిన అధికారులు.. దానిని సుందర్బన్స్(సుందరవనాలలో)లో విడిచిపెట్టారు. బోట్లో నుంచి బోన్ ద్వారా దానిని విడిచిపెట్టగా.. అమాంతం ఒక్క దూటున నీళ్లలో దూకేసి ఈదుకుంటూ వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్లిపోయింది. That tiger sized jump though. Old video of rescue & release of tiger from Sundarbans. pic.twitter.com/u6ls2NW7H3 — Parveen Kaswan, IFS (@ParveenKaswan) April 17, 2022 ఇది లైఫ్ ఆఫ్ పై క్లైమాక్స్‌తో పోలుస్తూ పలువురు సరదా కామెంట్లు చేస్తున్నారు. పులి రెస్క్యూ వీడియో పాతదే అయినప్పటికీ.. సోషల్ మీడియాలో ఎక్కువగా వీడియోలు షేర్ చేసే ప్రవీణ్‌కుమార్ కాస్వాన్ ఐఎఫ్ఎస్ తాజాగా ఈ వీడియోను పోస్ట్ చేశాడు. దీంతో ఇలా సరదా సంభాషణ సాగుతోంది. కానీ, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. పులి అలా నీళ్లలో దూకినప్పుడు.. ఈదుకుంటూ వెళ్లినప్పుడు మాత్రం దాని రాజసం మాత్రం వేరే లెవల్లో ఉంది!. -
సముద్రంలో ఒంటరిగా 76 రోజులు!
అమెరికాకు చెందిన స్టీవెన్ కల్హాన్ రచయిత, ఫిలాసఫర్, జర్నలిస్ట్, పరిశోధకుడు. నేవల్ ఆర్కిటెక్చర్ చదివిన కల్హాన్ పడవల తయారీలో నిపుణుడు. 1986లో స్పెయిన్‌లో తీరంలో జరిగిన పడవల పోటీల్లో పాల్గొనేందుకు బయల్దేరాడు. అక్కడ పోటీలు జరుగుతుండగా తుపానులో చిక్కుకొని బోటు దెబ్బతిని ఆఫ్రికాలోని మొరాకోకు దగ్గరలో ఉన్న ఓ దీవికి చేరుకున్నాడు. అక్కడ బోటును రిపేరు చేసుకొని తిరిగి అమెరికాకు పయనమయ్యాడు. అప్పటికే బోటులో ఆహారం అయిపోవడంతో చేపలు, పక్షుల్ని పట్టుకొని తింటూ, వర్షాలు పడినపుడు బోటులోని ఓ డబ్బాలో నీళ్లు నిల్వచేసుకుని తాగుతూ 76 రోజుల ఒంటరి ప్రయాణం తర్వాత ఎట్టకేలకు వెస్టిండీస్‌లోని ఓ దీవికి చేరుకున్నాడు. అక్కడ కొందరు స్థానిక జాలర్లు ఈయన్ని రక్షించడంతో తిరిగి అమెరికా చేరుకున్నాడు. సముద్రంలో తాను ఎదుర్కొన్న భయానక పరిస్థితుల గురించి ఆ తర్వాత ఆయన రాసిన అడ్రిఫ్ట్ నవలకు ఎంతో పేరొచ్చింది. అలాగే 2012లో వచ్చిన లైఫ్ ఆఫ్ పై సినిమాలో కొన్ని సంఘటనలకూ స్టీవెన్ అనుభవమే ప్రేరణ. ఆ సినిమాకు ఆయన సహాయకుడిగానూ వ్యవహరించాడు. -
'లైఫ్ ఆఫ్ పై' పులికి ఎంత కష్టం..!?
'లైఫ్ ఆఫ్ పై' సినిమా గుర్తుంది కదా! బతకాలనే ఆశతోపాటు సర్వం కోల్పోయినా.. జీవితం నిర్దేశిత గమ్యానికే చేరుతుందనే సందేశానికి అద్భుతమైన విజువల్స్ జోడించి రూపొందించిన ఆ సినిమాలో హీరో 'పై పటేల్' తోపాటు 'రిచర్డ్ పార్కర్' గా నటించిన పులి కూడా అందర్నీ మెప్పించింది. ఇప్పుడా పులికి పెద్ద కష్టమొచ్చిపడింది. నిజం చెప్పాలంటే ఇప్పుడేకాదు.. ఎప్పట్నుంచో అది అనుభవిస్తున్న హింస వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం కెనడాలోని ఒంటారియోలో గల ఓ జూలో నివరిస్తున్న పులిని.. దాని సంరక్షకుడే హింసించిన వీడియోను ప్రఖ్యాత జంతుసంరక్షణ సంస్థ పెటా వెలుగులోకి తెచ్చింది. సొంతగా జూపార్క్‌ను నడిపే మిచెల్ హాకెన్ బర్గర్ అనే పెద్దమనిషే అక్కడి జంతువులకు ట్రైనింగ్ ఇస్తూఉంటాడు. 'లైఫ్ ఆఫ్ పై'లో నటించేందుకు యునో(పులి పేరు)కు శిక్షణ ఇచ్చింది కూడా ఆయనే. జంతుశిక్షకుడిగా మిచెల్ కు ఎంత పేరుందో అంతకంటే ఎక్కువే ఆరోపణలున్నాయి. ఆయన జంతువులను హింసిస్తాడని పెటా మెదటినుంచి వాదిస్తూనేఉంది. తాజాగా రహస్యంగా చిత్రీకరించిన ఓ వీడియోలో ఆ ఆరోపణలు నిజమేనని తేలింది. కొరడాతో పులిని పదేపదే కొడుతూ, పచ్చిబూతులు తిట్టినవైనమంతా వీడియోలో రికార్డయింది. 'పులి నొటిపై, కాళ్లమీదా కొడితే నాకు ఆనందం కలుగుతుంది' అని మిచెల్ మాటలు వీడియోలో స్పష్టంగా వినిపించాయని, వీటి ఆధారంగా ఆయనపై కేసు పెట్టనున్నట్లు పెటా సంస్థ డిప్యూటీ డైరెక్టర్ బ్రిట్టానీ పీట్ మీడియాకు చెప్పారు. -
ఫైర్ ఉన్న దర్శకురాలు
సహజంగానే దీపా మెహతా అనగానే గుర్తొచ్చేది ‘ఫైర్’. ప్రధానస్రవంతి దృష్టిలో ఇద్దరు స్త్రీల ‘అనామోదనీయ’ సంబంధాన్ని చూపిన చిత్రమది; లేదా భర్తల మాటున ఇద్దరు మామూలు గృహిణులు తమకుతాము వెతుక్కున్న స్వీయ సాంత్వనని చూపిన చిత్రం కూడా! అయితే, దీపామెహతా ఆ ఇద్దరు మహిళల్ని మాత్రమే బాధితులుగా చూడరు, వాళ్ల భర్తల్ని కూడా పితృస్వామ్య వ్యవస్థలో కచ్చితంగా కట్టుబడి ఉండాల్సిన విలువలకు బందీలుగా పరిగణిస్తారు. విషయం తెలిసినా వాళ్లు భార్యల్ని వదులుకోలేరుగా. అదీ దీపా మెహతా! దీపా పంజాబ్‌లో పుట్టి, కెనడాలో స్థిరపడ్డారు. దీనివల్ల ఆమెను ‘బయటి దర్శకురాలిగా’ విమర్శించేవారున్నారు. కాని భారతదేశ ‘లోపటి’ని ముసుగుల్లేకుండా చూపడానికి ఆమె ప్రయత్నిస్తున్నారు. దేశవిభజన సబ్జెక్టు మీద ఈ లోపటి దర్శకులు ఎందరు, ఎన్ని సినిమాలు తీయడానికి ప్రయత్నించారు? ఆ సున్నితమైన సంక్లిష్టమైన అంశాన్ని దీపా ‘ఎర్త్’లో ఆవిష్కరించారు. ‘కనీసం కోటిమంది జనం- ముస్లింలు, హిందువులు, సిక్కులు- వాళ్ల వాళ్ల ఇండ్లనుంచి తరిమివేయబడ్డారు. ఎక్కువ నష్టం జరిగింది పంజాబ్‌లో. వారాల్లో పదుల వేల మంది ఊచకోత జరిగింది. మా నాన్న, వాళ్ల సోదరులు లాహోర్‌లో చాలా కష్టాలుపడ్డారు. వాళ్లు ఇళ్లు వదలాల్సివచ్చింది. మా నాన్న తన ముస్లిం స్నేహితులని మళ్లీ జీవితకాలంలో చూడలేదు. ప్రతి కుటుంబానికి ఇలాంటి పంచుకోదగిన విషాదగాథ ఏదో ఉంది. 1947 అనగానే వాళ్లకు భారత స్వాతంత్య్రం గుర్తురాదు, దేశ విభజన గుర్తొస్తుంది’ అని చిత్రానికి నేపథ్యం చెబుతారామె. ఫిల్మ్ పంపిణీదారు కూతురిగా దీపాకు చిన్నప్పటినుంచీ సినిమారంగం మీద ఆసక్తివుంది. అయితే, అది కేవలం కూడికలు, తీసివేతలకు పరిమితమైందికాదు. ‘శుక్రవారం విడుదల, సోమవారం బాక్సాఫీస్ వసూళ్లు’ ఆమె ఆసక్తి కాదు. వాటి ఫలితమే ఫైర్, వాటర్ లాంటి సినిమాలూ, వాటితో ముడిపడిన వివాదాలూ! అలాగని, ‘ప్రత్యేకంగా వివాదాస్పదమైన చిత్రాన్ని తీయాలని నేనేమీ సంకల్పించను, ‘ఫైర్’, ‘వాటర్’లకు వచ్చిన స్పందన మాత్రం భయానకమైనది. అలాంటిది ఎవరికీ జరగకూడదనుకుంటాను. పైగా అది ఎవరికీ మేలు చేయదు, నాకైనా, నా నటులు, సాంకేతిక నిపుణులు, ఆఖరికి సినిమాను కనీసం చూడకుండానే అభిప్రాయాలు ఏర్పరుచుకునే వారికి కూడా!’ అంటారు దీపా. ‘అయితే, నేను అలాంటి భయాల్ని ఎప్పుడూ వెనకసీట్లో పెట్టేస్తాను. భయంతో ఏ ప్రగతీ సాధించలేము, పాషన్‌తోనే తప్ప’. ‘ఏ దర్శకులైనా వాళ్ల వర్కు నిశ్శబ్దంగా చావడాన్ని ఇష్టపడరు. నీ పనిని అభినందించే వ్యక్తి నువ్వు మాత్రమే అయితే ప్రయోజనం ఏమిటి? అది అందరికీ చేరాలి. సినిమాలో ఉన్నదాని గురించి ప్రేక్షకులు ఆలోచించడం ఉత్సాహాన్నిస్తుంది. అలాగని నేనేమీ ప్రపంచాన్ని మార్చాలని బయలుదేరలేదు. ఒక సందేశం ఇవ్వడం కోసమే నేను సినిమాలు తీయను’ అంటారు. ‘ముద్రలు వేయడం సోమరుల పని. నన్ను నేను ఫెమినిస్టు దర్శకురాలిగాకన్నా హ్యూమనిటేరియన్ డెరైక్టర్‌గా పరిగణిస్తా’. ‘సత్యజిత్ రే, మిజోగుచి, ఓజు, విట్టారియో డె సికా, బెర్గ్మన్- అందరూ మాస్టర్స్- వీళ్లందరి ప్రభావమూ’ తన మీద ఉందంటారామె. బుకర్ ఆఫ్ ద బుకర్ గౌరవం పొందిన ‘మిడ్నైట్స్ చిల్డ్రన్’ను సినిమాగా మలచడమేకాదు, ఆ నవల రచయిత సల్మాన్ రష్దీతోనే స్క్రీన్‌ప్లే రాయించారు, ‘అపవాదులకు’ వీలివ్వకుండా! ‘పుస్తకాల్లోంచి సినిమాగా మలచడంలో ఉన్న ఇబ్బంది ఏమిటంటే, రెంటికీ పోలిక తేవడం అనివార్యం. ‘అడాప్టేషన్ పోలీసులు’ ఎప్పుడూ ఉంటారు. పుస్తకాలు, సినిమాలు రెండూ భిన్న మాధ్యమాలు కాబట్టి, ఎప్పుడో అరుదైన సందర్భంలో తప్ప పుస్తకం కన్నా సినిమా బాగా రావడం సంభవించదు. ఉదాహరణకు ‘లైఫ్ ఆఫ్ పై’ సినిమా పుస్తకం కన్నా బాగావచ్చిందనిపించింది నాకు’ అని చెబుతారు. ‘సినిమా తీస్తున్నప్పుడు ప్రతిదీ చాలెంజే. పెద్ద సీనా, చిన్న సీనా అన్నది కాదు, 1,500 మంది లేదా 3,000 మంది ఎక్స్ట్రాలో ఆ దృశ్యంలో ఉండటం కూడా కాదు, ఆ సీన్లోని ఉద్వేగ కేంద్రాన్ని పట్టుకోవడంలోనే అసలైన విషయం దాగుంది. అది మనం లొకేషన్ మీదే కనుక్కోగలం. దానికంటే ముందు సాధ్యం కాదు. నేనిది చేస్తాను, నటీనటులు ఇది చేస్తారు అని ముందే ఒక ఆలోచన ఉంటుంది. కానీ మీకు కచ్చితంగా కెమెరా ఎక్కడ పెట్టాలో తెలియదు. ఆ మ్యాజిక్, ఆ సినిమాతీయడం అనే మ్యాజిక్ అంతా లొకేషన్లోనే జరుగుతుంది’. ‘నటీనటులు వస్తారు, రెండు నెలలు కలిసి పనిచేస్తారు, మళ్లీ ఇంకో ప్రాజెక్ట్ మీదికి మరలిపోతారు. కానీ దర్శకురాలిగా, నేను ఆ సినిమాతో జీవిస్తాను. పోస్ట్ ప్రొడక్షన్, ఎడిటింగ్, సౌండ్, మ్యూజిక్ అన్నీ అయిపోయేదాకా దానితో ఉంటాను. అది నా బేబీ’ అంటారు దీపా ఉద్వేగంగా... అందువల్లే ఆమె సినిమాలన్నీ పద్ధతిగా పెంచినట్టుగా ఉంటాయేమో! నటీనటులు వస్తారు, రెండు నెలలు కలిసి పనిచేస్తారు, మళ్లీ ఇంకో ప్రాజెక్ట్ మీదికి మరలిపోతారు. కానీ దర్శకురాలిగా, నేను ఆ సినిమాతో జీవిస్తాను.