ఎక్కడో తమిళనాడుకు చెందిన దేవుడికి ఓ భక్తుడు ఇచ్చిన భూములవి. విస్తీర్ణం ఒకటీ రెండూ కాదు.. ఏకంగా 26 ఎకరాలు. సుమారు రూ.50 కోట్ల విలువైన ఆ భూములపై రైతుల ముసుగులో ఉన్న ఇద్దరు అధికార పార్టీ నాయకుల కన్ను పడింది. ఇంకేముంది.. దేవుడికే శఠగోపం పెట్టేశారు. వాటిని ఎలాగోలా తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. వరిసాగుతో ఒరిగేదేమీ లేదనుకున్నారో ఏమో మరి! ఏకంగా ఆక్వా సాగు ప్రారంభించారు. చెరువులను తిరిగి లీజుకిచ్చేసి రూ.కోట్లలో ఆర్జిస్తున్నారు. అటు ఆలయానికి లీజు.. ఇటు రెవెన్యూకు శిస్తు చెల్లించకుండా.. దేవుడి సొమ్మును దర్జాగా దోచుకుంటూ.. అధికారం అండతో.. ఆ ‘తెలుగు తంబిలు’ సాగిస్తున్న దందా ఇదీ..
పిఠాపురం: తమిళనాడు రాష్ట్రంలోని శ్రీపెరంబు దూర్ అరుణ్ముగు ఆదికేశవ పెరుమాళ్ శ్రీభాస్కరాచార్యస్వామి ఆలయానికి పిఠాపురం రెవెన్యూ పరిధి లోని సర్వే నంబర్ 802–2లో సుమారు 26 ఎకరాల భూములు ఉన్నాయి. మా ర్కెట్ రేటు ప్రకారం ప్రస్తుతం వాటి విలువ సుమారు రూ.50 కోట్లు ఉంది. సుమారు 50 ఏళ్ల కిందట పిఠాపురానికి చెందిన ఒక దాత తనకు వారసులు లేకపోవడంతో.. తమ కులదైవమైన శ్రీపెరంబుదూర్ ఆదికేశవస్వామివారి ఆలయానికి ఈ భూములను విరాళంగా ఇచ్చారు. తమిళనాడు దేవాదాయ శాఖ అధికారులు ఆ భూములను స్థానిక రైతులకు లీజుకు ఇచ్చారు.
ఈ భూ ములపై కన్ను వేసిన అధికార టీడీపీకి చెందిన ఇద్దరు వాటిని రెండేళ్ల లీజుకు తీసుకున్నారు. ఇదంతా పదిహేనేళ్ల కిందటి బా గోతం. లీజు కాలం పూర్తయిన తరువాత కూడా పంటలు దెబ్బ తిన్నాయని, నష్టం వచ్చిందని సాకులు చెబుతూ, వాటిని ఖాళీ చేయకుండా, రాజకీయ పలుకుబడితో ఆ భూములపై పెత్తనం సాగిస్తున్నారు. సుమారు 15 ఏళ్లుగా ఎటువంటి లీజూ చెల్లించకుండా, తమ సొం త భూముల మాదిరిగా పంటలు సాగు చేసుకుంటూ కోట్లాది రూపాయల ఆదాయాన్ని దిగమింగుతున్నారని, చివరకు రెవెన్యూకు చిల్లిగవ్వ కూడా భూమి శిస్తు చెల్లించడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారు అధికార టీడీపీకి చెందిన నియోజకవర్గ ముఖ్యనేత అనుచరులు కూడా అయినందువల్లనే అధికారులు మిన్నకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
అక్రమ ఆక్వా చెరువులు
తమిళ దేవుడికి ఇక్కడ భూములున్న విషయం ఎవ్వరికీ తెలియకపోవడంతో ఇక తమను అడిగేవారే లేరనుకున్న ఆ నేతలు ఏకంగా రొయ్యల చెరువులు తవ్వేశారు. తమిళనాడు దేవాదాయ శాఖ ఎటువంటి లీజుకూ ఇవ్వకపోయినా, ఎవరి అనుమతీ తీసుకోకుండానే ఏకంగా రొయ్యల సాగు చేపట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ భూములను వేలం ద్వారా లీజుకు ఇవ్వాలని తమిళనాడు దేవాదాయ శాఖ ప్రయత్నించింది. అయితే, ఆ భూములు ఖాళీగా లేవని, వాటిల్లో ఆక్వా చెరువులు తవ్వారనే విషయాలు బయటపడ్డాయి. దీంతో అక్కడి అధికారులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ సదరు నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని యథేచ్ఛగా రొయ్యల సాగు నిర్వహిస్తున్నారు. ఒకపక్క అక్కడ రొయ్యల సాగు చేస్తూనే అధికార పార్టీ ముఖ్య నేత అండతో రెవెన్యూ రికార్డుల్లో మాత్రం పంటభూములుగా చూపిస్తూ పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
రైతుల ఆందోళన
పచ్చని పంట పొలాల మధ్య చిచ్చు పెడుతూ రొయ్యల చెరువులు తవ్వుతున్నారని అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోలేదని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. రొయ్యల చెరువుల వల్ల చుట్టుపక్కల ఉన్న సారవంతమైన పంట పొలాలు చౌడుబారి పోతున్నాయని, తీవ్ర నష్టాల పాలవుతున్నామని వారు వాపోతున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా చెరువులు తవ్వేసినా, అధికార పార్టీ నాయకులు కావడంతో అధికారులు పట్టించుకోవడంలేదని, దీంతో తమ పొలాలు నాశనమవుతున్నాయని గగ్గోలు పెడుతున్నారు.
న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం
ఆ భూములకు సంబంధించి కొన్ని సంవత్సరాలుగా లీజు రావడం లేదు. కొన్నేళ్లుగా శిస్తు చెల్లించడం లేదు. ఇటీవల ఆ భూములను లీజుకు ఇచ్చేందుకు వేలం వేయాలని ప్రయత్నించగా, ఎవరో ఆక్రమించుకుని రొయ్యల చెరువులు తవ్వినట్లు మా దృష్టికి వచ్చింది. దీనిపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు న్యాయస్థానంలో కేసు వేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. పిఠాపురంలో ఒక న్యాయవాది ద్వారా న్యాయపరమైన చర్యలకు ఉపక్రమిస్తున్నాం.
– ఎ.నరసింహన్, దేవాదాయ శాఖ అధికారి, అరుణ్ముగు ఆదికేశవ పెరుమాళ్ శ్రీభాస్కరాచార్య స్వామివారి ఆలయం, శ్రీపెరంబుదూర్, తమిళనాడు
అవి దేవుడి భూములే,
ఆచెరువులు అక్రమ చెరువులే తమిళనాడు దేవస్థానానికి చెందిన భముల్లో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా రొయ్యల చెరువులు తవ్వినట్లు గుర్తించాము. ఈవిషయాన్ని ఆదేవస్థానం అధికారులకు నోటీసులు పంపించాము. ఆభూముల్లో రొయ్యల చెరువులు ఉండగా రెవిన్యూ రికారుండల్లో పంట భూములుగానే ఉన్నాయి. దీనిపై ప్రభుత్వానికి నివేదికలు పంపించాము. రెవిన్యూ శిస్తు సైతం గత మూడేళ్లుగా చెల్లించడం లేదు. పలుమార్లు నోటీసులు పంపినా సమాధానం లేదు.
– బి.సుగుణ, తహసీల్దార్, పిఠాపురం
Comments
Please login to add a commentAdd a comment