
తుది దశకు చేరుకున్న ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్ నిర్మాణం
సాక్షి, అమరావతి: నాణ్యమైన సీడ్, ఫీడ్, ఇతర ఆక్వా ఉత్పత్తులను రైతులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్స్ ఏర్పాటు చేస్తోంది. వైఎస్సార్ అగ్రి ల్యాబ్స్ లో అంతర్భాగంగా 27 ల్యాబ్‌ల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. మే నెలాఖరులోగా వీటిని రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
కాకినాడలోని స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ (ఎస్‌ఐఎఫ్‌టీ) ఆధ్వర్యంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, కైకలూరు, ఒంగోలు, నెల్లూరులో ప్రస్తుతం 8 ఆక్వా ల్యాబ్స్ పని చేస్తున్నాయి. వీటిలో కొన్ని శిథిలావస్థకు చేరుకోగా.. చాలాచోట్ల పరికరాలు పనిచేయని పరిస్థితి. ఆక్వా రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 8 రాష్ట్ర ప్రభుత్వం తో పాటు ఆక్వా సాగు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మరో 27 ల్యాబ్స్ ను ఏర్పాటు చేస్తోంది.
నియోజకవర్గానికి ఒకటి చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 162 వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. వీటిలో ఆక్వా సాగు విస్తారంగా ఉన్న 27 ప్రాంతాల్లో అగ్రి ల్యాబ్స్‌లోనే అంతర్భాగంగా 1,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆక్వా ల్యాబ్స్ నిర్మిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో అగ్రి ల్యాబ్, పై ఫ్లోర్‌లో ఆక్వా ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.50.30 కోట్లు కేటాయించింది. ఈ మొత్తంలో రూ.20 కోట్లను అత్యాధునిక పరికరాల కోసం, రూ.30.30 కోట్లను భవనాలను సమకూర్చుకునేందుకు ఖర్చు చేస్తున్నారు.
తీర ప్రాంతం ఉన్న 9 జిల్లాల్లో నిర్మిస్తున్న ఈ ల్యాబ్‌లలో స్థానిక అవసరాలకు తగ్గట్టుగా 35 చోట్ల వాటర్, సాయిల్ అనాలసిస్, 35 చోట్ల మైక్రో బయాలజీ, 14 చోట్ల ఫీడ్ అనాలసిస్, 17 చోట్ల పీసీఆర్, 14 చోట్ల క్వాలిటీ కంట్రోల్ పరీక్షలు అందుబాటులోకి రాబోతున్నాయి. పాత, కొత్త ల్యాబ్స్ కలిపి శ్రీకాకుళంలో 5, విజయనగరంలో 1, విశాఖ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మూడేసి చొప్పున, తూర్పు గోదావరి జిల్లాలో 7, పశ్చిమ గోదావరి జిల్లాలో 6, కృష్ణా జిల్లాలో 5, నెల్లూరులో రెండు చొప్పున ఆక్వా ల్యాబ్స్ అందుబాటులోకి రాబోతున్నాయి.
నిర్మాణ బాధ్యతలు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌కు..
ల్యాబ్‌లకు అవసరమైన భవన నిర్మాణ బాధ్యతలను ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌కు అప్పగించారు. దాదాపు 80 శాతం భవన నిర్మాణాలు పూర్తి కావచ్చాయి. మిగిలిన పనులను మే 15 నాటికల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ల్యాబ్స్ కు అవసరమైన అత్యాధునిక పరికరాలను కూడా ఏర్పాటు చేసి మే నెలాఖరులోగా అగ్రి ల్యాబ్‌్సతో కలిపి వీటి సేవలను కూడా అందుబాటులోకి తీసుకు రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అవసరమైన సిబ్బంది నియామకం కూడా పూర్తయింది. వారికి శిక్షణ కార్యక్రమాలు కూడా చేపట్టారు.
రైతులకు అందుబాటులో ఆక్వా సేవలు
ఇప్పటివరకు వాటర్, సాయిల్ తదితర టెస్ట్‌ల కోసం తీసుకున్న శాంపిల్స్‌ను ల్యాబ్‌లున్న ప్రాంతాలకు పంపి టెస్టింగ్ చేయించే వాళ్లం. ఫలితాలు వచ్చేందుకు కొంత సమయం పట్టేది. ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్స్ అందుబాటులోకి వస్తే రైతులు కోరుకున్న సేవలను స్థానికంగానే పొందవచ్చు. సీడ్, ఫీడ్‌ను ఈ ల్యాబ్‌లలో పరీక్షించిన తర్వాతే పంపిణీ చేస్తాం కాబట్టి నాణ్యమైనవి దొరుకుతాయి.
– కోటేశ్వరరావు, ప్రిన్సిపాల్, ఎస్‌ఐఎఫ్‌టీ, కాకినాడ