ఖరీఫ్ పంట చేతికి వచ్చే నాటికి ప్రతి రైతు భరోసా కేంద్రం (ఆర్‌బీకే) పరిధిలో గ్రేడింగ్, ప్యాకింగ్ సదుపాయాలు సిద్ధం కావాలి. రాష్ట్రంలోని 10,641 ఆర్బీకేలలో ఈ ఏర్పాట్లుండాలి. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కోసం ఇ–ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేయాలి.
– సీఎం వైఎస్ జగన్
ఇ–ప్లాట్‌ఫామ్ ఏర్పాటు
► రైతులు పండించిన పంటల్లో 30 శాతం కొనుగోలు చేయడం ద్వారా మార్కెట్లో పోటీతత్వాన్ని పెంచి, రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించే ప్రయత్నాలను ప్రభుత్వం చేస్తుంది. మిగిలిన 70 శాతం పంటకు కూడా కనీస గిట్టుబాటు ధర కల్పించే ప్రయత్నాలు చేయాలి.
► ఇందుకోసం ఇ–మార్కెటింగ్ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేయాలి. దీనిపై పంటలను అమ్మాలంటే నాణ్యత అనేది చాలా ముఖ్యం. దీనికోసం గ్రేడింగ్, ప్యాకింగ్, ప్రాసెసింగ్ లాంటి సదుపాయాలు కల్పించాలి.
► ఇ–మార్కెటింగ్ ప్లాట్‌ఫాం విజయవంతమవ్వాలంటే రవాణా సదుపాయాలు, సకాలంలో రైతులకు చెల్లింపులు, వ్యవసాయ ఉత్పత్తుల్లో నాణ్యత పాటించడం ముఖ్యం. వీటిపై సమర్థవంతమైన ఆలోచన చేయాలి.
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాన్ని యూనిట్‌గా తీసుకుని, దాని పరిధిలో ఏయే పంటలు వేయాలనే దానిపై ప్రణాళికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఏ రైతు ఏ పంట వేస్తున్నారన్న దానిపై ఇ–క్రాపింగ్ కోసం విధివిధానాలను మరింత సమగ్రంగా తయారు చేయాలన్నారు. వాటిని రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బీకే), గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలని చెప్పారు. రైతులు పండించిన పంటలను విక్రయించేందుకు ఇ–ప్లాట్‌ఫాంను కూడా సిద్ధం చేయాలని ఆదేశించారు. పంటల ప్రణాళిక, ఇ–క్రాపింగ్ అంశాలపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ముఖ్యమంత్రి తీసుకున్న కీలక నిర్ణయాలు ఇలా ఉన్నాయి.
పంటల ప్రణాళిక, ఇ–క్రాపింగ్ అంశాలపై సోమవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
మ్యాపింగ్ చేయాలి
► వీలైనంత త్వరగా పంటల ప్రణాళిక, ఇ– క్రాపింగ్‌పై విధి విధానాలను రూపొందించాలి. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాన్ని యూనిట్‌గా తీసుకుని, దాని పరిధిలో ఏ పంటలు వేయాలనే దానిపై మ్యాపింగ్ చేయాలి.
► జిల్లా, మండల స్థాయిల్లో వ్యవసాయ సలహా బోర్డులను వెంటనే ఏర్పాటు చేయాలి. మార్కెటింగ్ చేయలేని పంటలు వేస్తే.. రైతులకు నష్టం కలుగుతుంది. పంటల ప్రణాళికకు అనుగుణంగా విత్తనాలు అందుబాటులో ఉంచాలి.
► ఇ– క్రాపింగ్ మీద సమగ్ర విధివిధానాలను, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ)లను వెంటనే తయారు చేయాలి. ఇ– క్రాపింగ్ విధివిధానాలను సచివాలయాల్లో, ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచాలి. విధివిధానాలు వివాదాలు లేకుండా, పారదర్శకంగా ఉండాలి.
గ్రేడింగ్, ప్యాకింగ్ జనతా బజార్లకూ ఉపయోగం
► వచ్చే సీజన్‌లో ఏర్పాటు చేయదలచిన జనతా బజార్లకూ గ్రేడింగ్, ప్యాకింగ్ విధానాలు దోహద పడతాయి. తర్వాత దశలో గ్రామాల్లో గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీలపై దృష్టి పెట్టాలి. ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు కావాలి.
► అధికారులు వీటికి అవసరమైన అనుమతులు వెంటనే ఇవ్వాలని, ఈ మేరకు మార్గదర్శక ప్రణాళిక రూపొందించి తనకు నివేదించాలని సీఎం ఆదేశించారు.
సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment