సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్‌లో ఈ–పంట (ఎలక్ట్రానిక్ క్రాప్) నమోదును వ్యవసాయ శాఖ వేగవంతం చేసింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఒడిదుడుకుల మధ్య ఖరీఫ్ సాగవుతుండగా.. సాగైన ప్రతి పంటను నమోదు చేసేలా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. సంక్షేమ ఫలాలు ఈ–క్రాప్ నమోదే ప్రామాణికం కావడంతో పకడ్బందీగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. గత సీజన్ మాదిరిగానే పంటల నమోదుతోపాటు నూరు శాతం ఈకేవైసీ నమోదే లక్ష్యంగా ముందుకెళ్తోంది.
78 లక్షల ఎకరాల్లో ఖరీఫ్
ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు లక్ష్యం 1.10 కోట్ల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 78 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. ప్రధానంగా 38.36 లక్షల ఎకరాల్లో వరి సాగవ్వాల్సి ఉండగా.. ఇప్పటివరకు 29.48 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇతర పంటల విషయానికి వస్తే.. 2.56 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 3.30 లక్షల ఎకరాల్లో కందులు, 7.19 లక్షల ఎకరాల్లో వేరుశనగ, సుమారు లక్ష ఎకరాల చొప్పున ఆముదం, చెరకు పంటలు సాగయ్యాయి.
ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక కింద 80 శాతం సబ్సిడీపై విత్తన సరఫరాతోపాటు సెప్టెంబర్‌లో ఆశాజనకంగా వర్షాలు కురుస్తుండటంతో ఖరీఫ్ సాగు లక్ష్యం దిశగా వెళ్తోంది. ఈ నేపథ్యంలో ఖరీఫ్‌లో సాగైన పంటల నమోదుపై వ్యవసాయ శాఖ దృష్టి సారించింది. వెబ్‌ల్యాండ్, సీసీఆర్సీ డేటా నమోదుతో పాటు తొలిసారి జియో ఫెన్సింగ్ ఆధారంగా జూలైలో ఈ–క్రాప్ నమోదుకు శ్రీకారం చుట్టారు. తొలుత తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో నమోదు చేపట్టగా, ఆ తర్వాత మిగిలిన జిల్లాల్లో శ్రీకారం చుట్టారు.
నమోదులో అగ్రస్థానంలో కర్నూలు
ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటివరకు 78 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగవగా.. 46.50 లక్షల ఎకరాల్లో సాగైన పంటల వివరాలను నమోదు చేశారు. 84.98 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు లక్ష్యం కాగా.. 55.95 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇప్పటికే 31.50 లక్షల ఎకరాల్లో సాగైన పంటల వివరాలను నమోదు చేశారు. 22 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవ్వాల్సి ఉండగా.. 21 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి.
ఇప్పటికే 15 లక్షల ఎకరాల్లో పంటల వివరాలను ఈ క్రాప్‌లో నమోదు చేశారు. 17.53 లక్షల ఎకరాల్లో వరి, 5.52 లక్షల ఎకరాల్లో పత్తి, 3.53 లక్షల ఎకరాల్లో మామిడి, 2.86 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 2.10 లక్షల ఎకరాల్లో కంది, 2.13 లక్షల ఎకరాల్లో మిరప, 1.60 లక్షల ఎకరాల్లో మొక్క జొన్న, 1.50 లక్షల ఎకరాల్లో జీడిమామిడి, 1.35 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్, 1.29 లక్షల ఎకరాల్లో బత్తాయి, 99 వేల ఎకరాల్లో కొబ్బరి, 75 వేల ఎకరాల్లో ఆముదం, 61 వేల ఎకరాల్లో అరటి, 52 వేల ఎకరాల్లో నిమ్మ, 46 వేల ఎకరాల్లో టమోటా పంటలు నమోదు చేశారు. జిల్లాల వారీగా చూస్తే కర్నూలు, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాలు నూరు శాతం నమోదుతో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.
జియో ఫెన్సింగ్ ద్వారా హద్దులు నిర్ధారించి..
నేషనల్ ఇన్‌ఫర్మేటిక్ సెంటర్ (ఎన్‌ఐసీ) సౌజన్యంతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన యాప్‌లో ఆధార్, వన్‌బీ, జాతీయ చెల్లింపుల సహకార సంస్థ (ఎన్‌పీసీఐ), ఆధార్‌తో లింక్ అయిన బ్యాంక్ ఖాతా వివరాలు, ఫోన్ నంబర్, సీసీఆర్సీ కార్డు వివరాలను నమోదు చేస్తున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత జియో ఫెన్సింగ్ ద్వారాæ సరిహద్దులు నిర్ధారించి, రైతు ఫోటోను ఆర్బీకే సిబ్బంది అప్‌లోడ్ చేస్తున్నారు.
గిరి భూమి వెబ్‌సైట్‌లో నమోదైన వివరాల ఆధారంగా అటవీ భూముల్లో ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాదారులు సాగు చేస్తున్న పంటల వివరాలను ఈ–క్రాప్‌లో నమోదు చేస్తున్నారు. మరోవైపు పంటసాగు హక్కు పత్రం (సీసీఆర్సీ) కలిగిన రైతులతో పాటు సీసీఆర్సీ కార్డుల్లేని రైతుల వివరాలను నమోదు చేస్తున్నారు. ఖాళీగా ఉంటే నో క్రాప్ జోన్ అని, ఆక్వా సాగవుతుంటే ఆక్వాకల్చర్ అని, వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తుంటే నాన్ అగ్రిల్యాండ్ యూజ్ అని నమోదు చేసి లాక్ చేస్తున్నారు.
30 నాటికి తుది జాబితాలు
ఈ–క్రాప్ నమోదు ప్రక్రియ సెప్టెంబర్ 25 నాటికి పూర్తి చేసి సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల్లో ఈ–పంట జాబితాలను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. అభ్యంతరాల పరిశీలన తర్వాత సెప్టెంబర్ 30న ఆర్బీకేల్లో తుది జాబితాలను ప్రదర్శించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం
– చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ
డూప్లికేషన్‌కు తావులేకుండా..
డూప్లికేషన్‌కు తావు లేకుండా ఈ–ఫిష్ డేటాతో జోడించారు. ఈ–క్రాప్‌తో పాటు ఈ–కేవైసీ (వేలి ముద్రల) నమోదు ప్రక్రియ పూర్తి కాగానే ప్రతీ రైతుకు భౌతికంగా రసీదు అందజేస్తున్నారు. ఈ క్రాప్ ప్రక్రియ పూర్తయిన తర్వాత 10 శాతం ఎంఏవోలు–తహసీల్దార్లు, 5 శాతం జిల్లా వ్యవసాయ, ఉద్యాన శాఖాధికారులు, 3 శాతం సబ్ కలెక్టర్లు, 2 శాతం జాయింట్ కలెక్టర్లు, 1 శాతం చొప్పున కలెక్టర్ ర్యాండమ్ చెక్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment