వ్యవసాయ, ఉద్యాన శాఖలపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఖరీఫ్ నాటికి నూరు శాతం ఆర్బీకేల్లో యంత్ర సేవా కేంద్రాలు అందుబాటులో ఉండాలి. ఆర్బీకేలకు అనుబంధంగా కిసాన్ డ్రోన్స్‌ను సత్వరమే ఏర్పాటు చేయాలి. జూలైలో కనీసం 500 కిసాన్ డ్రోన్స్, డిసెంబర్ కల్లా మరో 1,500 డ్రోన్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలి. రైతులకు వ్యక్తిగతంగా టార్పాలిన్లు, స్ప్రేయర్ల పంపిణీకి సాధ్యమైనంత త్వరగా శ్రీకారం చుట్టాలి. జూలైలో టార్పాలిన్లు, జూలై–డిసెంబర్ మధ్య మూడు విడతల్లో స్ప్రేయర్లు పంపిణీ చేయాలి.
– వ్యవసాయ శాఖ సమీక్షలో సీఎం జగన్
సాక్షి, అమరావతి: ‘వ్యవసాయ యాంత్రీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలి. పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి. గ్రామ స్థాయిలో ప్రతి రైతుకు ఆధునిక యంత్రాలను అందుబాటులో ఉంచాలి. ఇప్పటికే మెజార్టీ ఆర్బీకేల్లో రైతు గ్రూపులకు యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేశాం. సాధ్యమైనంత త్వరగా మిగిలిన ఆర్బీకేల్లో ఏర్పాటు చేయాలి. అవసరమైన మేరకు టార్పాలిన్లు, స్ప్రేయర్లు వంటి వ్యక్తిగత పరికరాలను రైతులకు పంపిణీ చేయాలి. అలా చేస్తే వ్యవసాయ యాంత్రీకరణ మరింత పెరిగి.. రైతులు మరింతగా లబ్ధి పొందేందుకు దోహద పడుతుంది’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.
అధికారులు రూపొందించిన వ్యవసాయ పరికరాల పంపిణీ షెడ్యూల్‌కు బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ, ఉద్యాన శాఖలపై జరిగిన సమీక్షలో సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుత రబీ సీజన్‌తో పాటు రానున్న ఖరీఫ్ సీజన్‌లో అనుసరించాల్సిన కార్యాచరణపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఇంకా మిగిలిన 4,225 ఆర్బీకేల్లో సీహెచ్‌సీలకు ఏప్రిల్‌లో యంత్రాల పంపిణీ పూర్తి చేయాలని చెప్పారు. రబీ సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదన్నారు.
రైస్ మిల్లర్ల ప్రమేయం లేకుండా పూర్తి పారదర్శకంగా ధాన్యం సేకరణ చేపట్టాలని ఆదేశించారు. ఇటీవలి అకాల వర్షాల వల్ల దెబ్బ తిన్న పంటలకు సంబంధించి ఎన్యుమరేషన్‌ను వేగవంతం చేయాలన్నారు. ఆర్బీకేల ద్వారా రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు అందించాలని, ఈ విషయంలో మరింత శ్రద్ధ పెట్టడంతో పాటు నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఆర్బీకేల్లో కియోస్క్‌లు నూరు శాతం పని చేసేలా చూడటంతో పాటు, వాటి సేవలు పూర్తి స్థాయిలో రైతులు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కియోస్క్‌ల పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలన్నారు.
ఆర్బీకేల ద్వారా 10.5 లక్షల టన్నుల ఎరువులు
2023–24 సీజన్‌లో 10.5 లక్షల టన్నుల ఎరువుల పంపిణీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. ఎరువులతో పాటు రైతులకు అవసరమైన స్థాయిలో పురుగుల మందులను ఏపీ ఆగ్రోస్ ద్వారా పంపిణీకి చర్యలు చేపట్టామని చెప్పారు. రబీ సీజన్‌లో 100 శాతం ఈ క్రాపింగ్ పూర్తయిందని, దీని ఆధారంగానే రబీ ధాన్యం కొనుగోలుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
ఎగుమతికి ఆస్కారం ఉన్న వరి రకాలను ప్రోత్సహిస్తున్నామని, 2022 ఖరీఫ్‌లో 2.74 లక్షల హెక్టార్లలో ఎగుమతి చేయదగ్గ వరి రకాలను సాగు చేసేలా ప్రోత్సహించామని చెప్పారు. తద్వారా దాదాపు 6.29 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వచ్చిందని తెలిపారు. ప్రస్తుత రబీ.. 2022–23 సీజన్‌లో 1.06 లక్షల హెక్టార్లలో ఎగుమతి వెరైటీలను రైతులు సాగు చేశారని, 3.79 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా వేస్తున్నామని వివరించారు. ఇంకా ఏం చెప్పారంటే..
► పొలంబడి శిక్షణ కార్యక్రమాల వల్ల సత్ఫలితాలు వస్తున్నాయి. ఆర్బీకేల ద్వారా ఉత్తమ వ్యవసాయ పద్ధతులపై రైతులకు శిక్షణ ఇస్తున్నాం. వీటి వల్ల్ల వరి, వేరుశనగలో 15 శాతం, పత్తిలో 12 శాతం, మొక్కజొన్నలో 5 శాతం పెట్టుబడి ఖర్చులు తగ్గాయి. పత్తిలో 16 శాతం, మొక్కజొన్నలో 15 శాతం, వేరుశనగలో 12 శాతం, వరిలో 9 శాతం దిగుబడులు పెరిగినట్టుగా క్షేత్ర స్థాయి పరిశీలనలో గుర్తించాం.
► పూర్తి సేంద్రియ వ్యవసాయ పద్ధతుల దిశగా అడుగులు వేయడానికి ఇది తొలిమెట్టు కానుంది. 26 రైతు ఉత్పత్తిదారుల సంఘాల(ఎఫ్‌పీవో)లకు జీఏపీ (గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్) సర్టిఫికేషన్ ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం.
► రాష్ట్రంలో మిల్లెట్స్ సాగును ముందుకు తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందించాం. 19 జిల్లాల్లో 100 హెక్టార్ల చొప్పున మిల్లెట్ క్లస్టర్లు ఏర్పాటు చేశాం. వీటితో పాటు మూడు ఆర్గానిక్ క్లస్టర్లను కూడా ఏర్పాటు చేశాం. అకాల వర్షాల వల్ల పంట నష్టంపై అంచనా వేసేందుకు చేపట్టిన ఎన్యుమరేషన్ శరవేగంగా జరుగుతోంది. ఏప్రిల్ మొదటి వారంలో నివేదికలు ఖరారు చేసి, రెండో వారానికి నష్టపోయిన రైతుల జాబితాలను విడుదల చేస్తాం.
► ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయ, ఉద్యాన శాఖల సలహాదారులు తిరుపాల్ రెడ్డి, శివప్రసాద్ రెడ్డి, ఏపీ ఆగ్రోస్ చైర్మన్ బి.నవీన్ నిశ్చల్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకష్ణ ద్వివేది, వ్యవసాయ, ఉద్యాన శాఖ కమిషనర్లు చేవూరు హరికిరణ్, ఎస్.ఎస్. శ్రీధర్, మార్క్‌ఫెడ్ ఎండీ రాహుల్‌పాండే, ఏపీ సీడ్స్, ఆగ్రోస్ ఎండీలు డాక్టర్ శేఖర్ బాబు, ఎస్.కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఫ్యామిలీ డాక్టర్ తరహాలో ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్: సీఎం
► ఫ్యామిలీ డాక్టర్ తరహాలోనే ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్‌ను వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి దశల వారీగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలి. ప్రతి ఏటా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఈ పరీక్షలు చేసే దిశగా చర్యలు తీసుకోవాలి.
► జూన్‌లో ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యే నాటికి పరీక్షా ఫలితాలు వచ్చేలా చూడాలి. వాటి ఆధారంగానే రైతులకు సాగులో పాటించాల్సిన పద్ధతులపై పూర్తి వివరాలు, అవగాహన కల్పించాలి. భూ పరీక్ష కోసం నమూనాల సేకరణ, పరీక్షలు, ఫలితాలు, వాటి ఆధారంగా సాగు పద్ధతులు, రైతులకు అవగాహన కల్పించడం వంటి అంశాలపై ఒక సమర్థవంతమైన ఎస్‌ఓపీ రూపొందించుకోవాలి. ఈ పరీక్ష ఫలితాల ఆధారంగానే శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకు పంటలకు అవసరమైన స్థాయిలో ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచాలి. అప్పుడే ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్.. ఆర్బీకే సేవలు మరో దశకు వెళ్తాయి.
► ఉద్యాన వన పంటల సాగు విస్తీర్ణం ఏటా పెరగడం వల్ల దిగుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి. కొత్త తరహా ఉత్పత్తులు వస్తున్నాయి. అందుకు తగినట్టుగా మార్కెటింగ్ ఉండాలి. రైతులు తాము పండించిన పంటలను విక్రయించుకోవడానికి ఏ దశలోనూ ఇబ్బంది పడకూడదు. ఆ విధంగా మార్కెటింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఉద్యాన పంటలు పండించే రైతులను మార్కెటింగ్‌కు అనుసంధానం చేయాలి. అప్పుడే వారికి మంచి ఆదాయం వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment