కౌలు రైతులకు రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు మరింత ముందుకు రావాలి. వారికి క్రాప్ కల్టివేటెడ్ రైట్ కార్డ్స్ (సీసీఆర్‌సీ) కూడా ఇచ్చాం కాబట్టి రుణాల మంజూరులో బ్యాంకులు చొరవ చూపాలి.
ఆర్థిక వ్యవస్థలో కీలకమైన ఎంఎస్‌ఎంఈలకు బ్యాంకులు తోడ్పాటు అందించాలి. అప్పుడే ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. ప్రతి ఎంఎస్‌ఎంఈలో కనీసం 10 మంది జీవనోపాధి పొందుతున్నారు. రుణాల రీస్ట్రక్చర్‌లో బ్యాంకులు సహాయం చేయాలి. 2014 నుంచి ఆ పరిశ్రమలకు గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రాయితీలు సుమారు రూ.1,100 కోట్లు చెల్లించాం. కోవిడ్ సమయంలో కరెంట్ ఫిక్స్‌డ్ చార్జీలు కూడా రద్దు చేశాం.
– సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రైతుల ఆదాయం ఎలా రెట్టింపు అవుతుందన్న దానిపై బ్యాంకులు ప్రధానంగా దృష్టి సారించాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. పెట్టుబడి వ్యయం తగ్గడం, పంటలకు సరైన మార్కెటింగ్ సదుపాయాలు, విపత్తుల సమయంలో ఆదుకోవడం ద్వారా రైతులకు మేలు జరుగుతుందన్నారు. గత త్రైమాసికంలో రుణాల మంజూరులో 7.5 శాతం వృద్ధి నమోదు కావడం సంతోషకరమని, పంట రుణాలు 99 శాతం ఇచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన శుక్రవారం క్యాంపు కార్యాలయంలో 213వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, మేకపాటి గౌతమ్‌రెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, ఉన్నతాధికారులు, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) కన్వీనర్ వి.బ్రహ్మానందరెడ్డి, ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ కె.నిఖిల, నాబార్డు సీజీఎం సుధీర్‌కుమార్ జన్నావర్‌తో పాటు వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. యూబీఐ జీఎం లాల్‌సింగ్, యూబీఐ ఎండీ, సీఈవో రాజ్‌కిరణ్‌రాయ్ (ఎస్‌ఎల్‌బీసీ చైర్మన్) వీడియో కాన్ఫరెన్సు ద్వారా హాజరయ్యారు. ముఖ్యమంత్రి ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ...
ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రులు, అధికారులు
రైతు భరోసాతో 80 శాతం పెట్టుబడి వ్యయాన్ని అందచేస్తున్నాం..
రైతులకు పెట్టుబడి వ్యయ్యాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. రైతు భరోసా ద్వారా ఏటా రూ.13,500 చొప్పున సహాయం చేస్తున్నాం. రాష్ట్రంలో 50 శాతం మంది రైతులకు అర హెక్టారు కన్నా తక్కువ భూమి ఉంది. 80 శాతం పెట్టుబడి వ్యయాన్ని రైతు భరోసా ద్వారా అందచేస్తున్నాం. ఖరీఫ్ సీజన్ ఆరంభానికి ముందు మే నెలలో రూ.7,500, పంట కోత సమయంలో రూ.4 వేలు, సంక్రాంతి సమయంలో మిగిలిన రూ.2 వేలు ఇస్తున్నాం.
సున్నా వడ్డీ రుణాలతో భారీ మార్పులు...
వడ్డీ లేని రుణాల ప్రయోజనాన్ని పొందేలా రైతులను చైతన్యం చేస్తున్నాం. వడ్డీ లేని రుణాల కింద గత సర్కారు హయాంలో ఎగ్గొట్టిన అన్ని బకాయిలను పూర్తిగా చెల్లించాం. పంటల బీమా ప్రీమియం భారం రైతులపై పడకుండా చేశాం. వ్యవసాయ రంగంలో మేం తీసుకున్న అతి పెద్ద చర్యల్లో ఇది ఒకటి. రైతులు కట్టాల్సిన ప్రీమియంను మేమే చెల్లిస్తున్నాం. దీనివల్ల వ్యవసాయ రంగంలో పెద్ద మార్పులు వచ్చాయి.
అండగా రైతు భరోసా కేంద్రాలు..
ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల రైతులు పండించే పంటలకు భద్రత వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 10,641 రైతు భరోసా కేంద్రాలు అన్నదాతలను చేయి పట్టి నడిపిస్తాయి. విత్తనం వేసిన దగ్గర నుంచి పంటలు అమ్మే వరకూ ఆర్బీకేలు రైతులకు అండగా ఉంటాయి. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులోకి తెచ్చి రైతులకు మేలు చేస్తున్నాయి.
జగనన్న తోడుతో చిరు వ్యాపారులకు భరోసా..
జగనన్న తోడు ద్వారా చిరు వ్యాపారులకు రూ.10 వేలు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం.అసంఘటిత రంగం కూడా ఆర్థిక వ్యవస్థకు దోహదం చేస్తోంది. ప్రైవేట్ వ్యక్తుల నుంచి అధిక వడ్డీలకు రుణాలు తీసుకోవాల్సిన దుస్థితిని తొలగించాం. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు ఇస్తున్నాం. వారు ఏ పని చేస్తున్నారో కూడా గుర్తిస్తున్నాం. వారికి బ్యాంకులు రుణాలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుంది. ఆ వడ్డీలకు ప్రభుత్వం గ్యారెంటీ ఉంటుంది. చిరు వ్యాపారుల జీవితాలను మార్చడానికి బ్యాంకర్లు ముందడుగు వేయాలి.
మహిళా సాధికారత..
ఆసరా, చేయూత పథకాల ద్వారా మహిళా సాధికారితకు అడుగులు వేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల జీవితాలను మార్చేలా కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. కుటుంబంలో అత్యంత ప్రభావశీలురైన 45 – 60 ఏళ్ల లోపు మహిళలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేలు ఇస్తున్నాం. ఇప్పటికే ఒక ఏడాది ఇచ్చాం, తర్వాత మూడు సంవత్సరాలు కూడా ఏటా రూ.18,750 చొప్పున ఇస్తాం. ఆ మహిళలకు అండగా నిలిచేలా అమూల్, అల్లానా, ఐటీసీ, ప్రాక్టర్ అండ్ గాంబల్, హెచ్‌యూఎల్, రిలయెన్స్ లాంటి ప్రఖ్యాత సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం. మహిళలకు నష్టం రాకుండా, వారి కాళ్లమీద వారు నిలబడేలా కార్యక్రమాలు రూపొందించాం. వారు ఎంపిక చేసుకున్న వ్యాపారాలకు బ్యాంకర్లు తోడుగా నిలవాలి. రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావాలి. చేయూత, ఆసరా మహిళలకు అండగా నిలబడేందుకు గ్రామ, వార్డు స్థాయిల్లో కమిటీలను కూడా ఏర్పాటు చేశాం. ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల పంపిణీకి షెడ్యూల్ రూపొందించి ఇప్పటికే పంపిణీ ప్రారంభించాం. షెడ్యూల్ ప్రకారం మహిళలకు సహాయం అందించేలా బ్యాంకర్లు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి. అధికారులు కూడా ఆ ప్రకారం వ్యవహరించాలి.
స్వయం సహాయక బృందాలు..
రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలు 2020–21లో తమ ఖాతాల్లో రూ.7,500 కోట్లు జమ చేశాయి. వాటికి బ్యాంకులు ఇస్తున్న వడ్డీ కేవలం 3 శాతం మాత్రమే. కానీ అవే బ్యాంకులు రుణాలపై 11 నుంచి 13 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి. సకాలంలో రుణాలు చెల్లిస్తున్న వారికి ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తున్న విషయాన్ని బ్యాంకులు పరిగణలోకి తీసుకోవాలి. మహిళలను మరింత చైతన్య పరిచేలా ముందుకు వెళ్లాలని బ్యాంకర్లను కోరుతున్నా. కుటుంబంలో ఒక మహిళ తన కాళ్ల మీద తాను నిలబడగలిగితే ఆ కుటుంబం వృద్ధి లోకి వస్తున్నట్లే.
టిడ్కో ఇళ్లు..
టిడ్కో ఇళ్లను వీలైనంత త్వరగా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 2.69 లక్షల యూనిట్లను 2021 డిసెంబర్, 2022 డిసెంబర్‌లో విడతలుగా పూర్తి చేస్తుంది. దీనికి బ్యాంకర్లు తమ వంతు సహకారం అందించాలి.
రాష్ట్రంలో పథకాలు భేష్
– రాజ్‌కిరణ్‌రాయ్, యూబీఐ ఎండీ, సీఈవో
‘కోవిడ్ నుంచి త్వరగా కోలుకున్నాం. అందుకు అందరికీ అభినందనలు. రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. నిర్ణీత లక్ష్యాలకు అనుగుణంగా బ్యాంకుల కార్యకలాపాలు, ఆర్థిక సహాయం కొనసాగాయి. రాష్ట్రంలో ప్రాధాన్యతా రంగంలో ఈ ఏడాది సెప్టెంబరు నాటికి రూ.2,80,519 కోట్ల రుణాలిచ్చాం. ఇది మొత్తం రుణాలలో 64.60 శాతం. వాస్తవానికి మొత్తం రుణాలలో ప్రాధాన్యతా రంగానికి 40 శాతం ఇవ్వాలని నిర్దేశించినా అంతకుమించి ఇచ్చాం. అదే సమయంలో వ్యవసాయ రంగానికి ఇచ్చిన రుణం రూ.1,85,075 కోట్లు. ఇది మొత్తం రుణాలలో 42.61 శాతం ఉంది’
Comments
Please login to add a commentAdd a comment